• facebook
  • whatsapp
  • telegram

సాంకేతికత తోడవ్వడం మంచి పరిణామమే కదా!

* గ్రూప్ - IV మెదక్ జిల్లా టాపర్
చదివింది ఇంజినీరింగ్ విద్య.. ఎంచుకున్న మార్గం ప్రభుత్వ ఉద్యోగం ద్వారా సమాజానికి సేవచేయడం. ఆ క్రమంలో ఆర్థిక బాధలూ.. అనేక ఒడుదుడుకులు... వీటన్నింటినీ ఆత్మస్త్థెర్యంతో ఎదుర్కొని ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ - IV సర్వీసెస్ (నోటిఫికేషన్ నంబర్ 38/ 2011) పరీక్షలో మెదక్ జిల్లా టాపర్‌గా నిలిచారు సిద్దిపేటకు చెందిన గందే శ్రీనివాస్.

పేపర్ - I లో 137, పేపర్ - II లో 142 మార్కులతో మొత్తం 300 మార్కులకుగాను 279 మార్కులు సాధించారు. మార్చి 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన ఫలితాల ప్రకారం కడప జిల్లాకు చెందిన అభ్యర్థి (హాల్ టికెట్ నంబరు: 41104139) 284 మార్కులు సాధించగా... శ్రీనివాస్ (హాల్ టికెట్ నంబరు: 42206124) 279 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం మెదక్ జిల్లా మిరిదొడ్డిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను ఈనాడుప్రతిభ బృందం పలుకరించగా అనేక విషయాలను వెల్లడించారు....

 

* మీ కుటుంబ నేపథ్యం, చదువు గురించి తెలపండి.
మాది సిద్దిపేట దగ్గర్లోని బక్రిచెప్యాల్ గ్రామం. నేను మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని ఎస్‌హెచ్‌సీఎస్‌టీ కాలేజీ నుంచి 2007లో ఈసీఈ విభాగంలో బీటెక్ పూర్తి చేశాను.

 

* బీటెక్ చేసి కాంపిటేటివ్ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం...
నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలని కోరిక. ఇంజినీరింగ్ పూర్తయ్యాక కొంత కాలంపాటు ఇందూర్ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాను. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిపేరయ్యాను. గ్రూప్ - I స్థాయి పోస్టులకు సిద్ధం కావడానికి ఆర్థికంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండాలని తొందరగానే గ్రహించి, ముందు దిగువ స్థాయి పోస్టులను లక్ష్యంగా ఎంచుకున్నాను. ఈ క్రమంలో గత ఏడాది నిర్వహించిన వీఆర్వో పరీక్షలో జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించాను. ఆ తర్వాత ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో అర్హత సాధించాను. తాజాగా గ్రూప్ - II విభాగంలోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా పూర్తయ్యింది.

 

* చాలాకాలంపాటు ఖాళీగా ఉండి, పోటీ ప్రపంచంలో వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ఈ విజయాలను మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు?
కాంపిటేషన్ రంగం కోసం సుదీర్ఘకాలంగా ప్రిపేరవడం ఆషామాషీ వ్యవహారం కాదు. తాత, అన్నయ్య నాకు అన్నివిధాలా సహకారమందించి, ఆర్థికంగా ఏ లోటు రానివ్వకుండా చూడటం వల్లే ఇది సాధ్యమైంది. పడిన కష్టానికి ఫలితం దక్కడంతో అమ్మ కళ్లల్లో ఆనందం చూసి, ఆనందభాష్పాలు రాల్చాను. ఈ స్ఫూర్తితో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి చేస్తాను.

 

* మీ ప్రిపరేషన్ విధానం గురించి చెప్పండి.
సిలబస్‌కు సంబంధించి నిర్దిష్టమైన మెటీరియల్‌ను ఎంపిక చేసుకున్నాను. ఎకానమీ సబ్జెక్టు కోసం కోచింగ్ తీసుకున్నాను. రోజూ ఈనాడు పత్రికను చదివి, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి నోట్సు ప్రిపేర్ చేసుకున్నాను. రోజులో కనీసం 3 గంటలు www.eenadupratibha.net లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్‌ను చదవడానికి కేటాయించాను. ఆయా అంశాల్లో ఆన్‌లైన్ పరీక్షలను ప్రాక్టీస్ చేయడం నాకు బాగా తోడ్పడింది. వీటితోపాటు ప్రతిభ పేజీల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ (కృష్ణ ప్రసాద్), పాలిటీ (వీరబ్రహ్మం), అనంత రామకృష్ణ (ఫిజిక్స్), వేడియం భాస్కర్ (చరిత్ర), జనరల్ స్టడీస్ వ్యాసాలను గత రెండేళ్లుగా క్రమం తప్పకుండా చదువుతున్నాను. నలుగురం స్నేహితులం కలిసి సిద్దిపేటలో రూమ్ తీసుకొని సాధన చేశాం. ప్రతిరోజు వివిధ అంశాలపై డిస్కషన్ చేసేవాళ్లం. మిత్రులందరూ దాదాపుగా ఏకకాలంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికవ్వడం అత్యంత సంతోషానిచ్చింది.

 

* మీ ప్రిపరేషన్ కాలంలో కాంపిటేటివ్ రంగానికి సంబంధించి మీరు గమనించిన మార్పులేమిటి?
కొన్నేళ్ల కిందటి వరకూ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్థులకు సరైన అవగాహన ఉండేది కాదు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రస్తుతం డిగ్రీలు చేస్తూనే ఈ అంశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. మెరుగైన మెటీరియల్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో ఎలాంటి పోస్టుకైనా అధికంగా శ్రమించడం తప్పనిసరైంది.

 

* ఒకప్పుడు సంప్రదాయ డిగ్రీ చేసినవారే ఎక్కువగా ఈ రంగంలోకి వచ్చేవారు. ప్రస్తుతం బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేసినవారు కూడా ఎక్కువగా ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలను ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు?
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న భద్రత, హోదా, గౌరవమే దీనికి ప్రధాన కారణం. ఏ రంగంలోనైనా నైపుణ్యమున్నవారికే అవకాశాలు వస్తున్నాయి. కొన్నేళ్ల కిందటివరకూ ప్రభుత్వ రంగంలో వివిధ ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ రంగానికి సాంకేతిక విద్య కూడా తోడవ్వడం మంచి పరిణామమే కదా! ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందడం శుభ సూచకమే.

 

* కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సిద్ధమవుతున్నవారికి మీరిచ్చే సూచనలు...
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాని కోసం అహర్నిశలు కృషి చేయండి. ఎంతమంది పోటీలో ఉన్నారనే విషయాన్ని ఆలోచించకుండా, వైఫల్యాలు ఎదురైనా పట్టుదల వీడకుండా సాధన చేయండి. మార్కెట్లో రకరకాల మెటీరియల్ లభిస్తోంది. నిపుణుల సలహాలతో నిర్దిష్టమైన పుస్తకాలనే ఎంపిక చేసుకొని చదవండి. మోడల్ పేపర్లను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. వీటితోపాటు యోజన, వివేక్ లాంటి పత్రికలనూ చదవండి.

Posted Date: 01-11-2019


  • Tags :

 

పోటీ పరీక్షలు

మరిన్ని