• facebook
  • whatsapp
  • telegram

Education: డిగ్రీ కళాశాలలపై ఏఐసీటీఈ పిడుగు

* బీబీఏ, బీసీఏ, బీబీఎం కోర్సులకు అనుమతి తప్పనిసరి

* ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ ఈ కోర్సులు ప్రవేశపెట్టుకోవచ్చు


ఈనాడు, హైదరాబాద్‌: బ్యాచులర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(బీసీఏ), బ్యాచులర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ), బ్యాచులర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌(బీబీఎం) కోర్సులకు వచ్చే విద్యా సంవత్సరం(2024-25) నుంచి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతులు తప్పనిసరిగా పొందాలన్న నిబంధన రాష్ట్రంలోని పలు డిగ్రీ కళాశాలలకు శరాఘాతం కానుంది. ఇప్పటివరకు నిబంధనలు పాటించకపోయినా.. సరైన మౌలిక సదుపాయాలు లేకున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించేవారు. ఇక నుంచి ఆ కోర్సులకు కూడా ఏఐసీటీఈ నిబంధనలు వర్తింపజేస్తే చిన్న కళాశాలలకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, అదే సమయంలో విద్యానాణ్యత కూడా పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులకు యూజీసీ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతులు ఇస్తోంది. ఆ తర్వాత ఆయా విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్‌) జారీ చేస్తాయి. ఇక నుంచి పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ కోర్సుల తరహాలోనే బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులకూ ఏఐసీటీఈ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. 


ప్రస్తుతానికి అనుమతి మాత్రమే!

వచ్చే ఏడాది బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులు నడపాలంటే ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాల్సిందే. కొద్దిరోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం యూజీసీ నిబంధనల్లో ఎటువంటి మార్పు లేదని, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తి, మౌలిక వసతులు తదితర అంశాలను మార్చడం లేదని ఏఐసీటీఈ ఛైర్మన్‌ సీతారామ్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. అయితే ఈసారి ఈ కోర్సులను ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అదే జరిగితే విద్యార్థులు సాధారణ డిగ్రీ కళాశాలలకు బదులు.. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. దానికితోడు ఆ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టాలంటే రూ.లక్షల్లో దరఖాస్తు ఫీజు చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.10 లక్షలు కట్టాలి. ‘ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం తరగతి గది విస్తీర్ణం 720 చదరపు అడుగులు ఉండాలి. ప్రస్తుతం 400-500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గదుల్లోనూ తరగతులు నడుపుతున్నారు’ అని ఓ డిగ్రీ కళాశాల యజమాని తెలిపారు. ప్రస్తుతానికి ఏఐసీటీఈ నిబంధనలను అమలు చేయకున్నా ఒకటీ రెండు సంవత్సరాల్లో జరిగేది అదేనని ఆయన పేర్కొన్నారు. నగరాల్లో 30 ఏళ్ల లీజుకు ఒప్పందం ఉంటేనే కోర్సుకు ఏఐసీటీఈ అనుమతి ఇస్తుంది. జిల్లాల్లో సొంత భవనాలు తప్పనిసరి. నగరాల్లో 30 ఏళ్లకు లీజు ఒప్పందం చేసుకోవడం కష్టమని, జిల్లాల్లో 70 శాతానికిపైగా కళాశాలలు లీజు భవనాల్లోనే నడుస్తున్నాయని పలువురు చెబుతున్నారు.

 

చిన్న కళాశాలలకు భారమే..

ప్రస్తుతం చాలా కళాశాలల్లో బీసీఏ, బీబీఏ కోర్సుల ఫీజు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకే ఉంది. ఏఐసీటీఈ నిబంధనలు పాటిస్తే ఫీజులు పెంచాల్సి వస్తుంది. దానికితోడు ఏఐసీటీఈ పరిధిలోకి వస్తే కొన్ని ఫీజులను తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి(టీఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేస్తుంది. ఇంజినీరింగ్‌ తరహాలోనే కొన్ని పెద్ద కళాశాలలు రుసుములను భారీగా పెంచుతాయని అంచనా వేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని పలు చిన్న కళాశాలలు ఆ కోర్సులను మూసేసే ప్రమాదం ఉందని ఓయూ విశ్రాంత ఆచార్యుడు, ఓ ప్రైవేట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డీమ్డ్‌ వర్సిటీలు, ఏడెనిమిది కళాశాలలు మాత్రమే బీసీఏ, బీబీఏ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు తీసుకుంటున్నాయి. ‘దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. నిబంధనలపై కొంత అస్పష్టత ఉంది. వాటిని మార్చాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విన్నవిస్తాం’ అని తెలంగాణ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.పరమేశ్వర్‌ తెలిపారు.


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.