• facebook
  • whatsapp
  • telegram

గేట్‌ టాపర్‌ సూర్యనారాయణ

టాపర్లపై ఉండే ఆరాధనతో వారి వ్యూహాలు తెలుసుకున్నాడు. ప్రేరణ పొందాడు. అధ్యాపకుల మార్గదర్శనంతో సరైన దిశలో కృషి చేశాడు. చివరకు తానే టాపర్‌గా నిలిచాడు! ప్రతిష్ఠాత్మక ‘గేట్‌’లో ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో అఖిలభారత స్థాయి మొదటి ర్యాంకు సాధించిన సూర్యనారాయణ విజయ్‌కుమార్‌ వడ్డేపల్లి తన విజయరహస్యాలను ‘చదువు’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

మా స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్‌ అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడగలుగుతాను. మా ఊళ్లోనే పాఠశాల, కళాశాల విద్య పూర్తయింది. పుణెలోని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుంచి ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేశాను. ఓ ప్రైవేటు సంస్థలో ఇండస్ట్రియల్‌ ఇంజినీరుగా చేరాను.
సాంకేతిక రంగంలో కెరియర్‌ తీర్చిదిద్దుకోవాలని ఎప్పటినుంచో నా కోరిక. దాంతో గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)పై దృష్టి పెట్టాను. ఈ పరీక్ష చాలా కష్టమని చాలామంది అనుకుంటారు గానీ దానిలో వాస్తవమేమీ లేదు. కావలసిందల్లా సరైన ప్రిపరేషన్‌ వ్యూహం. దాన్ని పాటిస్తే అధిక మార్కులు తప్పకుండా వస్తాయి. కానీ తికమక పడీ, నమ్మకం కోల్పోయీ గేట్‌ను కొందరు కష్టంగా తయారుచేసుకుంటున్నారని నా ఉద్దేశం.
హైదరాబాద్‌లోని ‘ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ’లో గేట్‌ సమ్మర్‌ క్రాష్‌ కోర్సులో చేరాను. రోజుకు 14 గంటల చొప్పున సాగే 50 రోజుల కోర్సు ఇది. తరగతుల్లో విన్న అంశాలను నోట్సుగా రాసుకున్నా. అన్ని కాన్సెప్టులూ ఆ వ్యవధిలో పూర్తిచేసుకున్నా. ప్రిపరేషన్‌కు తగిన దిశానిర్దేశం ఈ కోచింగ్‌ వల్ల లభించింది. క్లాస్‌ నోట్సు బాగానే సరిపోయింది. అందుకే ఏ రిఫరెన్‌్్స పుస్తకాలూ చూసే అవసరం రాలేదు. అధ్యాపకులు ప్రేరణ కోసం పూర్వపు గేట్‌ టాపర్ల వ్యూహాలు వివరించి, ప్రోత్సహించారు.

 

ఇదీ నా ప్రణాళిక
సరైన ప్రిపరేషన్‌కు కీలకం- సరళంగా, ప్రభావశీలంగా ఉండే ప్రణాళిక. గేట్‌ కోసం మొదట స్థూలంగా ఐదు నెలల ప్రణాళిక వేసుకున్నా. తర్వాత వీక్లీ ప్లాన్‌పై దృష్టి పెట్టాను. వీక్లీ ప్లాన్‌ను అత్యుత్తమంగా సిద్ధమయ్యేలా అమలుచేశా. గేట్‌లో 11-12 సబ్జెక్టులుంటాయి. విభిన్నమైన వీటి కాన్సెప్టులపై పట్టు రావటానికి రెండు సబ్జెక్టులను ఒకేసారి సమాంతరంగా చదువుతూవెళ్లా. రివిజన్‌ సమయంలో 3-4 సబ్జెక్టులను సమాంతరంగా చదివాను. దీనివల్ల పరీక్షలప్పుడు నాకు సులువయింది.
ప్రతిరోజూ 8 గంటలసేపు నిద్రపోయాను. ఉదయపు కార్యక్రమాలకు ముందు అంతకుముందు చదివిన కాన్సెప్టులను రివైజ్‌ చేసుకునేవాణ్ణి. గట్టి పునాది ఏర్పడటానికీ, ముందుకు సాగటానికీ ఇది ఉపకరించింది. కొన్ని చాప్టర్లు పూర్తయ్యాక వాటి కాన్సెప్టులతో సంబంధమున్న వివిధ రకాల ప్రాబ్లమ్స్‌ను సాల్వ్‌ చేస్తూవచ్చా. ఇది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఒక సబ్జెక్టు ప్రిపరేషన్‌ పూర్తవగానే దానిపై విభిన్నరకాల 3-4 టెస్ట్‌ సిరీస్‌ను చేసేవాణ్ణి.

 

తరచూ చేసే పొరపాట్లు
అభ్యర్థులు ఒకే కాన్సెప్టులపై రకరకాల పుస్తకాలు చదువుతూ గందరగోళపడుతుంటారు. అలా కాకుండా ప్రామాణిక స్టడీ మెటీరియల్‌ను చదవాలనేది నా సూచన. కాన్సెప్టులపై ధీమా రావాలంటే ప్రాబ్లమ్స్‌ సాల్వింగ్‌పై ఎక్కువ సమయం వెచ్చించాలి.
చాలామంది జనరల్‌ ఆప్టిట్యూడ్‌ భాగాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. స్కూలు రోజుల్నుంచీ నేర్చుకుంటున్న ఈ జి.ఎ.లో సులువుగా స్కోర్‌ చేయొచ్చు. ఓసారి మననం చేసుకుని గేట్‌ స్థాయి జి.ఎ. ప్రశ్నలను సాల్వ్‌ చేస్తే మొత్తం మార్కులు తెచ్చుకోవచ్చు.
పరీక్షలో ఏ ప్రశ్నపైనా ఎక్కువ సమయం వెచ్చించకూడదు. కష్టంగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వదిలేసెయ్యాలి. ఎక్కువ సమయం తీసుకుని చివరకు జవాబు రాకపోతే ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుంది. వదిలేసినవాటిని చివర్లో సాల్వ్‌ చేసుకోవచ్చు. ప్రశ్న చదువుతున్నపుడే ప్రాబ్లమ్‌ సగం సాల్వ్‌ చేయొచ్చు. అందుకే ప్రశ్నను జాగ్రత్తగా, అప్రమత్తంగా చదవటం చాలా ముఖ్యం. ఆ తర్వాతే సొల్యూషన్‌కు వెళ్లాలి. సరిగా ప్రశ్న చదవకుండా జవాబు కోసం ఆత్రుత పడకూడదు.

 

పునశ్చరణ, మాక్‌ టెస్టులు
మొదటిసారి సిద్ధమయ్యేటప్పుడు షార్ట్‌ నోట్సు రాసుకోవాలి. నియమిత కాలంలో (ప్రతి వారం) దాన్ని ‘క్విక్‌ రివిజన్‌’ చేసుకోవాలి. మర్చిపోవటం ఎవరికైనా మామూలే కాబట్టి అలా జరక్కుండా పునశ్చరణ చేసుకోవాలి. ఇక ధీమా పెరగాలంటే మాక్‌ టెస్టులు వీలైనన్ని రాయాలి. స్కోరు పట్టించుకోకూడదు.కానీ రాసిన పరీక్షను సరిగా విశ్లేషించుకోవాలి. అది ముఖ్యం.

 

సమయ నిర్వహణ
ప్రిపరేషన్‌ సమయంలో గంటల తరబడి యాంత్రికంగా పుస్తకాల్లో మునిగిపోకుండా ప్రభావశీలంగా చదవాలి. పూర్తి సమయం చదివే అవకాశమున్నవారు కనీసం 7-8 గంటలు తమ సన్నద్ధతకు వెచ్చించవచ్చు. ఉద్యోగాలు చేస్తూ గేట్‌ రాసేవారు విధులు ముగించాక చదవటం కంటే తెల్లవారుజామున ప్లాన్‌ చేసుకుంటే తాజాగా ఉండి, అధిక ప్రయోజనం కలుగుతుంది. నేనైతే రోజూ వ్యాయామం చేసి, ప్రిపరేషన్‌కు చక్కగా నన్ను సిద్ధం చేసుకునేవాణ్ణి.
మూడు గంటల వ్యవధిలో అన్ని ప్రశ్నలనూ కవర్‌ చేయాలంటే సమయ నిర్వహణ ప్రధానం. ఆన్‌లైన్‌ టెస్టులను వీలైనన్ని సాధన చేస్తేనే ఇది అలవడుతుంది.
చివరి 10-15 రోజుల్లో గేట్‌ గత సంవత్సరాల ప్రశ్నపత్రాలన్నీ తిరిగి సాల్వ్‌ చేశా. పరీక్ష బాగా రాశా కాబట్టి మంచి మార్కులు వస్తాయని తెలుసు. కానీ ఆలిండియా ప్రథమ స్థానం కలలో కూడా ఊహించలేదు. అందుకే వెంటనే నమ్మటం కష్టమైంది. సంతోషంతో కళ్లవెంట నీళ్లొచ్చాయి. అమ్మానాన్నలూ బాగా ఆనందపడ్డారు.

 

రేపటి అభ్యర్థులకు సూచనలు
* మొదట మీపై మీకు నమ్మకం ఉండాలి. నిరాశపడకూడదు.
* క్లాసు నోట్సు ఇతరులది తీసుకోకూడదు. సొంతంగా రాసుకోండి.
* నోట్సు చార్టులు/డయాగ్రమ్‌ల రూపంలో క్లుప్తంగా ఉంటే కాన్సెప్టులను పోల్చగలిగి రివిజన్‌ తేలికవుతుంది.
* నోట్సుపై విశ్వాసముంచి దాని ఆధారంగా కాన్సెప్టులను పునశ్చరణ చేసుకోండి. ఏదైనా సందేహం వచ్చినపుడు మాత్రమే రిఫరెన్స్‌ మెటీరియల్‌ చూడాలి.
* తొలి ప్రిపరేషన్‌ను హడావుడిగా ముగించాలనుకోవద్దు. తగిన వ్యవధి తీసుకుని, సమగ్రంగా చదవండి. ఆపై రివిజన్‌ చేస్తూనే పూర్తి నిడివి టెస్టులను రాయాలి.
* నిర్దిష్ట వ్యవధుల్లో టెస్ట్‌ సిరీస్‌ రాసి విశ్లేషించుకోవడం చాలా అవసరం. వాటిలో తక్కువ స్కోరు చేసినా నిరాశపడకూడదు. మెరుగుదల క్రమంగా వస్తుంది.
* ముందురోజు చదివిన కాన్సెప్టులను క్రమం తప్పకుండా రివైజ్‌ చేస్తూపోతే బాగా జ్ఞాపకం ఉంటాయి.
* వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాల్వ్‌ చేయండి. సొంత షార్ట్‌కట్స్‌ను వాడితే సమయం ఆదా అవుతుంది.
* గేట్‌ కాల్‌క్యులేటర్‌ మాత్రమే ఉపయోగించాలి. లేకుంటే పరీక్షలో కష్టమవుతుంది.
* 30-40 శాతం మంది అభ్యర్థులు చివరి నెలలో వెనకడుగు వేయటం చూశాను. పోటీలో నిలబడాలంటే పరీక్ష రాసేవరకూ ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
ఉన్నతవిద్య ప్రాముఖ్యం గురించి ఎప్పుడూ చెపుతుండే మా అమ్మమ్మ నాకు నిరంతర ప్రేరణ. ఉద్యోగం వదిలి పూర్తి కాలం సన్నద్ధతకు కేటాయించడంలో అమ్మానాన్నల మద్దతు చెప్పుకోదగ్గది. గేట్‌ విజయంలో వీరి మద్దతు ఎంతో ఉంది. అసలు ఎక్కడో ఉద్యోగిగా ఉండటం కాకుండా సొంత సంస్థను నెలకొల్పి ఇతరులకు ఉపాధి కల్పించాలనేది నా ఆశయం.

Posted Date: 01-11-2019


  • Tags :

 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని