• facebook
  • whatsapp
  • telegram

విలువైన కోర్సులకు విశిష్ట గమ్యాలు!

* ఉపకారవేతనాలకు అవకాశం

విదేశాల్లో చదువుకోవాలంటే అయిదో.. ఆరో దేశాలు ఠక్కున గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచ ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో పేరు సంపాదించుకున్న మరెన్నో దేశాలూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. వాటిలో స్వీడన్‌, నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌, నార్వే ఇప్పుడు భారతీయ విద్యార్థులకు సరికొత్త గమ్యస్థానాలుగా మారుతున్నాయి. అవసరాలు, అందుబాటు ఫీజులు, బోధన విధానాలు, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు వీటిని ఎంచుకుంటున్నారు.

విదేశాల్లో ఉన్నతవిద్య అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే. ఎక్కువమంది భారతీయ విద్యార్థులు ఈ దేశాలకు వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్నో దేశాలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. వీటిలో కొన్నిచోట్ల ఉచితంగా చదువుకునే అవకాశమూ ఉంది.

స్వీడన్‌ - పరిశోధనలకు పేరు
ఆవిష్కరణలు, పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దేశం స్వీడన్‌. ఇక్కడి బోధనా విధానం ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా పేరుపొందింది. ఈ దేశ విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా, సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రాధాన్యమిస్తాయి. ఇక్కడి బోధన విధానం డిగ్రీలు, క్రెడిట్‌లు అందించే లక్ష్యంతో కాకుండా తార్కికత, హేతుబద్ధత, అనువర్తనం పెంపొందించే విధంగా ఉంటాయి.
ఉత్తమ సంస్థలు: లండ్‌ యూనివర్సిటీ, కేటీహెచ్‌ రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యుప్సాల యూనివర్సిటీ, చాల్మర్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, స్టాక్‌ హోం యూనివర్సిటీ, గూతెన్‌బర్గ్‌ యూనివర్సిటీ, కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌.
ఉత్తమ కోర్సులు: పరిశోధన (రిసెర్చి), కంప్యూటర్‌ సైన్స్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఈ దేశం ప్రసిద్ధి.
ట్యూషన్‌ ఫీజు: ఇక్కడి విశ్వవిద్యాలయాలు ట్యూషన్‌ ఫీజు వసూలు చేస్తాయి. కొన్ని సంస్థలు భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. కేటీహెచ్‌ ఇండియా స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారు ప్రతినెలా వసతి, ఇతర ఖర్చుల కోసం కొంత మొత్తం పొందవచ్చు.
ప్రవేశాలు: ఎక్కువ కోర్సులు ఆటమ్‌ ఇన్‌టేక్‌ (ఆగస్టు-సెప్టెంబరు)లో ఉంటాయి. వీటికి అక్టోబరు మధ్య నుంచి జనవరిలోగా దరఖాస్తు చేసుకోవాలి. స్ప్రింగ్‌ సెమిస్టరు జనవరిలో మొదలవుతుంది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

 

నార్వే - ట్యూషన్‌ ఫీజు లేదు
ఈ దేశంలో మూడేళ్లకే యూజీ పూర్తవుతుంది. అందువల్ల మనదేశానికి చెందిన సాధారణ గ్రాడ్యుయేట్లు నేరుగా పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. ఉన్నత ప్రమాణాలతో విద్యనందించే దేశంగా నార్వే గుర్తింపు పొందింది. ట్యూషన్‌ ఫీజు వసూలు చేయకపోవడం ఈ దేశం ప్రత్యేకత. పీజీ స్థాయిలో 200 కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు.నిరుద్యోగం రేటు 3 శాతం మాత్రమే. ఇక్కడ జీవన ప్రమాణాలు అత్యున్నతం.
ఉత్తమ సంస్థలు: వివిధ సర్వే సంస్థలు ప్రకటిస్తోన్న ర్యాంకుల ప్రకారం ఓస్లో యూనివర్సిటీ, బెర్జన్‌ విశ్వవిద్యాలయం, నార్వేజియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ ట్రోమ్సో, నార్వేజియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌, బెర్జెన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ స్టావేంజర్‌, నార్డ్‌ యూనివర్సిటీ, ఎన్‌హెచ్‌హెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, ఇన్‌లాండ్‌ నార్వే యూనివర్సిటీ ఆఫ్‌ అప్లయిడ్‌ సైన్సెస్‌ ఈ దేశంలో పేరున్న సంస్థలు.
ఉత్తమ కోర్సులు: ఇండస్ట్ర్టియల్‌ ఇంజినీరింగ్‌, ఐటీ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్‌ సైన్స్‌, నేచురల్‌ సైన్సెస్‌, ఎనర్జీ అండ్‌ సస్టెయినబిలిటీ, డిజిటల్‌ మీడియా, యానిమేషన్‌, విజువల్‌ ఆర్ట్స్‌.
ట్యూషన్‌ ఫీజు: పబ్లిక్‌ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవు. సెమిస్టర్‌ ఫీజుగా రూ.5000 గరిష్ఠంగా చెల్లిస్తే సరిపోతుంది. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు వసూలుచేస్తాయి. వసతి ఖర్చులకు ఏడాదికి దాదాపు రూ.10 లక్షలు అవసరమవుతాయి. వారానికి 20 గంటలు పార్ట్‌టైం పనిచేసుకోవచ్చు.
ప్రవేశాలు: కోర్సులు సాధారణంగా ఆగస్టులో మొదలవుతాయి. వీటికోసం ప్రతి సంవత్సరం డిసెంబరులోగా దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌ స్కోరు తప్పనిసరి.

 

మెరుగైన విద్యాప్రమాణాలు
నార్వే, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌ల్లోని విద్యాసంస్థల్లో మెరుగైన ప్రమాణాలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఉచితంగా చదువుకోవడానికీ అవకాశం ఉంది. నియామకాల్లో స్థానిక భాష తెలిసినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ చదవడానికి ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ (ఐఈఎల్‌టీఎస్‌ /టోఫెల్‌) స్కోరు తప్పనిసరి. ఉన్నతవిద్యకు ఈ దేశాలకు వెళ్లాలనుకుంటే ఏడాది ముందు నుంచే సన్నద్ధం కావడం మంచిది.
- ఉడుముల వెంకటేశ్వర రెడ్డి, విదేశీవిద్య సలహాదారు

డెన్మార్క్‌ - ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం
విద్యలో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో డెన్మార్క్‌ ఒకటి. జీవన ప్రమాణాలు బాగుంటాయి. ఇక్కడి విద్యాసంస్థలు ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు పొందుతున్నాయి. 500కు పైగా కోర్సులను ఆంగ్లంలో అందిస్తున్నారు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నవే. ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ. కోర్సులతో పరిశ్రమలు అనుసంధానమై ఉంటాయి.
ఉత్తమ సంస్థలు: కోపెన్‌హాగెన్‌ యూనివర్సిటీ, డెన్మార్క్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ, ఆరస్‌ యూనివర్సిటీ, ఆల్‌బర్గ్‌ యూనివర్సిటీ
ఉత్తమ కోర్సులు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, బయో మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ బయో టెక్నాలజీ, నేచురల్‌ సైన్సెస్‌
ట్యూషన్‌ ఫీజు: ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఉంటుంది. వసతి, ఖర్చులకు ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.11 లక్షలు వెచ్చించాలి.
ప్రవేశాలు: విద్యాసంస్థలను బట్టి ప్రవేశ సమయం వేర్వేరుగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబరులో మొదలయ్యే యూజీ కోర్సులకు మార్చిలోగా, జనవరి, ఫిబ్రవరి కోర్సులకు సెప్టెంబరులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఐఈఎల్‌టీఎస్‌ లేదా టోఫెల్‌ స్కోరు తప్పనిసరి.

 

నెదర్లాండ్స్‌ - టాప్‌ వందలో పలు సంస్థలు
ఈ దేశంలో సుమారు 85 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇవి అప్లయిడ్‌ సైన్స్‌, ట్రెడిషనల్‌ అని రెండు రకాలుగా ఉంటాయి. ఇక్కడ చదివే విదేశీ, భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. పబ్లిక్‌ యూనివర్సిటీల్లో స్కాలర్‌షిప్‌ సౌకర్యం లభిస్తుంది. రెండు వేలకుపైగా కోర్సులను ఆంగ్లంలో అందిస్తున్నారు.
ఉత్తమ సంస్థలు: వివిధ సర్వేల్లో టాప్‌ వందలోపు విశ్వవిద్యాలయాల జాబితాలో నెదర్లాండ్స్‌ దేశం నుంచి నమోదవుతున్నవి ఎన్నో ఉన్నాయి. డెల్ఫ్‌ట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, ఆమ్‌స్టర్‌డామ్‌ యూనివర్సిటీ, గ్రోనింగెన్‌ యూనివర్సిటీ, లైడెన్‌ యూనివర్సిటీ, ఎథోవెన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, యుట్రెక్ట్‌ యూనివర్సిటీ, వేగెనింగెన్‌ యూనివర్సిటీ అండ్‌ రిసెర్చ్‌, ట్వెంటే యూనివర్సిటీ, ఎరాస్మస్‌ యూనివర్సిటీ, రోట్టర్‌డామ్‌
ఉత్తమ కోర్సులు: ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఈ దేశం ప్రసిద్ధి.
ట్యూషన్‌ ఫీజు: కోర్సును బట్టి ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు ఉంటాయి.
ప్రవేశాలు: ఏడాదికి రెండుసార్లు. ఫిబ్రవరి (వింటర్‌), సెప్టెంబరు (ఆటమ్‌)లో ఉంటాయి. ఆటమ్‌ ఇన్‌టేక్‌లో అన్ని కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Posted Date : 20-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం