• facebook
  • whatsapp
  • telegram

టెన్త్‌ ఫెయిలైనా.. ఐఎఫ్‌ఎస్‌ సాధించారు!

ఒక్క వైఫల్యం ఎదురైతేనే... కుంగిపోతాం. అలాంటిది పదోతరగతి తప్పింది. తర్వాత ఏ పోటీపరీక్ష రాసినా వైఫల్యమే. అయినా తనని తాను సర్దిచెప్పుకొంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఐఎఫ్‌ఎస్‌ అధికారిణిగా నిలిచిన ఇషితా భాటియా స్ఫూర్తి కథనమిది.

 

హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌కు చెందిన ఇషిత పదోతరగతి ఫెయిల్‌ అయ్యింది. ఇక చదువు అటకెక్కినట్టే అనుకున్నారంతా. కానీ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేసి పట్టుదలగా చదివారామె. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చేరి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ)లో డిగ్రీ చేశారు. దిల్లీలోని ఓ స్కూల్‌లో ఉద్యోగంలో చేరారు. సివిల్స్‌ సాధించాలన్న లక్ష్యంతో...  యూపీఎస్‌సీ పోటీ పరీక్షను మూడుసార్లు రాసినా ఫలితం దక్కలేదు. మరోపక్క ఆర్‌బీఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటివి ప్రయత్నించి అక్కడా వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. నిరాశకు గురైనా, తిరిగి కోలుకొని మరింత పట్టుదలతో ప్రయత్నించేవారు. కృషి చేస్తే ఫలితమెప్పటికైనా దక్కుతుందని నమ్మేవారు ఇషిత. ‘వైఫల్యం మనలో పట్టుదలని పెంచుతుంది. లెక్కలేనన్ని పోటీ పరీక్షలు రాశా. చివరగా 2021లో యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌ పాసయ్యా. ఆ తర్వాత మెయిన్స్‌కు సిద్ధం కావడానికి రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఇది నాకు ఛాలెంజ్‌గా అనిపించింది. సిలబస్‌ పూర్తిచేయడానికి ప్రత్యేక క్యాలెండర్‌ను తయారుచేసుకొన్నా. నా సందేహాలు తీర్చుకోవడానికి టెలిగ్రాం గ్రూప్స్‌ బాగా ఉపయోగపడ్డాయి. అలా మెయిన్స్‌లోనూ పాసయ్యా’నంటారీమె.

 

పాఠంగా..

పదోతరగతిలోనే తన చదువు ఆగిపోతుందని అనుకున్నవారందరికీ తనేంటో నిరూపించానంటారీమె. ‘జీవితం చాలా చిన్నది. ఇందులో మనకు మనమే స్ఫూర్తికావాలి. వైఫల్యాలను పాఠాలుగా తీసుకొంటే మనలో దాగున్న శక్తి బయటకొస్తుంది. నిరాశకు గురైతే జీవితం అక్కడే ఆగిపోతుంది. ఓటమిని ఒప్పుకోకుండా, కింద పడినప్పుడల్లా తిరిగి లేవడానికి కృషి చేశా. అమ్మానాన్న చేయూత ఎంతో ఉంది. నేను ఫెయిలైనప్పుడల్లా నాకన్నా వారే ఎక్కువ బాధపడేవారు. ఫెయిల్‌ అయిన ప్రతిసారీ పట్టుదలగా ప్రయత్నించేదాన్ని. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న నన్ను చూసి అందరూ స్ఫూర్తి పొందుతుంటే సంతోషంగా ఉంద’ని చెబుతున్నారు ఇషిత.

Posted Date: 10-12-2023


 

తాజా కథనాలు

మరిన్ని