• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

కొత్త ఏడాది అవకాశాలు ఆశావహంఉద్యోగ భద్రత, స్థిరమైన జీతాలు, సామాజిక గుర్తింపు, క్రమం తప్పని పదోన్నతులు.. వీటితో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం కారణంగా ప్రభుత్వ కొలువుల పట్ల ఆసక్తి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇతర ఉపాధి రంగాల్లో మాంద్యం, పెరిగిపోతున్న జనాభా వల్ల నానాటికీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఫలితంగా తీవ్రమైన పోటీ! సర్కారీ నౌకరీల సంఖ్య తక్కువగా ఉండటంతో మెజారిటీ అభ్యర్థులకు ఇవి అందని ద్రాక్షగానే ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే.. తప్పనిసరిగా కొన్ని ప్రత్యేక లక్షణాలు సంతరించుకోవాలి. నిరంతరం సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడాలి. అప్పుడే ఉద్యోగ యోగాన్ని సాకారం చేసుకోగలుగుతారు. 


తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పాత నోటిఫికేషన్‌లలో జరిగిన అవకతవకల్ని సరిచేసుకుంటూ కొత్త అధ్యయనానికి తెరలేపడంతో పోటీ పరీక్షల వాతావరణం మెరుగైంది. 


ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే ప్రధానమైన గ్రూప్‌-1, 2, డీవైఈవో.. ఇతర నోటిఫికేషన్లు విడుదలవడంతో ఉద్యోగార్థులు శక్తియుక్తులను కేంద్రీకరించి పోటీపడుతున్నారు. డీఎస్సీ, సచివాలయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు.


యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్‌ సంస్థలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నియామక ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేసుకుంటూనే ఉన్నాయి.


ఇలాంటి నేపథ్యంలో 2024లో కేంద్ర నియామక సంస్థలతో పాటు రాష్ట్ర నియామక సంస్థలు కూడా వివిధ కొలువులు భర్తీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ కొత్త సంవత్సరంలో సరైన ప్రణాళికతో పాటు ఏ విధమైన మానసిక సంసిద్ధత ఉండాలో పరిశీలిద్దాం.


ఒకే ప్రయత్నంతో అదృష్టం పరీక్షించుకోవద్దు

ఒకే ఒక ప్రయత్నంతో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే ఆలోచన సరైంది కాదు. ఇటీవలికాలంలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో రిసెషన్, తయారీ- సేవా రంగాల్లోనూ ఉపాధి కల్పన కుంటుపడటంతో లక్షల మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. అయితే వారిలో తీవ్రంగా భంగపడేవారి సంఖ్య ఎక్కువ. అలాంటి నవతరానికి ఉండే అభిప్రాయం ఏంటంటే- ఒక ప్రయత్నం చేసి ఉద్యోగం వస్తే ఉండటం.. లేదంటే వెళ్ళిపోవటం! నిజానికి పోటీ పరీక్షల్లో ఉండే సిలబస్‌ చాలా విస్తృతం. అనేక అంశాలను కవర్‌ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఒకే ప్రయత్నంతో ఫలితం ఆశించడం అత్యాశే అవుతుంది. 


సివిల్‌ సర్వీసెస్, గ్రూప్‌-1, 2 లాంటి పరీక్షల్లో కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల కృషి రెండు- మూడు ప్రయత్నాలు మెజారిటీ అభ్యర్థుల విషయంలో అవసరం అవుతాయి. ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌ లాంటి పరీక్షల్లో కనీసం ఒక సంవత్సరం అధ్యయనం, సాధనతో పాటు ఆరు నుంచి పది పరీక్షలు అయినా రాసినప్పుడే కల నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వాస్తవాన్ని గమనించి పోటీ పరీక్షల క్షేత్రంలో దిగటం సరైన నిర్ణయం అవుతుంది.


నిరంతర.. విస్తృత అధ్యయనం 

ఇంజినీరింగ్, ఇతర గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లలో వచ్చే మార్కులు ఉద్యోగ సాధనకు ప్రామాణికం కావు. ఆ మార్కులు తక్కువైనా సరే.. ఎక్కువైనా సరే- ఆయా పరీక్షల్లో పరిమితమైన సిలబస్, వాటితో పాటు ప్రాక్టికల్స్, చాయిస్‌ విధానం, నిర్దిష్ట పుస్తకాలు ఉంటాయి. అందువల్ల తక్కువ సమయంలో అధ్యయనం చేసి తక్కువ పరిజ్ఞానంతో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. 


కానీ సివిల్‌ సర్వీసెస్, గ్రూప్‌-1, 2 లాంటి పరీక్షల్లో సిలబస్‌ అంశాలు కేవలం సూచికలే గానీ వాటి నుంచే ప్రశ్నలు రావాలన్న నియమమేదీ లేదు. అందుకని విస్తృతంగా ఉండే సిలబస్‌ను విస్తృతంగా అధ్యయనం చేయాలి. అదే సందర్భంలో సిలబస్‌కు ఆవల ఉండే అనేక విషయాలనూ అధ్యయనం చేయాలి. వివిధ సబ్జెక్టుల మధ్య ఉండే అనుసంధానాలను గుర్తించి విశ్లేషించుకునే (ఇంటర్‌ డిసిప్లినరీ) ధోరణి అవసరం. ఈ విధానం అనుసరించి పరీక్షల్లో సమాధానాలు గుర్తించటం, రాయటం జరిగితే తప్ప విజయం అంత సులభం కాదు. ఇది గుర్తించి గతంలోని అకడమిక్‌ మార్కులను ప్రామాణికంగా తీసుకోకుండా నిరంతరం విస్తృతంగా అధ్యయనం చేసే అభ్యర్థులే అంతిమ విజేతలు అవుతారు.


సాధన.. సాధన

ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌ మొదలైన రంగాల్లో ఉద్యోగాలు సాధించాలంటే అతి ప్రధానమైన అంశం- విస్తారంగా ప్రాక్టీస్‌ (సాధన) చేయటమే. మిగతా పోటీ పరీక్షల్లో కూడా ఇది ముఖ్యమే కానీ ఈ నియామక సంస్థల పరీక్షల్లో మాత్రం ప్రాక్టీస్‌ ఎంతో కీలకం. ఈ పరీక్షల్లో సమయం నిర్వహణ..ప్రధానమైన సవాలు. అంటే నిర్దిష్ట వ్యవధిలో ఆయా ప్రశ్నలకు సరైన సమాధానాలు కనిపెట్టి గుర్తించాలి. ఈ పరీక్షల్లో విస్తృత విషయపరిజ్ఞానం అవసరం ఉండదు. కానీ తక్కువ సమయంలో సమాధానాలను గుర్తించేందుకు వివిధ రకాల షార్ట్‌ కట్‌లను అనుసరించే వ్యూహంతో ముందుకు వెళ్లాలి. అందుకోసం- తెలిసిన బిట్లు అయినా, టెక్నిక్స్‌ అయినా నిరంతర సాధన మాత్రం తప్పనిసరి. పరీక్షకు రెండు మూడు వారాల ముందు చేసే ప్రాక్టీస్‌ ఏమాత్రం సరిపోదు. ఎంత నిపుణత సాధించినా ఉద్యోగం వచ్చేంతవరకూ వివిధ రూపాల్లో ప్రాక్టీస్‌ చేయాల్సిందే! 


భాషపై పట్టు

కేంద్రప్రభుత్వ, బ్యాంకింగ్‌ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు భాషాపరమైన పట్టు కూడా తప్పనిసరి. ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యం అంతగా లేనందున అనేక పోటీ పరీక్షల్లో విఫలమవుతుంటారు. అదేవిధంగా ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్న అభ్యర్థుల్లో కూడా గ్రామర్‌ పరంగా పట్టు బలహీనంగానే ఉంటోంది. ఒక భాషపై పట్టు సాధించాలంటే వ్యాకరణ అంశాలతో పాటు ఆయా భాషా పుస్తకాలను చదవాలి. ఉదాహరణకు ఇంగ్లిష్‌ దినపత్రికను నిత్యం చదవటంతో పాటు చిన్నపిల్లల కథలతో మొదలుపెట్టి వీలైనన్ని పుస్తకాలు చదువుతుండాలి. ఇలా కేంద్రీకృతమైన సాధన చేసినప్పుడే భాషపై పట్టు లభిస్తుంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించలేక చాలామంది అభ్యర్థులు పోటీ పరీక్షల్లో భంగపడతారు. విలువైన సమయాన్ని కూడా కోల్పోతారు.


విద్యా నేపథ్యం ఏదైనా..

యూపీఎస్‌సీ, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో రాణించాలంటే సోషల్‌ స్టడీస్‌ లాంటి సబ్జెక్టుల్లో పట్టు ఉండాలని చాలామంది భావిస్తారు. అదేవిధంగా ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో రాణించాలంటే గణిత నేపథ్యం ఉండాలని చాలామంది అనుకుంటారు. ఇదో అపోహ మాత్రమే.

యూపీఎస్‌సీ, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల సిలబస్‌ను అన్ని సబ్జెక్టులూ బ్యాలెన్స్‌ అయ్యేలా తయారుచేస్తారు. అందువల్ల అభ్యర్థి విద్యానేపథ్యం ఏదైనప్పటికీ ఆ నేపథ్యం లేని విషయాల మీద అధ్యయనం చేసినప్పుడే విజయం సాధించగలుగుతారు.

బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో గణిత శాస్త్రం పాత్ర కొంతవరకే. భాషలు, జనరల్‌ స్టడీస్, రీజనింగ్‌ లాంటి అంశాల భాగస్వామ్యం కూడా విజయానికి తప్పనిసరిగా దోహదపడుతుంది. కాబట్టి లెక్కలే సర్వస్వం అనుకోవడం సబబు కాదు. గణితంతో డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు కూడా తప్పనిసరిగా నిరంతర ప్రాక్టీస్‌ చేసినప్పుడే, మిగతా సిలబస్‌ అంశాలను కవర్‌ చేసినప్పుడే విజయం సాధిస్తారు. ఇదే సూత్రం మిగతా అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. ‘గణితం బ్యాక్‌ గ్రౌండ్‌ నాకు ఉంద’ంటూ అతి విశ్వాసంతో ఆవేశపడటం ఎంత అనర్థకమో, ‘గణితం బ్యాక్‌గ్రౌండ్‌ నాకు లేద’ని అనవసరంగా ఆవేదన చెందటమూ అంతే అనర్థకం.  


పోటీకి దిగేముందే ఆర్థిక వనరుల పరిగణన

అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించే కారకాల్లో ఆర్థిక వనరులు కూడా ఒకటి. ముఖ్యంగా యూపీఎస్‌సీ, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో విజయం సాధించేందుకు మెజారిటీ అభ్యర్థుల విషయంలో సంవత్సరాల తరబడి కృషి అనివార్యం. సంపాదించాల్సిన పరిస్థితుల్లో ఉద్యోగాన్వేషణ సంవత్సరాల తరబడి చేయాలంటే ఆర్థికపరమైన పకడ్బందీ ప్రణాళిక ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. చాలామంది ఆర్థిక బలాలను సరిగా అంచనా వేసుకోకుండా పోటీ పరీక్షల్లోకి దిగుతారు. ఆపై ఏం చేయాలో పాలుపోక ఏకాగ్రత లోపించి పోటీ పరీక్షల నుంచి అర్థాంతరంగా విరమిస్తూ ఉంటారు. ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్తపడాలి.  
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ మార్పు స్వాగతించు.. విజయం సాధించు!

‣ ఐటీ కొలువు.. ఇలా సులువు!

‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు

‣ కాలేజీ విద్యార్థులకు కెరియర్‌ ట్రైనింగ్‌

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ సీసీఎంబీలో ఉద్యోగావకాశాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-01-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌