• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

* కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు


చదువు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్, కెరియర్‌కు సంబంధించిన పనులు.. విద్యార్థి జీవితంలో అన్నీ ఉంటాయి, ప్రతి విషయానికీ దేని విలువ దానికే ఉంటుంది. ఒక్కొక్కరి అవసరాలు వేరువేరుగా ఉన్నప్పుడు వీటికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యం కూడా వేరుగానే ఉంటుంది కదా! అందుకే రోజువారీ పనుల్లో ప్రాథమ్యాలు (ప్రయారిటీస్‌) ఎంచుకోవడం అవసరం. ఎందుకంటే సబ్జెక్టులు, టెస్టులు, గ్రేడ్లు, కెరియర్‌ అంటూ విద్యార్థులకు ఉండే ఒత్తిడి చిన్నదేం కాదు..  ఎంత చేసినా రోజు సరిపోదన్నంత బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏది ముందు.. ఏది తర్వాత అనేది సరిగా ఎంచుకుంటే అన్నింటినీ చక్కగా నిర్వహించగలుగుతాం. ఇందుకు పాటించాల్సిన సూచనలేంటో చూద్దామా!


పనుల్లో ప్రాథమ్యాలను గుర్తించడం చాలా విధాల మేలు చేస్తుంది. ఇది మనకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ సక్రమపద్ధతిలో  ఉండటానికి దోహదపడుతుంది. నిరంతరంగా జరిగే అభివృద్దినీ, లక్ష్యసాధనలో ప్రదర్శననూ తరచూ పరిశీలించుకునే వీలు కలుగుతుంది. రోజూ దొరికే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామో లేదో తెలుసుకునే వీలుంటుంది. ఇంకా దాన్ని బాగా ఉపయోగించుకునేలా ఎలా ప్రణాళిక రచించుకోవాలో తెలుస్తుంది. ప్రాథమ్యాలు ఏర్పరుచుకోవడం ద్వారా మన సామర్థ్యం, పరిమితులు తెలియడమే కాదు.. అవసరం అయినప్పుడు కొన్ని అక్కర్లేని పనులను పక్కనపెట్టడం కూడా తెలుస్తుంది.


సమయం అంచనా

ప్రతి పనికీ నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవడం ద్వారా దేన్ని ఎంత కాలవ్యవధిలో పూర్తి చేయగలమో ఒక స్పష్టత ఏర్పడుతుంది. అలాగే షెడ్యూల్‌పై పట్టు లభిస్తుంది. దీనివల్ల నిర్దేశించిన సమయంలో ఎన్ని పనులు సమర్థంగా పూర్తిచేయగలుగుతున్నామో తెలుస్తుంది. వాయిదాలు వేస్తూ సమయం వృథా కాకుండా ఈ పద్ధతి ఆపుతుంది.


పనుల జాబితా

ఒక రోజులో ఉన్న పనులు, ఒక నెలలో చేయాల్సిన మార్పులు, ఒక ఏడాదిలో అందుకోవాల్సిన లక్ష్యాలు.. ఇలా ఏవైనా ఒక జాబితాగా రాయడం ద్వారా వాటిపై స్పష్టత ఏర్పడుతుంది. అప్పుడు వాటిలో ఏది ముందు, ఏది తర్వాత, ఏది వెంటనే, ఆపైన.. ఇలా నిర్ణయించుకోవడం సులభమవుతుంది. ఇందుకోసం ఆలోచనలు అన్నింటినీ ఒక కాగితంపై రాసుకోవాలి. చదువు, పని, ఇల్లు, స్నేహితులు.. అన్నింటినీ ఈ పద్ధతిలో సులభంగా నిర్వహించుకోగలం.


ప్రణాళిక ఎలా?

ప్రతి పనికీ దానికున్న ప్రాముఖ్యతను నిర్ణయించడం ముఖ్యం. ఆ పని ముగించాల్సిన గడువు, లేదా అది పూర్తవ్వడం కోసం చేయాల్సిన కృషి.. ముందే ఆలోచించడం ద్వారా అది ఎప్పుడు చేయాలనే విషయం నిర్ణయించుకోవచ్చు. అతి ముఖ్యమైన పనులను గడువు కంటే ముందే పూర్తిచేసేలా మన ప్రణాళిక ఉండాలి. అధికంగా సమయం, శ్రమ తీసుకోని పనులను తక్కువ ప్రాధాన్యంతో కింది వరుసలో ఉంచుకోవచ్చు. కచ్చితంగా చేయాల్సిన పనులు, చేస్తే బాగుంటుంది అనుకునేవి.. ఇలా కేటగిరీల వారీగా విభజించుకోవడం ద్వారా మరింత సమర్థంగా వాటిని పూర్తి చేయగలం.


కేటాయింపు

ముఖ్యమైన పనులేంటో, వాటికి ఎంత చొప్పున సమయం పడుతుందో అర్థం చేసుకున్నాక వాటికి సమయాన్ని కేటాయిస్తూ షెడ్యూల్‌ వేసుకోవాలి. దీనిద్వారా పనులు పూర్తిచేయడానికి సంబంధించిన మొత్తం ప్రణాళిక అంతా సిద్ధమవుతుంది. ఈ షెడ్యూల్‌ను రోజువారీ, నెలవారీగా సిద్ధం చేసుకోవడం ఉత్తమం. ఆఖర్లో అనుకున్నవన్నీ చేశామో లేదో పరిశీలించేలా చెక్‌లిస్ట్‌ ఉండాలి.


అవసరం లేనప్పుడు..

మన టు-డూ-లిస్టులో అవసరం లేని పనులను తగ్గించుకోవడం కూడా ముఖ్యమే! దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒక సమయంలో ముఖ్యమైనవిగా భావించిన పనులు తర్వాత అంత అవసరం లేకుండా పోవచ్చు. అటువంటి సమయాల్లో వాటిని తొలగించడం ద్వారా ఆ జాబితాను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుకోగలం.


ఫోకస్‌ తప్పకుండా..

టాస్క్‌లో ఉన్నప్పుడు అంతరాయం కలిగించే ఎటువంటి అంశాలకూ చోటు ఇవ్వకపోవడం మరో ముఖ్యమైన అంశం. కుదిరితే అలా ఇబ్బంది కలిగించే అంశాలను బ్రేక్‌ సమయానికి వాయిదా వేయడం, మరీ తప్పకపోతే ఆ సమయంలోనే బ్రేక్‌ తీసుకోవడం ద్వారా మన చదువు, ప్రణాళిక తప్పకుండా ఉంటుంది.


అధిక ఉత్పాదకత

కొందరు విద్యార్థులు తెల్లవారుజామున చదివేందుకు ఇష్టపడతారు. కొందరు రాత్రుళ్లు ఎంత ఆలస్యమైనా మెలకువగా ఉండగలరు కానీ తెల్లవారిమాత్రం నిద్రలేవలేరు. మరికొందరు సాయంత్రాలు చాలా ప్రశాంతంగా చదువుకోగలుగుతారు. ఒక్కొక్కరికీ అత్యధిక ఉత్పాదక సమయం అంటూ ఒకటి ఉంటుంది. ఆ సమయంలో వారు గంటలో చేసే పనిని అరగంటలో పూర్తిచేయగలరు.

ః ప్రాథమ్యాలను గుర్తించే క్రమంలో అత్యంత ముఖ్యమైన టాస్కులను ఇలా అధికంగా ప్రొడక్టివ్‌గా ఉండే సమయంలో చేయడం ద్వారా తక్కువ వ్యవధిలో ఎక్కువ పని చేయగలుగుతాం. ఆ సమయంలో చదివింది బాగా గుర్తుండటం, రాసిన అసైన్‌మెంట్లు మెరుగ్గా రావడం, ప్రాజెక్టులకు కొత్త ఆలోచన స్ఫురించడం.. ఇలా జరుగుతుంటుంది. అందువల్ల ప్రధాన సమయాన్ని ముఖ్యమైన టాస్క్‌లకు కేటాయించుకోవడం మంచిది.


విరామం

ప్రాథమ్యాలను సమర్థంగా ఎంపిక చేసుకోవడం, ఆలోచించడం, అన్నివేళలా స్థిరంగా అమలు చేయడం కొంత ఒత్తిడితో కూడుకున్న విషయం. అందుకే అవసరమైనప్పుడు విరామం తప్పనిసరి. అవసరమైతే బ్రేక్స్‌కు కూడా షెడ్యూల్‌లో భాగం ఇవ్వడం ద్వారా మరింత ప్రశాంతంగా పనులను పూర్తిచేయ గలుగుతాం.


వాస్తవికంగా..

ప్రణాళిక, ప్రాథమ్యాలు అనగానే అందరికీ ఒకే రకమైన మూసధోరణి సరిపోదు. ఒక్కో విద్యార్థీ ప్రత్యేకంగా ఉంటారు. అందువల్ల ప్రాథమ్యాల ఎంపిక వాస్తవికంగా ఉండాలి. చేయగలిగే సామర్థ్య పరిధిలోనే పనుల ప్రణాళిక జరగాలి. రోజూ ఒకే విధంగా, ఒకే ఏకాగ్రతతో టాస్కులు పూర్తి చేయలేం అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. వాస్తవాలకు దూరంగా, ఆచరణయోగ్యం కాని ప్రాధాన్యాలు నిర్దేశించుకోవడం వల్ల వాటిని అమలు చేయలేక ఇబ్బందిపడతాం.


అనుకోకుండా వచ్చేవాటికి..

ఎంత జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకున్నా కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు. కొన్నింటికి అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం పడితే, అనుకోకుండా వేరే పనులు కూడా వచ్చి చేరవచ్చు. కొన్ని టాస్కులు ప్రాధాన్య క్రమంలో ముందుకీ, వెనక్కీ వెళుతుండవచ్చు. ఇటువంటి అనుకోని పనులనూ సర్దుకునేలా మన షెడ్యూల్‌లో కొంత ఖాళీ సమయం ఉండాలి. దానివల్ల ప్లానింగ్‌ మరీ దెబ్బతినకుండా ఉంటుంది.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

‣ అర్థం చేసుకుంటూ చదివితే.. అధిక మార్కులు!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

Posted Date: 21-12-2023