• facebook
  • whatsapp
  • telegram

Versities: వర్సిటీల పరీక్షల విభాగాల ప్రక్షాళన

* ముఖ్యమంత్రి ఆదేశాలతో కదలిక 
 

ఈనాడు, హైదరాబాద్‌: నియామక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం విశ్వవిద్యాలయాల పరీక్షల విభాగాలను ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయాల పరీక్షల అంశమూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలో 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలున్నాయి. దాదాపు అన్ని వర్సిటీల పరీక్షల విభాగాల్లో ఎక్కువ మంది సిబ్బంది పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న వారే. తక్కువ వేతనాలు ఉండటం... ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారిలో కొందరు డబ్బులకు ఆశపడి విద్యార్థులు, మధ్యవర్తులతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎవరైనా ఒత్తిడి చేస్తే తప్ప పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం లేదు. జేఎన్‌టీయూహెచ్‌లోనూ ఇటీవల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఒకరు డబ్బులు తీసుకొని అధికారులకు తెలియకుండా నిజమైన సర్టిఫికెట్లు అని నకిలీవి ఇస్తున్నట్లు గుర్తించారు. అది బహిర్గతం కావడంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. వేరే సెక్షన్‌కు మార్చినా పాత పాస్‌వర్డ్‌తో ఆ ఉద్యోగి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. మొత్తానికి పోలీసులకు ఫిర్యాదు చేసి వర్సిటీ అధికారులు చేతులు దులుపుకున్నారు.

* దానిపై పత్రికల్లో వార్తలు రావడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. అందుకే జేఎన్‌టీయూ-హెచ్‌ పరీక్షల విభాగంలో తరచూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పలు వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి. దానికితోడు పరీక్షల విభాగాల్లో, ఆచార్యుల నియామకాల్లోనూ ఒక విధానం లేకుండా పోతోంది. ఉప కులపతులను ప్రసన్నం చేసుకున్న వారికి వాటిల్లో పోస్టులు దక్కుతున్నాయన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లో వాటిని ప్రక్షాళన చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. దీంతో అసలు ఏ వర్సిటీ పరీక్షల విభాగంలో ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారు? వారు ఎవరు? వారిలో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలోని వారు ఎందరు? శాశ్వత ఉద్యోగులు ఎందరు? పరీక్షల ప్రాసెసింగ్‌ చేసే సంస్థలను ఎలా ఎంపిక చేస్తున్నారు? తదితర వివరాలను సమర్పించాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ రాష్ట్ర ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఈ వివరాల కోసం ఆయా వర్సిటీలను విద్యామండలి సిబ్బంది అడిగితే...ఆ సమాచారం బయటకు ఎలా ఇస్తాం? అని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ వర్సిటీ అధికారులు నిరాకరించినట్లు తెలిసింది.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.