• facebook
  • whatsapp
  • telegram

దాటొద్దు.. చట్టబద్ధమైన దారి!

నకిలీ యూనివర్సిటీలో ప్రవేశం పొందేందుకు కొందరు తెలుగు విద్యార్థులు ప్రయత్నించి యు.ఎస్‌. ఇమిగ్రేషన్‌ అధికారులకు పట్టుబడటం, తర్వాతి పరిణామాలు కలకలం కలిగించాయి. కారణాలు ఏవైనా కోటి కలలతో సుదూర దేశం వెళ్లి, ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకోవటం దుర్భరం. మన విద్యార్థులు అమెరికా వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాల్లో లోపాలేమిటి? ఎక్కడ పొరపాటు జరుగుతోంది? ఇలా జరగకుండా ఉండాలంటే.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
అమెరికా వెళ్లాలని తపిస్తున్న యువతలో కొందరు అందుకు తగిన ప్రయత్నాలను నిజాయతీగా చేయటం లేదు. టోఫెల్‌, జీఆర్‌ఈ వంటివాటితో పని లేకుండానే ఫెర్మింగ్టన్‌ యూనివర్సిటీలో చేరవచ్చని ఇచ్చిన ప్రకటన వలలో 600 మందికి పైగా తెలుగు విద్యార్థులు, మొత్తంగా 1600 మంది చిక్కుకున్నారు. వారి సర్టిఫికెట్లు పరిశీలించిన ఇమిగ్రేషన్‌ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఫలితంగా వీరందరి భవిష్యత్తూ డోలాయమానంలో పడింది. విద్యావ్యవస్థపై తగిన అవగాహన లోపించటం వల్ల తప్పటడుగులు వేసి, వీరు సమస్యల్లో పడ్డారు. పొరుగూరు వెళ్లడానికి గూగుల్‌ మ్యాప్‌లో లొకేషన్‌ చెక్‌ చేసుకునే నేటి యువత అమెరికా వెళ్లడానికి అక్కడి ‘ప్రొటోకాల్‌’ను ఏమాత్రం పరికించడం లేదు. ఫలితమే నేడు తలెత్తిన పరిణామాలు. అసలు లోపం ఇక్కడి నుంచే మొదలు.
అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలంటే జీఆర్‌ఈ, టోఫెల్‌ లాంటి ప్రామాణిక పరీక్షల్లో మంచి స్కోరు సాధించాలి. ఇంగ్లిష్‌పై ఉండే సహజమైన భయమో, లేదా ఈ పరీక్షలను ఎలాగోలా గట్టెక్కిపోవాలనే ఆలోచనతోనో చాలామంది తెలుగు విద్యార్థులు ఈ పరీక్షల స్కోరుతో సంబంధం లేకుండా ప్రవేశం కల్పించే విద్యాసంస్థల్లో కళ్లు మూసుకుని చేరిపోతున్నారు. అమెరికాలో చిన్న గదిలో విద్యాసంస్థను ఆరంభించి అడ్మిషన్లకు ప్రకటనలు ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. ఇలాంటి సంస్థలకు జీఆర్‌ఈ, టోఫెల్‌ లాంటివాటితో పనిలేదు. వాటిలో కోర్సులు సరిగా ఉండవు. తరగతుల సంగతి చెప్పనే అక్కర్లేదు. మన విద్యార్థులు ఇలాంటి తక్కువ స్థాయి విద్యాసంస్థల వలలోనే పడుతూ... చివరకు ఇలా ఇమిగ్రేషన్‌ అధికారులకు పట్టుబడు తున్నారు.
జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షల గురించి భయపడాల్సిన అవసరం లేదు. వీటిని ఎదుర్కోవడం పెద్ద సమస్యా కాదు. అమెరికా వెళ్లాలన్న లక్ష్యం నిర్ణయించుకున్నప్పటి నుంచే స్వదేశంలోనే ఈ పరీక్షల్లో శిక్షణ పొందవచ్చు. తద్వారా మంచి స్కోరు సాధించడానికి అవకాశం ఉంది. కానీ అంత కష్టం ఎందుకనే చిన్న ఆలోచనాలోపం పెద్ద కష్టాల్లోకి నెట్టివేస్తోంది.

ఏం చేయాలి?
విశ్వవిద్యాలయాలూ, అవి అందించే కోర్సుల్లో నాణ్యత, పరిశోధనలు లాంటివి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నాణ్యమైన వర్సిటీలను ఎంపిక చేసుకునేలా జాగ్రత్తపడాలి.
* అమెరికాకు విద్యార్థిని ఆహ్వానించేముందు యూనివర్సిటీలు ముఖ్యంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
1. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, లెటర్‌ ఆఫ్‌ రికమెండేేషన్స్‌
2. జి.పి.ఎ.; అదనపు సమాచారం
3. జీఆర్‌ఈ, టోఫెల్‌ లాంటి పరీక్షల స్కోరు. ఈ మూడింటి ఉద్దేశాలను సరిగా అవగాహన చేసుకుంటే అమెరికాలో చట్టబద్ధంగా చదువుకోవడం చాలా సులభం.
* జీఆర్‌ఈ, టోఫెల్‌ లాంటి ప్రామాణిక పరీక్షల స్కోరుతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ కార్యకలాపాలు ముఖ్యం.
* ప్రామాణిక పరీక్షల కోసం ఇంజినీరింగ్‌లో చేరిన మొదటి ఏడాది నుంచే శ్రద్ధగా కృషి చేస్తే వీటిని సులువుగా ఎదుర్కొనే సామర్థ్యం అలవడుతుంది. కనీసం మూడో ఏడాది నుంచైనా వీటికోసం సన్నద్ధత అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే.. అమెరికా రావాలనే ప్రయత్నాల ప్రారంభానికి ముందే ప్రామాణిక పరీక్షల ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి.
* ఉన్నతవిద్య కోసం అమెరికా వచ్చే విద్యార్థి ‘సమాజం కోసం ఏం చేయగలడు?’ అనేది యూనివర్సిటీల అధికారులు పరిశీలిస్తారు. చదివిన కోర్సుకు సంబంధించే కాకుండా అదనంగా ఏం చేశాడనేది కూడా ముఖ్యమే. ఒక ప్రాజెక్టు, సామాజిక సేవ, ఇంజినీరింగ్‌ ప్రాజెక్టు వర్క్‌, నచ్చిన క్రీడ, మెచ్చిన వ్యాపకం..ఇలా ఎందులోనైనా ప్రావీణ్యం పెంచుకోవాలి. ఇంజినీరింగ్‌/ డిగ్రీ చేస్తూనే ఏదైనా ల్యాబ్‌లో పార్ట్‌టైమ్‌ పనిచేయడం ద్వారా ప్రాక్టికల్‌ నాలెడ్జి సంపాదించవచ్చు. ఇవన్నీ అమెరికాలో అడుగుపెట్టేందుకు సోపానాలవుతాయి.
* అమెరికా బయలుదేరేముందు అక్కడి స్థితిగతులు, చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.

సీపీటీ సంగతేమిటి?
తప్పుడు ధ్రువీకరణలతో అమెరికాకు వచ్చి/ అమెరికా వచ్చాక తప్పుడు పత్రాలతో ఉంటున్న వందల మంది తెలుగు విద్యార్థులను పట్టుకున్న ఉదంతంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు- సీపీటీ. కరిక్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌కు ఇది సంక్షిప్త రూపం. అమెరికాలోని విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్‌ను చేసుకునే అవకాశాన్ని అధికారికంగా ఇస్తాయి. సీపీటీ సమయంలో ఉపకార వేతనం తక్కువే లభిస్తుంది. సీపీటీ సాయంతో నిజానికి పెద్ద ఉద్యోగాలూ రావు. ఓపికతో ఈ ఇంటర్న్‌షిప్‌ను చట్టబద్ధంగా పూర్తిచేస్తే మంచి అవకాశాలు తలుపు తడతాయి. అయితే అంత ఓపిక లేని విద్యార్థులు సీపీటీ పేరుతో ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ను అడ్డదారిలో పొందుతున్నారు. ఈ ఆథరైజేషన్‌ సాయంతో డూప్లికేట్‌ డాక్యుమెంట్లు తయారుచేసుకుని ఫుల్‌టైమ్‌ జాబ్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ద్వారా అత్యధిక వేతనాలు పొందుతూ చదువులు సజావుగా సాగించాలనేది విద్యార్థుల ఆలోచన. అయితే ఇది సరైనదేనా? కాదా? అనే స్పృహ లోపించడం వల్ల ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ చట్టాల ప్రకారం ఓపిగ్గా సీపీటీ పూర్తి చేస్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

ఉద్యోగాలతో మొదటికే మోసం
అమెరికాకు వస్తున్న విద్యార్థులు ఇక్కడి ఖరీదైన విద్య తాలూకు ఖర్చును భరించేందుకు పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలకు ఆకర్షితులవుతున్నారు. నిబంధనల ప్రకారం ఇది తప్పు. చదువుకోడానికి వచ్చిన విద్యార్థి చదువుకోవడం మాత్రమే చేయాలి. సీపీటీ ఇంటర్న్‌షిప్‌ను వందశాతం చట్టబద్ధంగా పూర్తిచేయాలి. ఇలా చేయకుండా అడ్డదారిలో ఆథరైజేషన్‌ పత్రాలు పొంది ఫుల్‌టైమ్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయటం మొదటికే మోసం తెస్తోంది.
అమెరికా వర్సిటీల్లో చట్టబద్ధంగా ప్రవేశం పొందకుండా లేదా చట్టబద్ధంగా ప్రవేశం పొంది- వచ్చాక నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు కొందరు. ఇదే ఇబ్బందులను కలిగిస్తోంది. అమెరికా విద్యావిధానం పటిష్ఠమైనది. ఇక్కడ చదవాలంటే కొంత కష్టపడాలి. ఇందుకు ఇష్టంతో శ్రమించాలే కానీ షార్ట్‌కట్స్‌లో వెళ్తే... దీర్ఘకాలంలో అగచాట్లు తప్పవు. అమెరికాకు చదువుకోడానికి వచ్చి... కోర్సు పూర్తి కాగానే స్వదేశం తిరిగి వెళ్లే ఉద్దేశం ఉండాలి. అయితే చాలామంది కోర్సు పూర్తి కాగానే అమెరికాలోనే ఏదైనా ఉద్యోగం వెతుక్కుని ఉండిపోవాలని చూస్తున్నారు.

ఉన్నత స్థాయి సంస్థలెన్నో!
అమెరికాలో ఉన్న దాదాపు 4,800 ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయాల్లో సుమారు 4వేల వర్సిటీల్లో నిరంతరం పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. వీటన్నిటిలో పీహెచ్‌డీ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మిలియన్స్‌ ఆఫ్‌ ఎండోమెంట్‌ అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతవిద్య పూర్తిచేస్తే అలాంటివారు అక్కడే ఉండిపోవాలని అమెరికాయే ఆహ్వానం పలుకుతుంది. కానీ ఏదోలా అమెరికా వచ్చి, చిన్నాచితకా ఉద్యోగాలు చేసి సెటిలైపోదామనుకుంటే మాత్రం కుదరదు. అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు అధికారిక ర్యాంకింగులుండవు. ఏది మంచి వర్సిటీయో అమెరికా ప్రభుత్వం చెప్పదు. ఆయా వర్సిటీల్లోని డిపార్ట్‌మెంట్లకు ప్రైవేటు ఏజెన్సీలు ఇచ్చే ర్యాంకింగ్‌ వేరు. అందులో పనిచేసే ప్రొఫెసర్లకు ఇచ్చే ర్యాంకింగ్‌ వేరు. ఏ విషయాన్ని అయినా ఇంటర్నెట్‌ ద్వారా స్వేచ్ఛగా తెలుసుకోగల వీలుంది. ఆ రకంగా ప్రామాణిక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నించాలి.
- డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు, డైరెక్టర్‌, ఇండో అమెరికన్‌ స్టూడెంట్‌ కౌన్సిల్‌

Posted Date : 21-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం