• facebook
  • whatsapp
  • telegram

ప్రతిష్ఠాత్మక బిర్లా సంస్థల్లో ఇంజినీరింగ్‌!

బీఈ, బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు బిట్‌శాట్‌ ప్రకటన

దేశంలో ఇంజినీరింగ్‌ విద్యకు ప్రతిష్ఠాత్మకమైనవాటిలో బిర్లా విద్యాసంస్థలు ముఖ్యమైనవి. పిలానీ, గోవా, హైదరాబాద్‌ల్లో ఇవి బీఈ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ప్రవేశపరీక్ష బిట్‌శాట్‌ స్కోరుతో అవకాశం కల్పిస్తున్నాయి. ఏటా సుమారు మూడు లక్షల మంది ఈ సంస్థల్లో సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇటీవలే ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు...

సన్నద్ధత ఎలా?

ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి. సిలబస్‌ వివరాలూ ప్రకటనలో పేర్కొన్నారు. వాటిని శ్రద్ధగా పరిశీలించాలి. 

సబ్జెక్టులవారీ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలు, భావనలు బాగా చదవాలి. 

పాత ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలించాలి. సన్నద్ధతకు దిశానిర్దేశం చేయడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి సబ్జెక్టులోనూ చాప్టర్లవారీ పరీక్షలో దక్కుతోన్న ప్రాధాన్యం గమనించాలి. అలాగే ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారో చూసుకోవాలి. సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా మలచుకోవాలి.  

పరిమిత సంఖ్యలో రిఫరెన్స్‌ పుస్తకాలను ఎంచుకుని, వాటినే ఎక్కువసార్లు చదవడం మంచిది. 

వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

ఈ పరీక్షలో.. ఆంగ్లం, లాజికల్‌ రీజనింగ్‌లకూ ప్రాధాన్యం ఉంది కాబట్టి వాటిపైనా దృష్టి పెట్టాలి. ఈ విభాగాల్లో మెరుగైన స్కోరు సాధించినవాళ్లు ముందుంటారు.

 పరీక్షకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులైనా రాయాలి. ఫలితాలు విశ్లేషించుకుని, వెనుకబడిన అంశాల్లో అదనంగా కృషి చేయాలి. ముందు పరీక్షలో చేసిన తప్పులు తర్వాతి పరీక్షలో పునరావృతం కాకుండా చూసుకోవాలి. 

 ఈ సందర్భంగా నిర్దిష్ట సమయంలోగా సమాధానాలు గుర్తించటం అలవాటు చేసుకోవాలి.  

 జేఈఈ మెయిన్స్‌ సన్నద్ధతతో బిట్‌ శాట్‌ ఎదుర్కోవచ్చు. అందువల్ల మెయిన్స్‌ మాదిరి, పాత ప్రశ్నపత్రాల సాధన బాగా ఉపయోగపడుతుంది. 

 ఏపీ, టీఎస్‌ ఎంసెట్‌ ప్రశ్నపత్రాల అధ్యయనమూ ప్రయోజనకరమే. 

 గణితంలో కొన్ని ప్రశ్నలకు షార్ట్‌ కట్‌ మెథడ్స్‌ ద్వారా తక్కువ వ్యవధిలో జవాబు గుర్తించవచ్చు. వీటిపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన సూత్రాలు గుర్తుంచుకోవాలి. 

 రుణాత్మక మార్కులున్నాయని మర్చిపోకూడదు. అసలేమాత్రమూ అవగాహనలేని ప్రశ్నలను రాస్తే నష్టం జరుగుతుంది. వాటిని వదిలేయడమే మేలు. 

సబ్జెక్టులవారీగా..

ఆంగ్లం: భాషపై ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. గ్రామర్, ఒకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, కంపోజిషన్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌ను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. 

లాజికల్‌ రీజనింగ్‌: తర్కం, కచ్చితత్వం తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. వెర్బల్‌ విభాగం నుంచి ఎనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్‌ కంప్లిషన్, లాజికల్‌ డిడక్షన్, చార్ట్‌ లాజిక్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. నాన్‌ వెర్బల్‌ విభాగంలో ప్యాటర్న్‌ పర్సెప్షన్, ఫిగర్‌ ఫార్మేషన్‌ అండ్‌ ఎనాలిసిస్, పేపర్‌ కటింగ్, ఫిగర్‌ మ్యాటిక్స్, రూల్‌ డిటెక్షÛన్‌ల్లో ప్రశ్నలు సంధిస్తారు. 

గణితం: ఆల్జీబ్రా, త్రికోణమితి, టు డైమెన్షనల్‌ కోఆర్డినేట్‌ జామెట్రీ, త్రీ డైమెన్షనల్‌ కోఆర్డినేట్‌ జామెట్రీ, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, ఆర్డినరీ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్స్, స్టాటిస్టిక్స్, లీనియర్‌ ప్రోగ్రామింగ్, మ్యాథమెటికల్‌ మోడలింగ్‌ అధ్యాయాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

బయాలజీ: డైవర్సిటీ ఇన్‌ లివింగ్‌ వరల్డ్, సెల్‌: లైఫ్, స్ట్రక్చర్, ఫంక్షన్, జెనెటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్, ప్లాంట్స్, యానిమల్స్, రీప్రొడక్షన్, గ్రోత్‌ అండ్‌ మూమెంట్‌ ఇన్‌ ప్లాంట్స్, రీ ప్రొడక్షన్‌ గ్రోత్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ హ్యూమన్స్, ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, బయాలజీ అండ్‌ హ్యూమన్‌ వెల్ఫేర్, బయోటెక్నాలజీ అండ్‌ అప్లికేషన్స్‌ విభాగాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. 

ఫిజిక్స్‌: యూనిట్స్‌ అండ్‌ మెజర్‌మెంట్స్, కైనమాటిక్స్, న్యూటన్‌ లాస్‌ ఆఫ్‌ మోషన్, ఇంపల్స్‌ అండ్‌ మొమెంటమ్, వర్క్‌ అండ్‌ ఎనర్జీ, రొటేషనల్‌ మోషన్, గ్రావిటేషన్, సోలిడ్స్, ఫ్లూయిడ్స్‌ మెకానిక్స్, ఆసిలేషన్స్, వేవ్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిక్‌ ఎఫెక్ట్‌ ఆఫ్‌ కరెంట్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ ఇండక్షన్, ఆప్టిక్స్, మోడర్న్‌ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌ అధ్యాయాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

కెమిస్ట్రీ స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్, అటామిక్‌ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, ఫిజిక్స్‌ అండ్‌ కెమికల్‌ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్‌ కైనటిక్స్, హైడ్రోజన్‌ అండ్‌ ఎస్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్, పి,డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అండ్‌ హైడ్రో కార్బన్స్‌ ప్రిన్సిపుల్స్, స్టీరియో కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కాంపౌండ్స్, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, ఎక్స్‌పరిమెంటల్‌ కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

ఇవీ కోర్సులు

బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్‌.

బీఫార్మసీ

ఎమ్మెస్సీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సైన్సెస్, ఎకనామిక్స్, జనరల్‌ స్టడీస్‌

అర్హత: ఇంజినీరింగ్, ఎమ్మెస్సీ కోర్సులకు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూపు తప్పనిసరి. బీఫార్మసీకి బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో సంబంధిత గ్రూపులో కనీసం 75 శాతం మార్కులు సాధించాలి. సంబంధిత సబ్జెక్టుల్లోనూ విడిగా 60 శాతం మార్కులు ఉండాలి. 2023లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాస్తున్నవాళ్లు, 2022లో ఉత్తీర్ణులైనవారే అర్హులు. 

పరీక్ష విధానం

4 విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1 ఫిజిక్స్‌ 30, పార్ట్‌-2 కెమిస్ట్రీ 30, పార్ట్‌-3 ఎ. ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 10, బి. లాజికల్‌ రీజరింగ్‌ 20, పార్ట్‌-4 మ్యాథ్స్‌ / బయాలజీ (బీఫార్మసీ కోసం) 40 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 130 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 3 గంటలు కేటాయించారు. సెక్షన్ల వారీ సమయ నిబంధనలు లేవు. ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు వస్తాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. 

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. నిర్ణీత సమయం కంటే ముందే ప్రశ్నలన్నింటికీ జవాబులు గుర్తించినవారికి అదనంగా 12 ప్రశ్నలు లభిస్తాయి. మ్యాథ్స్‌/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాజికల్‌ రీజనింగ్‌ ఒక్కో విభాగం నుంచి 3 చొప్పున ఇవి ఉంటాయి. వీటికి సరైన సమాధానాలు గుర్తిస్తే అదనపు మార్కులు పొందవచ్చు. అయితే ఈ విధానం ఎంచుకున్నవారు ముందు గుర్తించిన 130 ప్రశ్నలకు జవాబులు మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. 

కటాఫ్‌ ఇలా...

ఈ సంస్థల్లో బీటెక్‌ కెమికల్, సివిల్‌ బ్రాంచీల కంటే ఎమ్మెస్సీ ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో చేరడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల ఎమ్మెస్సీ కటాఫ్‌ స్కోర్‌ వాటికంటే ఎక్కువగా ఉంది. 

మొత్తం 390కి 220 మార్కులు పొందినవారు ఏదైనా క్యాంపస్‌లో ఏదో ఒక ఇంజినీరింగ్‌ విభాగంలో సీటు ఆశించవచ్చు. ఎమ్మెస్సీ జనరల్‌ స్టడీస్‌ కోర్సు ఒక్క పిలానీ క్యాంపస్‌లోనే అందుబాటులో ఉంది. ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరినవారు ఏడాది అనంతరం డ్యూయల్‌ డిగ్రీ చదువుకోవచ్చు. మొదటి ఏడాది కోర్సులో వీరు చూపిన ప్రతిభ ప్రకారం ఈ సీట్లు కేటాయిస్తారు. ఈ విధానం ఎంచుకున్నవారు ఐదేళ్ల వ్యవధితో నచ్చిన బ్రాంచీలో ఇంజినీరింగ్‌తోపాటు ఎమ్మెస్సీ పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడి ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు నాలుగేళ్లకే పూర్తవుతాయి. మిగతా వాటిలో ఈ వ్యవధి ఐదేళ్లు. బిట్‌శాట్‌ స్కోర్‌తో ఎన్‌ఐఐటీ యూనివర్సిటీతోపాటు పలు ఇతర సంస్థలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 

ప్రోత్సాహకాలు

ఇంటర్‌ పరీక్షల్లో ఆయా బోర్డుల వారీ టాపర్లగా నిలిచినవారు నేరుగా ప్రవేశం పొందవచ్చు. బిట్‌శాట్‌లో మెరిసినవారికి స్కాలర్‌షిప్పు లభిస్తుంది. ప్రతిభ, అవసరాల ప్రాతిపదికన వీరికి 15 నుంచి 100 శాతం ట్యూషన్‌ ఫీజులో రాయితీ ఇస్తున్నారు. ఏటా సుమారు 30 శాతం మంది విద్యార్థులు ఈ తరహా ప్రోత్సాహాలను అందుకుంటున్నారు. ఈ సంస్థల్లో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల ద్వారా ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారు.  

గమనించండి

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 9 వరకు స్వీకరిస్తారు. 

ఆన్‌లైన్‌ పరీక్షలు: సెషన్‌-1 మే 21 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. సెషన్‌-2 జూన్‌ 18 నుంచి 22 వరకు.

ఫీజు: పురుషులకు రూ.3400, మహిళలకు రూ.2900. రెండు సెషన్లలోనూ పరీక్ష రాసుకోవడానికి పురుషులకు రూ.5400, మహిళలకు రూ.4400.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం

వెబ్‌సైట్‌: https://www.bitsadmission.com/

మరింత సమాచారం... మీ కోసం!

‣ నాణ్యమైన బోధన.. నెలనెలా స్టైపెండ్‌!

‣ చివరివరకూ అంతే ఉత్సాహంగా..

‣ అత్యున్నత కొలువుకు పోటీపడతారా?

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ‘మ్యాట్‌’!

‣ డెక‌రేష‌న్ల‌కు కొన్ని కోర్సులు!

‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!

Posted Date: 10-02-2023


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌