• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వర్చువల్‌ ఫీల్డ్‌ ట్రిప్‌ వెళ్దామా!

క్షేత్రస్థాయి పర్యటనలు తరగతి గది  పాఠాలకంటే కొత్తగా ఉండటమే కాదు.. విద్యార్థి మనోవికాసానికీ ఎంతగానో తోడ్పడతాయి. అందుకే చదివే సబ్జెక్టు గురించి పూర్తిస్థాయిలో అనుభవపూర్వకంగా తెలుసుకునే పర్యటనలంటే విద్యార్థులకూ ఉత్సాహంగానే ఉంటుంది. అయితే కరోనా సంక్షోభం అనంతరం ఏర్పడిన పరిణామాల వల్లనో, అందుబాటులోకి వచ్చిన సరికొత్త టెక్నాలజీ కారణంగానో.. ఇప్పుడు ‘వర్చువల్‌ ఫీల్డ్‌ ట్రిప్‌’కు ఆదరణ పెరుగుతోంది. మరి ఉన్నచోటనే ఉంటూ అన్నీ తిరిగి నేర్చుకునే అవకాశం కల్పిస్తున్న దీని సంగతులేంటో మీరూ చూడండి.

అన్ని స్థాయుల విద్యార్థులకూ వారివారి వయసుకు తగ్గట్టుగా ‘వర్చువల్‌ ఫీల్డ్‌ ట్రిప్‌’ అనే అంశం ఇప్పుడు ప్రాముఖ్యం సంతరించుకుంటోంది. సైన్స్, ఆర్ట్స్, టెక్నాలజీ, ఇలా ఏ సబ్జెక్టులకు సంబంధించి అయినా... తరగతిలోనే ఉంటూ ప్రపంచం మొత్తం చుట్టేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయీ పర్యటనలు. ఎక్కడెక్కడి నిపుణులతోనూ నేరుగా మాట్లాడిన అనుభవం కూడా వీటి ద్వారా పొందొచ్చు. పాఠాల గురించి అదనపు సమాచారాన్ని ఇచ్చేందుకు ఈ ట్రిప్‌లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి.

ఒక విద్యార్థి సొంతంగా, తన స్నేహితులతో కలిసి, లేక మొత్తం తరగతిలో విద్యార్థులంతా ఒకేసారి ట్రిప్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. డిస్కవరీ ఎడ్యుకేషన్, నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఎడ్యుకేషన్, గూగుల్‌ఎర్త్‌ వీఆర్, అపోలో 11 వీఆర్‌... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ట్రిప్స్‌ను అందిస్తున్న వెబ్‌సైట్లు, యాప్‌లు అనేకం. వీటిలో కొన్ని పర్యటనలు ఉచితంగా చేయొచ్చు, మరికొన్నింటికి మాత్రం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా ఉంటుంది?..

ఉదాహరణకు మీరొక విమానం కాక్‌పిట్‌ గురించి తెలుసుకోవాలి అనుకున్నారే అనుకోండి... మీ స్నేహితులతో ఈ ఆలోచన పంచుకుంటారు. ఏ ప్రొవైడర్‌లో ఉన్న టూర్‌ మీకు నచ్చిందో ఎంపిక చేసుకుంటారు. ఫ్రెండ్స్‌ అంతా ఒకే టైంలో కలిసి టూర్లో పాల్గొనేలా సమయం, తేదీ నిర్ణయించుకుంటారు. ఆ టైంకి అందుబాటులో ఉన్న వీఆర్‌ సెట్‌ ధరిస్తే సరి! అంతా కలిసి నేరుగా పర్యటనలో ఉన్న భావన కలుగుతుంది. చేతిలో పుస్తకం, పెన్ను పట్టుకుంటే అదే సమయంలో అసైన్‌మెంట్లకు కావాల్సిన సమాచారం కూడా సేకరించుకోవచ్చు!

ఏమేం చూడొచ్చు!

వర్చువల్‌గా ట్రిప్‌ చేయాలి అనుకుంటే బోలెడన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఏ సబ్జెక్టుకు సంబంధించిన అంశమైనా ఇట్టే తెలుసుకోవచ్చు. పురాతన దేవాలయాలు, కట్టడాలు, వివిధ మ్యూజియంలు, అడవులు, నదులు, సముద్ర గర్భాలు, పరిపాలనా భవంతులు, ప్రధాన నగరాలు... ఇలా బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మొత్తంగా ఈ ప్రక్రియ విద్యార్థి   అవగాహన స్థాయిని మరింత పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది.

చాలా సులువు..

నేరుగా వెళ్లి చూసే ప్రక్రియ నిజానికి కొంచెం కష్టంతో కూడుకున్నది, ముఖ్యంగా అధ్యాపకులకు. విద్యార్థులందరికీ నచ్చే ప్రదేశాన్ని ఎంపిక చేయడం, తల్లిదండ్రులను ఒప్పించడం, ఇతర ఏర్పాట్లు, భద్రత... ఇలా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ వర్చువల్‌ ట్రిప్స్‌లో ఈ ఇబ్బందులు ఏవీ ఉండవు. అందువల్ల ఎక్కువ టూర్లు చేసి, అనేక కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొట్టేద్దాం కానిస్టేబుల్‌ కొలువు!

‣ ఇండియన్‌ ఎకానమీ.. ఇలా చదివేద్దాం!

‣ బాగా చదవాలంటే సరిగా తినాలి!

‣ ఆర్కిటెక్చర్‌లో... ప్రవేశాలకు నాటా

‣ డైవ్‌.. కెరియర్‌ వావ్‌!

‣ పరీక్ష కోణంలో.. పకడ్బందీగా!

‣ ఫార్మసీ పీజీకి నైపర్‌ దారి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌