• facebook
  • whatsapp
  • telegram

కోరుకుంటే...కోర్సుకో దేశం!

పరిశోధనల కోసం అనువైన పరిస్థితులు, ఉద్యోగాలకు ఉన్న అవకాశాలు, ఎక్కువ మంది ఏయే దేశాలకు ఎందుకు వెళుతున్నారు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాలు కొన్ని కోర్సులకు ప్రసిద్ధి చెందినట్లు గమనించవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ సమాచారం ఆధారంగా ఏ కోర్సుకి ఏ దేశానికి వెళ్లాలి అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో చదువుకునే మన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువమంది పీజీ కోర్సుల కోసం పరాయి దేశాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన బోధనను అందించే యూనివర్సిటీల సమాచారం కోసం అభ్యర్థులు అన్వేషిస్తున్నారు. అగ్రగామి అమెరికా మొదలు చిన్న దేశమైన సింగపూర్‌ వరకూ ఎన్నో రకాల కోర్సులను అందిస్తున్నాయి. ఒక్కోదేశం ఒక్కో తరహా కోర్సులకు ప్రసిద్ధి చెందాయి. ఎక్కడ ఏ కోర్సులు బాగుంటాయో తెలుసుకొని అడుగేస్తే గరిష్ఠ ప్రయోజనం ఉంటుంది.

స్టెమ్‌, మేనేజ్‌మెంట్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ : అమెరికా

సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌... వీటిని స్టెమ్‌ కోర్సులంటారు. యూఎస్‌ వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 80 శాతం ఈ కోర్సుల్లోనే చేరుతున్నారు. ఇంజినీరింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌...ఒక్కో కోర్సులోనూ ఏటా రెండేసి లక్షల మంది చొప్పున విదేశీ విద్యార్థులను అమెరికా ఆకర్షిస్తోంది. ఫీజు అధిక మొత్తంలో ఉన్నప్పటికీ విదేశీయులు అమెరికాలో చదవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలతోపాటు మంచి కెరియర్‌ సొంతం కావడమే దీనికి కారణం. అమెరికాలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదువుతున్న మొత్తం విద్యార్థుల్లో 20 శాతం విదేశీయులే. ఎఫ్‌టీ సహా, పలు సర్వేల ప్రకారం టాప్‌ బిజినెస్‌ స్కూళ్లలో సింహభాగం అమెరికాలోనే ఉన్నాయి. అలాగే ఇంజినీరింగ్‌లోనూ సత్తా చాటుతోంది. సోషల్‌ సైన్సెస్‌ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులూ యూఎస్‌కే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కోర్సుల్లో పరిశోధనకు అవకాశాలు లభించడం, సులువుగా ఉద్యోగాలు దొరకడం కారణాలు.
ఇంటర్నెట్‌, డిజిటల్‌ ప్రభావంతో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలను మించి ఆన్‌లైన్‌ మీడియా పుంజుకుంటోంది. దీంతో న్యూ మీడియా కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇందులోనూ అగ్రరాజ్యం అమెరికాదే పైచేయి.ప్రపంచంలో మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులకు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ ప్రసిద్ధి. దీని తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ-బెర్క్‌లీ, టెక్సాస్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్‌ పేరున్న సంస్థలు. అధిక సంఖ్యలో పులిట్జర్‌ అవార్డులు అందుకున్నది అమెరికావాళ్లే.

ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ : అమెరికా, యూకే

ఆంగ్లం, సాహిత్యం, చరిత్ర, తత్త్వశాస్త్రం...తదితర కోర్సులకు అమెరికా, యూకేలు పేరుపొందాయి. ప్రపంచ అత్యుత్తమ సంస్థల జాబితాలో స్థానం పొందిన విశ్వవిద్యాలయాల్లో అధిక శాతం ఈ రెండు దేశాల్లోనివే. లైఫ్‌ సైన్సెస్‌లోనూ యూఎస్‌, యూకేలే అగ్రగాములు. పురాతన ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విఖ్యాత హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌ అన్ని కోర్సుల్లోనూ తిరుగులేని సంస్థలు. ఇవే కాకుండా వివిధ విశ్వవిద్యాలయాలు మేటి విద్యను అందిస్తున్నాయి.

సివిల్‌, ఆర్కిటెక్చర్‌ : దుబాయ్‌
దుబాయ్‌ పేరెత్తగానే గుర్తొచ్చేది ఆకాశహర్మ్యాలు, ఆకర్షణీయ డిజైన్‌లే. ఆర్కిటెక్చర్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులు తొలి ప్రాధాన్యం దుబాయ్‌కి ఇవ్వడం సముచితం. ఇక్కడి బుర్జ్‌ ఖలీఫా, మరీనా 101, ది పామ్‌..లాంటి నిర్మాణాలు ప్రపంచంలోనే విశిష్టమైనవిగా పేరొందాయి. విశ్వవిఖ్యాత నిర్మాణ సంస్థల కార్యాలయాలన్నీ దుబాయ్‌లో నెలకొన్నాయి. అయిదారేళ్ల పని అనుభవం ఉన్న సీనియర్‌ ఆర్కిటెక్చర్లు ఏటా సగటున కోటి రూపాయల వేతనం పొందుతున్నారు. ప్రతి కట్టడానికీ ఆర్కిటెక్చర్లతోపాటు సివిల్‌ ఇంజినీర్ల సేవలూ కీలకం. అందువల్లే సివిల్‌కు దుబాయ్‌లో గిరాకీ ఉంది. ఇక్కడి సివిల్‌ ఇంజినీర్లు కెరియర్‌ ఆరంభంలో ఏడాదికి రూ.20 లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రపంచంలో ఆర్కిటెక్చర్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యలో దుబాయ్‌ తర్వాతే ఏ దేశమైనా అనే స్థాయికి చేరుకుంది. భారత్‌కు చెందిన అమిటీ, మణిపాల్‌ యూనివర్సిటీలు ఇక్కడ సివిల్‌/ ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఈ రెండూ దుబాయ్‌లో మేటి కళాశాలలుగా పేరొందాయి. వీటితోపాటు అమెరికన్‌ యూనివర్సిటీ, హెరోట్‌ వాట్‌ యూనివర్సిటీ సివిల్‌కు ప్రాధాన్యమున్న విద్యాసంస్థలు.

ఆటోమొబైల్‌, మెకానికల్‌ : జర్మనీ
ఆడి, బీఎండబ్ల్యు, బెంజ్‌, పోర్షే, ఫోక్స్‌ వ్యాగన్‌...ఇలా ప్రముఖ కార్ల తయారీ కంపెనీలకు పుట్టినిల్లు జర్మనీ. ఆటోమొబైల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యలో ఈ దేశం తర్వాతే ఏవైనా. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు బ్రాంచీల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులు జర్మనీ బాట పడుతున్నారు. మేటి చదువులతోపాటు ఉన్నత అవకాశాలూ సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడ మోటారు వాహనాలతోపాటు భారీ యంత్రాలు సైతం ఎక్కువగా తయారవుతున్నాయి. జర్మనీలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. నాణ్యమైన జీవనప్రమాణాలు, తక్కువ ఫీజు వీరిని ఆకర్షిస్తున్నాయి. బయో టెక్నాలజీ, స్టెమ్‌ కోర్సుల్లోనూ ఎక్కువమంది చేరుతున్నారు. ఇక్కడ పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తారు. వివిధ రంగాల్లో వందకుపైగా నోబెల్‌ విజేతలను ఈ దేశం అందించింది. ఈ దేశంలో మూనిచ్‌ టెక్నికల్‌ విశ్వవిద్యాలయం ప్రసిద్ధ సంస్థ. ఏటా పదివేల మందికి పైగా భారతీయ విద్యార్థులు జర్మనీ వెళ్తున్నారు.

విదేశీ విద్యార్థుల ప్రాధాన్యం ఇలా..

ఏటా పది లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు యూఎస్‌లో చదువులకు వెళ్తున్నారు. ఈ విద్యార్థుల్లో చైనాది ప్రథమ స్థానం కాగా భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఎక్కువమంది ఇంజినీరింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కోర్సుల్లో చేరుతున్నారు.

బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులకు కెనడా ప్రసిద్ధి. చైనా, భారత్‌ల నుంచి ఎక్కువమంది చేరుతున్నారు.ఫ్యాషన్‌ డిజైనింగ్‌, యానిమేషన్‌, గేమింగ్‌, జర్నలిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఈ దేశంలో ప్రాధాన్యమున్న కోర్సులు..

దాదాపు 3 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో చైనా, భారత్‌లు ఉన్నాయి. ఎక్కువమంది బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, హాస్పిటాలిటీ, పర్సనల్‌ సర్వీసెస్‌, కామర్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సులకు ఆస్ట్రేలియాకు ప్రాధాన్యమిస్తున్నారు.

న్యూజిలాండ్‌ చదువులకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, సోషల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ఎక్కువమంది చేరుతున్నారు.

వైద్య విద్య నిమిత్తం ఎక్కువ మంది భారతీయులు చైనా వెళ్తున్నారు. అన్ని కోర్సుల్లో కలుపుకుని ఏటా పదిహేను వేల మందికి పైగా భారతీయులు చైనాలో చేరుతున్నారు. హ్యుమానిటీస్‌, బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, సోషల్‌ సైన్సెస్‌ కోర్సులకు ఈ దేశం ప్రసిద్ధి. ఏటా 4 లక్షల మంది విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తోంది.

అయిదు లక్షలమందికి పైగా విద్యార్థులు యూకే చదువులకు వెళ్తున్నారు. వీరిలో ప్రథమ స్థానం చైనా. తర్వాత అమెరికా. భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, సోషల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఫైన్‌ అండ్‌ అప్లైడ్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరుతున్నారు.

సింగపూర్‌లో లక్ష మందికి పైగా విదేశీ విద్యార్థులు చేరుతున్నారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, లా కోర్సులకు ఈ దేశం ప్రసిద్ధి. ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌, హాస్పిటాలిటీ, మాస్‌ కమ్యూనికేషన్‌, లాజిస్టిక్స్‌, ఏవియేషన్‌లు సైతం ఈ దేశంలో పేరున్న కోర్సులు.

ఇటీవలి కాలంలో కొంతమంది ఐర్లాండ్‌ వెళుతున్నారు. ఇక్కడి ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌, డేటా సైన్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌, ఫిజిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో మన వాళ్లతోపాటు అమెరికా, చైనా, ఫ్రాన్స్‌ల విద్యార్థులూ చేరుతున్నారు.

మరికొన్ని...

* లా, ఆర్ట్‌, డిజైన్‌ కోర్సులకు యూకే ప్రసిద్ధి చెందింది.
* మెడిసిన్‌, డెంటిస్ట్రీ కోర్సుల కోసం రష్యాను పరిశీలించవచ్చు. ఈ దేశం హ్యుమానిటీస్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌ కోర్సులకు పేరుపొందింది.
* పొలిటికల్‌ సైన్స్‌ కోర్సుల్లో ఫ్రాన్స్‌ అగ్రగామి.
* పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ అండ్‌ హెల్త్‌ కోర్సులకు నెదర్లాండ్స్‌ ప్రసిద్ధి.
* అప్లయిడ్‌ సైన్సెస్‌, ట్రెడిషనల్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ కోర్సుల కోసం జపాన్‌ను ఎంచుకోవచ్చు.
* హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ కోర్సులకు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్‌, మలేసియా చెప్పుకోదగ్గవి.

Posted Date : 20-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం