• facebook
  • whatsapp
  • telegram

సాంకేతిక విద్యకు జయహో జపాన్‌!

టెక్నాలజీ పరంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో జపాన్‌ ఒకటి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్‌ టెక్నాలజీలకు ఈ దేశం ప్రసిద్ధి పొందింది. ఇక్కడి విద్యాసంస్థల్లో కోర్సులను పరిశ్రమల ఆధారంగానే రూపొందిస్తారు. దీంతో ఉద్యోగావకాశాలు వేగంగా అందుతున్నాయి. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇదో ముఖ్య కారణం. అందుకే సాంకేతిక కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ఈ దేశాన్నీ పరిగణనలోకి తీసుకోవచ్చు.

ఆసియాలో అత్యుత్తమ విద్యను అందించే దేశాల్లో జపాన్‌ ఒకటి. ముఖ్యంగా టెక్నాలజీ, సైన్స్‌ అంశాలకు ఇది ప్రసిద్ధి. ఆటోమొబైల్స్, డిజిటల్, ఫైబర్‌ ఆప్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్‌ టెక్నాలజీ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల విషయంలో ఈ దేశానికి చాలా పేరుంది. ఉత్తమ విద్యా ప్రమాణాలు, పరిశ్రమాధారిత బోధన కారణంగా విదేశీ విద్యార్థులు ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం- ప్రపంచ అత్యుత్తమ 100 విశ్వవిద్యాలయాల్లో 13 జపాన్‌ యూనివర్సిటీలు ఉన్నాయి.

జపాన్‌ ఎందుకు?

నాణ్యమైన విద్య, ముఖ్యంగా స్టెమ్‌ కోర్సులకు ఈ దేశం ప్రాచుర్యం పొందింది. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు మూడు లక్షల విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తున్నారు. యూఎస్‌ఏ, యూకే లాంటి దేశాలతో పోలిస్తే ఖర్చు తక్కువనే చెప్పొచ్చు. ఒకప్పుడు ఈ దేశాన్ని ఎంచుకోవడానికి బోధనా భాష అడ్డంకిగా ఉండేది. కానీ అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే ఉద్దేశంతో కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో కోర్సులను తప్పనిసరి చేశారు. అంతర్జాతీయ విద్యార్థులకు ఎన్నో స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్‌ ఫీజులో తగ్గింపులను అందిస్తున్నారు. జపాన్‌ మెరుగైన జీవన ప్రమాణాల్లో మొదటి స్థానంలో, భద్రతలో తొమ్మిదో ర్యాంకులో నిలిచింది.

సెమిస్టర్‌ విధానం...

విద్యాసంవత్సరం ఏప్రిల్‌లో మొదలై మార్చిలో ముగుస్తుంది. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. చాలావాటిల్లో రెండు సెమిస్టర్లు ఉన్నాయి. కొన్ని ట్రైమిస్టర్లనూ అందిస్తున్నాయి. క్రెడిట్‌ విధానం ఉంది. జూన్‌ నుంచి జనవరి వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఏప్రిల్‌లో ప్రవేశాలుంటాయి. ఇంగ్లిష్‌లో కోర్సులు చేస్తూ జపనీస్‌ నేర్చుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు చాలావరకూ విశ్వవిద్యాలయాలు అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటికి ప్రత్యేకంగా ఫీజు ఏమీ ఉండదు. టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ స్కోరును ఇక్కడి విద్యాసంస్థలు అంగీకరిస్తున్నాయి. టోఫెల్‌ స్కోరు 75-80 మధ్య ఉండాలి. ఐఈఎల్‌టీఎస్‌ కనీసం 6 ఉండాలి. ఈ స్కోరుతోపాటు సర్టిఫికెట్‌ ఆఫ్‌ అకడమిక్‌ అచీవ్‌మెంట్‌.. స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (శాట్‌), ఎగ్జామినేషన్‌ ఫర్‌ జపనీస్‌ యూనివర్సిటీ అడ్మిషన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ (ఈజేయూ) లేదా హైస్కూలు గ్రాడ్యుయేట్‌ స్టాండర్డైజ్డ్‌ స్కోరుల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాలి.

వీసా ప్రక్రియ

విశ్వవిద్యాలయం నుంచి ప్రవేశం పొందిన తర్వాత ఆ దేశంలోని రీజినల్‌ ఇమిగ్రేషన్‌ బ్యూరో నుంచి ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎలిజిబిలిటీ ఫర్‌ ఎ స్టేటస్‌ ఆఫ్‌ రెసిడెన్స్‌’ కు దరఖాస్తు చేసుకోవాలి. విశ్వవిద్యాలయమే సంబంధిత పత్రాన్ని విద్యార్థికి పంపుతుంది. వీసా దరఖాస్తులో భాగంగా విద్యార్థి దాన్ని మనదేశంలోని జపాన్‌ ఎంబసీ/ కాన్సులేట్‌లో సమర్పించాలి. దీంతోపాటు ఖర్చులను భరించగలిగే సామర్థ్యాన్ని నిరూపించుకునే పత్రాలనూ (ఇన్‌కం సర్టిఫికెట్, గ్యారెంటర్‌ ఇన్‌కం, టాక్సేషన్‌ సర్టిఫికెట్‌ లాంటివి) జత చేయాలి.జపాన్‌లో విద్యాసంస్థల్లో అడ్మిషన్ల సమాచారం కోసం https://www.jasso.go.jp/en/index.html వెబ్‌సైట్‌ చూడవచ్చు.

విద్యా విధానమిదీ

పన్నెండో తరగతి (ఆరేళ్ల ఎలిమెంటరీ స్కూలు విద్య, సెకండరీ ఎడ్యుకేషన్‌ - 3 ఏళ్లు లోయర్‌ సెకండరీ స్కూలు, 3 ఏళ్లు అప్పర్‌ సెకండరీ స్కూలు) తరువాతి విద్యను హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కింద పరిగణిస్తారు. అయిదు రకాల విద్యాసంస్థలు ఉంటాయి. 1. కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ (టెక్నాలజీ సంబంధిత అసోసియేట్‌ డిగ్రీలు) 2. ప్రొఫెషనల్‌ ట్రెయినింగ్‌ కాలేజీలు (డిప్లొమా కోర్సులు) 3. జూనియర్‌ కాలేజీలు (అసోసియేట్‌ డిగ్రీలకు) 4. యూనివర్సిటీస్‌ (గ్రాడ్యుయేట్లకు) 5. గ్రాడ్యుయేట్‌ స్కూల్స్‌ (పీజీ, పీహెచ్‌డీ కోర్సులు) బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల కాలవ్యవధి నాలుగు నుంచి ఆరేళ్ల వరకూ ఉంటుంది. మాస్టర్‌ డిగ్రీకి రెండేళ్లు, పీహెచ్‌డీకి మూడేళ్లు. అసోసియేట్‌ డిగ్రీల కాలవ్యవధి రెండు నుంచి మూడున్నరేళ్లవరకూ ఉంటుంది. డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాల వ్యవధి రెండు నుంచి నాలుగేళ్లు. యూనివర్సిటీ, జూనియర్‌ కాలేజీ/ ప్రొఫెషనల్‌ ట్రెయినింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి 12 ఏళ్ల విద్యాభ్యాసం పూర్తిచేసి ఉండాలి. కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రవేశానికి పదకొండేళ్లు, గ్రాడ్యుయేట్‌ స్కూల్‌లో ప్రవేశానికి పదహారేళ్ల విద్య తప్పనిసరి.

ఇంగ్లిష్‌లో బోధించే ప్రముఖ విశ్వవిద్యాలయాలు:

అకిటా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ

రిత్సుమేకన్‌ ఏషియా పసిఫిక్‌ యూనివర్సిటీ

మియజాకీ ఇంటర్నేషనల్‌ కాలేజ్‌

ఒకగాక్యువెన్‌ యూనివర్సిటీ

నగోయా యూనివర్సిటీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌

ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీ

ఒసాకా జోగకున్‌ యూనివర్సిటీ

సోఫియా యూనివర్సిటీ

కన్సాయ్‌ గయ్‌డాయ్‌ యూనివర్సిటీ

హితోత్సుబషి యూనివర్సిటీ

వసేద యూనివర్సిటీ

షిబరా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

స్కాలర్‌షిప్‌లు

అంతర్జాతీయ విద్యార్థులకు ఆర్థికసాయాన్ని అందించడానికి పలురకాల స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి మొత్తాన్ని అందిస్తున్నాయి. మిగతావి చాలావరకూ విద్యార్థి ట్యూషన్‌ ఫీజు, నివాస ఖర్చుల్లో కొంత మొత్తాన్ని కవర్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పీజీ విద్యార్థులకు ఎంఈఎక్స్‌టీ అందించేవాటిని ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకోవచ్చు. వీటిలో ఎక్కువ శాతం విద్యార్థి సమర్పించిన పత్రాల ఆధారంగా అందజేస్తారు. కొన్నింటిని మాత్రం రాతపరీక్ష, ఇంటర్వ్యూ ప్రకారం ఇస్తారు. ఆ దేశాన్ని చేరకముందే దరఖాస్తు చేసుకునే స్కాలర్‌షిప్‌లూ ఉన్నాయి. చాలావాటికి కళాశాల్లో రిపోర్ట్‌ చేసిన తర్వాతే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

జపాన్‌ గవర్నమెంట్‌ (ఎంఈఎక్స్‌టీ) అందించే.. యంగ్‌ లాడర్స్‌ ప్రోగ్రామ్, రిసెర్చ్‌ స్టూడెంట్స్‌ (నాన్‌ డిగ్రీ), రిసెర్చ్‌ స్టూడెంట్స్‌ (మాస్టర్స్‌ కోర్స్‌), రిసెర్చ్‌ స్టూడెంట్స్‌ (డాక్టోరల్‌ కోర్స్‌), టీచర్‌ ట్రెయినింగ్, అండర్‌ గ్రాడ్యుయేట్‌/ టెక్నాలజీ/ స్పెషలైజ్‌డ్‌ ట్రెయినింగ్‌/ జపనీస్‌ స్టడీస్‌.. వీటికి జపాన్‌కు వెళ్లకముందే అప్లై చేసుకోవచ్చు.

దేశంలోని జపనీస్‌ ఎంబసీ లేదా కాన్సులేట్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టవచ్చు. నెలవారీ స్టైపెండ్‌ పొందొచ్చు.

రిజర్వేషన్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ మన్‌బుకగాక్షూ ఆనర్స్‌ స్కాలర్‌షిప్స్‌ ఫర్‌ ప్రైవేట్లీ ఫైనాన్స్‌డ్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌.. దీనికి జేఏఎస్‌ఎస్‌ఓ (జాసో) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇదీ నెలవారీ స్టైపెండ్‌ను చెల్లిస్తుంది.

ఇవేకాకుండా స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దాదాపుగా 132 వరకు విదేశీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.

పార్ట్‌టైం వర్క్‌: వారానికి 28 గంటలు చేసుకోవచ్చు. సెలవు రోజుల్లో 8 గంటలు చేసుకునే వీలూ ఉంది. దీనికి విద్యాసంస్థ, ఇమిగ్రేషన్‌ సర్వీస్‌ బ్యూరోల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. చదువు, అటెండెన్స్‌కు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. హాజరు తగ్గితే కోర్సు నుంచి తొలగిస్తారు.

విద్యకూ, పరిశోధనకూ..

ఉత్తమ విశ్వవిద్యాలయాలను కలిగిన దేశంగా జపాన్‌కు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. నాణ్యమైన విద్యతోపాటు పరిశోధనకూ ఇక్కడ ప్రాముఖ్యం ఎక్కువ. అందుకే ఏటా 2,30,000 మంది అంతర్జాతీయ విద్యార్థులు విద్యాభ్యాసానికి ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుత తరం ఇంజినీరింగ్‌ కోర్సులకూ ప్రాధాన్యం పెరుగుతోంది. అంతర్జాతీయ బృందంతో, విభిన్న సంస్కృతుల వారితో పనిచేయడం, ఒకరి పనిని, నైపుణ్యాలను గౌరవించడం వంటి లక్షణాలు అభ్యర్థులకు అవసరం. వాటిని అందరూ తెలుసుకోవాలి. నిరంతరం నేర్చుకునే తత్వం, సమస్య ఆధారంగా నేర్చుకోవడం (ప్రాబ్లమ్‌ బేస్డ్‌ లర్నింగ్‌) తప్పనిసరి. ఇలాంటి బోధన ఇక్కడి విశ్వవిద్యాలయాల ప్రత్యేకత.
ఉదాహరణకు- షిబరా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ‘ఇంటర్నేషనల్‌ హైస్కూల్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం’ ఆ తరహాదే. దీనిద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన హైస్కూలు విద్యార్థులను ఆహ్వానించి రిసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కల్పిస్తున్నాం. సాంప్రదాయిక తరగతి ధోరణికి భిన్నంగా అభ్యాస అనుభవాన్ని విస్తరించుకోవటానికీ, పరిశోధనలో కెరియర్‌ను నిర్మించుకోవటానికీ ఈ ప్రోగ్రాం తోడ్పడుతుంది. సురక్షిత వాతావరణంతోపాటు, మంచి ఉద్యోగావకాశాలు జపాన్‌లో విద్యార్థులను ఆకర్షించే అంశాలు.

- డాక్టర్‌ మురళీధర్‌ మిర్యాల

డిప్యూటీ ప్రెసిడెంట్, బోర్డ్‌ ఆఫ్‌ కౌన్సిలర్, షిబరా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, జపాన్‌; miryala1@shibaura-it.ac.jp

ఖర్చుల వివరాలు

ఫీజు: అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌కు ఏడాదికి నేషనల్‌ యూనివర్సిటీ రూ.5,43,538, స్థానిక ప్రభుత్వ యూనివర్సిటీలో రూ.6,16,450, ప్రైవేటు యూనివర్సిటీ అయితే రూ.7,29,000 నుంచి రూ.10,87,000 వరకూ అవుతుంది. మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లకు ఏడాదికి నేషనల్‌ యూనివర్సిటీలకు రూ.5,42,000, పబ్లిక్‌ యూనివర్సిటీలకు రూ.5,09,656, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు రూ. 4,38000 నుంచి రూ.8,28,000 వరకూ అవుతాయి.

బీమా: అంతర్జాతీయ విద్యార్థులు నేషనల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సిస్టమ్‌ను తప్పక తీసుకోవాలి. విద్యార్థి నివసించే ప్రదేశాన్ని బట్టి దీనిలో మార్పులుంటాయి. సాధారణంగా దీనికి రూ.15,400 వరకూ అవుతుంది. దీనిలో హెల్త్‌ ఇన్సూరెన్స్, వ్యక్తిగత ప్రమాద బీమా, లయబిలిటీ ఇన్సూరెన్స్‌ మూడూ కవర్‌ అవుతాయి.
దైనందిన ఖర్చులు: వీటిలోనూ ప్రాంతాన్ని బట్టి మార్పులుంటాయి. సాధారణంగా నెలకు రూ.47,700 నుంచి రూ.66,000 వరకూ వ్యయం అవుతుంది.

రెండు దశల్లో ఎంపిక

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు రెండు దశల్లో ఎంపిక చేస్తాయి. మొదటి దశలో విద్యార్థి ధ్రువపత్రాలను స్క్రీనింగ్‌ చేస్తాయి. వాటి ప్రకారం ఫోన్‌/ వీడియో ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తాయి.

సమర్పించాల్సిన పత్రాలు:

దరఖాస్తు పత్రం

పర్సనల్‌ స్టేట్‌మెంట్‌/ అకడమిక్‌ ఎస్సే

డిగ్రీ ట్రాన్‌స్క్రిప్ట్స్‌

రిఫరెన్సెస్‌/ లెటర్‌ ఆఫ్‌ రెకమెండేషన్‌ (కనీసం 2)

ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ స్కోర్లు, సర్టిఫికెట్లు

అప్లికేషన్‌ ఫీ సర్టిఫికెట్‌.

Posted Date : 20-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం