• facebook
  • whatsapp
  • telegram

 ఫీజు చెల్లిస్తేనే  రెండో ఏడాది త‌ర‌గ‌తులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ బోర్డు హెచ్చరికలు బేఖాతరు చేస్తూ నగరంలోని పలు కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు ఫీ‘జులుం’ ప్రదర్శిస్తున్నాయి. నెలాఖరులోపు ఫీజులు కట్టకపోతే రెండో ఏడాదికి పంపించేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ప్రస్తుతానికి పరీక్షలు లేకుండా రెండో ఏడాదికి ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కారణంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో 1,74,032 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు రెండో ఏడాదిలోకి ప్రమోట్‌ అయ్యారు. వీరిలో 1.25లక్షల మంది ప్రైవేటు కళాశాలల్లోనే చదువుతున్నారు. 2020-21 సంవత్సరంలో మొదటి ఏడాదిలో చేరిన విద్యార్థులకు 20-25 రోజుల ప్రత్యక్ష బోధన జరిగింది. మిగిలిన రోజుల్లో ఆన్‌లైన్‌ తరగతులు నడిచాయి. అయినప్పటికీ కొన్ని కార్పొరేట్‌ కళాశాలలు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. గత ఫిబ్రవరిలో ప్రత్యక్ష బోధన జరిగినప్పుడు తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ చాలావరకు ఫీజులు చెల్లించారు. ఇప్పుడు మిగిలిన ఫీజు చెల్లించాలని, లేకపోతే రెండో ఏడాది తరగతులకు అనుమతించేది లేదని చెబుతున్నాయి.

     ‘మొదటి ఏడాదికి సంబంధించి పెండింగులో ఉన్న ఫీజులను ఏప్రిల్‌ 28లోగా చెల్లించాలి. లేకపోతే 29 నుంచి ప్రారంభం కానున్న రెండో సంవత్సరం ఆన్‌లైన్‌ క్లాసులకు వెబ్‌లింకు ఇవ్వడం కుదరదు. ఫీజులు కట్టని విద్యార్థులకు నైతిక -మానవీయ విలువలు, పర్యావరణ విద్య అసైన్‌మెంట్ల మార్కులను ఇంటర్‌ బోర్డుకు ఇచ్చేది లేదు. రెండో ఏడాదికి ప్రమోట్‌ చేసేది లేదు.’’

- నిజాంపేట సమీపంలోని ఓ కార్పొరేట్‌ కళాశాల ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు పంపించిన సందేశం ఇది.

అప్పుడే మార్కులు పంపిస్తామని..

మొదటి ఏడాదికి సంబంధించి నైతిక, మానవీయ విలువలు, పర్యావరణ విద్య అసైన్‌మెంట్‌ జవాబుపత్రాలను దిద్ది మే 3లోపు ఇంటర్‌బోర్డుకు సమర్పించాలని ఆయా కళాశాలలను అధికారులు ఆదేశించారు. ఫీజులు చెల్లించకపోతే ఆయా మార్కులను అప్‌లోడ్‌ చేసేది లేదని కొన్ని కళాశాలల యజామాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ఇంటర్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అధికారులు హెచ్చరించినా పట్టించుకోవడంలేదు.

సెలవులైనా తరగతులు తప్పవా..?

ఏప్రిల్‌ 27 నుంచి మే 31 వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఇవేమీ పట్టించుకోకుండా ఏప్రిల్‌ 29 లేదా 30 తేదీల నుంచి రెండో ఏడాది తరగతులు ఆన్‌లైన్‌లో ప్రారంభిస్తున్నట్లు కళాశాలల యాజమాన్యాలు సందేశాలు పంపిస్తున్నాయి. మొదటి ఏడాది ఫీజులను చెల్లించకపోతే వెబ్‌లింకులు పంపించేది లేదని చెబుతున్నాయి.

వచ్చే విద్యా సంవత్సరానికి అంతే..!

2021-22 సంబంధించి మొదటి ఏడాది ప్రవేశాలను జూనియర్‌ కళాశాలలు చేపట్టాయి. నగరంలోని ఓ కార్పొరేట్‌ కళాశాల యాజమాన్యం ఏడాదికి రూ.1.80 లక్షల ఫీజును నిర్ణయించింది. రూ.40 వేలు తగ్గిస్తున్నట్లు చెప్పి, రూ.1.40 లక్షలు చెల్లించాలంటోంది. ఆన్‌లైన్‌ తరగతులైనప్పటికీ ఫీజులు భారీగా నిర్ణయించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరో పేరున్న కళాశాల యాజమాన్యం రూ.3లక్షలు, మరో యాజమాన్యం రూ.1.70 లక్షలుగా ఫీజులు నిర్ణయించాయి. ఆన్‌లైన్‌ తరగతుల ఫీజుల విషయంలో ఇంటర్‌ బోర్డు నుంచి విధి విధానాలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి.

నేరుగా ఫిర్యాదు చేయవచ్చు

మార్కులు అప్‌లోడ్‌ చేసేందుకు మే 3వ తేదీ వరకు సమయం ఉన్నప్పటికీ, ఏప్రిల్‌ 30 లోపే పంపించాలని అన్ని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించాం. ఫీజులకు లింకు పెడుతూ వేధిస్తుంటే నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్ఛు దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. వేసవి సెలవుల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు వీల్లేదు.

- కిషన్‌, మేడ్చల్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.