• facebook
  • whatsapp
  • telegram

ఏదీ వదలొద్దు... రివిజన్‌ మరవొద్దు!

* సీఎంఏ ఇంటర్‌ ఆలిండియా టాపర్‌ ఇరిగెల మహేంద్రరెడ్డి సూచనలు

కామర్స్‌ కోర్సుల్లో ప్రాచుర్యం పొందిన కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ (సీఎంఏ)లో ఇంటర్‌ దశ ఎంతో కీలకం. ఇది పూర్తయితే ప్రధాన అవరోధం దాటినట్టే. ఇటీవల విడుదలైన సీఎంఏ ఇంటర్‌ ఫలితాల్లో అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు కర్నూలు జిల్లా బత్తులూరుకు చెందిన ఇరిగెల మహేంద్రరెడ్డి. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించటం విశేషం! తన ప్రిపరేషన్‌ ఎలా సాగిందో, టాప్‌ ర్యాంకు రావటానికి ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో ‘చదువు’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

కష్టపడి చదవకపోతే ఫలితాలు రావనేది అందరికీ తెలిసిందే. అయితే ఆ కష్టం ప్రణాళికాబద్ధంగా, లక్ష్య దిశలో సాగాలి. అత్యధిక మార్కులతో జాతీయస్థాయిలో పోటీపడి టాప్‌ ర్యాంకు తెచ్చుకోవాలంటే...సబ్జెక్టు పరిజ్ఞానం, పరీక్షా విధానంపై పట్టు అవసరం. సీఎంఏను మంచి మార్కులతో నెగ్గాలంటే... ప్రతి విద్యార్థీ తనకు సరిపోయే ప్రణాళిక తయారు చేసుకోవాలి. దానికంటే ముందు సిలబస్‌పై అవగాహన తెచ్చుకోవాలి.

మాది రైతు కుటుంబం. పదో తరగతి వరకూ తెలుగు మీడియంలో చదివాను. తర్వాత తల్లిదండ్రుల, టీచర్ల ప్రోత్సాహంతో ఇంటర్‌లో ఎంఈసీ+ సీఏ కోర్సు కోసం మాస్టర్‌మైండ్స్‌ సంస్థలో చేరాను. మొదట్లో సీఏ కోర్సు అనగానే భయపడ్డాను. కానీ పట్టుదలతో చదివాను. ఇంటర్లో 937 మార్కులు వచ్చాయి. ఇంటర్‌తోపాటే సీఏ-సీపీటీ పూర్తిచేశా. సీఏ ఐపీసీసీని మొదటి ప్రయత్నంలో పూర్తి చేయటంతో పాటు 509 మార్కులతో ఆలిండియా 40వ ర్యాంకు సాధించాను. సీఏ ఫైనల్‌ను 485 మార్కులతో పూర్తిచేశా. తర్వాత సీఎంఏ చదవాలనిపించింది. ఎందుకంటే... సీఏలో ఉండే చాలా సబ్జెక్టులు సీఎంఏలోనూ ఉంటాయి. రిజిస్ట్రేషన్‌ చేయించుకుని సీఎంఏ ఇంటర్‌ సొంతంగా చదవటం ప్రారంభించా. ఇన్‌స్టిట్యూట్‌ వారి మెటీరియల్‌నూ, రివిజన్‌ టెస్ట్‌ పేపర్లనూ చదివి, సీఏ ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానం జోడించి సిద్ధమయ్యాను. సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు ప్రశ్నపత్రం తయారుచేసేటపుడు నిర్దిష్టమైన వెయిటేజిని పాటిస్తారు. అందుకే ఆ ప్రకారం ప్రిపేరయ్యా. ప్రతి అంశానికీ ప్రాముఖ్యం ఇచ్చి చదివి, పునశ్చరణ (రివిజన్‌) చేసుకున్నాను. ఈ రకంగా చదివి, సీఎంఏ ఇంటర్‌ను తొలి ప్రయత్నంలో పూర్తిచేయటంతో పాటు 631 మార్కులతో అఖిలభారత ప్రథమ ర్యాంకును సాధించగలిగాను.

సులువుగా 60 శాతం మార్కులు...
గడిచిన రెండు పరీక్షల ప్రశ్నపత్రాలను కూలంకషంగా విశ్లేషించుకోవాలి. ప్రతి పరీక్షలో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నదీ గమనించాలి. ఆబ్జెక్టివ్‌, సబ్జెక్టివ్‌, ప్రాక్టికల్‌, థియరీ, కేస్‌ లాస్‌... వీటిపై పట్టు సాధించాలి.
* ఇంతకుముందు పరీక్షల ప్రశ్నపత్రాలను (స్కానర్‌) విశ్లేషించుకోవటానికి తగిన సమయం కేటాయించుకోవాలి.
* రివిజన్‌ టెస్ట్‌ పేపర్స్‌ను 2 సార్లు, మోడల్‌ టెస్ట్‌ పేపర్లను 3 సార్లు, వర్క్‌బుక్‌నూ పునశ్చరణ చేసుకోవాలి. కచ్చితంగా ఇలా చేస్తే కనీసం 60 శాతం మార్కులు పొందవచ్చు. వీటిని http://www.icmai.in/icmai/index.php నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* పరీక్షకు ముందు తప్పనిసరిగా సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ వారి మెటీరియల్‌ ప్రశ్నలు, కంపోడియం, గత మూడు పరీక్షల ఆర్‌టీపీస్‌, మోడల్‌ టెస్ట్‌పేపర్స్‌ను కనీసం ఒకసారైనా చదివితే మంచిది.
* వర్క్‌బుక్‌లోని కాన్సెప్టులను తప్పకుండా చదవాలి.
* ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌లో పరీక్ష రాసే విధానం బట్టి మార్కులు వస్తాయి. తుది జవాబుకు మాత్రమే కాకుండా ప్రశ్నలోని అన్ని దశలకూ మార్కులుంటాయి.
* లాస్‌, ఎథిక్స్‌ అండ్‌ గవర్నెన్స్‌లో నిబంధనలూ, ఉదాహరణలూ, లాండ్‌ మార్క్‌ కేసులను మిళితం చేసి రాయాలి. ఇలా చేస్తే మిగతావారితో పోలిస్తే మీ పేపర్‌ ప్రత్యేకంగా ఉండి, మంచి మార్కులు వస్తాయి.
* కాస్ట్‌ అకౌంటింగ్‌లో ముఖ్యమైన సూత్రాలూ, సైడ్‌ హెడింగ్స్‌ను ముందుగానే రాసివుంచుకుంటే పరీక్ష ముందురోజు సబ్జెక్టు మొత్తాన్నీ సులువుగా రివిజన్‌ చేసుకోవటానికి వీలుంటుంది.
* స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రశ్నలు నేరుగా కాకుండా తిప్పి అడుగుతారు. సన్నద్ధత సమయంలోనే వీటిపై ఎక్కువ పరిచయం చేసుకుంటే పరీక్షలో తడబడకుండా రాయగలుగుతాం.
* ఇన్‌డైరెక్ట్‌ టాక్సేషన్‌లో జి.ఎస్‌.టి.పై ఎక్కువ దృష్టిపెడితే ఎక్కువ మార్కులు వస్తాయి.

Posted Date: 01-11-2019


 

ఇత‌రాలు

మరిన్ని