• facebook
  • whatsapp
  • telegram

చదవడంలో ప్రణాళిక తప్పనిసరి

* పీజీమెట్ - 2014 ప్రథమ ర్యాంకర్ శ్రీరాంరెడ్డి

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: 'ప్రణాళిక ప్రకారం చదివితే విజయం తప్పక వరిస్తుందని పేర్కొంటున్నారు 2014 పీజీ మెట్ ప్రథమ ర్యాంకర్ శ్రీరాం రెడ్డి. ఎన్టీఆర్ వర్సిటీ ఇటీవల ప్రకటించిన పీజీమెట్- 2014లో గాంధీమెడికల్ కళాశాలకు చెందిన వైద్యవిద్యార్థి శ్రీరాంరెడ్డి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు. ప్రణాళిక ప్రకారం చదవడంవల్లే తనకీ ర్యాంకు వచ్చినట్లు తెలిపారు. ప్రథమ ర్యాంకు సాధించిన సందర్భంగా శ్రీరాంరెడ్డితో 'న్యూస్‌టుడే ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు.....

కుటుంబ నేపథ్యం....

కర్నూల్‌జిల్లా నందికొట్కూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, లీలావతి దంపతుల కుమారుడు శ్రీరాంరెడ్డి. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి వినియోగదారుల ఫోరంలో పనిచేస్తున్నాడు. తల్లి గృహిణి. చిన్ననాటినుంచి శ్రీరాంరెడ్డి చదువులో చురుగ్గా ఉండడంతో మంచి పాఠశాలలో చదివించాలని తల్లిదండ్రులు నిర్ణయించుకుని ఏడో తరగతినుంచి విజయవాడలో చదివించారు.

 

* టెన్త్‌లో 546 మార్కులు

పదోతరగతిలో 546 మార్కులు సాధించిన శ్రీరాంరెడ్డి ఇంటర్‌కూడా విజయవాడలోని శ్రీ చైైతన్య కళాశాలలో చదివారు. ఇంటర్‌లో 960 సాధించిన అతను ఎంసెట్‌లో 36 ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఎంబీబీయస్‌లో 67.7శాతం ఉత్తీర్ణతను సాధించారు. 2014లో మొదటిసారి జరిగిన పీజీమెట్‌లో 176 ర్యాంకు వచ్చింది. తాను పరీక్షరాసిన విధానం మేరకు యాభైలోపు ర్యాంకు వస్తుందనుకున్నాడు. కానీ, అందులో తానులేకపోవడం, యాభైలోపు వచ్చిన వారంతా ఎంబీబీఎస్ పలుమార్లు తప్పిన వారు, ఇంటర్‌లో తక్కువ మార్కులు, ఎంసెట్‌లో ర్యాంకు రాకున్నా ఎంబీబీఎస్ సీటు కొనుక్కున్నవారుండడంతో అవకతవకలు జరిగినట్లు గుర్తించి విచారానికి లోనయ్యాడు.

 

* పరీక్షకు ఇలా చదివాను.

లోటుపాట్ల కారణంగా మొదట నిర్వహించిన పీజీమెట్- 2014ను రద్దుచేసి తిరిగి రెండోసారి నిర్వహించడంతో కొంత ఎక్కువగానే శ్రమపడాల్సి వచ్చిందని అతను తెలిపారు. ఎంబీబీఎస్ తర్వాత హౌస్‌సర్జన్‌గా విధులు నిర్వహిస్తూనే చదువుకోవడం, సీరియర్ల అనుభవాలు తెలుసుకుని అందుకు తగినట్లుగా ముందుకు వెళ్లాను. కోచింగ్‌కుకూడా వెళ్లాను. అక్కడ నిర్వహించే పరీక్షల్లో పాల్గొనడం, ఇలా... ఎప్పటికప్పుడు చిన్న విషయాన్నికూడా తనకు అనుకూలంగా చేసుకుంటూ ప్రిపేరయ్యాను. ముందుగానే ప్రణాళిక వేసుకుని రోజుకు పదిగంటలకు తగ్గకుండా చదివాను. దీనివల్ల మంచి ప్రయోజనం కలిగింది.

 

* మానసిక ఒత్తిడిని ఎలా తట్టుకున్నానంటే..

పీజీమెట్‌కు ప్రిపేరయ్యేందుకు మొత్తం 19 సబ్జెక్టులుంటాయి. వాటిని చూడగానే ఎవరికైనా అమ్మో అనిపిస్తుంది.కానీ, ముందుగానే మానసికంగా సిద్ధమయ్యాను. ఇవన్నీ నేనే చదవాలి. వీటిల్లోంచే ప్రశ్నలు వస్తాయి.అంటే, ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా, దృఢచిత్తంతో చదవాలి అని నిశ్చయించుకున్నాను. అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధంచేసుకుని ఏకాగ్రాతతో చదివాను. పరీక్ష రాసిన తీరునుబట్టి పదిలోపు ర్యాంకు వస్తుందనుకున్నాను. కానీ, తీరాచూస్తే ఒకటో ర్యాంకు రావడంపట్ల నిబద్ధతతో చదివినందుకు ఫలితం దక్కిందని సంతోషపడ్డాను.

Posted Date: 02-11-2019


  • Tags :