• facebook
  • whatsapp
  • telegram

కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు

ఐటీ రంగంలో ఉద్యోగ సాధనకు సూచనలు



ఎన్నో కొత్తకొత్త అవకాశాలకు నెలవైన ఐటీ రంగంలో.. ఉద్యోగం సంపాదించడం కోట్ల మంది  విద్యార్థుల కల! దానికోసం కనిపించిన కోర్సులన్నీ చేస్తూ కష్టపడుతూ ఉంటారు. అయితే ట్రెండ్‌కు తగిన విధంగా మనం నేర్చుకునే స్కిల్స్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా కోరుకున్న జాబ్‌ను సులభంగా చేజిక్కించుకునే వీలుంటుంది. ఇలా ప్రస్తుతం ఎటువంటి నైపుణ్యాలున్నాయో... వాటిని ఎలా నేర్చుకోవాలో..  పూర్తి వివరాలు తెలుసుకుందామా!


ఐటీ రంగంలో ఉన్నవి లెక్కలేనన్ని విభాగాలు, ఉద్యోగాలు.. కానీ వాటిని అందుకోవడానికి కావాల్సిన నైపుణ్యాలే పెద్ద సవాలు! కొందరు సరైన వ్యూహంతో తక్కువ సమయంలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగితే.. మరికొందరు ఎంతకాలమైనా నచ్చిన కొలువు దక్కక ఇబ్బందిపడుతుంటారు. అయితే అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నిజానికి ఐటీ రంగాన్ని నిపుణుల కొరత వేధిస్తూ ఉందని ఎప్పటికప్పుడు సర్వేలు చెబుతూనే ఉన్నాయి. ఒకపక్క అభ్యర్థులు ఏం నేర్చుకుని, ఎలా ఉద్యోగాలు పొందాలో తెలియక అవస్థ పడుతుంటే, మరోపక్క కంపెనీలు చక్కని స్కిల్స్‌ కలిగిన వారి కోసం ఎదురుచూస్తున్నాయి. కొత్త  ఏడాదిలో అయినా ఈ గ్యాప్‌ను అర్థం చేసుకుని సరైన దారిలో ప్రయాణం మొదలుపెట్టడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. 2024లో డిమాండ్‌ ఉండబోయే స్కిల్స్‌ ఏమిటో ఒక్కసారి పరిశీలిస్తే..

సిస్టమ్స్‌ - నెట్‌వర్క్స్‌

కంప్యూటర్‌ సిస్టమ్స్, నెట్‌వర్క్స్‌ చక్కగా పనిచేస్తున్నాయో లేదో సరిగ్గా చూసుకోవడం పనులు సాఫీగా సాగేందుకు చాలా అవసరం. ఇలా సరిచూడగలిగే నైపుణ్యాలు సాధించినవారు సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌ వంటి కొలువుల్లో చేరవచ్చు. ఈ స్కిల్స్‌ కేవలం సాధారణ పరిస్థితుల్లోనే కాకుండా క్లౌడ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పని చేసేటప్పుడు సైతం ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణంగా వీటిలో.. 

విండోస్, లైనెక్స్, మాక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ గురించి తెలుసుకోవడం. 

కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టలేషన్, కాన్ఫిగరింగ్‌ నేర్చుకోవడం. 

క్లౌడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ - అప్లికేషన్‌. 

లోకల్‌ ఏరియా నెట్‌వర్క్, వైడ్‌ ఏరియా నెట్‌వర్క్స్, స్టోరేజ్‌ ఏరియా నెట్‌వర్క్స్, వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్స్‌.. ఇలా అన్నింటినీ నిర్వహించడం. 

బృంద సభ్యులకు ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడంలో సహాయం చేయడం.. ఇలా వివిధ రకాల నైపుణ్యాలు అవసరం అవుతాయి. వీటిని నేర్చుకుంటే ఈ విభాగంలో స్థిరపడొచ్చు.


డెవోప్స్‌

డెవలప్‌మెంట్, ఆపరేషన్స్‌ల కలయిక ఇది. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఐటీ బృందాల మధ్య వారధిగా పనిచేస్తుంది. ఒక ఐటీ సంస్థను నడిపించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనితో పనిచేయడం నేర్చుకోవడం ద్వారా డెవోప్స్‌ ఇంజినీర్‌గా కెరియర్‌ను ప్రారంభించవచ్చు. ఇందుకోసం.. 

కంటిన్యువస్‌ డెలివరీ థియరీపై అవగాహన ఉండాలి. 

డాకర్, క్యూబర్‌నెటిస్‌ వంటి కంటైనర్‌ టెక్నాలజీ ఏదైనా నేర్చుకోవాలి. 

పైతాన్, రూబీ, సీ వంటి ఏదైనా ఒక స్క్రిప్టింగ్‌ లాంగ్వేజ్‌ వచ్చి ఉండాలి.  

క్లౌడ్‌ ఆపరేషన్స్‌ తెలిసి ఉండాలి. ఈ నైపుణ్యాలను సాధన ద్వారా ప్రయత్నించవచ్చు.


మెషిన్‌ లెర్నింగ్‌

ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఒక ముఖ్యభాగం. ప్రోగ్రామర్లు, డేటా ప్రొఫెషనల్స్‌కు ఇది అత్యంత ఆవశ్యకమైన నైపుణ్యం. ఇందులో బేసిక్‌ స్కిల్స్‌ను ఆన్‌లైన్‌ ద్వారా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు. అనంతరం ప్రొఫెషనల్‌గా సాధన చేస్తే ఉద్యోగాల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. 

* పారామెట్రిక్, నాన్‌పారామెట్రిక్‌ అల్గారిదమ్స్, కెర్నల్స్, క్లస్టరింగ్, డీప్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్‌ వంటివి నేర్చుకోవడం ద్వారా దీనిపై పట్టు సాధించవచ్చు.


నేర్చుకోవడం ఎలా?

ఐటీ కెరియర్‌లో విజయాన్ని అందుకోవాలంటే ఈ కింది విధాలుగా స్కిల్స్‌ నేర్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. 

సొంతంగా: చాలా వరకూ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు, డేటా అనాలిసిస్‌ టెక్నిక్స్, మరికొన్ని ఐటీ స్కిల్స్‌ను ఆన్‌లైన్‌ కోర్సులు, హోమ్‌ ప్రాజెక్టుల ద్వారా సొంతంగా నేర్చుకునే వీలుంటుంది.     

సర్టిఫికేషన్స్‌ : ప్రొఫెషనల్‌ అవసరాలకు తగిన విధంగా నైపుణ్యాలు ఉన్నాయో లేదో పరీక్షించుకునేందుకు సర్టిఫికేషన్స్‌ ఉపయోగపడతాయి. సర్టిఫికేషన్‌ను అందించగలిగే పరీక్షను పాసయ్యేందుకు చదవడం ద్వారా మరింత రాణించగలుగుతాం. ఆసక్తులకు తగిన విధమైన ప్రాథమిక స్థాయి పరీక్షలు ఏం ఉన్నాయో సరిచూసుకుని దరఖాస్తు చేయవచ్చు. 

బూట్‌క్యాంప్స్‌ : కొన్ని వారాలు, నెలలపాటు కొనసాగే బూట్‌క్యాంప్స్‌ కచ్చితమైన స్కిల్స్‌ను తీరైన రీతిలో నేర్పించగలవు. ప్రోగ్రామింగ్‌కు సంబంధించి బూట్‌క్యాంప్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ సైబర్‌ సెక్యూరిటీ వంటి అంశాలకు కూడా ఇవి లభిస్తాయి.


డేటా అనాలిసిస్‌

వివిధ ఐటీ టాస్కుల్లో డేటాను విశ్లేషణ చేయడం చాలా ముఖ్యం. పర్‌ఫార్మెన్స్‌ డేటాను మానిటర్‌ చేయడం ద్వారా సెక్యూరిటీ సమస్యలను గుర్తించడం, వినియోగంలో ఇబ్బందులను గుర్తించడంలో బృందాలకు సహాయం చేయవచ్చు. ఐటీలో డేటాతో పనిచేసేవారు డేటా అడ్మినిస్ట్రేటర్లు, డేటా ఇంజినీర్లుగా రాణిస్తారు. వీరికి ఎస్‌క్యూఎల్, స్టాటిస్టిక్స్, పైతాన్‌ లాంగ్వేజ్‌లపై పట్టు ఉండాలి. డేటాను సేకరించడం, నిర్వహించడం, నిల్వ చేయడం, విశ్లేషించడం, అవసరమైనప్పుడు దాని నుంచి ఇన్‌పుట్స్‌ తీసుకోగలగడం.. ఇలాంటి నైపుణ్యాలన్నీ డేటా అనాలిసిస్‌ కిందకు వస్తాయి. డేటా సంబంధిత ఉద్యోగాలు చేయాలి అనుకునేవారు ఏదైనా డేటా మేనేజింగ్‌ టూల్‌ను కూడా నేర్చుకోవడం మరింత ఉపకరిస్తుంది.


క్లౌడ్‌ కంప్యూటింగ్‌

క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసి నిర్వహించడం వరకూ అన్నిరకాలైన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ స్కిల్స్‌ ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్నాయి. దీనితో పనిచేయడం నేర్చుకోవడం ద్వారా క్లౌడ్‌ డెవలపర్, అడ్మినిస్ట్రేటర్, ఆర్కిటెక్ట్‌.. వంటి వివిధ కొలువుల్లోకి వెళ్లవచ్చు. ఏడబ్ల్యూఎస్, గూగుల్‌ క్లౌడ్, మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్, ఒరాకిల్‌ వంటి టెక్నాలజీలు ఏవైనా నేర్చుకుని ఇందులో కెరియర్‌  కోసం ప్రయత్నించవచ్చు


ప్రోగ్రామింగ్‌

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లుగా, వెబ్‌ అప్లికేషన్లు, వెబ్‌సైట్లు డెవలప్‌ చేసేందుకు ప్రోగ్రామింగ్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి. టాస్క్‌లకు ఆటోమేట్‌ చేయాలి అనుకునే ఐటీ ఉద్యోగులు అందరికీ దీనిపై అవగాహన ఉండే తీరాలి. పైతాన్, సీ ప్లస్‌ ప్లస్, జావాస్క్రిప్ట్, రూబీ, పవర్‌షెల్‌ వంటి లాంగ్వేజ్‌లు నేర్చుకోవడం ద్వారా దీనిపై పట్టు సాధించవచ్చు. ఏం చేయాలో, ఎలా చేయాలో కంప్యూటర్‌కు తెలియజెప్పే ఈ పనిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పెరుగుదలతో ప్రోగ్రామింగ్‌లో కొత్త అవసరాలు, అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీటిని అందిపుచ్చుకోవడం ద్వారా డెవలపర్‌గా కెరియర్‌ను ప్రారంభించవచ్చు.


సెక్యూరిటీ

ప్రతి ఐటీ విభాగానికీ, బృందానికీ సెక్యూరిటీ తప్పనిసరి. సమాచారం, ఇతర విలువైన అంశాలు చోరీకిగానీ, వేరే ఇతర ఏవిధమైన డ్యామేజ్‌కు గురికాకుండా చూసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. సెక్యూరిటీకి సంబంధించిన అంశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం కూడా ఇందులో భాగం. హెల్ప్‌ డెస్క్, నెట్‌వర్కింగ్, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన నైపుణ్యాలను సాధన చేయడం ద్వారా సెక్యూరిటీ స్కిల్స్‌ నేర్చుకునే వీలుంటుంది. దీన్ని  విపులంగా పరిశీలిస్తే..

ఫిజికల్, నెట్‌వర్క్, సాఫ్ట్‌వేర్‌ సెక్యూరిటీ 

ఫైర్‌ వాల్స్, రూటర్స్‌ ఇన్‌స్టలేషన్‌

డేటా ఎన్‌క్రిప్షన్‌ 

రిస్క్‌ మిటిగేషన్‌ స్ట్రాటజీ, థ్రెట్‌ అనాలిసిస్‌ 

పీసీఐ - డీఎస్‌ఎస్, హెచ్‌ఐపీపీఏ, సీసీపీఏ నాలెడ్జ్‌ 

ఎథికల్‌ హ్యాకింగ్, పెనిట్రేషన్‌ టెస్టింగ్‌.. ఇలా మరింత లోతుగా ఈ సబ్జెక్టును సాధన చేయడం ద్వారా సెక్యూరిటీ విభాగాల్లో కొలువులు సాధించవచ్చు.

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ సీసీఎంబీలో ఉద్యోగావకాశాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 26-12-2023


 

టెక్‌ స్కిల్స్‌

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం