• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగం మానేశా...

* పేరు: మాధురి, ర్యాంకు: ఒక‌టి

కాలంతో పోటీపడి కార్పొరేట్‌ కొలువుని అందుకున్నా ఏదో అసంతృప్తి. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఏ మాత్రం వెనకాడలేదు. అసలు నాకు గ్రూప్స్‌ రాయాలన్న ఆలోచన కన్నా మందు నాకు సివిల్స్‌ హాజరవ్వాలనే ఆలోచన వచ్చింది. రెండు సార్లు ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. కానీ విజయం సాధించలేదు. ఈ గ్రూప్స్‌ విజయంతో త్వరలో అదీ సాధిస్తాననుకుంటున్నా.

నిజానికి ఈ ఆలోచనకు రెండుకారణాలు. ఒకటి నాకు స్వతహాగా జనరల్‌ నాలెడ్జ్‌ అంటే ఇష్టం. ఇక, నాన్నా, తాతయ్య ప్రభుత్వ ఉద్యోగులు కావడం ఇందుకు మరో కారణం. సివిల్స్‌ ఆలోచన వచ్చినా గ్రూప్స్‌ రాయాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు డిప్యుటీ కలెక్టర్‌గా అర్హత సాధించా. అంతకన్నా ముందు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశా. వాస్తవానికి నేను పుట్టింది వరంగల్‌ జిల్లా మంగపేటలో అయినా నాన్న ఉద్యోగరీత్యా పెరిగిందంతా హైదరాబాద్‌. ట్రిపుల్‌ఐటీలో ఎంటెక్‌ అయ్యాక క్యాంపస్‌ సెలక్షన్స్‌లోనే ఐబీఎమ్‌లో ఉద్యోగం వచ్చింది. తరవాత విప్రోలో చేరా. కానీ నా మనసంతా గ్రూప్స్‌ మీదే ఉండేది. ఇది తెలిసి మా వారు ‘నీకంత ఇష్టంగా ఉంటే ఉద్యోగం మానేసి సీరియస్‌గా చదువు’ అని సూచించారు. అదే చేశా. చదువుకోవడం మొదలుపెట్టా. అప్పటికే గర్భవతిని. ఎక్కువసేపు కూర్చుని చదవడం చాలా కష్టం అనిపించేది. కానీ చదువుపై ఇష్టం కాబట్టి ఎక్కువగంటలు అలాగే చదువుకునేదాన్ని. పరీక్ష పూర్తయ్యింది. సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి డెలివరీ. బాబు రోజుల పిల్లాడు అయినా సరే! ఓ పక్క వాడిని అమ్మ సాయంతో చూసుకుంటూ మరోపక్క చదువుకున్నాను. కచ్చితంగా మంచి ర్యాంక్‌ వస్తుందని అనుకున్నా.
చిన్న లక్ష్యాలతోనే..
ఒక లక్ష్యం పెట్టుకున్నాక ఎంత కష్టమైన దాన్నయినా సరే పూర్తిచేయాలనే తత్వం నాది. అందుకే సిలబస్‌ పూర్తిచేయడానికి ఓ లక్ష్యం పెట్టుకున్నాక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసేదాన్ని కాదు. ఎప్పటికప్పుడు పూర్తిచేసేదాన్ని. దానికోసం దీర్ఘకాలిక లక్ష్యాలే కాదు... స్వల్పకాలిక లక్ష్యాలూ ఏర్పాటు చేసుకున్నా. అయితే ముందు సులభంగా ఉన్న అంశాలను కాకుండా కష్టంగా ఉన్నవాటిపై దృష్టిపెట్టా. దాంతో ఆఖరున తేలిగ్గా అనుకున్న అంశాను పూర్తిచేశా. ఎప్పటికప్పుడు నన్ను నేను పరీక్షించుకోవడానికి మాక్‌టెస్ట్‌లూ రాసేదాన్ని. అదే నాకు విజయాన్ని తెచ్చిపెట్టింది.

Posted Date: 31-10-2019


  • Tags :