• facebook
  • whatsapp
  • telegram

కార్పొరేషన్లు, సొసైటీల్లో 9వేల పోస్టులు

* భ‌ర్తీ చేసేలా ప్రభుత్వ నిర్ణయం


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు(కార్పోరేషన్లు), సహకార సంస్థ(సొసైటీ)ల్లోని ఖాళీలనూ భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సమాచారం ఇవ్వాలని అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులను తాజాగా ఆదేశించింది. దీంతో భర్తీ చేయనున్న ఉద్యోగాల సంఖ్య మరో తొమ్మిది వేల మేరకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు 190కి పైగా ఉన్నాయి. వీటిలో భారీగా ఉద్యోగాల ఖాళీలున్నాయి. చాలా ఏళ్లుగా కార్పొరేషన్లు, సొసైటీల్లో ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. పదవీ విరమణలతో ఉద్యోగాల ఖాళీలు పెరుగుతున్నా వాటి స్థానంలో నియామకాలు జరగడం లేదు. అన్ని కార్పొరేషన్లలో కలిసి 8,920కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రాథమిక సమాచారం. మరోవైపు కొన్ని సంస్థలు, సొసైటీల అధికారులు, ఉద్యోగులు డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచేస్తున్నారు. సంస్థల్లో ఉద్యోగుల లోటు ఉన్నా ప్రభుత్వపరంగా ఖాళీలు భర్తీ కావడం లేదు. ఆర్థిక పొదుపు చర్యల పేరిట కొత్త ఉద్యోగాలను ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఖాళీల వల్ల ఆయా సంస్థల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిబ్బందిపై పనిభారం పడుతోంది.  తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం అన్ని శాఖల నుంచి ఖాళీల సమాచారం కోరింది. దీంతో అన్ని శాఖలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లోని పోస్టుల సమాచారం మాత్రమే ఇచ్చారు. కార్పొరేషన్లు, సొసైటీలను పట్టించుకోలేదు. దీనిని సమీక్షించిన ప్రభుత్వం శాఖలతో పాటు కార్పొరేషన్లు, సొసైటీల పరిధిలోని ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తున్నట్లు అన్ని శాఖలకు సమాచారం ఇచ్చింది. ఆయా శాఖలు విధిగా తమ పరిధిలోని అన్ని కార్పొరేషన్లు, సొసైటీల నుంచి సమాచారం తీసుకొని ప్రభుత్వానికి నివేదించాలని సూచించింది.

సమాచార సేకరణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లు, సొసైటీల నుంచి ఖాళీల సమాచారం ఇవ్వాలని వాటి మేనేజింగు డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారులకు సూచించాయి. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర పౌరసరఫరాలు, అటవీ అభివృద్ధి సంస్థ, టీవీ-చలనచిత్ర అభివృద్ధి సంస్థ, వైద్యఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ, టీఎస్‌టీఎస్‌, ఖనిజాభివృద్ధి సంస్థ, ఆగ్రోస్‌, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థ, రాష్ట్ర చేనేత సహకార సంస్థ(టెస్కో), తెలంగాణ ఫుడ్స్‌, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, గొర్రెలు-మేకల అభివృద్ధి సంస్థ, పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ అయ్యే వాటిలో ఉన్నాయి.

ఒప్పంద ఉద్యోగులకు ఆ భాగ్యం దక్కేనా
ఆర్టీసీ, జెన్‌కో, ట్రాన్స్‌కో తదితర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వం దశల వారీగా క్రమబద్ధీకరిస్తోంది. మిగిలిన కార్పొరేషన్లు, సొసైటీలకు మాత్రం ఈ భాగ్యం దక్కడం లేదు. ఒక్కో ఒప్పంద ఉద్యోగి అతి తక్కువ వేతనాలతో ఆయా సంస్థల్లో, సొసైటీల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర విధుల్లో ఒప్పంద ఉద్యోగులు ఉన్నత విద్యార్హతలతో సమర్థంగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ట్రాన్స్‌కో, ఆర్టీసీ మాదిరిగా వారిని క్రమబద్ధీకరించాల్సి ఉన్నా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల్లో దీర్ఘకాలిక అనుభవంతో ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలోనే సేవలందిస్తున్నా తమను క్రమ‌బద్ధీకరించడం లేదని వాటిల్లోని ఒప్పంద ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తాజా నియామకాల ప్రక్రియలో తమను క్రమబద్ధీకరించడం ద్వారా ఆయా ఉద్యోగాల భర్తీ లక్ష్యం నెరవేరుతుందని ఒప్పంద ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.