• facebook
  • whatsapp
  • telegram

Colleges: సీఎం రేవంత్‌ నియోజకవర్గంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల..

* కోస్గి పాలిటెక్నిక్‌ను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు

* మూడు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలు

* 2024-25 నుంచే తరగతుల ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌.. ఇంజినీరింగ్‌ కళాశాలగా మారనుంది. ఈ పాలిటెక్నిక్‌ను ఉన్నతీకరిస్తూ (అప్‌గ్రెడేషన్‌) విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఇక్కడ ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభించనున్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కళాశాలలో మూడు బీటెక్‌ బ్రాంచీలు (180 సీట్లు) అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ అండ్‌ ఎంఎల్‌), సీఎస్‌ఈ (డేటా సైన్స్‌) కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

* సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలోనే..

రాష్ట్రంలో ఇంతవరకు ఉన్న కళాశాలలు ఆయా విశ్వవిద్యాలయాల కళాశాలలే. అంటే అవి జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల మాత్రం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మౌలిక వసతుల కల్పన, బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, వారి వేతనాలు తదితర వాటిని ఆ శాఖే చేపడుతుంది. అయితే ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాల ఏదైనా ఏదో ఒక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండాలి.  అంటే.. ఒక వర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) తీసుకోవాలి. ఆ విశ్వవిద్యాలయం రూపొందించిన సిలబస్‌ను ఆ కళాశాల పాటించాలి. పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల జారీ వర్సిటీ చేస్తుంది. ఈ మేరకు కోస్గిలో ఏర్పాటయ్యే కళాశాల జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఉండనుంది.

* పాలిటెక్నిక్‌ కోర్సులు యథాతథం

ఇంజినీరింగ్‌ కళాశాలగా స్థాయి పెరిగినా ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు యథాతథంగా కొనసాగుతాయి. కోస్గి పాలిటెక్నిక్‌ కళాశాలను 2014లో 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించారు. అక్కడ సివిల్‌, మెకానికల్‌, ఈసీఈ బ్రాంచీలు (180 డిప్లొమా సీట్లు) ఉన్నాయి. వాటికి అదనంగా బీటెక్‌ బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం పాలిటెక్నిక్‌ కోర్సులకు ఉన్న అధ్యాపకులు సరిపోతారని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే అక్కడ హాస్టల్‌ కూడా అందుబాటులోకి వచ్చిందని అధికారి ఒకరు తెలిపారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.