• facebook
  • whatsapp
  • telegram

ఆహ్వానిస్తోంది ఆడి.. బెంజి దేశం!

ఆటోమోటివ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌ కోర్సులను విదేశాల్లో చదవాలనుకుంటే మొదటి ప్రాధాన్యం జర్మనీకి ఇవ్వచ్చు. తక్కువ ఖర్చు.. నాణ్యమైన విద్యకు ఈ దేశం పేరుపొందింది. వందకుపైగా నోబెల్‌ అవార్డు గ్రహీతలు ఈ దేశం నుంచే ఉండటం ఇక్కడి విద్యావిధానం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. వృత్తివిద్య, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో రాణించాలనుకునే వారు ఇక్కడి కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జర్మనీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కొంచెం సులువుగానే లభిస్తాయి. అక్కడ జీవన ప్రమాణాలూ మెరుగ్గానే ఉంటాయి. నాణ్యమైన విద్య, తక్కువ ఫీజులు, కోర్సు పూర్తయిన తర్వాత అవకాశాలు లభించడం, భద్రమైన భవిష్యత్తు తదితర కారణాలతో ఈ దేశానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళుతున్నారు. ఇక్కడి విదేశీ విద్యార్థుల సంఖ్యలో మనవాళ్లు రెండో స్థానంలో ఉన్నారు. తయారీ రంగం, పరిశోధన, అభివృద్ధిలో జర్మనీ విశ్వవ్యాప్త ఖ్యాతిని పొందింది. ప్రపంచ మార్కెట్‌లో సుస్థిర స్థానం పొందిన ఆడి, బెంజి, ఫోక్స్‌వ్యాగన్‌ కార్లు, బాష్‌ వాషింగ్‌ మెషీన్లు జర్మన్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యాలకు మచ్చుతునకలు.
భారత్‌ నుంచి జర్మనీ వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువమంది ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. మ్యాథమేటిక్స్‌, నేచురల్‌ సైన్సెస్‌, లా, ఎకనామిక్స్‌, సోషల్‌ సైన్సెస్‌ కోర్సులు తర్వాతి స్థానంలో ఉన్నాయి. బయోటెక్నాలజీ రంగంలో జర్మనీ విశేష అభివృద్ధిని నమోదు చేస్తోంది. వస్తు ఎగుమతి, దిగుమతుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. జీడీపీ ప్రకారం ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. వందకు పైగా నోబెల్‌ గ్రహీతలు ఈ దేశం నుంచి ఉన్నారు. విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో జర్మనీ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం దాదాపు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎనభై శాతం మంది స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) కోర్సులు చదువుతున్నారు.

 

స్థానిక భాషపై అవగాహన

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు అనే విధానం జర్మనీలో లేదు. ఎవరికి వారే ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. విషయ పరిజ్ఞానం ఉన్నవారికి ఢోకా ఉండదు. విద్యా బోధన ఆంగ్లంలో జరిగినప్పటికీ రోజువారీ అవసరాలకు జర్మన్‌ భాషపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఉద్యోగాల విషయంలో జర్మన్‌ భాష వచ్చినవారికి కొంత ప్రాధాన్యం లభిస్తుంది. ఇక్కడ అద్దెకు వసతి దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది. ముందుగానే తెలిసినవారి సహాయం తీసుకోవడం మంచిది. చాలావరకు పనులు ఎవరికి వారే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్వతంత్రంగా ఉండడానికి సిద్ధం కావాలి.

రెండుసార్లు ప్రవేశాలు

జర్మనీ యూనివర్సిటీలను రెండు రకాలుగా విభజించుకోవచ్చు. కొన్ని టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు, మరికొన్ని అప్లైడ్‌ సంస్థలు. మొదటివి మాత్రమే డాక్టోరల్‌ డిగ్రీలను అందిస్తాయి. అందువల్ల అవసరాలకు తగిన విధంగా వేటిలో చేరాలో ముందే నిర్ణయించుకోవాలి. ఏడాదిలో సమ్మర్‌, వింటర్‌ల్లో రెండుసార్లు ప్రవేశాలుంటాయి. విదేశీ విద్యార్థుల కోసం పలు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. వాటిలో డాడ్‌, ఎరాస్‌మస్‌ ముఖ్యమైనవి. ఈ రెండూ ప్రభుత్వ ప్రోత్సాహకాలు. ప్రభుత్వేతర స్కాలర్‌షిప్‌లను పదహారుకు పైగా సంస్థలు ఇస్తున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని యూనివర్సిటీలు ప్రత్యేకంగా ఆర్థికసాయాన్ని అందిస్తున్నాయి. ఇక్కడ చదువుతున్న, స్థిరపడిన భారతీయుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల ఏ సంస్థలో చేరినప్పటికీ భారతీయుల ఉనికి కనిపిస్తుంది. జర్మనీలో చదువుల కోసం పూర్తి అధికారిక సమాచారం ‌www.daad.de/en/ నుంచి పొందవచ్చు.
వింటర్‌ సెమిస్టర్‌ కోసం దరఖాస్తులను ఏటా మే నుంచి జులై 15 వరకు స్వీకరిస్తారు. కోర్సులో ప్రవేశానికి అనుమతిస్తూ లేఖలు ఆగస్టు లేదా సెప్టెంబరులో పంపుతారు. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే సెప్టెంబరు లేదా అక్టోబరులో సమాచారం అందుతుంది. అక్టోబరులో తరగతులు మొదలవుతాయి. సమ్మర్‌ సెమిస్టర్‌ కోసం దరఖాస్తులను డిసెంబరు నుంచి జనవరి 15 వరకు ఆహ్వానిస్తారు. వీటికి అనుమతి లేఖలు ఫిబ్రవరి లేదా మార్చిలో వస్తాయి. తరగతులు మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి మొదలవుతాయి.
అర్హతలు: ఈ దేశంలో టాప్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు జీఆర్‌ఈ 300 స్కోరుతో లభిస్తున్నాయి. ఐఈఎల్‌టీఎస్‌లో 6 లేదా టోఫెల్‌ వంద స్కోర్‌ ఉండాలి. మంచి అకడమిక్‌ నేపథ్యం, పని అనుభవం మేటి సంస్థల్లో ప్రవేశానికి ఉపయోగపడతాయి.

కోర్సులు... ఫీజు

ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, పరిశోధన రంగాల్లో రాణించాలనుకునేవారు జర్మనీ గురించి ఆలోచించవచ్చు. వివిధ సంస్థలు ప్రకటిస్తోన్న వరల్డ్‌ ర్యాంకింగ్‌ జాబితాలో ఈ దేశం నుంచి కనీసం 45 విశ్వవిద్యాలయాలకు చోటు దక్కుతోంది. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ టాప్‌ యూనివర్సిటీస్‌ -2020 జాబితాలో వందలోపు ఉన్న సంస్థల్లో ఎనిమిది జర్మనీలో ఉన్నాయి. వసతి, ఆహారం, ఇతర అవసరాలకు ఏడాదికి సుమారు రూ.8 లక్షలు అవసరమవుతాయి. మ్యూనిక్‌లాంటి ప్రాంతాల్లో ఇంకా కొంత ఎక్కువ వ్యయం అవుతుంది. ఫీజు తక్కువగా ఉన్నప్పటికీ అద్దెలు ఎక్కువగానే ఉంటాయి. రెండేళ్ల పీజీ కోర్సు పూర్తి చేయడానికి అన్నీ కలిపి రూ.25-30 లక్షల వరకు అవుతుంది. ఆటోమోటివ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌- ఈ నాలుగు విభాగాలకు జర్మనీ ప్రసిద్ధి చెందింది. ఎక్కువ కోర్సులు వింటర్‌ సెమిస్టర్‌లో, మరికొన్ని సమ్మర్‌లోనూ, ఇంకొన్ని రెండు సీజన్లలో ప్రారంభమవుతాయి. పీజీ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడానికి వెయ్యికి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐటీ ప్రొఫెషనల్‌ కోర్సు పూర్తయిన తర్వాత సగటున ఏడాదికి 33,000 - 40,000 యూరోల వేతనంతో ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు ఇక్కడ గిరాకీ ఉంది.

అనుకూల అంశాలు
ట్యూషన్‌ ఫీజు

చాలా వర్సిటీలు యూజీ కోర్సులకు ట్యూషన్‌ ఫీజు తీసుకోవడం లేదు. వివిధ సేవల కోసం ఖర్చు మన కరెన్సీలో రూ.12,800 నుంచి రూ. 21,200 వరకు చెల్లించాలి. పీజీ కోర్సులకు ఫీజు ఉంటుంది. ఇది యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియాలతో పోలిస్తే తక్కువే.
 

ఆంగ్లంలో బోధన
జర్మనీలో 400కు పైగా విశ్వవిద్యాలయాలు వైవిధ్యమైన కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ప్రసిద్ధ సంస్థలూ ఉన్నాయి. చాలా యూనివర్సిటీలు ఆంగ్లమాధ్యమంలో బోధన అందిస్తున్నాయి. కాబట్టి స్థానిక భాషతో ఇబ్బంది లేదు.

 

అనుసంధానం
ఇక్కడి విద్యా బోధన థియరీ, ప్రాక్టికల్స్‌ విధానంలో ఉంటుంది. కోర్సు పూర్తిచేసుకునేలోపే ఆ విభాగానికి చెందిన పరిశ్రమల్లో పనిచేసే అవకాశం కల్పిస్తారు. లర్నింగ్‌ బై డూయింగ్‌ జర్మనీ విద్యా వ్యవస్థ ప్రత్యేకత.

 

పనికి వెసులుబాటు
ఇక్కడ చదివే విదేశీ విద్యార్థులు అధికారికంగా ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఏడాదిలో 120 మొత్తం రోజులు లేదా 240 అర్ధ రోజులు (పార్ట్‌ టైం) పనిచేసుకుంటూ సంపాదించుకోవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత 18 నెలల పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.

Posted Date : 20-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం