• facebook
  • whatsapp
  • telegram

చలో యూకే!

* ఫాస్ట్‌ ట్రాక్‌ డిగ్రీలు
* కోర్సుతో పాటు ఇంటర్న్‌షిప్‌

విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు మొగ్గు చూపుతున్న దేశాల్లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మొదటి వరసలో నిలుస్తోంది. బోధనకూ, పరిశోధనకూ ఇక్కడి విద్యాసంస్థలు బాగా పేరుపొందాయి. కొన్నేళ్ల క్రితం విదేశీ విద్యార్థుల సంఖ్య కొంత మందగించినా ఇటీవలి కాలంలో మళ్లీ యు.కె.ను ఎంచుకుంటున్నవారు గణనీయంగా పెరుగుతున్నారు. తక్కువ కాలవ్యవధి కోర్సులు, ఫాస్ట్‌ ట్రాక్‌ డిగ్రీలు ఇక్కడి ఆకర్షణల్లో కొన్ని. గ్లోబల్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో యు.కె. విశ్వవిద్యాలయాలెన్నో ముందువరసలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి ఏటా ఈ విశ్వవిద్యాలయాల్లో చేరుతున్నారు. బ్రెగ్జిట్‌ ప్రభావం తగ్గించుకోవటానికి విదేశీ విద్యార్థుల ప్రవేశాలను యు.కె. ప్రోత్సహిస్తోంది!

అమెరికా కంటే ముందే విదేశీవిద్యకు ప్రాచుర్యం పొందింది యు.కె.నే! ఇక్కడి ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ లాంటి విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాలు ఎంతోకాలం నుంచి అత్యుత్తమ విద్యకు పేరుపొందాయి. మహాత్మా గాందీ,Å జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, డెస్మండ్‌ టుటు, జార్జ్‌ సొరోస్‌లాంటి గొప్ప నాయకులూ, తత్వవేత్తలూ ఉన్నతవిద్యలు చదివింది ఇక్కడే. వందకు పైగా నోబెల్‌ బహుమతి గ్రహీతలు యు.కె. విద్యాసంస్థల నుంచి వచ్చినవారే. క్రీడారంగంలో కూడా ఎంతో పేరు పొందింది. ఫుట్‌బాల్‌, టెన్నిస్‌, అథ్లెటిక్స్‌, రగ్బీ, క్రికెట్‌, స్నూకర్‌, గోల్ఫ్‌, హార్స్‌ రేసింగ్‌, సైక్లింగ్‌ లాంటి క్రీడల పోటీలకు ఇది ప్రముఖ వేదిక.

మిగిలిన దేశాలతో పోలిస్తే ఇక్కడ యూజీ, పీజీ ప్రోగ్రాములు పూర్తిచేయటానికి తక్కువ వ్యవధి పడుతుంది. దీంతో ట్యూషన్‌ ఫీజు, ఇతర ఖర్చులూ బాగా తగ్గిపోతాయి. మరో పక్క ప్రతిభావంతులకు ఉపకారవేతనాలు లభిస్తాయి. విద్యార్థి వీసాకు ఆన్‌లైన్‌ పద్ధతిని అమలుచేస్తున్నారు. ఎక్కువమంది విద్యార్థులు యు.కె. వస్తున్నందున వీసా ప్రక్రియ వేగవంతం కావటానికి మరింత మెరుగైన విధానం అన్వేషిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

గ్రేట్‌ స్కాలర్‌షిప్పులు
యు.కె.లో చదవటానికి భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు గ్రేట్‌ బ్రిటన్‌ కాంపెయిన్‌, బ్రిటిష్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా ‘గ్రేట్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్పుల’ను ఇస్తున్నాయి. కేంబ్రిడ్జి, యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో, యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాంప్టన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ మొదలైన 36 యు.కె. వర్సిటీల్లో 15 రకాల యూజీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు వీటిని ఉద్దేశించారు. ఎంపికైనవారికి మొదటి సంవత్సరం కోర్సు ట్యూషన్‌ ఫీజును అందిస్తారు. విద్యాపరంగా ఉత్తమ ప్రతిభ, ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ ట్రాక్‌ రికార్డు ఉండి, నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం ప్రదర్శించే విద్యార్థులు ఈ ఉపకారవేతనాలకు అర్హులవుతారు.

ముఖ్యమైన కోర్సులు
యు.కె.లో విభిన్న కోర్సులకు డిమాండ్‌ ఉంది. వాటిలో ముఖ్యమైనవి-
బిజినెస్‌: ఆంత్రప్రెన్యూర్‌ షిప్‌, అనలిటిక్స్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, మార్కెటింగ్‌
సైన్స్‌: మెరైన్‌ బయాలజీ, ఫిజిక్స్‌ అండ్‌ అస్ట్రానమీ, కెమిస్ట్రీ
ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ: ఏరోనాటికల్‌, బయో ఇంజినీరింగ్‌, సివిల్‌, మెకానికల్‌, కెమికల్‌
లా: క్రిమినాలజీ అండ్‌ లా, ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ లా, క్రిమినల్‌ జస్టిస్‌, సివిల్‌ లా
సోషల్‌ సైన్సెస్‌: ఆంత్రొపాలజీ, సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌
స్పోర్ట్స్‌ సైన్స్‌: స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ ఫిజియాలజీ, స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ న్యూట్రిషన్‌
మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌: జర్నలిజం, ఫిల్మ్‌ అండ్‌ టీవీ స్టడీస్‌, స్క్రీన్‌ రైటింగ్‌, డిజిటల్‌ మీడియా
ఆర్ట్స్‌: ఫైన్‌ ఆర్ట్‌ పెయింటింగ్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌
హాస్పిటాలిటీ: హాస్పిటాలిటీ అండ్‌ టూరిజం, మెడికల్‌ టూరిజం.

అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు
* యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి
* ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌
* యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌
* లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌
* కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో
* యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ వార్‌విక్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్‌గౌ
* యూనివర్సిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌
* దుర్హం యూనివర్సిటీ
* యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌
* లాన్‌కాస్టర్‌ యూనివర్సిటీ. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాలను నిర్ధరించే ఐఈఎల్‌టీఎస్‌ గానీ టోఫెల్‌ గానీ రాయాల్సివుంటుంది.
అవసరమైన ఐఈఎల్‌టీఎస్‌ స్కోరు: 6.5. కొన్ని విద్యాసంస్థల్లో 6 స్కోరు సరిపోతుంది.
టోఫెల్‌ స్కోరు: 90. కొన్ని విద్యాసంస్థలు అంతకంటే తక్కువ కూడా అనుమతిస్తాయి.

 

ఉద్యోగావకాశం
యూరోపియన్‌ యూనియన్‌లో భాగం కాని దేశాల విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం చూసుకోవటానికి నాలుగు నెలల వ్యవధే ఉంటుంది. ఈ తర్వాత వారిని యు.కె.లో ఉండనివ్వరు (డిపోర్టేషన్‌). కోర్సు పూర్తయ్యాక చాలామంది నాన్‌ ఈయూ విద్యార్థులు తమ దేశాలకు వెళ్లిపోతారు. కానీ యు.కె.లో ఉద్యోగం చేయాలనుకున్నవారు టయర్‌ టూ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏమిటీ వీసా?: టయర్‌ టూ వీసా స్పాన్సర్‌ లైసెన్స్‌ ఉన్న ఎంప్లాయర్‌ నుంచి నిర్దిష్ట నైపుణ్య స్థాయి ఉన్న ఉద్యోగ ఆఫర్‌ పొందినవారికి టయర్‌ టూ వీసా వస్తుంది. ఆ ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం కనీసం రూ. 18.35 లక్షలుండాలి. పీజీ కోర్సులు ముగిసిన తర్వాత విదేశీ విద్యార్థులు నాలుగు నెలలు కాకుండా ఆరునెలల కాలం ఉండాలంటే టయర్‌ ఫోర్‌ వీసా పైలట్‌ స్కీము ఉంది.

ట్యూషన్‌ ఫీజు ఎంత?
తరగతి గది ఆధారిత డిగ్రీలకు: రూ. 11.03 లక్షల నుంచి రూ. 15.88 లక్షలు, లేబరెటరీ ఆధారిత డిగ్రీలకు: రూ. 12.80 లక్షల నుంచి రూ. 19.41 లక్షలు, క్లినికల్‌ ప్రోగ్రాములకు: రూ. 18.53 లక్షల నుంచి రూ. 26.47 లక్షలు, టాప్‌ బీ స్కూల్స్‌లో ఎంబీఏకు: రూ. 14.12 లక్షల నుంచి రూ. 38.83 లక్షలు. ఇది ఏడాదికి నిర్ణయించిన ట్యూషన్‌ ఫీజు. దైనందిన ఖర్చులు ఏడాదికి రూ.7-10 లక్షల వరకు అవుతాయి.

యు.ఎస్‌.తో పోలిస్తే..
యు.ఎస్‌.తో పోలిస్తే యు.కె.లో కోర్సులు పూర్తిచేయటానికి ఏడాది తక్కువ పడుతుంది. యు.ఎస్‌.లో బ్యాచిలర్‌ డిగ్రీ 4 ఏళ్లు. యు.కె.లో 3 ఏళ్లు మాత్రమే. పీజీకి యు.ఎస్‌.లో 2 ఏళ్లు పడుతుంది. యు.కె.లో ఏడాది మాత్రమే. అమెరికాలో నిరంతరం రీడింగ్‌ రైటింగ్‌ అసైన్‌మెంట్స్‌ ఉంటాయి. యు.కె.లో జనరల్‌ అసైన్‌మెంట్లు ఉంటాయి. కొన్నిసంస్థల్లో సెమిస్టర్‌ పొడవునా అసైన్‌మెంట్లు ఉండకపోవచ్చు. చదువుకోవటానికి అయ్యే ఖర్చు అమెరికాతో పోలిస్తే యు.కె.లో కొంత తక్కువ. యు.ఎస్‌.లో అన్ని అసైన్‌మెంట్లు మొత్తం పరిశీలించి గ్రేడ్లు ఇస్తారు. యు.కె.లో అయితే సాధారణంగా ఫైనల్‌ పరీక్షలపై ఆధారపడి గ్రేడ్లు ఇస్తారు. భారత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు (ముఖ్యంగా బోధనా రంగంలో) ఆశించేవారికి ఏడాది పీజీతో ఇబ్బందులు ఎదురు కావొచ్చు.

ఇంటర్న్‌షిప్‌లు
యు.కె.లో చాలా విశ్వవిద్యాలయాలు ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, బిజినెస్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి ఎన్నో కోర్సులకు ఇంటర్న్‌షిప్‌లుంటాయి. కోర్సు పూర్తయ్యాక 6 నెలల నుంచి 1 సంవత్సరం వ్యవధిలో వీటిని పూర్తి చేయాల్సివుంటుంది. ఇవి అన్ని యూనివర్సిటీల్లోనూ లభించవు కాబట్టి దరఖాస్తు చేసుకునేముందే ఇంటర్న్‌షిప్‌ అవకాశం ఉందో లేదో ధ్రువీకరించుకోవాలి. ఇంటర్న్‌షిప్‌ ప్రక్రియలో భాగంగా విద్యార్థి ఉద్యోగం సంపాదించగలిగితే యు.కె.లో కొనసాగవచ్చు. అప్పుడు టయర్‌ టూ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- శుభకర్‌ ఆలపాటి

ప్రవేశాలకు గడువు
యూకేలో 3 విడతల్లో ప్రవేశాలు లభిస్తాయి. మొదటిది (టర్మ్‌ 1) సెప్టెంబరు - డిసెంబరు, రెండోది (టర్మ్‌ 2) జనవరి - ఏప్రిల్‌, మూడోది (సమ్మర్‌) ఏప్రిల్‌ - జూన్‌. ప్రస్తుతం డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతున్న వారు, పూర్తయిన వాళ్లు టర్మ్‌ 2, 3 పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రక్రియను ప్రారంభించవచ్చు. 6 నుంచి 12 విద్యాసంస్థలను ఎంచుకుని దరఖాస్తు చేసుకుంటే మేలు. దరఖాస్తు ప్రక్రియకు 6-8 నెలల సమయం పడుతుంది. కొన్ని విద్యాసంస్థలకు 3 నెలలముందు దరఖాస్తు చేసినా సరిపోతుంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల డెడ్‌లైన్స్‌తో పోలిస్తే పీజీ కోర్సుల గడువులు మరికొంత ఆలస్యంగా ఉంటాయి. నేరుగా సంబంధిత విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది.

Posted Date : 21-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం