• facebook
  • whatsapp
  • telegram

ప్రతిష్ఠాత్మక బిర్లా సంస్థల్లో ప్రామాణిక కోర్సులు!

బిట్‌శాట్‌-2022 సన్నద్ధతకు సూచనలు

మనదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో బిర్లా ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) ముఖ్యమైనవి. ఎంతో ప్రాధాన్యమున్న ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెంట్స్‌ హోదానూ ఇవి పొందాయి. ఇక్కడ అందించే ఇంజినీరింగ్‌ చదువులకు ఇంచుమించు ఐఐటీలతో సమాన గుర్తింపు ఉంది. అన్ని సీట్లూ మెరిట్‌ ప్రాతిపదికనే భర్తీ చేస్తారు. వీటిలో ప్రవేశానికి బిట్‌శాట్‌ రాయాలి. మేటి స్కోరు సాధించినవారు పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో చదువుకోవచ్చు. బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సులనూ ఈ సంస్థలు అందిస్తున్నాయి. ఇంటర్‌ మ్యాథ్స్, సైన్స్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో బిట్‌శాట్‌-2022 పూర్తి వివరాలు...

గత రెండుమూడేళ్ల కౌన్సెలింగ్‌ సరళి గమనిస్తే.. 240 మార్కులు సాధించినవారికి ఏదైనా బిట్స్‌ క్యాంపస్‌లో ఏదో ఒక ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లో సీటు దక్కుతోంది. ఈ సంస్థల్లో బీటెక్‌ కెమికల్, సివిల్‌ బ్రాంచీల కంటే ఎమ్మెస్సీ ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో చేరడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల ఎమ్మెస్సీ కటాఫ్‌ స్కోర్‌ వాటికంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు 20 ప్రశ్నలు తగ్గించారు కాబట్టి కటాఫ్‌ తగ్గుతుంది. తాజా మార్పుల నేపథ్యంలో 200 మార్కులు పొందినవారు ఏదైనా క్యాంపస్‌లో ఏదో ఒక ఇంజినీరింగ్‌ విభాగంలో సీటు ఆశించవచ్చు. ఎమ్మెస్సీ జనరల్‌ స్టడీస్‌ కోర్సు ఒక్క పిలానీ క్యాంపస్‌లోనే అందుబాటులో ఉంది. ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరినవారు ఏడాది అనంతరం డ్యూయల్‌ డిగ్రీ చదువుకునే అవకాశం ఉంది. మొదటి ఏడాది కోర్సులో వీరు చూపిన ప్రతిభ ప్రకారం ఈ సీట్లు కేటాయిస్తారు. ఈ విధానం ఎంచుకున్నవారు అయిదేళ్ల వ్యవధితో నచ్చిన బ్రాంచిలో ఇంజినీరింగ్‌తోపాటు ఎమ్మెస్సీ పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడి ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు నాలుగేళ్లకే పూర్తి చేసుకోవచ్చు. మిగిలిన సంస్థల్లో ఈ వ్యవధి అయిదేళ్లగా ఉంటుంది. బిట్‌శాట్‌ స్కోరుతో ఎన్‌ఐఐటీ యూనివర్సిటీతోపాటు పలు ఇతర సంస్థలూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ప్రోత్సాహకాలు

ఇంటర్‌ పరీక్షల్లో ఆయా బోర్డుల వారీ టాపర్లగా నిలిచినవారు బిట్‌శాట్‌ రాయకుండానే నేరుగా ప్రవేశం పొందవచ్చు. మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్పు లభిస్తుంది. ప్రతిభ, అవసరాల ప్రాతిపదికన వీరికి 15 నుంచి వంద శాతం ట్యూషన్‌ ఫీజులో రాయితీ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం 30 శాతం మంది విద్యార్థులకు ఈ తరహా ప్రోత్సాహకాలను అందుకుంటున్నారు. ఈ సంస్థల్లో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల ద్వారా ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారు.

ఇవీ కోర్సులు

బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్‌.

బీఫార్మసీ

ఎమ్మెస్సీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సైన్సెస్, ఎకనామిక్స్, జనరల్‌ స్టడీస్‌.

అర్హత: ఇంజినీరింగ్, ఎమ్మెస్సీ కోర్సులకు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ తప్పనిసరి. బీఫార్మసీకి బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో సంబంధిత గ్రూప్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించాలి. అలాగే సంబంధిత సబ్జెక్టుల్లోనూ విడిగా 60 శాతం మార్కులు ఉండాలి. 2022లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాస్తున్నవాళ్లు, 2021లో ఉత్తీర్ణులైనవారే అర్హులు. 

పరీక్ష ఇలా...

ఇందులో 4 విభాగాలుంటాయి. పార్ట్‌ 1 ఫిజిక్స్‌ 30, పార్ట్‌ 2 కెమిస్ట్రీ 30, పార్ట్‌ 3 ఎ. ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 10, బి. లాజికల్‌ రీజరింగ్‌ 20, పార్ట్‌ 4 మ్యాథ్స్‌/ బయాలజీ (బీఫార్మసీ కోసం) 40 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 130 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 3 గంటలు కేటాయించారు. సెక్షన్ల వారీ సమయ నిబంధనలు లేవు. ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు వస్తాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన వాటికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. నిర్ణీత సమయం కంటే ముందే ప్రశ్నలన్నింటికీ జవాబులు గుర్తించినవారికి అదనంగా 12 ప్రశ్నలు లభిస్తాయి. మ్యాథ్స్‌/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాజికల్‌ రీజనింగ్‌ ఒక్కో విభాగం నుంచి 3 చొప్పున ఇవి ఉంటాయి. వీటికి సరైన సమాధానాలు గుర్తిస్తే అదనపు మార్కులు పొందవచ్చు. అయితే ఈ విధానం ఎంచుకున్నవారు ముందు గుర్తించిన 130 ప్రశ్నలకు జవాబులు మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.

పరీక్షలు జూన్, జులైల్లో..

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 21 వరకు స్వీకరిస్తారు.

ఆన్‌లైన్‌ పరీక్షలు: సెషన్‌ 1 కోసం జూన్‌ 20 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. సెషన్‌ 2లో జులై 22 నుంచి 26 వరకు ఉంటాయి.

ఫీజు: పురుషులకు రూ.3400, మహిళలకు రూ.2900. రెండు సెషన్లలోనూ పరీక్ష రాసుకోవడానికి పురుషులకు రూ.5400, మహిళలకు రూ.4400.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం

వెబ్‌సైట్‌: https://www.bitsadmission.com/

తాజా మార్పు ఇదీ...

గత ఏడాదితో పోలిస్తే ప్రశ్నల సంఖ్య 150 నుంచి 130కి కుదించారు. పరీక్ష వ్యవధి మాత్రం అలాగే ఉంచారు. ఇది అభ్యర్థులకు అనుకూలాంశంగా చెప్పుకోవచ్చు.

ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కో దాంట్లో పది చొప్పున, మ్యాథ్స్‌/ బయాలజీలో 5, ఇంగ్లిష్‌లో 5 ప్రశ్నలు తగ్గించారు.

లాజికల్‌ రీజనింగ్‌లో గతం కంటే 10 ప్రశ్నలు పెంచారు. అందువల్ల ఈ అంశానికి సన్నద్ధతలో ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రాథమిక భావనలు ముఖ్యం

ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అందువల్ల ముందు వాటిని బాగా అధ్యయనం చేయాలి. ఆయా సబ్జెక్టులవారీ ప్రాథమికాంశాలు, భావనలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. ఇవి పూర్తిస్థాయి సన్నద్ధతకు దిక్సూచిలా ఉపయోగపడతాయి. ఆయా సబ్జెక్టుల్లో చాప్టర్లవారీ ప్రాధాన్యాన్ని గుర్తించి, అందుకు తగ్గ సమయం వెచ్చించుకోవాలి.

పరిమిత సంఖ్యలో రిఫరెన్స్‌ పుస్తకాలను ఎంపికచేసుకుని, వాటినే ఎక్కువసార్లు చదవడం మంచిది.

ఐఐటీ-జేఈఈ, ఎంసెట్‌లా కాకుండా బిట్‌శాట్‌లో ఆంగ్లం, లాజికల్‌ రీజనింగ్‌లకూ ప్రాధాన్యం ఉంది కాబట్టి వాటిపైనా దృష్టి పెట్టాలి. ఈ విభాగాల్లో మెరుగైన స్కోరు సాధించినవాళ్లు ముందుంటారు.

పరీక్షకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులైనా రాయాలి. ముందు పరీక్షలో చేసిన తప్పులు తర్వాతి పరీక్షలో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏ అంశాల్లో వెనుకబడుతున్నారో గమనించి వాటికి ప్రాధాన్యమివ్వాలి. సమయపాలనను పాటించాలి.

జేఈఈ మెయిన్స్‌ సన్నద్ధతతో బిట్‌ శాట్‌ ఎదుర్కోవచ్చు. అందువల్ల మెయిన్స్‌ మాదిరి, పాత ప్రశ్నపత్రాల సాధన ఉపయోగపడుతుంది.

గణితంలో కొన్ని ప్రశ్నలకు షార్ట్‌ కట్‌ మెథడ్స్‌ ద్వారా తక్కువ వ్యవధిలో జవాబు గుర్తించవచ్చు. వీటిపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన సూత్రాలు గుర్తుంచుకోవాలి.

రుణాత్మక మార్కుల కారణంగా నష్టం జరగడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల తెలియని ప్రశ్నలను వదిలేయడమే మంచిది.

బిట్‌శాట్‌ వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రం అందుబాటులో ఉంది. దాన్ని ఎన్నిసార్లైనా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు.

ఏ అంశాల నుంచి ప్రశ్నలు?

ఆంగ్లం: ప్రశ్నలు అభ్యర్థి ఇంగ్లిష్‌ను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ఉంటాయి. ఆ భాషలో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. గ్రామర్, ఒకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, కంపోజిషన్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.

లాజికల్‌ రీజనింగ్‌: తర్కం, కచ్చితత్వం అభ్యర్థిలో ఎలా ఉన్నాయో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ఇందులో వెర్బల్‌ విభాగం నుంచి ఎనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్‌ కంప్లీషన్, లాజికల్‌ డిడక్షన్, చార్ట్‌ లాజిక్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. నాన్‌ వెర్బల్‌ విభాగంలో ప్యాటర్న్‌ పర్సెప్షన్, ఫిగర్‌ ఫార్మేషన్‌ అండ్‌ ఎనాలిసిస్, పేపర్‌ కటింగ్, ఫిగర్‌ మ్యాటిక్స్, రూల్‌ డిటెక్షన్‌ల్లో ప్రశ్నలు సంధిస్తారు.

గణితం: ఆల్జీబ్రా, త్రికోణమితి, టు డైమెన్షనల్‌ కోఆర్డినేట్‌ జామెట్రీ, త్రీ డైమెన్షనల్‌ కోఆర్డినేట్‌ జామెట్రీ, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, ఆర్డినరీ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్స్, స్టాటిస్టిక్స్, లీనియర్‌ ప్రోగ్రామింగ్, మ్యాథమేటికల్‌ మోడలింగ్‌ అధ్యాయాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

బయాలజీ: డైవర్సిటీ ఇన్‌ లివింగ్‌ వరల్డ్, సెల్‌: లైఫ్, స్ట్రక్చర్, ఫంక్షన్, జెనెటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్, ప్లాంట్స్, యానిమల్స్, రీప్రొడక్షన్, గ్రోత్‌ అండ్‌ మూమెంట్‌ ఇన్‌ ప్లాంట్స్, రీ ప్రొడక్షన్‌ గ్రోత్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ హ్యూమన్స్, ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, బయాలజీ అండ్‌ హ్యూమన్‌ వెల్ఫేర్, బయోటెక్నాలజీ అండ్‌ అప్లికేషన్స్‌ విభాగాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు.

ఫిజిక్స్‌: యూనిట్స్‌ అండ్‌ మెజర్‌మెంట్స్, కైనమాటిక్స్, న్యూటన్‌ లాస్‌ ఆఫ్‌ మోషన్, ఇంపల్స్‌ అండ్‌ మొమెంటమ్, వర్క్‌ అండ్‌ ఎనర్జీ, రొటేషనల్‌ మోషన్, గ్రావిటేషన్, సాలిడ్స్, ఫ్లూయిడ్స్‌ మెకానిక్స్, ఆసిలేషన్స్, వేవ్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిక్‌ ఎఫెక్ట్‌ ఆఫ్‌ కరెంట్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ ఇండక్షన్, ఆప్టిక్స్, మోడర్న్‌ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ అధ్యాయాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

కెమిస్ట్రీ: స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్, అటామిక్‌ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, ఫిజిక్స్‌ అండ్‌ కెమికల్‌ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్‌ కైనటిక్స్, హైడ్రోజన్‌ అండ్‌ ఎస్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్, పి,డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అండ్‌ హైడ్రో కార్బన్స్‌ ప్రిన్సిపుల్స్, స్టీరియో కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కాంపౌండ్స్, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, ఎక్స్‌పరిమెంటల్‌ కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నీటి సంరక్షణ తక్షణ కర్తవ్యం

‣ సిలబస్‌ అంతా చదవాలి.. ప్రశ్నలు సాధన చేయాలి!

‣ ఇంటర్మీడియట్‌తో నౌకాదళం కొలువులు

‣ విజయాన్ని నిర్ణయించే వ్యక్తిత్వ పరీక్ష!

‣ IIT Madras‌: ఐఐటీ మద్రాస్‌ ఆన్‌లైన్‌ బీఎస్సీ

‣ అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌ అలా సాధించారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 22-03-2022


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌