• facebook
  • whatsapp
  • telegram

ఏ దేశమేగాలి..ఏం చదవాలి?

విదేశాలకు వెళ్లి చదువుకోవడం ఇప్పుడు కల కాదు... కామన్‌ అయిపోతోంది. అయితే ఏ దేశానికి వెళ్లాలి అనేది మొదట ఎదురయ్యే ప్రశ్న. అందరూ అమెరికా అంటున్నారు.. యూకే ఓకే.. కాకుంటే కెనడా.. ఆలోచిస్తే ఆస్ట్రేలియా.. పోనీ జర్మనీ.. కొత్తగా న్యూజిలాండ్‌.. సరాసరి సింగపూర్‌.. ఇలా ఎక్కడికైనా మనవాళ్లు వెళ్లిపోతున్నారు. ఈ సంఖ్య ఏటా పెరిగిపోతోంది. ఇప్పుడు వెళ్లాలనుకునే వాళ్లు ముందుగా ఆయా దేశాల ప్రత్యేకతలపై స్థూల అవగాహన తెచ్చుకోవాలి. అడ్మిషన్ల సమయానికి ఒక సంవత్సరం లేదా తొమ్మిది నెలల ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి.

ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో చదువుకునే విద్యార్థుల్లో చైనా ముందుండగా, తర్వాతి స్థానంలో భారత్‌ దూసుకుపోతోంది. వృద్ధి విషయంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. మనదేశం ఏటా 10 శాతం పెరుగుదల కనబరుస్తుండగా, చైనాలో ఇది 8 శాతంగా నమోదవుతోంది. ఏటా 3.5 లక్షలకుపైగా భారతీయ విద్యార్థులు చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో దాదాపు 85 శాతం మంది యూఎస్‌, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లోని విద్యా సంస్థల్లో చేరుతున్నారు. సగం మంది అమెరికాలో కాలుమోపుతున్నారు. వీరిలో 80 శాతం మంది స్టెమ్‌ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. విదేశీ విద్య అభ్యసించే భారతీయుల్లో 10 శాతం అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో, 75 శాతం మాస్టర్స్‌ డిగ్రీలోనూ చేరుతున్నారు.

ఓపీటీ ఒక వరం - అమెరికా8
ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 కంపెనీల్లో కనీసం సగం సంస్థలకు ప్రధాన కార్యాలయాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రపంచ గమనాన్ని మార్చేసిన స్టార్టప్‌లకు పుట్టినిల్లు యూఎస్‌. టెక్నాలజీ, సైంటిఫిక్‌ రిసెర్చ్‌, మ్యూజిక్‌, మూవీస్‌, కాలేజీల ర్యాంకులు...ఏవైనాసరే టాప్‌ స్థానంలో అమెరికా ఉంటుంది. అందువల్లే అక్కడి పేరొందిన సంస్థల్లో ట్యూషన్‌ ఫీజు ఏడాదికి అక్షరాలా రూ. అరకోటి. అయితే బడ్జెట్‌ ప్రకారం ఎంచుకోవడానికి ఆ దేశంలో నాలుగు వేల విద్యాసంస్థలు ఉన్నాయి. ఏఆర్‌డబ్ల్యు, క్యూఎస్‌, టైమ్స్‌ సంస్థలు ప్రకటిస్తోన్న ప్రపంచ టాప్‌- 100 విశ్వవిద్యాలయాల జాబితాల్లో కనీసం 40 నుంచి 50 వరకు ఈ ఒక్క దేశం నుంచే నమోదవుతున్నాయి. అందువల్ల మెరిట్‌ విద్యార్థుల మొదటి ఎంపిక యూఎస్‌గానే ఉంటోంది. ప్రపంచ ప్రసిద్ధ స్టాన్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నవారిలో 5 శాతం మందికే అవకాశం లభిస్తుంది.

* స్టెమ్‌ కోర్సులకు మూడేళ్లు, మిగిలిన కోర్సులకు ఏడాదిపాటు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ఉంటుంది.
* మూడు సీజన్లలో ప్రవేశాలు. ప్రధానమైన ఫాల్‌ సీజన్‌ సెప్టెంబరులో మొదలవుతుంది.

నాణ్యమైన జీవనం - కెనడా8
యూఎస్‌ తర్వాత ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం కెనడా. ట్యూషన్‌, వసతి కోసం యూఎస్‌లో వెచ్చించే మొత్తంతో చూసుకుంటే దాదాపు 50-60 శాతంతో కోర్సు పూర్తవుతుంది. ప్రపంచంలో నాణ్యమైన జీవన ప్రమాణాలున్న దేశాల్లో కెనడానే ముందుంటోంది. వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పటికీ విదేశీ విద్యార్థులు చదువుకోవడానికి అనుకూల పరిస్థితులు ఇక్కడ ఎక్కువ. ఈ దేశ జనాభాలో దాదాపు 4 శాతం మంది భారతీయులే ఉన్నారు. అలాగే ఇక్కడ ఎక్కువమంది మాట్లాడే భాషల్లో పంజాబీది నాలుగో స్థానం. ఇంజినీరింగ్‌, ఐటీ, బయోసైన్సెస్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా, కొంచెం సులువుగా లభిస్తాయి. ఇక్కడ రెండేళ్ల పని అనుభవంతో శాశ్వత నివాస యోగ్యతకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత పౌరసత్వానికి ప్రయత్నించుకోవచ్చు. వీసా ప్రాసెసింగ్‌ వ్యవధిని కెనడా 60 నుంచి 45 రోజులకు తగ్గించింది. ఈ దేశంలో ఉద్యోగావకాశాలూ, ఎంచుకోవడానికి విద్యా సంస్థలూ ఎక్కువే. భిన్న సంస్కృతులు దర్శనమిస్తాయి. ఇక్కడి విదేశీ విద్యార్థుల్లో దాదాపు 28 శాతం మంది చైనీయులు. భారతీయుల వాటా 25 శాతం. ప్రవేశాలు ఎక్కువగా సెప్టెంబరు, జనవరిలో ఉంటాయి.

* ఈ దేశ జనాభాలో దాదాపు 4 శాతం మంది భారతీయులే ఉన్నారు.
* ప్రవేశాలు ఎక్కువగా సెప్టెంబరు, జనవరిలో ఉంటాయి.

తక్కువ ఖర్చుతో వసతి - జర్మనీ
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. విదేశీ విద్యార్థులకు ఉచితంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అందించడం ఈ దేశం ప్రత్యేకత. తక్కువ ఖర్చుతో వసతి పొందవచ్చు. స్టెమ్‌, ఫైనాన్స్‌ కోర్సులకు ప్రసిద్ధి. ఏడాదిలో 120 రోజులు పనిచేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. పీజీ స్థాయిలో వెయ్యికిపైగా, యూజీలో 150 కోర్సులను ఆంగ్లంలో చదువుకోవచ్చు. అయితే ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా ఉండడానికి జర్మన్‌ భాష నేర్చుకోవడం మంచిది. ఆ భాషతో పరిచయం ఉంటేనే ప్రవేశం లభిస్తుంది. ఇందుకోసం పరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌, ఐటీ, మెడిసిన్‌, నర్సింగ్‌, సైంటిఫిక్‌ రిసెర్చ్‌లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఉద్యోగంలో మూడేళ్లు కొనసాగిన తర్వాత శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సమ్మర్‌ కోర్సులు ఏప్రిల్‌లో, వింటర్‌ అడ్మిషన్లు అక్టోబరులో జరుగుతాయి.

* స్టెమ్‌, ఫైనాన్స్‌ కోర్సులకు ప్రఖ్యాతి.
* విదేశీ విద్యార్థులకు ఉచితంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అందిస్తారు.

ఏడాదిలో పీజీ - యూకే
సుప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాలు, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌... ఈ దేశానికి చెందిన ప్రపంచస్థాయి సంస్థలు. ఇక్కడ సాధారణ చదువులతోపాటు నాణ్యమైన వైద్యవిద్య విదేశీ విద్యార్థులకు అందుతుంది. ఇక్కడ ఏడాది వ్యవధితో పూర్తయ్యే పీజీ కోర్సులున్నాయి. వీటిని పరిశ్రమలు గుర్తించాయి. అయితే వీటిని పూర్తిచేసుకున్నవారికి భారత్‌లో ఉపాధి పొందడానికి ప్రతికూలతలు ఉన్నాయి. విదేశీ విద్యార్థులకు కామన్‌వెల్త్‌, గ్రేట్‌, రోడ్స్‌ స్కాలర్‌షిప్పులు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబరు/ అక్టోబరులో విద్యాసంవత్సరం మొదలవుతుంది. వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు.

* సెప్టెంబరు/ అక్టోబరులో విద్యాసంవత్సరం మొదలవుతుంది.
* వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు.

అక్కడే ఉద్యోగం మంచిది - ఆస్ట్రేలియా
ప్రపంచంలో నివాసానికి మెరుగైన మొదటి పది దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఇక్కడి వాతావరణం చాలా సహజంగా ఉంటుంది. ఒక చదరపు కిలోమీటరు పరిధిలో కేవలం ముగ్గురే ఉంటారు (భారత్‌లో ఇదే విస్తీర్ణంలో 455 మంది నివసిస్తున్నారు). క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. జీవన ప్రమాణాలు బాగుంటాయి. ఫీజులు దాదాపు యూఎస్‌లో మాదిరిగానే ఉంటాయి. ఈ దేశంలో చదువుకున్నవారు అక్కడే ఉద్యోగం పొందితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. భారత్‌లో ఈ డిగ్రీలను ప్రత్యేకంగా పరిగణించరు. ఇక్కడి జనాభాలో 2 శాతం భారతీయులే. ఇమిగ్రేషన్‌ను ఈ దేశం ప్రోత్సహిస్తుంది. పీఆర్‌ (పర్మినెంట్‌ రెసిడెన్సీ) మాదిరి అయిదేళ్ల స్కిమ్మ్‌డ్‌ మైగ్రేషన్‌ ప్రోగ్రాం ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డాక్టర్లు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు, వెబ్‌ డెవలపర్లు, సేల్స్‌ ప్రొఫెషన్లకు అనుకూలం. నాలుగేళ్ల పీఆర్‌ తర్వాత పౌరసత్వానికి ప్రయత్నించవచ్చు. ఎక్కువ కోర్సులు ఫిబ్రవరి, మార్చిల్లో మొదలవుతాయి.

* ఇమిగ్రేషన్‌ను ఈ దేశం ప్రోత్సహిస్తుంది.
* నాలుగేళ్ల పీఆర్‌ తర్వాత పౌరసత్వానికి అవకాశం.

వీసా సరళం - చైనా


చైనాలో ప్రసిద్ధ విద్యాసంస్థలు హాంకాంగ్‌లో నెలకొన్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి. బహుళజాతి సంస్థలకు చెందిన దాదాపు మూడోవంతు ప్రాంతీయ కేంద్ర కార్యాలయాలు చైనాలో ఉన్నాయి. మాండరిన్‌ వచ్చినవారు దూసుకుపోవచ్చు. హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులకు ప్రసిద్ధి. హాంకాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్టెమ్‌, బిజినెస్‌, ఫైనాన్స్‌ కోర్సుల్లో పేరొందింది. వీసా ప్రక్రియ సరళంగా ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఏడాది ఉండవచ్చు. హాంకాంగ్‌లో ఏడేళ్లు ఉన్నవారు శాశ్వత నివాస యోగ్యత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

* మాండరిన్‌ భాష వస్తే ప్రయోజనకరం.
* హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులకు ప్రసిద్ధి.

అందుబాటులో ఫీజులు - న్యూజిలాండ్‌
ఇటీవలి కాలంలో న్యూజిలాండ్‌ వెళ్లి చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. హార్టికల్చర్‌, డెయిరీ టెక్నాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌, జియో థర్మల్‌ ఎనర్జీ అండ్‌ బయోటెక్నాలజీ కోర్సులు ఈ దేశంలో ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఉన్నత విద్యా ప్రమాణాలు
పాటిస్తున్నారు. ప్రశాంతంగా చదువుకోవడానికి అనువైన పరిస్థితులు, శిక్షణలో అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌ వినియోగం, అందుబాటులో ఫీజు ఈ దేశం ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. కోర్సు అనంతరం మూడేళ్లు పోస్టు స్టడీ ఓపెన్‌ వర్కింగ్‌ వీసా సౌలభ్యం ఈ దేశంలో చదువుతోన్న విదేశీ విద్యార్థులకు కల్పించారు. జులై, ఫిబ్రవరిలో ప్రవేశాలు ఎక్కువగా ఉంటాయి.

* కోర్సు అనంతరం మూడేళ్లు పోస్టు స్టడీ ఓపెన్‌ వర్కింగ్‌ వీసా సౌలభ్యం
* జులై, ఫిబ్రవరిల్లో ప్రవేశాలు

ఆరు నెలల్లో శాశ్వత నివాసం - సింగపూర్‌
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో సింగపూర్‌ రెండోది. దీనిద్వారా 188 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్‌/ వీసా ఆన్‌ అరైవల్‌ అవకాశం లభిస్తోంది. ఫైనాన్స్‌, టెక్నాలజీ హబ్‌లు ఎక్కువ. బహుళజాతి కంపెనీల్లో దాదాపు సగం సంస్థలకు ప్రాంతీయ కేంద్ర కార్యాలయాలు ఇక్కడే నెలకొల్పారు. నాన్యంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌, సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్సిటీలు పేరున్న సంస్థలు. భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశస్థులు ఇక్కడ చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ విద్యలో వినూత్న కోర్సులకు సింగపూర్‌ ప్రసిద్ధి పొందింది. ప్రవేశాలు ఆగస్టు, జనవరిల్లో ఉంటాయి. ఉద్యోగం పొందినవారు 6 నెలల్లో శాశ్వత నివాసానికి అర్హత సాధిస్తారు. పీఆర్‌ వచ్చిన రెండేళ్ల తర్వాత పౌరసత్వం నిమిత్తం ప్రయత్నించవచ్చు.

* మేనేజ్‌మెంట్‌ విద్యలో వినూత్న కోర్సులకు సింగపూర్‌ ప్రసిద్ధి.
* ప్రవేశాలు ఆగస్టు, జనవరిల్లో.

విదేశీ విద్య కోసం ఐర్లాండ్‌, యూఏఈ, జపాన్‌, దక్షిణ కొరియా, ఇటలీ, టర్కీ, ఫ్రాన్స్‌ దేశాలను సైతం మనవాళ్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు.

Posted Date : 20-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం