• facebook
  • whatsapp
  • telegram

ఏ వేళలో వెళ్లాలి?

ఇప్పుడేగా డిగ్రీ పూర్తయింది. ఇంత హడావిడిగా ఫాల్‌ అడ్మిషన్లకు పరుగులు పెట్టాలా? సావకాశంగా స్ప్రింగ్‌ ప్రవేశాలకు ప్రయత్నించకూడదా? విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లే అభ్యర్థులకు ఎదురయ్యే ప్రధానమైన సందేహాల్లో ఇదొకటి. ఏదైతే ఏమిటి.. కాస్త అటూఇటూగా కోర్సు పూర్తయినా అంత మునిగిపోయేదేముంది అనిపించవచ్చు. కానీ ఆ ఎంపిక అనేక అంశాలపై ప్రభావం చూపుతుంది. అందుకే వివిధ దేశాల్లోని విద్యాసంస్థల ఇన్‌టేక్‌ల వివరాలు ముందే తెలుసుకోవాలి. వ్యక్తిగత ప్రాధాన్యాలు, అనుకూలతలు, అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలి.

మన దేశంలో ఏడాదికి ఒకటే విద్యాసంవత్సరం ఉంటుంది. కాబట్టి ఒకటే ఇన్‌టేక్‌. కానీ విదేశాల్లో పరిస్థితి వేరు. ఒక విద్యా సంవత్సరంలో వివిధ ఇన్‌టేక్‌లు ఉంటాయి. దేశాన్ని బట్టి వీటిలో తేడాలుంటాయి. ఏ ఇన్‌టేక్‌ అయినప్పటికీ విద్యా బోధన, పరిశోధన అవకాశాల పరంగా ఎలాంటి భేదమూ ఉండదు.

ఒకటికి మించి ఇన్‌టేక్‌లు ఉండటం వల్ల ఎక్కువమంది విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. విద్యాసంస్థలపరంగా చూస్తే... వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. వాటన్నిటినీ పరిశీలించి, వారికి ఒకేసారి ప్రవేశాలను కల్పించడం కష్టతరం. విద్యార్థుల పరంగా చూస్తే.. వారు కోరుకున్న యూనివర్సిటీల్లో సీటు పొందడం కొన్నిసార్లు వీలవదు. ఇందుకు కారణాలేమైనా తిరిగి దరఖాస్తు చేసుకుని, చేరాలంటే ఏడాదిపాటు వేచి ఉండాలి. సమయం వృథా. దీనికి పరిష్కారంగా చాలా దేశాల విద్యాసంస్థలు ఒకటికి మించి ఇన్‌టేక్‌ అవకాశాలను కల్పిస్తున్నాయి.

 

ఎలా నిర్ణయించుకోవాలి?

ఎన్ని ఇన్‌టేక్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ ఫాల్‌, స్ప్రింగ్‌లను ప్రధానమైనవిగా భావిస్తారు. వీటిలో దేన్ని ఎంచుకోవాలన్నదానిపై సందేహాలు ఎదురవుతుంటాయి. కొన్ని అంశాలను పరిశీలించడం ద్వారా వీటిపై స్పష్టత తెచ్చుకోవచ్చు.

విశ్వవిద్యాలయాలు: ఎంచుకున్న విశ్వవిద్యాలయాలు రెండు ఇన్‌టేక్‌లనూ అంగీకరిస్తున్నాయో లేదో చూసుకోవాలి. కొన్ని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌కు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కాబట్టి, ఈ ఇన్‌టేక్‌కు దరఖాస్తు చేసుకునేవారు విద్యాసంస్థ ప్రవేశాలను కల్పిస్తోందో లేదో ముందుగానే తెలుసుకోవాలి. ప్రీ-రిక్విజిట్‌ టెస్ట్‌లను రాయడానికి తగిన సమాచారాన్ని సేకరించుకోవాలి. కొన్నిసార్లు సంస్థల వెబ్‌సైట్లు దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వలేవు. ఇతర మార్గాల్లో పరిశోధన చేయాలి. దానిలో చదివే విద్యార్థులనూ, సంబంధిత అధికారులనూ మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.

సీటు పొందే వీలు: అభ్యర్థి దరఖాస్తును అంగీకరించి సీటు ఇవ్వటం అనేది పూర్తిగా విశ్వవిద్యాలయం విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఏ ఇన్‌టేక్‌కు దరఖాస్తు చేస్తున్నారన్నదానికీ- దీనికీ ఏమాత్రం సంబంధం ఉండదు. అయితే ఫాల్‌ ఇన్‌టేక్‌లో తీసుకునేవారి సంఖ్య పెద్ద మొత్తంలో ఉంటుంది. కాబట్టి, స్ప్రింగ్‌తో పోలిస్తే ఫాల్‌లో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువే.

కోర్సులు: సాధారణంగా విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఫాల్‌ సమయంలో ఎక్కువ కోర్సులు అందుబాటులో ఉంటాయి. అందుకే దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్ప్రింగ్‌కు అప్లికేషన్లు తక్కువ. అందుకే కొన్ని కోర్సులను మాత్రమే ఆఫర్‌ చేస్తారు. స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌లో భిన్నమైన, అందరూ ఆసక్తి చూపని కోర్సులను ఎంచుకోవాలనుకుంటే, అవి అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. చేరాలనుకునే డిగ్రీలు, స్పెషలైజేషన్లనూ చెక్‌ చేసుకోవాలి.

అసిస్టెంట్‌షిప్స్‌: సాంకేతికంగా విద్యాసంవత్సరం ఫాల్‌లోనే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో చేరినవారికి ఆన్‌క్యాంపస్‌ ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌ చేసుకునే వీలుంటుంది. ముఖ్యంగా రిసెర్చ్‌ ఆధారిత కోర్సులను చేసేవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది ప్రొఫెసర్లు తమ పరిశోధనను విద్యా సంవత్సరం మొదట్లోనే ప్రారంభించి, అసిస్టెంట్లను తీసుకుంటారు. ఏడాది మధ్యలో, స్ప్రింగ్‌లో ఈ అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్న్‌షిప్స్‌: చాలావరకూ విశ్వవిద్యాలయాలు విద్యార్థి కోర్సులో చేరి కనీసం 9 నెలలు గడిపితేనే క్యాంపస్‌ బయట ఇంటర్న్‌షిప్స్‌ చేయడానికి అనుమతినిస్తాయి. స్ప్రింగ్‌ అభ్యర్థులు ఆ అవకాశాన్ని అందుకోవడానికి 4-5 నెలలు అదనంగా వేచి ఉండాల్సి వస్తుంది. సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లనూ కోల్పోతారు.

గ్రాడ్యుయేషన్‌: కొన్నిసార్లు విశ్వవిద్యాలయాలు 3 సెమిస్టర్లలో మొత్తం కోర్సును పూర్తిచేసుకునే అవకాశం కల్పిస్తాయి. దీని వల్ల అభ్యర్థులు ఉద్యోగం తెచ్చుకుని, సంపాదించుకోడానికి వీలవుతుంది. మిగిలిన సెమిస్టర్‌ ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు డబ్బులు ఆదా అవుతాయి. ఈ అవకాశం ఎక్కువగా ఫాల్‌ విద్యార్థులకు దక్కుతుంది. వీరు స్ప్రింగ్‌ సెమిస్టర్‌ నాటికి తమ విద్య పూర్తిచేసుకుంటారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల నాటికి మిగిలిన కొన్ని నెలల సమయంలో ఇంటర్న్‌షిప్‌/ పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది.

వీసా: విద్యార్థి, దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయ ప్రొఫైళ్ల ఆధారంగా వీసా అందుతుంది. ఏ ఇన్‌టేక్‌లో దరఖాస్తు చేసుకున్నారనే దానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇన్‌టేక్‌ ఏదైనప్పటికీ వీసాకు ఎలాంటి సంకోచాలు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంసిద్ధత: మన వాళ్లకు చాలా వరకూ మే/జూన్‌ నాటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తవుతుంది. కొనసాగింపు అనుకూలమని విద్యార్థులు సెప్టెంబరులో నిర్వహించే ఫాల్‌ ప్రవేశాలపై ఆసక్తి చూపుతుంటారు. కొంతమందికి కొత్త కోర్సులో చేరే మానసిక సంసిద్ధతకు ఈ సమయం సరిపోకపోవచ్చు. ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు చేస్తున్నవారు, సొంత కమిట్‌మెంట్లు ఉన్నవారు ఫాల్‌కు అందుకోలేకపోవచ్చు. అలాంటివారు అనుకూల సమయం చూసుకొని, అన్నివిధాలుగా ప్రశాంతంగా సంసిద్ధమై వెళ్లడం మంచిది. ఆ ప్రకారమే దరఖాస్తు చేసుకోవాలి.

ఇన్‌టేక్‌ ఏదైనా అభ్యర్థి ఆసక్తి మేరకు ఉండాలి. తన అవసరాలు, భవిష్యత్తు ప్రణాళికలను బట్టి సాగాలి. కళాశాల/ విశ్వవిద్యాలయం నుంచి ఏం ఆశిస్తున్నారు, ఎప్పటిలోగా ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు.. వంటి అంశాలను పరిశీలించుకోవాలి. ఆ ప్రకారం ఇన్‌టేక్‌ నిర్ణయం తీసుకోవాలి.

ఫాల్‌, స్ప్రింగ్‌, సమ్మర్‌ అనే మూడు రకాల ఇన్‌టేక్‌లు ప్రధానంగా ఉంటాయి. సాధారణంగా ఫాల్‌ ఇన్‌టేక్‌ సెప్టెంబరులో మొదలై డిసెంబరులో ముగుస్తుంది. స్ప్రింగ్‌.. జనవరిలో ప్రారంభమై మేలో ముగుస్తుంది. సమ్మర్‌ ఇన్‌టేక్‌ మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. ఎక్కువ దేశాల విద్యాసంస్థలు ఫాల్‌, స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌లకు ప్రాధాన్యాన్నిస్తున్నాయి. చాలా కొద్ది విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సమ్మర్‌ ఇన్‌టేక్‌ ద్వారా విద్యార్థులను తీసుకుంటున్నాయి. ఎంచుకునే ప్రోగ్రామ్‌, సంస్థను బట్టి వీటిలో మార్పులుంటాయి.

 

ఉద్యోగావకాశాలు

అడ్మిషన్‌ సీజన్‌పై నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగావకాశాలనూ పరిశీలించాలి. సాధారణంగా జాబ్‌ ఫేర్లు, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు రెండో ఏడాదిలో జరుగుతాయి. అంటే ఫాల్‌కు సంబంధించి మూడు సెమిస్టర్లు, స్ప్రింగ్‌కు సంబంధించి రెండు సెమిస్టర్లు పూర్తయిన తర్వాత వాటిని నిర్వహిస్తారు. రెండు సెమిస్టర్లు పూర్తిచేసుకున్నవారితో పోలిస్తే మూడు పూర్తి చేసుకున్నవారికి అవకాశాలు ఎక్కువ. బయట ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు చేసి ఉంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

ఏ దేశంలో ఎప్పుడు?
 

ఆస్ట్రేలియా: రెండుసార్లు ప్రవేశాలను కల్పిస్తుంది. సెమిస్టర్‌-1 ఫిబ్రవరి చివర్లో లేదా మార్చిలో మొదలై మే చివర లేదా జూన్‌ ప్రారంభం వరకు ఉంటుంది. సెమిస్టర్‌-2 జులై చివర్లో లేదా ఆగస్టులో మొదలై నవంబరు వరకు ఉంటుంది.
యూకే: మూడు రకాల ఇన్‌టేక్‌లు అందుబాటులో ఉన్నాయి. టర్మ్‌-1 సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు, టర్మ్‌-2 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు, సమ్మర్‌ ఇన్‌టేక్‌ ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు సాగుతాయి.
యూఎస్‌ఏ: మూడు ఇన్‌టేక్‌ల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫాల్‌ ఆగస్టు చివర్లో ప్రారంభమై డిసెంబరులో ముగుస్తుంది. స్ప్రింగ్‌ జనవరిలో ప్రారంభమవుతుంది. సమ్మర్‌ ఇన్‌టేక్‌ పరిమిత కళాశాలల్లో కొన్ని ప్రోగ్రామ్‌లకు ఉంటుంది. ఇది సాధారణంగా మేలో ప్రారంభమవుతుంది.
కెనడా: మూడు ఇన్‌టేక్‌లు ఉన్నాయి. ఫాల్‌ సెప్టెంబరులో ప్రారంభమవుతుంది. వింటర్‌ జనవరిలోనూ, సమ్మర్‌ ఏప్రిల్‌/మేలో మొదలవుతాయి.
న్యూజీలాండ్‌: రెండు ప్రధాన ఇన్‌టేక్‌లున్నాయి. సెమిస్టర్‌-1 ఫిబ్రవరి నుంచి జూన్‌, సెమిస్టర్‌-2 జులై నుంచి నవంబరు వరకూ అందుబాటులో ఉంటాయి.
జర్మనీ: సాధారణంగా వింటర్‌, సమ్మర్‌ ఇన్‌టేక్‌లు ఉంటాయి. తుది గడువులు విశ్వవిద్యాలయాన్ని బట్టి మారతాయి. వింటర్‌ సెమిస్టర్‌ సెప్టెంబరు/ అక్టోబరులో ప్రారంభమై ఫిబ్రవరి/ మార్చిలో ముగుస్తుంది. సమ్మర్‌ సెమిస్టర్‌ ఏప్రిల్‌లో ప్రారంభమై జులై/ ఆగస్టులో ముగస్తుంది.
సింగపూర్‌: ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలైన నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (ఎన్‌యూఎస్‌), నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (ఎన్‌టీయూ), సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్సిటీ (ఎస్‌ఎంయూ) వంటివి పీజీ విద్యార్థులకు రెండు ఇన్‌టేక్‌ (ఆగస్టు, జనవరి)లకు అవకాశం కల్పిస్తున్నాయి. యూజీ విద్యార్థులకు ఒకే ఇన్‌టేక్‌ ఉంది. ఇది ఆగస్టులోఉంటుంది. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రతి క్వార్టర్‌లో ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. టూరిజం, హాస్పిటాలిటీ కోర్సులకు సంబంధించి ప్రతి నెలా ప్రవేశాలు జరిపేవీ ఉన్నాయి.

Posted Date : 20-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం