• facebook
  • whatsapp
  • telegram

విదేశీ విద్యకు ఇవీ భేషే!

విద్య విశ్వవ్యాప్తమైపోయింది. ఏ దేశంలో ఎలాంటి కోర్సులు ఉన్నాయో.. బాగున్నాయో తెలుసుకొని తేల్చుకోవడమే మిగిలింది. అందుకు అవసరమైన అన్ని వివరాలనూ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంచుతోంది. మనవాళ్లు చాలామంది గతంలో నాలుగైదు దేశాలకు మాత్రమే ఎక్కువగా వెళ్లేవారు. ఇప్పుడు ఇతర దేశాల వైపు దృష్టిసారిస్తున్నారు. అక్కడి ప్రమాణాలను, నాణ్యతను, ఉద్యోగావకాశాలను పరిశీలిస్తున్నారు. అభిరుచికి తగిన కోర్సులను ఎంచుకొని ఎగిరిపోతున్నారు.

విదేశాల్లో చదువులంటే మొదట గుర్తుకువచ్చేవి.. యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, కెనడా లాంటివి. కానీ ఇంకా ఎన్నో దేశాల్లో నాణ్యమైన విద్యను అందించే మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. ఉన్నత విద్యకు ఖండాంతరాలకు వెళ్లాలనుకునే వారు వాటి గురించీ ఆలోచించవచ్చు. మన విద్యార్థులు దాదాపు 86 దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారి సంఖ్య కొన్ని చోట్ల లక్షల్లో ఉంటే, ఇంకొన్ని ప్రాంతాల్లో వేలల్లో, వందల్లో ఉంది. ప్రామాణిక విద్యను అందించడంలో పేరు పొందిన దేశాల్లో న్యూజీలాండ్‌, సింగపూర్‌, ఐర్లాండ్‌, స్విట్జర్లాండ్‌, ఫిన్‌లాండ్‌ మొదలైనవి ఉన్నాయి. ఇక్కడికి వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆ దేశాల విద్యాసంస్థలు అనుసరిస్తున్న ఉన్నత ప్రమాణాలు, అక్కడి భద్రత, స్కాలర్‌షిప్‌లు తదితర వివరాలు తెలుసుకుంటే విద్యార్థులు తమ అవకాశాన్ని, అవసరాన్ని, ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోడానికి వీలుంటుంది.

న్యూజీలాండ్‌

ఇటీవలి కాలంలో న్యూజీలాండ్‌ వెళ్లి చదువుకునే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల వ్యవధి మూడేళ్లు. చాలావరకు పీజీ కోర్సులు 18 నెలల వ్యవధితో పూర్తవుతాయి. వీటికి ఫీజు 26,000 నుంచి 37,000 న్యూజీలాండ్‌ డాలర్లు చెల్లించాలి. మన కరెన్సీలో రూ.12 లక్షల నుంచి రూ. 17 లక్షల వరకు ఉంటుంది. వసతి, భోజనం, ఇతర ఖర్చులకు ఏడాదికి రూ.8.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అవసరమవుతాయి. వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. సెలవుల్లో ఫుల్‌ టైమ్‌ పనికి వీలుంది.

ప్రధాన సంస్థలు: ఆక్లాండ్‌ యూనివర్సిటీ, ఒటాగో యూనివర్సిటీ, ఆక్లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాంటర్‌బరీ, మసేయ్‌ యూనివర్సిటీ, విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్‌ వెల్లింగ్‌టన్‌, వైకాటో యూనివర్సిటీలు ప్రపంచ ర్యాంకింగ్‌ల్లో స్థానాలు పొందుతున్నాయి. మిగిలినవన్నీ ప్రైవేటు విద్యా సంస్థలే. ఇవి డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను ఎక్కువగా అందిస్తున్నాయి. ఆక్లాండ్‌ ప్రాంతంలో ఎక్కువమంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. దీనితర్వాత ప్రాధాన్యం క్రిస్ట్‌చర్చ్‌, వెలింగ్‌టన్‌, హామిల్టన్‌లకు లభిస్తోంది.

ప్రత్యేకతలు: ఇక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికసంఖ్యలో ఉన్నారు. మంచి పరిసరాలు, నేర్చుకోవడానికి అనువైన వాతావరణం, పూర్తి కంప్యూటరీకరణ, అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌ వినియోగం ఈ దేశం ప్రత్యేకతలు.

ముఖ్యమైన కోర్సులు: హార్టికల్చర్‌, డెయిరీ టెక్నాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌, జియో థర్మల్‌ ఎనర్జీ, బయోటెక్నాలజీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, సోషల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌.

అడ్మిషన్లు: ఎక్కువ కోర్సులకు ఫిబ్రవరి, జులైల్లో ప్రవేశాలుంటాయి. 8 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.

ఎక్స్‌లెన్స్‌ అవార్డులు

న్యూజీలాండ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను అక్కడి యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్‌ విభాగం కలిపి అందిస్తున్నాయి. ఏయూటీ, లింకన్‌, మసే, ఆక్లాండ్‌, ఒటాగో, విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్‌ వెల్లింగ్‌టన్‌, వైకాటో యూనివర్సిటీల్లో ఎందులోనైనా ప్రవేశం పొందిన భారతీయ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 31 స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. వీటిలో 29 పీజీ అభ్యర్థులకు, 2 యూజీల్లో చేరినవారికి ఇస్తారు. పీజీలో చేరినవారికి 5,000, యూజీకి 10,000 న్యూజీలాండ్‌ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 2,28,000; రూ. 4.55,000) స్కాలర్‌షిప్పుగా చెల్లిస్తారు. వీటిని పొందడానికి మంచి అకడమిక్‌ నేపథ్యంతోపాటు, నిర్ణీత న్యూజీలాండ్‌ యూనివర్సిటీల్లో ఎందులోనైనా యూజీ లేదా పీజీ కోర్సులో ప్రవేశం లభించినట్లు ధ్రువపత్రం, సీవీ, అకడమిక్‌ సర్టిఫికెట్ల కాపీలు, భారతీయ పౌరసత్వం వివరాలు అందించాలి.

వెబ్‌సైట్‌: ‌www.studyinnewzealand.govt.nz

ఐర్లాండ్‌

స్నేహపూర్వక వాతావరణం, భద్రతకు ప్రసిద్ధి. ఇక్కడ కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ కోర్సుల్లో చేరడానికి భారతీయ విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. మూడేళ్ల యూజీ చదివినవారు ఇక్కడి సంస్థల్లో పీజీ కోర్సుల్లో చేరవచ్చు.

ప్రధాన సంస్థలు: ట్రినిటీ కాలేజ్‌ డబ్లిన్‌, రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఇన్‌ ఐర్లాండ్‌, యూనివర్సిటీ కాలేజ్‌ డబ్లిన్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఐర్లాండ్‌, మైనూత్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్‌ కార్క్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లైమ్‌రిక్‌, డబ్లిన్‌ సిటీ యూనివర్సిటీ ఈ దేశంలో పేరున్న విద్యా సంస్థలు.

ప్రత్యేకతలు: ఈ దేశంలో వెయ్యికిపైగా బహుళజాతి సంస్థలు సేవలందిస్తున్నాయి. చదువుకుంటూ వారానికి 20 గంటలు పనిచేసుకునే అవకాశం ఉంది. కొన్ని నెలల్లో వారానికి 40 గంటలు పనిచేసుకోవచ్చు. చాలావరకు పీజీ కోర్సులు ఏడాది వ్యవధిలోనే పూర్తవుతాయి. కొన్నింటి వ్యవధి మాత్రం 16-24 నెలలు ఉంటుంది. సంవత్సరంలో పూర్తయ్యే పీజీలకు భారత్‌లో ఉద్యోగాలు, ఉన్నత విద్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని అభ్యర్థులు పరిశీలించుకోవాలి.

ముఖ్యమైన కోర్సులు: కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ

అడ్మిషన్లు: ఏడాదికి రెండుసార్లు ఆటమ్‌, స్ప్రింగ్‌ల్లో ఉంటాయి. ఆటమ్‌ సెమిస్టరు సెప్టెంబరు ప్రారంభంలో, స్ప్రింగ్‌ జనవరి చివర్లో మొదలవుతుంది. 

సింగపూర్‌

విద్య, ఆరోగ్యం, నాణ్యత, జీవన ప్రమాణాలు, భద్రత... మొదలైనవాటిలో సింగపూర్‌ సర్వోన్నతమైందిగా గుర్తింపు పొందింది. పలు బహుళజాతి కంపెనీలకు చెందిన ఆసియా ప్రాంతీయ కేంద్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ చిన్న దేశంలో 8000 బహుళజాతి సంస్థలు సేవలందిస్తున్నాయి. అందువల్ల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింగపూర్‌లో ఫీజులతోపాటు ఇతర ఖర్చులు కొంచెం అధికమే. అందువల్ల ఉన్నత చదువులకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది.

ప్రధాన సంస్థలు: నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌, నాన్యంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలు ప్రపంచంలో టాప్‌ విద్యాసంస్థలుగా గుర్తింపు పొందాయి. అన్ని సంస్థల సర్వేల్లోనూ వీటికి మంచిస్థానం దక్కుతోంది. సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్సిటీ, సింగపూర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ పేరుపొందిన విద్యాసంస్థలు.

ప్రత్యేకతలు: మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచంలోనే అత్యంత విశిష్ట కేంద్రంగా ఈ దేశం గుర్తింపు పొందింది. సింగపూర్‌లో 34 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 6 జాతీయ సంస్థలు. చదువుకోవడానికి, అనంతరం ఉద్యోగం చేసుకోవడానికి రెండింటికీ ఇక్కడి వాతావరణం అనువైనది. భారత్‌ నుంచి రాకపోకలకు అనువుగా ఉంటుంది.

ముఖ్యమైన కోర్సులు: మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, లా, అకౌంటింగ్‌, ఫినాన్స్‌ కోర్సులకు ప్రసిద్ధి. ఇంజినీరింగ్‌ పీజీ కోర్సుల్లో గేట్‌ స్కోర్‌తోనూ ప్రవేశం లభిస్తుంది.

అడ్మిషన్లు: ఇక్కడి యూజీ, పీజీ కోర్సులు సాధారణంగా ఆగస్టు, జనవరిల్లో మొదలవుతాయి. వచ్చే, ఆగస్టు ప్రవేశాలకు ఈ నవంబరు లోగా దరఖాస్తులు స్వీకరిస్తారు. 

ఫిన్‌లాండ్‌

ప్రపంచంలో అత్యంత భద్రమైన ప్రాంతాల్లో ఇదొకటి. చాలా పీజీ కోర్సులకు బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు కనీసం రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి.

ప్రధాన సంస్థలు: హెల్సింకీ యూనివర్సిటీ, ఆల్టో యూనివర్సిటీ, టుర్కూ యూనివర్సిటీ, జైవాస్కైలా యూనివర్సిటీ, ఔలూ యూనివర్సిటీ, టాంపేర్‌ యూనివర్సిటీ, ఎల్‌యూటీ యూనివర్సిటీ, ఈస్టర్న్‌ ఫిన్‌లాండ్‌ యూనివర్సిటీ ప్రపంచ ప్రసిద్ధ 500 విద్యా సంస్థల జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి.

ప్రత్యేకతలు: ఇక్కడ 400 కోర్సులు, 13 విశ్వవిద్యాలయాలు, 23 అప్లైడ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. విదేశీ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు లభిస్తున్నాయి.

ముఖ్యమైన కోర్సులు: ఇంజినీరింగ్‌, అప్లైడ్‌ సైన్సెస్‌

అడ్మిషన్లు: స్ప్రింగ్‌, ఆటమ్‌ సీజన్లలో లభిస్తాయి. వీటికి ఈ నవంబరు నుంచి జనవరిలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరికొన్ని దేశాలు

క్యూఎస్‌ ప్రపంచ ప్రసిద్ధ 200 విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు దక్కించుకున్న స్వీడన్‌, ఫ్రాన్స్‌, నార్వే, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌, హాంకాంగ్‌ తదితర దేశాలను విదేశీ విద్య కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు.

స్వీడన్‌: లండ్‌ యూనివర్సిటీ, కేటీహెచ్‌ రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యుప్సాల యూనివర్సిటీ, చాల్మర్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, స్టాక్‌హోం యూనివర్సిటీ.

స్విట్జ్జర్లాండ్‌: ఈటీహెచ్‌ జ్యూరిచ్‌ - స్విస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఈపీఎఫ్‌ఎల్‌ - ఇకొలే పాలిటెక్నిక్‌ ఫెడరలే డి లాసనే, జూరిచ్‌ యూనివర్సిటీ, జెనీవా యూనివర్సిటీ, బెర్న్‌ యూనివర్సిటీ, లాసనే యూనివర్సిటీ, బాసెల్‌ యూనివర్సిటీ.

నెదర్లాండ్స్‌: డెల్ఫ్‌ట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, ఆమ్‌స్టర్‌డామ్‌ యూనివర్సిటీ, కోపెన్‌ హాగెన్‌ యూనివర్సిటీ, గ్రోనింగెన్‌ యూనివర్సిటీ, లైడెన్‌ యూనివర్సిటీ, ఎథోవెన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, యుట్రెక్ట్‌ యూనివర్సిటీ, వేగెనింగెన్‌ యూనివర్సిటీ అండ్‌ రిసెర్చ్‌, ట్వెంటే యూనివర్సిటీ, ఎరాస్మస్‌ యూనివర్సిటీ రోట్టర్‌డామ్‌.

హాంకాంగ్‌ ఎస్‌ఏఆర్‌: యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌, హాంకాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ద చైనీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌, సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌, హాంకాంగ్‌ పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ.

సౌత్‌ కొరియా: కొరియా అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పోహంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కొరియా యూనివర్సిటీ, సంగ్‌ కుంక్వాన్‌ యూనివర్సిటీ, యోన్సే యూనివర్సిటీ, హాన్యంగ్‌ యూనివర్సిటీ.

Posted Date : 20-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం