• facebook
  • whatsapp
  • telegram

ఎన్‌సీసీతో ఆర్మీ అధికారి కొలువు

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు

మహిళలు అర్హులే!

ఎన్‌సీసీలో స‌ర్టిఫికేట్ ఉన్న‌వారిని ఆర్మీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. పలు నియామక ప్రకటనల్లో కొన్ని పోస్టులను వారి కోసమే కేటాయిస్తోంది. అలాగే ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పేరుతో ప్రత్యేక నోటిఫికేషన్‌ ఏటా విడుదల చేస్తోంది. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా శిక్షణలోకి తీసుకుంటారు. ట్రైనింగ్‌ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు అందిస్తారు. ఇటీవల వెలువడిన ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ప్రకటన పూర్తి వివరాలు చూద్దాం! 

ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఏడాదికి రెండుసార్లు ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తోంది. డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు పొందిన అకడమిక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో ఐదు రోజులు పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు. 

ఎంపికైతే...

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విధానంలో ఎంపికైనవారికి ఈ ఏడాది అక్టోబరు నుంచి ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ, చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. 

ఇలా చేరినవారు పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. వ్యవధి పూర్తయిన తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత ఉద్యోగం (పర్మనెంట్‌ కమిషన్‌) కిందికి తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. ఆ తర్వాత వీరు వైదొలగాల్సి ఉంటుంది. 

లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. వీరికి రూ.56,100 మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ఆలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ఎన్నో ప్రోత్సాహకాలూ పొందవచ్చు. 

పోస్టు: ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ

మొత్తం ఖాళీలు: 55. వీటిలో 50 పురుషులకు, 5 మహిళలకు కేటాయించారు. ఈ రెండు విభాగాల్లోనూ 6(పురుషులు 5, మహిళలు 1) పోస్టులు యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి. 

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సీ‡ సర్టిఫికెట్‌లో కనీసం బీ గ్రేడ్‌ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ అవసరం లేదు.

వయసు: జులై 1, 2022 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. జులై 2, 1997 - జులై 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 13 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.   

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/Authentication.aspx
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మే నెలలో టెట్‌!

‣ ప్రతిష్ఠాత్మక బిర్లా సంస్థల్లో ప్రామాణిక కోర్సులు!

‣ ఎస్సీలకు శ్రేష్ఠమైన విద్య

‣ మీ టైమ్‌టేబుల్‌ ఎలా ఉంది?

‣ నీటి సంరక్షణ తక్షణ కర్తవ్యం

‣ సిలబస్‌ అంతా చదవాలి.. ప్రశ్నలు సాధన చేయాలి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌