• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్ విధానాన్ని ఎలా స‌ద్వినియోగం చేసుకోవాలి

మ్మానాన్నలూ ఉపాధ్యాయులుగా మారండి

నిపుణులు, వైద్యుల సూచ‌న‌లు

ఈనాడు, అమరావతి: గుంటూరుకు చెందిన శ్యాంప్రసాద్‌ పదో తరగతి విద్యార్థి. అతనికి ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కావడం లేదు. సందేహాలు అడిగితే ఉపాధ్యాయులు ఏమంటారోననే భయం. ఉదయం నుంచి సాయంత్రం దాకా స్మార్ట్‌ఫోన్‌ ముందే కూర్చోవాల్సి వచ్చేసరికి.. ఒత్తిడికి లోనై నేర్చుకున్న అంశాన్ని సరిగా గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు. తన సమస్యను స్నేహితులతో పంచుకునే వీల్లేక.. తల్లిదండ్రులతో ఎలా చెప్పాలో తెలియక మనోవేదనకు గురవుతున్నాడు. కుమారుడి పరిస్థితిని గమనించిన తండ్రి సుబ్బారావు తానే ఉపాధ్యాయుడిగా మారారు. రోజూ గంటపాటు కుమారుడికి పాఠాలు చెబుతున్నారు. సందేహాల నివృత్తి కోసం తానూ ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నారు. కరోనా కారణంగా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఇదే కథ. వైరస్‌ వ్యాప్తి వల్ల ఈ విద్యాసంవత్సరంలో పిల్లలు ఆరు నెలలుగా తరగతులకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌లో చదువులు అనివార్యమయ్యాయి. ఏపీలో 7, 8, 9, 10 తరగతుల వారికి విద్యాసంస్థల్ని పునఃప్రారంభించారు. 50 శాతంలోపే పిల్లలు వస్తున్నారు. మిగతావారు ఇంటి దగ్గర ఉంటూ ఆన్‌లైన్‌ చదువుకే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో పాఠశాలలను ఫిబ్రవరి 1 నుంచి తెరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ విధానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? పిల్లల మేధో వికాసానికి, ఆరోగ్య పరిరక్షణకు ఏం చర్యలు తీసుకోవాలి? నిపుణులు వెల్లడిస్తున్న ఆసక్తికర అంశాలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

పాఠశాలలు, ఉన్నతవిద్య తరగతులు మొదలైనా ఆన్‌లైన్‌కు హాజరయ్యే వారే అధికం. పాఠశాలలు, కళాశాలలకు నేరుగా వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది.

గతానికి భిన్నంగా..

ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా అమ్మానాన్నలూ ఉపాధ్యాయులుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య స్నేహపూరిత వాతావరణం మరింత ఇనుమడించాలి. నిద్ర లేవడానికి, ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు మధ్య తప్పనిసరిగా గంట సమయం ఉండాలి. అప్పుడే నిద్రమత్తు వీడి మెదడు చురుగ్గా పని చేస్తుంది. పాఠాలు వినే చోటనే మంచినీరు, అల్పాహారం అందుబాటులో ఉంచడం మంచిది. వాటికోసం తరచూ లేచి వెళ్లి, మళ్లీ వచ్చి తరగతులు వింటుంటే నేర్చుకున్న అంశాల్ని మరచిపోయే ప్రమాదముందని మానసిక నిపుణులు సుధీర్‌ సండ్ర పేర్కొంటున్నారు.

ఒత్తిడిని చిత్తు చేద్దామిలా..

విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే గది, వారు కూర్చునే చోటు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

పాఠశాల, కళాశాలకు వెళ్లక్కర్లేదని ఎక్కువ సమయం నిద్రపోకూడదు.

ఆన్‌లైన్‌ తరగతులు ముగిశాక పునశ్చరణ చేసుకోవాలి. రోజులో రెండు గంటలైనా చదవాలి. హోం వర్క్‌, ప్రాజెక్టు పనుల్ని చేసుకోవాలి.

రెండు గంటలకోసారి 10-15 నిమిషాలు విరామం తీసుకోవాలి.

‣ తోటి విద్యార్థులతో గడిపే అవకాశం లేదు కాబట్టి చాలామందిని ఒంటరితనం ఇబ్బంది పెడుతుంది. దీనికి తోడు ఒత్తిడి. వీటిని ఎదుర్కొనేందుకు ఇంట్లోనే తేలికపాటి వ్యాయామం, ధ్యానం చేయాలి.

కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లతో గడిపే సమయాన్ని వీలైనంత తగ్గించుకోవాలి. తరగతులు అయ్యాక కాసేపు కళ్లు మూసుకుని ప్రశాంతంగా ఉండాలి. కుటుంబసభ్యులతో కూర్చొని మాట్లాడాలి. అవకాశం ఉన్నవారు ఇంటి పెరట్లో కూర్చుని ప్రకృతిని చూస్తూ సేదతీరితే మంచిది.

పెద్దలూ దృష్టి పెట్టండి...

‣ తరగతి పూర్తికాగానే ఉపాధ్యాయులు ఏం చెప్పారని పిల్లల్ని అమ్మానాన్నలు అడుగుతూ ఉండాలి.

దాదాపు 9 నెలలుగా ఇంట్లోనే ఉండిపోయారు కాబట్టి కొందరు నలుగురితో కలవకపోతే ఇబ్బంది పడుతుంటారు. అలాంటి పిల్లల చేత వారి స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడించాలి.

ఆన్‌లైన్‌ బోధనలో ఏదైనా సందేహాలుంటే వెంటనే ఉపాధ్యాయుల్ని ప్రశ్నించి, నివృత్తి చేసుకునేలా పెద్దలే ప్రోత్సహించాలి.

విద్యార్థులు పోషకాహారం తీసుకుని తగినంత నిద్రపోవాలి.

‣ పిల్లలకు భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడమే కాదు వాటిని వ్యక్తపరచడమూ నేర్పించాలి. తమ అభిమాన కామిక్‌, కార్టూన్‌, టీవీ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడం ద్వారా భావాల్ని ఎలా వ్యక్తపరుస్తారో తెలపమనాలి. తమ మాటలు వినేవారు ఉన్నారనే భావన పిల్లల్లో కల్పించాలి.

బుజ్జాయిల కృషిని ప్రశంసించాలి. తప్పుల నుంచి నేర్చుకునే మెలకువను అలవరచాలి.

కూర్చునే విధానమూ మారాలి

ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు అదేపనిగా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మెడ, నడుం నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతి అరగంట లేదా 45 నిమిషాలకోసారి లేచి.. మళ్లీ కూర్చోవాలి. కూర్చునే విధానంలోనూ మార్పు చేసుకోవాలి. కంప్యూటర్‌, మొబైల్‌ను సరైన ఎత్తులో టేబుల్‌పై అమర్చుకోవాలి. వీలైనంత వరకు వీపును వెనకకు ఆనించి, నిటారుగా కూర్చోవడం మంచిది.

- పీవీ రామారావు, పిల్లల వైద్యులు, సంచాలకులు, ఆంధ్ర ఆసుపత్రులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.