• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో వాయుసేనలో అగ్నివీర్‌ ఉద్యోగాలు

ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల

భారతీయ వాయుసేన అగ్నివీర్‌వాయు పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలూ అర్హులే. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు నాలుగేళ్లపాటు సేవలు అందించవచ్చు. ఆ తర్వాత వీరిలో 25 శాతం మంది శాశ్వత ఉద్యోగంలో కొనసాగుతారు. మిగిలినవారు ఆర్థిక ప్రోత్సాహకాలతో వైదొలగుతారు!

అగ్నివీర్‌వాయులో సైన్స్‌, నాన్‌ సైన్స్‌ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. సైన్స్‌ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు నాన్‌ సైన్స్‌ ఖాళీలకూ పోటీ పడవచ్చు. ఇందుకోసం వీరు ప్రత్యేక పరీక్ష రాయాలి.

సైన్స్‌: ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా నిర్దేశిత బ్రాంచీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి. లేదా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్‌ కోర్సు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఏ విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పది/ ఇంటర్‌/ డిప్లొమా/ ఒకేషనల్‌ ఎందులోనైనా ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు పొందడం తప్పనిసరి.

నాన్‌ సైన్స్‌: ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఏ అర్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పది/ ఇంటర్‌/ ఒకేషనల్‌ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి.

ఎత్తు: అన్ని విభాగాలకూ పురుషులు 152.5 సెం.మీ. మహిళలు 152 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు అవసరం. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు 5 సెం.మీ. వ్యత్యాసం తప్పనిసరి.

మూడు దశల్లో..

మూడు దశల్లో నిర్వహించే వివిధ పరీక్షలతో నియామకాలు చేపడతారు.

ఫేజ్‌-1

ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సైన్స్‌ సబ్జెక్టులకు పరీక్ష వ్యవధి ఒక గంట. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నాన్‌ సైన్స్‌ వారికి పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇంగ్లిష్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. సైన్స్‌, నాన్‌ సైన్స్‌ రెండింటికీ దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్ష 85 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. అన్ని పరీక్షల్లోనూ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. అలాగే తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ పావు మార్కు తగ్గిస్తారు. అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 సిలబస్‌ నుంచే వస్తాయి. ఎంచుకున్న పరీక్షను బట్టి ఇంగ్లిష్‌ 20, ఫిజిక్స్‌ 25, మ్యాథ్స్‌ 25, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 30 ప్రశ్నలు అడుగుతారు.

సన్నద్ధత: ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేసినవారు పరీక్షను సులువుగా ఎదుర్కోగలరు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలకు ఎంసెట్‌ స్థాయిలో సన్నద్ధమైతే సరిపోతుంది. ఇంటర్మీడియట్‌ ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలపై దృష్టిపెడితే ఆ విభాగంలోనూ మెరుగైన స్కోరు పొందవచ్చు. రీజనింగ్‌ విభాగంలో ప్రశ్నలు మరీ లోతుగా ఉండవు. మాదిరి ప్రశ్నలు సాధనచేసి, మెరుగైన మార్కులు పొందవచ్చు. జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలకు.. ఇటీవలి కాలంలో రక్షణ విభాగంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలకు ప్రాధాన్యమివ్వాలి. క్రీడలు, అవార్డులు, విజేతలు, పుస్తకాలు, రచయితలు, నియామకాలు, ఎన్నికలు... తాజా పరిణామాలపై దృష్టి సారిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.  

ఫేజ్‌-2

ఫేజ్‌-1లో ప్రతిభ చూపితేనే ఫేజ్‌-2లో అవకాశం ఉంటుంది. ఎంపికైనవారు నిర్దేశిత సెలక్షన్‌ కేంద్రాలకు ప్రవేశపత్రాలతోపాటు అవసరమైన సర్టిఫికెట్లు, వాటి నకళ్లు, ఫొటోలు, సామగ్రిని తీసుకెళ్లాలి. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని పురుషులు 7, మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే పురుషులు ఒక్కోటీ నిమిషం వ్యవధిలో.. 10 పుష్‌అప్స్‌, 10 సిట్‌అప్స్‌, 20 స్క్వాట్స్‌ పూర్తిచేయాలి. మహిళలు 90 సెకన్లలో 10 సిట్‌అప్ప్‌, నిమిషంలో 15 స్క్వాట్స్‌ చేయగలగాలి. వీటన్నింటిలోనూ అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు-1 నిర్వహిస్తారు. అభ్యర్థి ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగానికి సరిపోతాడో లేదో తెలుసుకోవడానికి ఆబ్జెక్టివ్‌ తరహాలో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు 2 ఉంటుంది. ఈ దశలో.. వాయుసేన వాతావరణానికి అభ్యర్థి అలవాటు పడగలడా లేదా పరిశీలిస్తారు.

ఫేజ్‌-3

అడాప్టబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించినవారిని వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణ, నాలుగేళ్ల విధుల నిమిత్తం తీసుకుంటారు.

సేవానిధి..

ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది ప్రతి నెల పొందే 30,000 నుంచి రూ.9000 మినహాయిస్తారు. అగ్నివీర్‌వాయు చేతికి రూ.21,000 అందుతుంది. రెండో ఏడాది రూ.23,100 వేతనం అందుతుంది. రూ.9900 నిధిలో జమ అవుతుంది. మూడో ఏడాది రూ.25,500 చేతికి వస్తుంది. రూ.10,950 నిధికి వెళ్తుంది. ఇలా నాలుగో ఏడాదికి వచ్చే సరికి వీరునికి రూ.28,000, నిధికి రూ.12,000 వెళ్తాయి. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి గానూ సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి జమవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జత చేస్తుంది. రెండూ కలిపి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డీని జతచేసి, అగ్నివీర్‌వాయుకి అందిస్తారు. సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం వీరికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. కార్పొరేట్‌ సంస్థల్లోనూ అవకాశాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్‌ మధ్యలో కావాలంటే వైదొలగొచ్చు. అలాంటి సందర్భంలో వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే అగ్నివీర్‌వాయుకి అందిస్తారు. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం దక్కదు.

ఉద్యోగంలోకి..

నాలుగేళ్ల వ్యవధి పూర్తిచేసుకున్న అగ్నివీర్‌వాయు ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని ఎయిర్‌ఫోర్స్‌లో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇందుకోసం నాలుగేళ్ల వ్యవధిలో చూపిన ప్రతిభ, సంస్థ అవసరాలు ప్రామాణికంగా తీసుకుంటారు. సైన్స్‌ విభాగంలో అవకాశం వచ్చినవారు గ్రూప్‌-ఎక్స్‌ (ఫిట్టర్‌) విధులు నిర్వర్తిస్తారు. వీరికి మొదటి నెల నుంచే రూ.33,100 మూలవేతనం అందుతుంది. నాన్‌ సైన్స్‌ అభ్యర్థులు గ్రూప్‌ వై(టెక్నీషియన్‌) సేవలు అందిస్తారు. వీరికి రూ.26,900 మూలవేతనం చెల్లిస్తారు. ఈ రెండు ట్రేడులవారికీ డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు అందుతాయి. ఎక్స్‌ ట్రేడ్‌ల్లోనివారు మొదటి నెల నుంచే రూ.యాభై వేలకు పైగా, వై ట్రేడుల్లో చేరినవాళ్లు సుమారు రూ.45,000 వేతనం అందుకోవచ్చు.

విధుల్లో కొనసాగినవారు భవిష్యత్తులో ప్రమోషన్ల ద్వారా మాస్టర్‌ వారెంట్‌ ఆఫీసర్‌ (ఎండబ్ల్యువో) స్థాయి వరకు చేరుకోవచ్చు. అలాగే సర్వీసులో కొనసాగుతూ కొన్ని పరీక్షల్లో అర్హతలు సాధించినవారు కమిషన్డ్‌ ఆఫీసర్లు కావడానికీ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తూనే నిర్ణీత వ్యవధితో ఉన్నత విద్య కొనసాగించడానికీ అనుమతిస్తారు. పదవీ విరమణ వయసు వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం పింఛను, ఇతర సౌకర్యాలు వీరికి దక్కుతాయి.  

ప్రోత్సాహకాలు

అగ్నివీర్‌వాయులో అవకాశం వచ్చినవారికి తొలి ఏడాది ప్రతి నెలా రూ.30,000 చెల్లిస్తారు. రెండో సంవత్సరం నెలకు రూ.33,000 వేతనం ఉంటుంది. మూడో ఏడాది రూ.36,500 అందుతుంది. నాలుగో సంవత్సరం రూ.40,000 ప్రతి నెలా చెల్లిస్తారు. వార్షిక సెలవులు 30 ఉంటాయి. ఆరోగ్య సమస్యను బట్టి సిక్‌ లీవ్‌ కేటాయిస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌లో ఉన్నప్పుడు రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్‌, రేషన్‌, డ్రెస్‌, ట్రావెల్‌ అలవెన్సులు అందిస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ వర్తిస్తుంది. నాలుగేళ్ల సేవలకు గానూ వారు పనిచేసిన విభాగాన్ని అనుసరించి అగ్నివీర్‌వాయు స్కిల్‌ సర్టిఫికెట్‌ అందుతుంది. వీరికి పింఛను, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ హోదా ఇవేవీ వర్తించవు. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఉండదు.

ముఖ్య సమాచారం

వయసు: 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. డిసెంబరు 26, 2002 - జూన్‌ 26, 2006 మధ్య జన్మించినవారు అర్హులు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు.

పరీక్ష ఫీజు: రూ.250.

ఆన్‌లైన్‌ పరీక్షలు: మే 20 నుంచి.

వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు నెట్‌!

‣ కాలుష్య నియంత్రణ బోర్డులో కొలువులు

‣ అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఇవే!

‣ సరిహద్దు దళంలోకి స్వాగతం!

‣ 5 వేల‌కుపైగా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు

‣ ఇంటర్‌తో ఐఐఎంలో ఎంబీఏ

‣ ఎగ్జామ్‌కి ముందు ఏం చేయ‌కూడ‌దు?

Posted Date : 21-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌