• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏఐ ట్రెండ్‌.. ఎంఎల్‌ డిమాండ్‌!

 

 

చిన్నపిల్లలు ఆడుకునే రిమోట్‌ కారు దగ్గర్నుంచి... సొంతంగా డ్రైవ్‌ చేసుకెళ్లే స్మార్ట్‌ కార్ల వరకూ... అంతటా, అన్నింటా విస్తరించేసింది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - ఏఐ). మనిషి తానెలా అయితే ఆలోచించి పనిచేస్తాడో... అలాంటి మేధనే కృత్రిమంగా సృష్టించి అద్భుతాలు చేస్తున్నాడు.

 

ఫార్చ్యూన్‌ బిజినెస్‌ ఇన్‌సైట్స్‌ అంచనా ప్రకారం ఒక్క 2020లోనే వైద్య రంగంలో ఏఐ మార్కెట్‌ డిమాండ్‌లో 150 శాతం పెరుగుదల కనిపించింది. రిటైల్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, ఆటోమోటివ్, లాజిస్టిక్స్‌.. ఇలా అన్ని రంగాల్లోనూ ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) టెక్నాలజీకి డిమాండ్‌ పెరుగుతుండటంతో ఈ నిపుణులకు అవకాశాలూ పెరిగాయి. ఇందుకు తగినట్టు వివిధ సంస్థలు సర్టిఫికెట్‌ నుంచి పీజీ స్థాయి వరకూ ఏఐలో పలు కోర్సులు అందిస్తున్నాయి. వీటిని నేర్చుకోవడం ద్వారా ఈ రంగంలో స్థిరమైన, లాభదాయకమైన కెరియర్‌ను నిర్మించుకోవచ్చు.

 

మనుషుల ఆలోచనా సరళి, మేధ లాగానే పనిచేసే ఏఐలో కొత్త టెక్నాలజీకి లోటులేదు. ఒకప్పుడు కంప్యూటర్‌ సైన్స్‌లో అంతర్భాగమయినా... ఇప్పుడు ఏఐ సొంతంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పరిశ్రమల్లో ఆలోచనతో పనిలేకుండా పదే పదే చేయాల్సిన పనులు, చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడం వంటి వాటిని ఏఐ ఇప్పటికే ఆక్రమించింది. మనుషులకు శారీరక శ్రమ తగ్గించేలా, వారి రోజువారీ పనుల్లో సాయపడేలా ముందడుగు వేస్తోంది. అత్యాధునిక యంత్రాల తయారీలోనూ దీనిది ముఖ్యపాత్ర. అలెక్సా, సిరి, టెస్లా కార్లు... ఇవన్నీ ఏఐకు ఉదాహరణలే. భాషలను అనువాదం చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, మాటలను గుర్తించడం.. ఇలాంటి పనులన్నీ ఏఐ సునాయాసంగా చేస్తుంది. దేశంలో ఆరోగ్యం, ఆర్థికం, తయారీ వంటి ప్రధాన రంగాలను ఏఐ ప్రభావితం చేస్తోంది. దాదాపు ప్రతి పరిశ్రమలోనూ ఇప్పుడిది అంతర్భాగమైంది.

 

మెషిన్‌ లెర్నింగ్‌

ఒక్క వాక్యంలో చెప్పాలంటే మనుషుల్లాగానే యంత్రాలు కూడా పాత అనుభవాల నుంచి కొత్తపాఠాలు నేర్చుకోవడాన్ని మెషిన్‌ లెర్నింగ్‌ అంటున్నారు. ఇది ఒక అల్గారిథమ్‌. ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు కోడ్‌ రాసుకోవచ్చు. అయితే అది ప్రాసెస్‌ అయ్యే విధానం మాత్రం ఒకేలా ఉంటుంది. ఈ అల్గారిథమ్స్‌లో సూపర్‌వైజ్డ్, అన్‌సూపర్‌వైజ్డ్, రీయిన్‌ఫోర్స్‌మెంట్‌ అనే మూడు రకాలున్నాయి. ఇచ్చిన సమాచారాన్నిబట్టి, అంతర్జాలాన్ని ఉపయోగించి, మన ప్రవర్తన తీరును అంచనా వేసి... ఇలా ఒక్కోటీ ఒక్కో విధంగా పనిచేస్తాయి. గూగుల్‌లో సెర్చ్‌ను అనుసరించి వచ్చే ఫలితాలు, ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ సజెషన్స్‌ వంటివి ఎంఎల్‌కు చక్కటి ఉదాహరణ. ఏఐలో మెషిన్‌లెర్నింగ్‌తోపాటు డీప్‌లెర్నింగ్, పైతాన్, డేటా అనాలిసిస్, లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి.

 

ఏం నేర్పుతారు?

ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు ఏఐలో ప్రాథమిక అంశాలు, మెషిన్‌ లెర్నింగ్, స్మార్ట్‌ అప్లికేషన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, డేటా అనాలిసిస్, రోబోటిక్స్, ఏఐ సిస్టమ్స్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి పలు అంశాలను అధ్యయనం చేస్తారు. పైతాన్‌ కోడింగ్‌ లాంగ్వేజ్, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్, అనుబంధ టాపిక్స్‌ను నేర్చుకుంటారు. లెక్కలంటే ఇష్టం ఉన్నవారికి... ప్రోగ్రామింగ్‌పై పట్టున్నవారికి... ఏఐ చక్కటి ఎంపిక. టెక్నాలజీపై ఆసక్తి... ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు ఇందులో ఎదుగుదల ఆశించవచ్చు.

ఏఐలో పట్టు సాధించాక అర్హత, అనుభవాన్నిబట్టి గేమ్‌ ప్రోగ్రామర్స్, రోబోటిక్‌ సైంటిస్ట్, కంప్యూటర్‌ సైంటిస్ట్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, ఏఐ రిసెర్చర్, ఏఐ గ్యాడ్జెట్స్‌ డెవలపర్లుగా రాణించే అవకాశం ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్, సామ్‌సంగ్, టీసీఎస్, విప్రో... లాంటి అంతర్జాతీయ సంస్థలతోపాటు స్థానికంగానూ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇవేకాక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు, రోబోటిక్స్‌ కంపెనీల్లో కొలువులకు ప్రయత్నించవచ్చు. 

 

అర్హతలేంటి?

బీటెక్‌లో ఏఐ అండ్‌ ఎంఎల్‌ చదవాలనుకునే విద్యార్థులు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ కచ్చితంగా చదివి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అదే ఎంటెక్‌లో చేరాలి అనుకుంటే గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో కంప్యూటర్‌ సైన్స్, ఏఐ, ఇతర అనుబంధ కోర్సులు చదవాలి. కొన్ని సంస్థలు జేఈఈ, గేట్, ఐపీయూ-సెట్‌ పరీక్షల స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుంటే... మరికొన్ని అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా నేరుగా సీట్లు కేటాయిస్తున్నాయి.

 

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కేంద్ర సంస్థల్లో స్టెనోలు!

‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!

‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్‌ డిగ్రీ

‣ ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?

‣ ఆటోక్యాడ్‌తో అనేక అవకాశాలు

‣ అవుతారా...ఆహార సలహాదారులు?

‣ ప్ర‌తికూల‌ ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌కు నెట్టేయండి!

Posted Date : 24-08-2022 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌