• facebook
  • whatsapp
  • telegram

ఈ కోర్సుల‌తో ఉద్యోగాలు ఖాయం!

 మూస చ‌దువులు వ‌దిలితే మేలు

 ఇంజినీరింగ్‌, మెడికల్‌ చ‌దువులే కాదు

 అందుబాటులో మరెన్నో ఉజ్వలమైన కోర్సులు

 కొన్నింటిపైనే మోజు వద్దంటున్న నిపుణులు


బీటెక్‌... దేశవ్యాప్తంగా అందరినోటా నానుతున్న కోర్సు. ఇందులో 13.29 లక్షల సీట్లు ఉన్నాయి. భర్తీ అవుతున్నది 7.36 లక్షలు. చివరకు కొలువులు దక్కించుకుంటున్నది 3.90 లక్షలు మాత్ర‌మే.  అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) చెబుతున్న 2019-20 విద్యా సంవత్సరం తాలూకూ లెక్కలివీ. ఆయా కళాశాలలు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించినప్పటికీ..వాస్తవానికి ఉద్యోగాలు పొందిన వారు 2.50 లక్షలకు మించకపోవచ్చన్నది  నిపుణుల అంచనా. ఇదీ దేశంలో ఇంజినీరింగ్‌ విద్య వాస్తవ పరిస్థితి.

 భారత్‌లో 2022 నాటికి మల్టీ మీడియాలో నిపుణులైన 13 లక్షల మంది అవసరమని ప్రముఖ కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. కానీ దేశంలో ఏటా ఈ రంగంలో 30 వేల మంది కూడా డిగ్రీ పూర్తిచేయడం లేదని కూడా ఇందులో పేర్కొంది.

 ఈ-కామర్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగాల్లో వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అమెజాన్‌ సంస్థ ఇటీవల ప్రకటించింది. అయితే బీకాం ఈ-కామర్స్‌ డిగ్రీ కోర్సులను అందించే విద్యాసంస్థలు తెలంగాణలో రెండే ఉండటం గమనార్హం.

దేశంలో విద్యార్థులు చదివే చదువులకు, కొలువులపరంగా ఉన్న గిరాకీకి మధ్య పొంతనలేదనేందుకు ఈ ఉదాహరణలే నిదర్శనం. అవసరంలేని కోర్సుల్లో లక్షల సీట్లు ఉండగా, అవసరం ఉన్న రంగాల్లో అరకొర మాత్రమే ఉంటున్నాయి. వచ్చే ఐదు, పదేళ్లకు ఏ రంగానికి ఎంత మంది నిపుణులు అవసరం, అందుకు అనుగుణంగా తీర్చిదిద్దే కోర్సులు ఏవి? అనే అంశాన్ని ప్రభుత్వాలు అధ్యయనం చేయడం లేదు. దీంతో విద్యార్థులకు మార్గదర్శకం కరవవుతోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఇంజినీరింగ్‌, వైద్యవిద్య తప్ప మిగతా కోర్సులపై ఆసక్తి చూపడం లేదు. కొలువులొచ్చే మంచి కోర్సులు ఎన్నో ఉన్నాయని, వాటి గురించి తెలుసుకుని ఇంటర్‌లోనే తగిన గ్రూపును ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజినీరింగ్‌ కళాశాలలు బీటెక్‌ తప్ప మరో చదువు లేదనే భావనను సగటు తల్లిదండ్రుల్లో కల్పించాయి. బీటెక్‌ చదివితే చాలు మన పిల్లలు ఐదంకెల జీతం ఆర్జిస్తారనే ఆశలనూ వారిలో బలంగా నాటాయి. ఒకటిన్నర దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ మూస ధోరణి కళ్లెదుటే ఎన్నో ఉజ్వలమైన, కచ్చితంగా ఉపాధినిచ్చే కోర్సులు ఉన్నా చూడలేని పరిస్థితిని కల్పించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది మంచి పరిణామం కాదని బీటెక్‌లోనూ సంప్రదాయ కోర్సులు కాకుండా కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటివి చదివితే ప్రయోజనం ఉంటుందని డిగ్రీలో డేటా సైన్స్‌తోపాటు ఆర్ట్స్‌ గ్రూపుల్లోనూ అనేక కొలువులిచ్చే కోర్సులున్నాయని, వాటిని చదివితే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందని చెబుతున్నారు. ఆ దిశగా విద్యార్థిలోకంలో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం విద్యావంతులతోపాటు, ప్రభుత్వాలపైనా ఉందని సూచిస్తున్నారు.. అలాంటి ఉపాధినిచ్చే కోర్సులు ఏమేం ఉన్నాయి, నిపుణులు, సర్వేలు ఏం చెబుతున్నాయో చూద్దాం..

మల్టీమీడియా.. హోటల్‌ మేనేజ్‌మెంట్‌

బీటెక్‌ చేసి ఖాళీగా ఉండేవారిని చూస్తాంగానీ.. మల్టీమీడియాలో డిగ్రీ పూర్తిచేసిన వారిలో 100 శాతం మందికి ఉద్యోగాలు దక్కుతున్నాయని డిజి క్వెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ సంస్థ అధినేత బసిరెడ్డి చెప్పడం ఆ కోర్సుకు ఉన్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతోంది. పెళ్లి కార్డుల నుంచి వినోదం, విద్యారంగం వరకు మల్టీమీడియాలో భాగమైన యానిమేషన్‌, గ్రాఫిక్స్‌ లాంటివి వినియోగించని రంగం లేదనేది ఆయన నిశ్చితాభిప్రాయం. ‘ఆ విద్యార్హతతో గ్రాఫిక్‌ డిజైనర్‌, వెబ్‌ డిజైనర్‌, కంటెంట్‌ స్ట్రాటజిస్ట్‌, బ్లాగర్‌, సోషల్‌ మీడియా డిజైనర్‌ లాంటి పలు ఉద్యోగాలున్నాయి. టీవీ, సినిమా, గేమింగ్‌, మీడియా, ప్రకటనల(అడ్వర్‌టైజింగ్‌) రంగాల్లోనూ కొలువులు దక్కుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.  ‘పెళ్లి నుంచి బహిరంగ సభలు, సమావేశాలు సహా ఏ కార్యక్రమమైనా నిర్వహించే బాధ్యతలను ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకే అప్పగిస్తున్నాం. అందుకే ఆ రంగంలో కూడా ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి’ అని కళాశాల విద్యాశాఖలో అకడమిక్‌ అధికారిగా పనిచేసిన డాక్టర్‌ నీరజ చెబుతున్నారు. భూమిపై మనిషి ఉన్నంత వరకు ఫార్మసీకి గిరాకీ ఉంటుందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ‘హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అంటే చెఫ్‌గా పనిచేయడమేననే అపోహ చాలా మందిలో ఉంది. అందులో కేటరింగ్‌ మేనేజ్‌మెంట్‌, హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హౌస్‌ కీపింగ్‌ లాంటి పలు విభాగాలుంటాయని’ జాహ్నవి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల అధినేత పరమేశ్వర్‌ చెప్పారు.

కొత్త సాంకేతికతలు.. కొలువులు కోకొల్లలు

కృత్రిమ మేధ(ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ), బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, డేటాసైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ తదితర వాటిల్లో నైపుణ్యం సాధించిన వారికి భారీగా కొలువులు రానున్నాయని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. మారుతున్న సాంకేతికత పరిజ్ఞానం, తదనుగుణంగా దక్కే ఉపాధి అవకాశాలకు సంబంధించి ప్రపంచ పరిణామాలను క్షుణ్నంగా గమనిస్తున్న ఐఐటీలు కూడా గత ఏడాది నుంచి బీటెక్‌, ఎంటెక్‌ స్థాయిలో కృత్రిమ మేధ, డేటా సైన్స్‌, అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ తదితర విభాగాల్లో కోర్సులను ప్రారంభించాయి. అన్ని పరిశ్రమల్లో ఏఐ కీలకంగా మారనుందని, మెషిన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) అల్గారిథమ్స్‌ వాడకుండా సమీప భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోలేరని జేఎన్‌టీయూహెచ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఆచార్యుడు కామాక్షిప్రసాద్‌ చెప్పారు. 2026 నాటికి ఏఐ నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా అపార ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నాస్కామ్‌ అంచనా వేసిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. డేటాసైన్స్‌లో భారత్‌లోనే ప్రస్తుతం 97 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, డేటాసైన్స్‌లో నైపుణ్యం కొరతే దానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కొన్ని పెరా బైట్‌ల సమాచారం పుట్టుకొస్తున్నందున వాటిని ప్రాసెస్‌ చేసి ఆయా రంగాల్లో వినియోగించే నిపుణుల అవసరం ఎంతైనా ఉందని జేఎన్‌టీయూహెచ్‌లోని సైబర్‌ సెక్యూరిటీ పరిశోధన కేంద్రం ఇన్‌ఛార్జి ఆచార్య శ్రీదేవి అభిప్రాయపడ్డారు. ‘2020 నాటికి 10 లక్షల సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉందని నాస్కామ్‌ అంచనా వేసింది. 2021 నాటికి ఆ అవసరం 35 లక్షలకు పెరిగింది. దీన్నిబట్టే ఆ రంగంలో గిరాకీ ఎంత వేగంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు’ అని ఆమె స్పష్టం చేశారు.

అర్ధగణాంకానికీ అవకాశాలెక్కువే..

డిగ్రీ స్థాయిలో అర్ధగణాంకశాస్త్రం(స్టాటిస్టిక్స్‌), ఆర్థికశాస్త్రం, డిజిటల్‌ కమ్యూనికేషన్‌/జర్నలిజం ప్రధాన సబ్జెక్టులుగా చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఈ మూడు రకాల కోర్సుల్లో ఒక సబ్జెక్టుగా ఐటీ ఉండటం తప్పనిసరని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య అప్పారావు పొదిలె చెప్పారు. డేటా సైన్స్‌ రంగంలో స్టాటిస్టిక్స్‌కు గిరాకీ ఉందని, ఈ-కామర్స్‌ రంగం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ తరహా నిపుణుల అవసరం బాగా పెరుగుతోందన్నారు. ‘స్టాటిస్టియన్స్‌ అవసరం ప్రపంచవ్యాప్తంగా 2019-2029 మధ్య ఏటా 35 శాతం పెరగబోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్‌లో మాత్రం వందల సంఖ్యలోనే తయారు చేసుకుంటున్నాం’ అని సీఆర్‌ రావు అడ్వాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌సైన్స్‌’ సంచాలకుడు యు.యుగంధర్‌ చెప్పారు.

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులతో నైపుణ్యం
ఇంటర్‌ విద్యార్హతతో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను అందిస్తున్నాయి. అయిదేళ్లు ఉండే ఈ కోర్సులతో డిగ్రీ, పీజీ విద్య అభ్యసించవచ్చు. ఈ కోర్సులను సెంట్రల్‌ వర్సిటీలు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివితే ఉద్యోగావకాశాలు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఐఐఎం ఇండోర్‌లో ఇంటర్‌ విద్యార్హతతో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ చేయవచ్చు. అన్ని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌)ల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులున్నాయి. ప్రముఖ వర్సిటీలు, సంస్థల్లో చదవడం వల్ల నైపుణ్యాలూ పెరుగుతాయి. ప్రాంగణ నియామకాల్లోనే కొలువులకు ఎంపికయ్యే అవకాశాలుంటాయి.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఏం చెప్పిందంటే..
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఇటీవల విడుదల చేసిన ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌ రిపోర్ట్‌-2020 నివేదిక ప్రకారం వచ్చే అయిదు సంవత్సరాల్లో గిరాకీ పెరిగే 10 కొలువుల్లో మొదటి స్థానం కృత్రిమ మేధ(ఏఐ)దే. భారత్‌లో అత్యధిక డిమాండ్‌ ఉండే ఉద్యోగాల్లోనూ ఏఐ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ స్పెషలిస్టులు, డేటా అనలిస్ట్స్‌ అండ్‌ సైంటిస్టులు, ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్టులు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ స్పెషలిస్టులు, బిగ్‌ డేటా అనలిస్టులు మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయని ఆ నివేదిక స్పష్టంచేసింది. అందుకు అనుగుణంగానే ఆయా కొత్త సాంకేతికతల్లో నిపుణులను అందించాలన్న లక్ష్యంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ విద్యా సంవత్సరం (2020-21) దేశవ్యాప్తంగా కొత్త కోర్సులను అనుమతి ఇచ్చిందని వర్సిటీల ఆచార్యులు గుర్తుచేస్తున్నారు. ‘‘సాఫ్ట్‌వేర్‌ రంగంలో కోడింగ్‌ కీలకం. అందుకే 6వ తరగతి నుంచే దాన్ని నేర్పాలని జాతీయ నూతన విద్యా విధానంలో కేంద్రం నిర్ణయించింది. సీబీఎస్‌ఈ 2019-20 విద్యా సంవత్సరం నుంచి కృత్రిమ మేధను 9వ తరగతి నుంచి ఐచ్ఛిక సబ్జెక్టుగా ప్రవేశపెట్టింది’ అని వారు స్పష్టంచేశారు.

ఇంటర్‌ తర్వాత చదవదగ్గ ముఖ్యమైన కోర్సులివీ...
1. ఈ-కామర్స్‌/డిజిటల్‌ మార్కెటింగ్‌

2. హోటల్‌ మేనేజ్‌మెంట్‌

3. యానిమేషన్‌/మల్టీమీడియా

4. ఫ్యాషన్‌ డిజైనింగ్‌/ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ తదితరాలు

5. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌

6. స్టాటిస్టిక్స్‌

7. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ

8. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌

9. ఇన్సూరెన్స్‌

10.ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ

11. లా

12. ఫైన్‌ ఆర్ట్స్‌/ఆర్కిటెక్చర్‌

బోధన రంగంలోనూ అవకాశాలు
- ఆచార్య రాజశేఖర్‌, ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్

కొన్నేళ్ల తర్వాత గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు సహా కీలక సబ్జెక్టులు బోధించే నిపుణులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. పాఠ్యాంశంపై పట్టు, బోధన తీరులో విభిన్నత, సరళంగా బోధించే నైపుణ్యం ఉన్న వారికి ఈ రంగంలో బెలెడన్ని అవకాశాలున్నాయి. కరోనా తర్వాత ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. హోం ట్యూషన్లకీ గిరాకీ ఎక్కువైంది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో భారత్‌ ఉపాధ్యాయులకు మంచి అవకాశాలున్నాయి. ఇప్పటికే అక్కడ ఎంతోమంది పనిచేస్తున్నారు. అందుకే ‘డిమాండ్‌-సరఫరా’ సూత్రాన్ని మరిచిపోకుండా సమతుల్యత పాటించాలి.

మంచి విద్యాసంస్థలను ఎంచుకోండి
- జగదేశ్వర్‌, కెరీర్‌ కౌన్సెలర్‌

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఇంజినీరింగ్‌, వైద్యవిద్యేతర కోర్సులపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఆయా కోర్సులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర విద్యాశాఖలపై ఉంది. ముఖ్యంగా డిజైన్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌, ఆర్కిటెక్చర్‌ లాంటి కోర్సులను జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో చదివితే మంచి వేతనాలు అందుకోవచ్చు. ప్రారంభ వేతనాన్నిబట్టి కాకుండా కొన్నేళ్ల అనుభవం తర్వాత కెరీర్‌ ఎలా ఉంటుందన్నది పరిగణనలోకి తీసుకుని కోర్సులను ఎంపిక చేసుకోవడం మంచిది.

 

- ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.