• facebook
  • whatsapp
  • telegram

Success : అడవిని ప్రేమించారు.. ఐఎఫ్‌ఎస్‌ సాధించారు!

* తెలుగు వనితల ఘనత 
 

పర్యావరణ ప్రాధాన్యం పెరుగుతోంది...  యువతలో ఈ కెరియర్‌ పట్ల ఇష్టమూ ఎక్కువవుతోంది... అందుకే సదుపాయాలుండే కార్పొరేట్‌ కొలువులకన్నా...  అడవుల సంరక్షణకే ఓటేస్తున్నారు. భూమిని పచ్చగా ఉంచే బాధ్యతని భుజానకెత్తుకుంటున్నారు. అలా ఐఎఫ్‌ఎస్‌ పరీక్షలు రాసి తెలుగు రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచిన స్ఫూర్తిప్రదాతలు వీరు...
 

మూడో ప్రయత్నంలో..!
 



 

రెండుసార్లు వైఫల్యం. అయినా వెనక్కి తగ్గలేదు. ఓపక్క ఉద్యోగం చేస్తూనే... పట్టుదలతో ఐఎఫ్‌ఎస్‌ పరీక్షలో 50వ ర్యాంకు సాధించింది వాసంతి పెద్దిరెడ్డి...
 

మాది సత్యసాయి జిల్లాలోని గోరంట్ల. నాన్న గోవిందరెడ్డి ఉపాధ్యాయుడు. అమ్మ ఉషారాణి. తమ్ముడు హరికిరణ్‌. ఎమ్మెస్‌ చేస్తున్నాడు. నేను నవోదయ విద్యార్థిని. పదోతరగతి వరకూ అక్కడే చదువుకున్నా. ఇక్కడ పాఠాలు చెప్పడంతోపాటు, విద్యార్థుల్ని వాటిల్లో ఇన్‌వాల్వ్‌ అయ్యేట్టు చేస్తారు. పరిశుభ్రత, వనరుల్ని వృథా చేయకుండా వాడుకోవడం వంటివన్నీ అక్కడే నేర్చుకున్నా. అలా నాకు చిన్నతనం నుంచీ సస్టెయినబిలిటీ మీద అవగాహన ఉంది. కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఇంటర్‌ విజయవాడ నారాయణలో చదువుకున్నా. ఆ తరవాత కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుదామనుకున్నా. కానీ కొన్ని కారణాలతో... ఫార్మసీని ఎంచుకున్నా. అక్కడా కెమిస్ట్రీనే కాబట్టి ఇష్టంగానే చదివా. ఆపై హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీయే చేశా. ఆ తరవాత కొవిడ్‌ రావడంతో కాస్త తీరిక సమయం చిక్కింది కదా దాన్ని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యా. 2019లో గ్రామపంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించా. అయితే ముందు నుంచీ సివిల్స్‌ రాయాలనీ, ఐపీఎస్‌కు ఎంపిక కావాలని ఉండేది. దాంతో ఆ ప్రయత్నాలు మొదలుపెట్టా. కోచింగ్‌ తీసుకోకుండానే ప్రయత్నించా. రెండు ప్రయత్నాలు చేసి విఫలమయ్యా. ఫారెస్ట్‌ సర్వీస్‌ ఓసారి ప్రయత్నించు అని స్నేహితులు అనడంతో ఈ దిశగా నా ప్రయత్నాలు మొదలయ్యాయి. మొదటిసారి ఇంటర్వ్యూ వరకూ వెళ్లా. రెండోసారి మెయిన్స్‌కూ అర్హత సాధించలేదు. ఇది మూడో ప్రయత్నం. ఉద్యోగం చేస్తూ... పరీక్షలు రాయాలంటే చాలా ఓపిక ఉండాలి. అంతకుమించి సమయం కూడా వెచ్చించాలి. తరచూ సెలవులు పెట్టడానికి అవ్వదు. కాబట్టి ఒత్తిడి ఉంటుంది. మరోవైపు ఇంట్లో వాళ్లని ఒప్పించి ఈ పరీక్షలు రాయడం కాబట్టి ఆ ఒత్తిడీ ఉంటుంది. పత్రికల్లో వచ్చే స్ఫూర్తికథనాలు నాలో పట్టుదలని పెంచేవి. ముఖ్యంగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి జగదీష్‌ బాకన్‌ ప్లాస్టిక్‌పై చేస్తున్న పోరాటం నాలో స్ఫూర్తి నింపింది. వాళ్లందరూ ఇచ్చిన స్ఫూర్తితోనే 50వ ర్యాంకు సాధించా. ట్రైనింగ్‌ తరవాత అడవుల రక్షణ కోసం నావంతు సేవలు అందిస్తా.


అమ్మమాటలే స్ఫూర్తి...
 


తండ్రి ఆటోడ్రైవర్‌. అంతంత మాత్రపు ఆదాయం. అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే ఐఐటీ సీటు సాధించిన అనూష కొల్లి తాజాగా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో 106వ ర్యాంకు సాధించి శెభాష్‌ అనిపించుకుంది...

మాది మిర్యాలగూడ. నాన్న వెంకన్న ఆటోడ్రైవర్‌. ఆ వృత్తిపై ఆధారపడితే ఆదాయం ఎలా ఉంటుందో తెలిసిందే కదా! అయినా అమ్మ నన్నూ, తమ్ముణ్ణి చదివించే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మా అమ్మ స్కూల్లో టీచర్‌గా నెలకు రూ.500 జీతానికి పనిచేస్తూ మా ఫీజులు కట్టేది. ‘ఇప్పుడు మనకున్న కష్టాల్ని పట్టించుకోకండి. బాగా చదివితేనే మంచి ఉద్యోగాలు చేస్తారు’ అనేది. ఆ మాటలు నాలో నాటుకుపోయాయి. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో, ఓ ప్రైవేట్‌ కాలేజీ నాకు ఫ్రీసీటు, హాస్టల్‌, ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహించింది. అలా ముంబయి ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో సీటు సాధించా. 2012లో ఇంజినీరింగ్‌ అయిన వెంటనే దిల్లీలో అయిదంకెల వేతనంతో కొలువు వచ్చింది. ఏడాది పని చేశాక హైదరాబాద్‌ వచ్చేశా. ఆ తరవాత శ్రీకాకుళానికి చెందిన రామకృష్ణతో పెళ్లయ్యింది. మాకు బాబు, పాప. పిల్లలు పుట్టాక ఉద్యోగం చేయడం కుదరక మానేశా. కానీ, చిన్నతనం నుంచి సివిల్స్‌ సాధించాలనే కల ఉండేది. ఈ విషయం మావారితో చెబితే రాయమని ప్రోత్సహించారు. మెటీరియల్‌ తెచ్చుకొని, ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నా. మూడు సార్లు మెయిన్స్‌ వరకు వెళ్లి వెనుతిరిగా. సివిల్స్‌తోపాటు ప్రతిసారీ ఐఎఫ్‌ఎస్‌కూ దరఖాస్తు చేసుకున్నా. ఈ సారి ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణత సాధించాక నవంబరులో మెయిన్స్‌ బాగా రాశా. ఇంటర్వ్యూలోనూ ఎంపిక కావడంతో 106వ ర్యాంకు సాధించి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికయ్యా. ముంబయి ఐఐటీలో చదువుతున్నప్పుడు మైనర్‌ డిగ్రీగా ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ చదివా. అప్పుడే దేశంలో అడవుల నరికివేత, భూతాపంవల్ల మానవాళికి కలిగే నష్టాలపై లోతుగా తెలుసుకున్నా. ఇంటర్వ్యూలోనూ ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం గురించి తడబడకుండా మాట్లాడా. అక్కడ మనుషులు, పులులకు మధ్య ఎందుకు సంఘర్షణ ఏర్పడుతుందో వివరించా. ఐఐటీలో చదివిన అనుభవంతో... అత్యాధునిక సాంకేతికత వాడి పచ్చని అడవులను కాపాడుకోవచ్చని బలంగా నమ్ముతున్నా.

 

జి.పాండురంగశర్మ, వరంగల్‌

 

Posted Date: 10-05-2024


 

ఇత‌రాలు

మరిన్ని