• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

చివరి ర్యాంకుల వారికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు


ఒకటో తరగతిలో చేరినప్పటి నుంచి ప్రతి విద్యార్థీ ప్రతి పరీక్షలో వందకు 35 మార్కులొస్తేనే పాసవుతాం అని కష్టపడి చదువుతాడు. కానీ భారత పరిపాలనా వ్యవస్థలో రాబోయే 30 ఏళ్ల పాటు ఆలిండియా సర్వీసు ఉన్నతాధికారులుగా పనిచేసే వారికి రాతపరీక్షల్లో  25- 26 శాతం మార్కులు వచ్చినా ర్యాంకులు దక్కాయి. ఇటీవల యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) విడుదల చేసిన సివిల్‌ సర్వీసెస్‌ ర్యాంకర్ల మార్కులను పరిశీలిస్తేనే అనేక ఆసక్తికరమైన అంశాలు వెెల్లడయ్యాయి! 


ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), ఇండియన్‌ పోలీసు సర్వీస్‌ (ఐపీఎస్‌), ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో విధానాలను రూపొందించే అత్యున్నత పరిపాలనా వ్యవస్థలో పనిచేసే ఉన్నతాధికారులను ఎంపిక చేయడానికి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను యూపీఎస్సీ ఏటా నిర్వహిస్తోంది. అఖిల భారత స్థాయిలో జరిగే ఈ పరీక్షల్లో ఈ ఏడాది మొత్తం 1016 మందికి ర్యాంకులను కేటాయించింది. ఈ ర్యాంకర్లకు వచ్చిన మార్కులను పరిశీలిస్తే- రాతపరీక్షల్లో తక్కువగా వచ్చిన వారికి సైతం ఇంటర్య్వూలో అధికంగా రావడంతో ర్యాంకులు సాధించి ఉద్యోగాల్లో చేరబోతున్నారు. దీనికి భిన్నంగా రాతపరీక్షలో అధిక మార్కులు వచ్చి, ఇంటర్వ్యూలో మార్కులు తగ్గినప్పటికీ కొందరు అత్యున్నత సర్వీసులకు ఎంపిక అయ్యారు. 


రాతపరీక్షలను 1750 మార్కులకు, ఇంటర్య్వూను 275 మార్కులకు కమిషన్‌ నిర్వహిస్తుంది. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల మొత్తం ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. 



మార్కుల తీరును విశ్లేషిస్తే చివరి మూడు ర్యాంకులు వచ్చిన వారికి రాతపరీక్షలో 25.4 నుంచి 26.8 శాతం మాత్రమే మార్కులు వచ్చాయి. ఉదాహరణకు 1015 ర్యాంకర్‌కు రాతపరీక్షల్లో 1750కి కేవలం 445 అంటే 25.42 శాతమే మార్కులొచ్చాయి. ఇలాగే 1016 ర్యాంకర్‌కు 26.8 శాతమే వచ్చాయి.


టాప్‌ ర్యాంకర్లకన్నా చిట్టచివరి ర్యాంకర్లకు ఇంటర్య్వూలో ఎక్కువ మార్కులు రావడం గమనార్హం. అంటే ఇంటర్య్వూలో బాగా మాట్లాడి సమాధానాలు చెప్పగలిగినవారు రాతపరీక్షల్లో సమాధానాలను బాగా రాయనందున తక్కువ మార్కులు వచ్చి అత్యున్నత ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి సర్వీసులకు అవసరమైన టాప్‌ 200లోపు ర్యాంకులను పొందలేకపోయారు. ఇంటర్య్వూలో ప్రతిభ ప్రదర్శించినా... రాతపరీక్షల్లో అధికంగా మార్కులు పొందలేకపోయినట్లు యూపీఎస్సీ విడుదల చేసిన మార్కులు వివరిస్తున్నాయి.

అఖిలభారత స్థాయిలో ప్రథమ ర్యాంకు వచ్చిన అభ్యర్థికి రాతపరీక్షలో 1750కి 51.3 శాతం అంటే 899, ఇంటర్య్వూలో 275కి 200 మార్కులు వచ్చాయి.

 891 ర్యాంకు పొందిన అభ్యర్థికి ఇంటర్వ్యూలో ఆలిండియా టాపర్‌ కన్నా 5 మార్కులు ఎక్కువ (205) వచ్చాయి. కానీ రాతపరీక్షలో 1750కి 704 మార్కులే దక్కాయి. ఇంటర్య్వూలో మెరుగ్గా సమాధానాలు చెప్పగలిగినా...రాతపరీక్ష ఆ స్థాయిలో రాయకపోవడంతో కేవలం 40 శాతమే వచ్చాయి. దీంతో ఇంటర్య్వూలో ఆలిండియా టాపర్‌కన్నా అధిక మార్కులు వచ్చినా ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి అత్యున్నత సర్వీసు ఉద్యోగానికి అవసరమైన టాప్‌ 200లోపు ర్యాంకు మాత్రం రాలేదు.

 పదో ర్యాంకర్‌కు ఇంటర్య్వూలో కేవలం 154 (56 శాతం) మార్కులు వచ్చినా మంచి ర్యాంకు లభించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. రాతపరీక్షల్లో 890 మార్కులొచ్చినందున ఇంటర్య్వూలో వచ్చిన 154 కలిపి మొత్తం 1044తో టాప్‌ పదో ర్యాంకు దక్కింది. 

 పదో ర్యాంకర్‌కు వచ్చిన 154 మార్కులకన్నా చివరిలో కొన్ని వందల మంది ర్యాంకర్లకు ఇంటర్య్వూలో ఎక్కువ మార్కులు రావడం గమనార్హం. ఈ అభ్యర్థి కన్నా 51 మార్కులు అదనంగా ఇంటర్య్వూలో 205 మార్కులను సాధించిన అభ్యర్థికి 891 ర్యాంకు రావడానికి కారణం- రాతపరీక్ష ఆ స్థాయిలో మెరుగ్గా రాయలేకపోవడమే.

 ఆలిండియా మొదటి ర్యాంకర్‌కు రాతపరీక్షల్లో 899, రెండో ర్యాంకర్‌కు 892 వచ్చాయి. ఆ తరవాత 3 నుంచి 20 ర్యాంకుల వరకూ చూస్తే పదో ర్యాంకర్‌కు మాత్రమే 890 మార్కులు వచ్చాయి. 

 తెలంగాణకు చెందిన అనన్యారెడ్డికి టాప్‌ మూడో ర్యాంకు వచ్చింది. ఆమెకు రాతపరీక్షల్లో 875, ఇంటర్య్వూలో 190 మార్కులొచ్చాయి. ఆమె కన్నా ముందున్న రెండో ర్యాంకర్‌కు ఇంటర్య్వూలో 15 తగ్గి 175 మార్కులు మాత్రమే రావడం గమనార్హం. కానీ రెండో ర్యాంకర్‌కు రాతపరీక్షల్లో అనన్యకన్నా 17 మార్కులు ఎక్కువగా వచ్చాయి. ఇంటర్య్వూలో 15 ఎక్కువగా వచ్చినందున... మరో 2 మార్కులు రాతపరీక్షల్లో గానీ, ఇంటర్య్వూలో గానీ అనన్య సాధించి ఉంటే ఆలిండియా టాప్‌ రెండో ర్యాంకు దక్కేది. ఆమె ‘ఈడబ్ల్యూఎస్‌’ రిజర్వుడ్‌ కోటాలో ఉన్నట్లు యూపీఎస్సీ వెెల్లడించింది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

‣ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!

‣ సోషల్‌ ట్రోలింగ్‌.. లైట్‌ తీసుకుందాం!

‣ ఐటీ ఎగ్జిక్యూటివ్‌గా అవకాశం

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

Posted Date : 22-05-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌