• facebook
  • whatsapp
  • telegram

అపోహలు వీడి... ఖండాంతరాలకు!

ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలంటే అదేదో అంతుపట్టని విషయంగా చాలామంది భావిస్తుంటారు. కన్సల్టెంట్ల చుట్టూ తిరుగుతూ కలవర పడుతుంటారు. మార్కులు తక్కువ.. బ్యాక్‌లాగ్స్‌ ఎక్కువ.. అడ్మిషన్‌ అందదేమో అని ఆందోళన చెందుతుంటారు. ఇవన్నీ అపోహలే అంటున్నారు నిపుణులు. అనుమానాలతో అవకాశాలను వదులుకోవడం.. అనవసరమైన వ్యయాన్ని పెంచుకోవడం తగదని చెబుతున్నారు. కొంత సహనం, ఇంకొంత పరిశోధనతో సొంతంగా దరఖాస్తు చేసుకొని దర్జాగా కోరుకున్న దేశంలో చదువుకోవచ్చని సూచిస్తున్నారు.

విదేశీ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయడం కష్టమైన ప్రక్రియగా చాలామంది భావిస్తుంటారు. కానీ కొంత అవగాహన, ముందస్తు సన్నద్ధతతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడి కోర్సులకు అప్లై చేసుకోవచ్ఛు సాధారణంగా కొందరు అభ్యర్థుల్లో కొన్ని అపోహలు, ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటి వాటిని మొదట నివృత్తి చేసుకుంటే మిగతా దశలు సాఫీగా సాగిపోతాయి.

విదేశీ విద్యాలయాల్లో ప్రవేశం చాలా కష్టమా?
జవాబు: ఇది నిజంగా అపోహే. సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి అభిప్రాయానికి వస్తుంటారు. విదేశాల్లో విద్య అనగానే చాలామందికి కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు మాత్రమే గుర్తుకువస్తాయి. వాటికి ఏర్పడిన ప్రాచుర్యమే అందుకు కారణం. వాస్తవానికి ఒక్కో దేశంలో టాప్‌ ర్యాంకులు పొందినవి, ప్రఖ్యాతి చెందినవి అన్నీ కలిపి ఒక శాతం ఉండవచ్ఛు ఇవి ఎంపిక ప్రక్రియలో కొన్ని అంశాలను పరిశీలిస్తాయి. మొత్తంగా 20 శాతం మందిని మాత్రమే తీసుకోగలుగుతాయి. అంటే 99 శాతం కళాశాలల గురించి చాలా మంది పట్టించుకోవడమే లేదు. టాప్‌ 200 ర్యాంకుల్లో ఉన్నవి తీసుకుంటున్నదీ 25- 50 శాతం మందినే. మొత్తంగా చూస్తే అభ్యర్థులు ఎంచుకుంటున్నదీ 5 శాతం సంస్థలను మాత్రమే. కొన్నింటికే అందరూ పోటీపడటం వల్ల ప్రవేశం కష్టం అనిపిస్తోంది. మిగతా వాటి వివరాలను సేకరించి దరఖాస్తు చేసుకుంటే అడ్మిషన్‌ సులభంగా పొందవచ్ఛు

దరఖాస్తు సమయంలో తరచూ చేసే పొరపాట్లు ఏమిటి?
జవాబు: ఇందులో పలు అంశాలు ఉన్నాయి.
సరైన పరిశోధన చేయకపోవడం: చాలామంది దేశం, రాయాల్సిన పరీక్షలు, స్కోరుపై పెట్టిన శ్రద్ధ మిగతా అంశాలపై పెట్టరు. ఫీజులే కాదు, మిగతా అంశాలనూ పరిశీలించాలి. స్కాలర్‌షిప్‌లు, క్యాంపస్‌ సదుపాయాలు వంటివాటి గురించీ తెలుసుకోవాలి.
ఎవరి నుంచి.. ఎలా.. అని తెలుసుకోకపోవడం?: ప్రతి విశ్వవిద్యాలయానికి ఒక అడ్మిషన్‌ కౌన్సెలర్‌ ఉంటారు. వీరు విదేశీ విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈ విషయం చాలామంది తెలుసుకోరు. విద్యా సంస్థల వెబ్‌సైట్లలో ఈ కౌన్సెలర్లకు సంబంధించిన లింకులు ఉంటాయి. ఒకవేళ ఎంచుకున్న సంస్థ వెబ్‌సైట్‌లో లింకులు కనిపించకపోతే ‘ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ గ్రూప్‌’లో ప్రయత్నించవచ్ఛు.
ముందస్తు ప్రణాళిక లేకపోవడం: కొందరు ప్రవేశ విధానాలు, గడువుల గురించి తెలుసుకోరు. ముందస్తు ప్రణాళికలను వేసుకోరు. దీనివల్ల ఇబ్బందే. విదేశీ విద్యాసంస్థలకు విభిన్న గడువులు, ప్రవేశ ప్రక్రియలు ఉంటాయి. వాటిని తెలుసుకుని తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
తర్వాత ఏమిటి?: విదేశీ విద్యకు సంబంధించి ప్లానింగ్‌ అనగానే విశ్వవిద్యాలయంలో అడ్మిషన్‌, వీసా పొందడం వరకే పరిమితమతుంటారు. ఆ తర్వాత ఏమిటో ఆలోచించరు. ప్రవేశం పూర్తవగానే ఉండే విద్యార్థి జీవితం గురించీ ప్లాన్‌ చేసుకోవాలి. కోర్సు తర్వాత ఏం చేయాలో ఈ దశలోనే నిర్ణయించుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లు, మెంటర్లు, పరిశోధన అవకాశాల వివరాలు తెలుసుకోవాలి.
ఏమేం చెప్పుకున్నారు?: దరఖాస్తు ప్రక్రియలో పేర్కొన్న అంశాలను అప్పుడే వదిలేస్తుంటారు. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌/ఎస్సేల్లో తమ నైపుణ్యాలు, విజయాల గురించి ఏం చెప్పుకున్నారో గుర్తుంచుకోవాలి. వాటిపై తర్వాతి దశలో ప్రశ్నలు ఎదురైతే స్పష్టంగా వివరించగలగాలి. అసత్యాలను అప్లికేషన్‌లో చేర్చకూడదు.

విద్యాసంస్థలు ఏ అంశాల ఆధారంగా విద్యార్థిని ఎంపిక చేస్తాయి?
జవాబు: ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది విద్యాపరంగా ఆ అభ్యర్థి విజయం సాధించగలడా? రెండోది మన సంస్థకు తగినవారేనా? మొదటి అంశంలో విద్యాపరమైన, టెస్ట్‌ స్కోర్ల ఆధారంగా చదువుపట్ల ఎంత శ్రద్ధ ఉందో అంచనా వేస్తారు. తర్వాత విద్యార్థి ఆసక్తులు, కెరియర్‌ వివరాలు కళాశాల సంస్కృతికి ఎంతవరకూ సరిపోతాయో చూస్తారు. అందుకే దరఖాస్తు చేసే విద్యాసంస్థ గురించి ముందే కొంత పరిశోధన చేయాలి. దానికి సరిపోవాలంటే ఏ లక్షణాలు ఉండాలో తెలుసుకోవాలి.

సొంతంగా చేసుకోవాలా? బయటి నుంచి సాయం తీసుకోవాలా?
జవాబు: విదేశీ విద్యకు సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్ఛు దానివల్ల వ్యయం తగ్గుతుంది. ఇందుకు చాలా పరిశోధన చేయాలి. ఓపిక ఉండాలి. తిరస్కరణ ఎదురైనా తట్టుకోగలగాలి. కనీసం ఏడాది ముందు నుంచే దరఖాస్తు ప్రక్రియ, సమర్పించాల్సిన పత్రాలు మొదలైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. తర్వాత సొంత ప్రయత్నాలు ప్రారంభించాలి.
సమయం లేనివారు, తిరస్కరణలపై విముఖత ఉన్నవారు ఏజెన్సీల సాయం తీసుకోవచ్ఛు వాటికి ప్రవేశ ప్రక్రియలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏజెన్సీలు అనుభవంతో ప్రవేశం తెప్పిస్తాయి. కానీ, అక్కడ ఉండాల్సిందీ, చదవాల్సిందీ విద్యార్థే కాబట్టి, సంస్థ, విద్యాబోధన మొదలైన వాటిపై స్పష్టత రావాలంటే ఒకసారి సొంతంగా ప్రయత్నించడమే మేలు. తిరస్కరణ ఎదురైనా కనీస అవగాహన ఉంటుంది. పైగా ఏజెన్సీలకు కొన్ని విశ్వ విద్యాలయాలపైనే అవగాహన ఉండవచ్ఛు అభ్యర్థులే స్వయంగా వివరాలు ప్రయత్నిస్తే ఇంకా ఎన్నో విశ్వవిద్యాలయాలు, కోర్సుల గురించి తెలుసుకునే వీలుంటుంది. ఏజెన్సీలు దరఖాస్తు ప్రక్రియలో చేసిన సాయానికి కొంత సొమ్ము తీసుకుంటాయి. ఈ సేవలను ఉచితంగా అందించే సంస్థలూ ఉన్నాయి. వాటి సాయానికీ అభ్యర్థులు ప్రయత్నించవచ్ఛు

బ్యాక్‌లాగ్‌లు ఉంటే అడ్మిషన్‌ దొరకదా?
జవాబు: బ్యాక్‌లాగ్‌లు పెద్ద అడ్డంకి కాదు. ప్రముఖ విశ్వవిద్యాలయాలు, చాలా కొద్ది సంస్థలు మాత్రమే బ్యాక్‌లాగ్‌ సర్టిఫికెట్లు ఉన్నవారిని స్వీకరించడం లేదు. పరిమిత సంఖ్యలో ఉంటే పట్టించుకోవడం లేదు. మరీ ఎక్కువ ఉంటే పోటీని అనుసరించి అడ్మిషన్‌ నిరాకరిస్తున్నాయి. ఏ విద్యాసంస్థ అయినా ఉత్తమ విద్యార్థులనే ఎంచుకోవాలని భావిస్తుంది. కాబట్టి, ప్రొఫైల్‌ బలంగా రూపొందించుకోవడం తప్పనిసరి. ప్రామాణిక పరీక్షల స్కోరు పైనా దృష్టిపెట్టాలి.

దరఖాస్తు ప్రక్రియను ఎప్పుడుమొదలు పెట్టాలి?
జవాబు: ప్రక్రియ ప్రారంభం కాగానే ఎంత త్వరగా దరఖాస్తు చేస్తే అంత మంచిది. కనీసం ఏడాది ముందుగా దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కావాల్సిన వాటన్నింటినీ సమకూర్చుకోవడంతోపాటు స్కాలర్‌షిప్‌ అవకాశాలనూ పరిశీలించుకోవాలి. కళాశాల, విశ్వవిద్యాలయాన్నిబట్టి తుది గడువులు మారుతుంటాయి. హై ర్యాంకింగ్‌ సంస్థల చివరి తేదీలు ఏడాది వరకూ ఉంటాయి. ఉదాహరణకు కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ అక్టోబరు ప్రోగ్రామ్‌లో చేరాలంటే దానికి ముందు ఏడాది అక్టోబరులోగా దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని పేరున్న విశ్వవిద్యాలయాలకు ఆరు నెలల వరకూ సమయం ఉంటుంది. తక్కువ ర్యాంకు సంస్థల విషయంలో కోర్సు ప్రారంభానికి రెండు, మూడు నెలల ముందు దరఖాస్తు చేసుకోవచ్ఛు

దరఖాస్తులో ఏమేం ఉండాలి?
జవాబు: దరఖాస్తు ప్రక్రియలో మొత్తం ఆరు కేటగిరీలు ఉంటాయి. అవి..
విద్యా సంబంధ ధ్రువపత్రాలు: కోర్సును బట్టి గత తరగతుల ధ్రువపత్రాలు- పది, ఇంటర్‌, డిగ్రీలకు సంబంధించినవి. ఒకవేళ మార్కుల షీట్లు ఇంగ్లిష్‌ కాకుండా ఏ ఇతర భాషలో ఉన్నా తర్జుమా చేయించి సిద్ధంగా ఉంచుకోవాలి.
టెస్ట్‌ స్కోర్లు: ప్రతి అంతర్జాతీయ కోర్సులో ప్రవేశానికి కొన్ని ప్రీ రిక్విజిట్‌ పరీక్షలను రాయాల్సి ఉంటుంది. అవి శాట్‌, జీమ్యాట్‌, జీఆర్‌ఈ, టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ మొదలైనవి. వీటి స్కోరు సంబంధిత పత్రాలను దరఖాస్తుకు జోడించాలి. ప్రతి విశ్వవిద్యాలయం వీటికి సంబంధించి కటాఫ్‌లను సూచిస్తుంది. వాటి ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్సే/ స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌: దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంస్థ విద్యార్థి గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అందులో భాగంగా తమ గురించి రాయమంటుంది. సాధారణంగా ఎస్సే లేదా ఎస్‌ఓపీల్లో ఏదో ఒకటి కోరతాయి. దానిని రాసేటప్పుడు ఫలానా కోర్సును, విద్యాసంస్థను ఎంచుకోవడానికి కారణాలు, భవిష్యత్తు లక్ష్యాలు, సంస్థకు తాము ఎంతవరకూ సరైన ఎంపిక వంటి వాటికి సమాధానాలు ఉండే విధంగా చూసుకోవాలి.
లెటర్స్‌ ఆఫ్‌ రెకమెండేషన్‌: ప్రొఫెసర్లు/ రిపోర్టింగ్‌ మేనేజర్ల నుంచి రెకమెండేషన్‌ లెటర్లను కోరవచ్ఛు అభ్యర్థులతో కలిసి పనిచేసిన అనుభవం, కలిసి సాధించిన లక్ష్యాలు, విజయాలను అందులో పొందుపరచాలి.
కార్యకలాపాలు: విద్యాసంస్థలు అభ్యర్థులను ఎంపిక చేసుకునేటప్పుడు అకడమిక్‌, టెస్ట్‌ స్కోర్లకే పరిమితం కావు. విద్యకు సంబంధించినవే కాకుండా ఇతర కార్యకలాపాలు, నాయకత్వం వహించినవి, వాలంటీర్‌గా చేసినవి, సాధించిన అవార్డులు తదితరాలను పరిశీలిస్తాయి. వాటినీ ప్రస్తావించాలి.
ఇతరాలు: ఒక్కో విశ్వవిద్యాలయం దరఖాస్తులో భాగంగా వివిధ అంశాలను కోరుతుంది. కొన్ని వీడియో/ టెలిఫోన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తాయి. డిజైన్‌ కోర్సులకైతే పోర్ట్‌ఫోలియో ఇమ్మని అడుగుతాయి. టాలెంట్‌ ఆధారిత కోర్సులకు ఆడిషన్‌నూ నిర్వహిస్తాయి.

Posted Date : 20-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం