• facebook
  • whatsapp
  • telegram

స్కోరు సరిపోతే.. భాష బాగుంటే..!

* విదేశీ విద్యాసంస్థల్లో సీటు ఖాయం

ఇతర దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం ఇబ్బంది లేకుండా సాగాలంటే అక్కడి భాష తెలియాలి లేదా ఆంగ్లంపై పట్టు ఉండాలి. అది నిరూపించుకోవడానికి కొన్ని పరీక్షల్లో స్కోరు సాధించాలి. మరికొన్ని టెస్ట్‌ల్లో ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌లాంటి వాటిల్లోనూ సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. విదేశాలకు వెళ్లాలనుకునే అభ్యర్థులు ఆ పరీక్షలు, అందులోని విభాగాల వివరాలపై తగిన అవగాహన కలిగి ఉండాలి.

మేటి కోర్సుల్లో చేరి అత్యున్నత అవకాశాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న యువతరం విదేశీ విద్యాభ్యాసానికి అమిత ప్రాధాన్యం ఇస్తోంది. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లాలనుకునేవారు రెండు రకాల పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి జీఆర్‌ఈ లేదా జీమ్యాట్‌ స్కోర్‌ పరిశీలిస్తారు. ఆంగ్లంలో సమర్థతను గమనించడానికి టోఫెల్‌ /ఐఈఎల్‌టీఎస్‌ / పీటీఈలో పొందిన మార్కులు చూస్తారు. ఆంగ్ల భాషలో అభ్యర్థి పఠన, భాషణ, లేఖన, శ్రవణ (రీడింగ్‌, స్పీకింగ్‌, రైటింగ్‌, లిసనింగ్‌ ) నైపుణ్యాలను టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, పీటీఈలు పరిశీలిస్తాయి. యూఎస్‌, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ... ఏ దేశంలో చదవాలనుకున్నప్పటికీ ఏదో ఒక పరీక్షలో స్కోరు తప్పనిసరి. ఎంఎస్‌, ఇతర పీజీ కోర్సులకు జీఆర్‌ఈ స్కోరును ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు పరిగణిస్తున్నాయి. ఇటీవల జీఆర్‌ఈ స్కోర్‌తో మేనేజ్‌మెంట్‌ విద్యలోనూ ప్రవేశాలు కల్పిస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జీమ్యాట్‌ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బిజినెస్‌ స్కూళ్లలో ఈ స్కోరు ప్రామాణికం. భారత్‌లోనూ ఐఎస్‌బీ, ఐఐఎంలు సహా పలు సంస్థలు జీఆర్‌ఈ, జీమ్యాట్‌లతో ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి.

టోఫెల్‌: 150 దేశాలకు ప్రామాణికం

టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఎ ఫారిన్‌ లాంగ్వేజ్‌ (టోఫెల్‌)ను ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సౌలభ్యం లేనిచోటే ఆఫ్‌లైన్‌ పరీక్షలకు అవకాశం ఉంటుంది. అభ్యర్థి ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్ఛు కొత్త మార్పుల ప్రకారం ఇప్పుడు వరుస పరీక్షల మధ్య 12 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. పరీక్ష ఫీజు 180 యూఎస్‌ డాలర్లు. స్కోరు రెండేళ్లపాటు చెల్లుబాటవుతుంది. పదివేల విశ్వవిద్యాలయాలు, 150 దేశాలు ఈ స్కోరుతో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి టోఫెల్‌ ఐబీటీలో మార్పులు చేశారు. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు తగ్గింది. ప్రశ్నల సంఖ్య కుదించారు. మారిన విధానం ప్రకారం రీడింగ్‌ సెక్షన్‌లో 3-4 ప్యాసేజ్‌లు ఉంటాయి. ఒక్కో ప్యాసేజ్‌ నుంచి 10 ప్రశ్నల చొప్పున వస్తాయి. వీటి వ్యవధి 54-72 నిమిషాలు. లిసనింగ్‌ విభాగంలో 3-4 లెక్చర్లు ఉంటాయి. ఒక్కోదాని నుంచి 6 చొప్పున ప్రశ్నలు వస్తాయి. 2-3 కన్వర్సేషన్లు, ఒక్కో దాని నుంచి 5 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 41-57 నిమిషాలు. స్పీకింగ్‌లో 4 టాస్క్‌లు. వీటిలో ఒకటి ఇండిపెండెంట్‌, 3 ఇంటిగ్రేటెడ్‌. వ్యవధి 17 నిమిషాలు. రైటింగ్‌ సెక్షన్‌ యథాతథంగా ఉంటుంది. ఇందులో 2 టాస్క్‌ల వ్యవధి 50 నిమిషాలు. ప్రతి సెక్షన్‌లోనూ టెస్టు స్కోరు 0-30 స్కేల్‌లో ఉంటుంది. అన్ని సెక్షన్లూ కలిపి 0-120 స్కేల్‌ ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. లిసనింగ్‌, స్పీకింగ్‌ సెక్షన్ల మధ్య 10 నిమిషాల విశ్రాంతి ఉంటుంది. హైదరాబాద్‌లో పరీక్ష రాసుకోవచ్చు.  www.ets.org/toefl

పీటీఈ: ఎన్నిసార్లయినా.. ఎన్ని సంస్థలకైనా!
పియర్సన్‌ టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ (పీటీఈ) కూడా టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ మాదిరిగానే ఉంటుంది. రీడింగ్‌, లిసనింగ్‌, రైటింగ్‌, స్పీకింగ్‌ విభాగాల్లో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఆస్ట్రేలియా, యూకే, యూరప్‌ విద్యా సంస్థలు ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. 50 దేశాల్లో 250కు పైగా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థి స్కోరు గణించడంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఉపయోగిస్తున్నారు. పరీక్షలో వచ్చిన స్కోరును ఎన్ని సార్లైనా, ఎన్ని సంస్థలకైనా పంపించుకోవచ్ఛు ఇందుకోసం అదనంగా ఏమీ వసూలు చేయరు. పరీక్ష రాసిన 5 పని దినాల్లోనే స్కోరు అందుబాటులోకి వస్తుంది. ఇందులో 3 పార్టులు ఉంటాయి. పార్ట్‌-1 స్పీకింగ్‌ అండ్‌ రైటింగ్‌ 77-93 నిమిషాలు, పార్ట్‌-2 రీడింగ్‌ 32-40 నిమిషాలు, పార్ట్‌-3 లిసనింగ్‌ 45-57 నిమిషాలు. హైదరాబాద్‌, విజయవాడల్లో పరీక్ష రాసుకోవచ్ఛు ఫీజు రూ. 13,300. ఈ స్కోరును ఇంకా పలు యూనివర్సిటీలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.  https://pearsonpte.com/

ఐఈఎల్‌టీఎస్‌: ఏడాదిలో 48 సార్లు

ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టం (ఐఈఎల్‌టీఎస్‌) స్కోరు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతోన్న విశ్వవిద్యాలయాల్లో చెల్లుబాటవుతుంది. ఏడాదిలో 48 సార్లు పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌, వైజాగ్‌, విజయవాడల్లో పరీక్ష రాసుకోవచ్ఛు బ్రిటిష్‌ కౌన్సిల్‌,
కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ, ఐడీపీ ఆస్ట్రేలియా సంయుక్తంగా ఐఈఎల్‌టీఎస్‌ అందిస్తున్నాయి. ఫీజు రూ.13,250. ఐఈఎల్‌టీఎస్‌ వ్యవధి 2:45 గంటలు. లిసనింగ్‌ 30 నిమిషాలు. రీడింగ్‌ ఒక గంట. రైటింగ్‌ ఒక గంట. స్పీకింగ్‌ 11-14 నిమిషాలు ఉంటాయి. పరీక్షను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ రెండు విధాలుగానూ నిర్వహిస్తున్నారు. అభ్యర్థి నచ్చిన విధానం ఎంచుకోవచ్ఛు స్పీకింగ్‌ టెస్టు మాత్రం ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.  www.ielts.org/

ఏ దేశానికి ఏది బాగు?
ఈ మూడు పరీక్షల లక్ష్యాలూ ఒకటే. అయితే అభ్యర్థి చదవాలనుకుంటున్న దేశం ప్రకారం అనువైనదాన్ని ఎంచుకోవచ్ఛు యూకే, యూరప్‌, ఆస్ట్రేలియా విద్య లక్ష్యంగా ఉన్నవారికి ఐఈఎల్‌టీఎస్‌ అనువైనది. అమెరికా చదువులకు టోఫెల్‌ బాగా ఉపయోగపడుతుంది. టోఫెల్‌ అమెరికన్‌ ఇంగ్లిష్‌, ఐఈఎల్‌టీఎస్‌ బ్రిటిష్‌ ఇంగ్లిష్‌ అనుసరిస్తాయి. పీటీఈ కొత్తదైనప్పటికీ ఐరోపా, ఆస్ట్రేలియా, ఐవీవైలీగ్‌ సంస్థల్లో అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్న సంస్థల సంఖ్య పరిమితంగా ఉంది. కాబట్టి ప్రవేశాలు ఆశించే సంస్థల్లో పీటీఈ చెల్లుబాటవుతుందా, లేదా చూసుకోవాలి. టోఫెల్‌ స్కోర్‌ పరీక్ష రాసిన 10 రోజుల్లో అందుబాటులో ఉంటుంది. అదే ఐఈఎల్‌టీఎస్‌ 13 రోజుల్లో, పీటీఈ 5-7 రోజుల్లో లభిస్తుంది. రెండేళ్ల వరకు స్కోర్లు చెల్లుబాటవుతాయి.

జీఆర్‌ఈ: సంవత్సరానికి 5 సార్లు
గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌ (జీఆర్‌ఈ)ను ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) నిర్వహిస్తుంది. పరీక్షను భారత్‌లో ఆన్‌లైన్‌లోనే రాయాలి. సంవత్సరంలో గరిష్ఠంగా 5 సార్లు రాసుకోవచ్ఛు రెండు పరీక్షల మధ్య వ్యవధి 21 రోజులు ఉంటే సరిపోతుంది. జీఆర్‌ఈలో సాధించిన స్కోరు అయిదేళ్లపాటు చెల్లుబాటవుతుంది. పరీక్ష ఫీజు 205 డాలర్లు. లైఫ్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, ఇంజినీరింగ్‌, బిజినెస్‌...ఇలా అన్ని కోర్సుల్లోనూ ప్రవేశానికి ఈ స్కోర్‌ ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ స్కోరు చెల్లుబాటవుతుంది. పరీక్షను ఎవరైనా రాసుకోవచ్ఛు ఎలాంటి అర్హతలూ అవసరం లేదు. ఈ స్కోరుతో ప్రవేశం పొందడానికి మాత్రం తగిన విద్యార్హతలు తప్పనిసరి. జీఆర్‌ఈ జనరల్‌ పరీక్షలో భాగంగా... ఎనలిటికల్‌ రైటింగ్‌, వెర్బల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ఎనలిటికల్‌ రైటింగ్‌లో భాగంగా రెండు ప్రశ్నలు రెండు విభాగాల్లో ఉంటాయి. ఏదైనా అంశంపై ప్రశ్న ఇచ్చి దాన్ని విశ్లేషించమంటారు. వ్యవధి 30 నిమిషాలు. మరో ప్రశ్న ఏదైనా అంశానికి సంబంధించిన వాదన. వ్యవధి 30 నిమిషాలు. వెర్బల్‌ రీజనింగ్‌లో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌ నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి సెక్షన్‌కూ 30 నిమిషాలు కేటాయించారు. క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లోనూ రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్‌ వ్యవధి 35 నిమిషాలు. www.ets.org/gre

జీమ్యాట్‌: మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి!
ప్రపంచవ్యాప్తంగా 2300కు పైగా సంస్థలు జీమ్యాట్‌ స్కోర్‌తో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. స్కోరు అయిదేళ్లపాటు చెల్లుతుంది. పరీక్ష ఫీజు 250 డాలర్లు. గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఏడాదిలో 5 సార్లు పరీక్ష రాసుకోవచ్ఛు రెండు ప్రయత్నాల మధ్య 16 రోజుల వ్యవధి ఉండాలి. ఎనలిటికల్‌ రైటింగ్‌, ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, వెర్బల్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. ఎనలిటికల్‌ రైటింగ్‌ 30 నిమిషాల వ్యవధి. ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌లో 12 ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 30 నిమిషాలు. క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లో 31 ప్రశ్నలకు 62 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. వెర్బల్‌ రీజనింగ్‌లో 36 ప్రశ్నలను 65 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం వ్యవధి 3 గంటల 7 నిమిషాలు.  www.mba.com/exams/gmat

ఈ పరీక్షల్లో మంచి స్కోరు ఉన్నంత మాత్రాన ప్రవేశాలు దక్కవు. ఎస్‌ఓపీ, రికమెండేషన్‌ లెటర్లు, అకడమిక్‌ ప్రతిభ ...మొదలైనవన్నీ పరిగణనలోకి తీసుకునే సీటు కేటాయిస్తారు.

Posted Date : 20-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం