• facebook
  • whatsapp
  • telegram

పాఠాల కంటే చర్చలే ఎక్కువ!

దేశ విదేశాల్లోని ప్రసిద్ధ సంస్థలు, కళాశాలలకు చదువుల కోసం ఏటా వేలమంది మన వాళ్లు వెళుతుంటారు. కానీ అక్కడి విద్యావిధానం గురించి తెలుసుకొని చేరేవాళ్లు చాలా తక్కువ. అందుకే ఆయా సంస్థల్లో బోధనా పద్ధతులు, వాతావరణం, జీవనం, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకున్న విద్యార్థులు ఈ కొత్త శీర్షిక ‘క్యాంపస్‌ మెయిల్‌’ ద్వారా వాటిని పంచుకుంటున్నారు. ఒక్కో సంస్థలో.. ఒక్కో కోర్సులో.. ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. విద్యాభ్యాసంతోపాటు బహుముఖ వికాసాన్ని పొందే అవకాశాలను క్యాంపస్‌లు కల్పిస్తాయి. ఆ వివరాలను ఈ ‘మెయిల్‌’లో తెలుసుకోవచ్చు.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ (యూ-పిట్‌)లో ఎంఎస్‌ సోషల్‌ వర్క్‌ కోర్సు చేస్తున్న మేధా మురళీధర్‌ అలాంటి విశేషాలను వివరిస్తున్నారు. సోషల్‌ వర్క్‌ అత్యుత్తమ శిక్షణ పొందిన వ్యక్తుల చేతిలో విలువైన మానవీయ పరికరం. ఇదో శాస్త్రం. ఈ విద్యలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్‌ మొదలైన స్థాయులున్నాయి. అన్నిటిలాగే ఈ వృత్తిలోనూ అంచెలంచెలుగా పైకి వచ్చే అవకాశాలున్నాయి. ఆర్థికంగా మంచి జీతభత్యాలున్నాయి. మానవ సంబంధాల పట్ల శాస్త్రజ్ఞానం, నైపుణ్యం ఉన్న వ్యక్తులు చేసే సంఘసేవ యావత్‌ సమాజానికీ ఉపయోగపడుతుంది.

నా సంగతికొస్తే- యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ-హెల్త్‌ సైకాలజీ పూర్తిచేసిన తర్వాత స్కాలర్‌షిప్‌తో యూ-పిట్‌లో రెండేళ్ల ఎంఎస్‌ సోషల్‌ వర్క్‌లో గత ఏడాది చేరాను. చేరిన మూడు నెలలకే సోషల్‌వర్క్‌ విభాగం నుంచి అంతర్జాతీయ ప్రతినిధిగా ఎన్నికవటం సంతోషాన్నిచ్చింది.

మనదేశ విద్యావిధానానికి భిన్నమైనది అమెరికన్‌ బోధనా పద్ధతి. ‘ఎంత ఎక్కువ’ నేర్చుకున్నామన్నదానికన్నా ‘ఎంత బాగా’ నేర్చుకున్నామన్నది ఇక్కడ ముఖ్యం. క్షేత్రస్థాయిలో తెలుసుకున్న విషయాన్ని ఎంత ప్రభావపూరితంగా అన్వయించగలమనేది గమనిస్తారు. ‘పిట్స్‌ బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌’ అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న విద్యాసంస్థ. కిందటి సంవత్సరమే శత వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంది.

నైపుణ్యాలకు పదును...

మా డిపార్ట్‌మెంట్లో మాస్టర్స్‌ విద్యార్థుల అధ్యయనం కోసం డైరెక్ట్‌ ప్రాక్టీస్‌, కోసా (కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ సోషల్‌ యాక్షన్‌) అనే స్ట్రీములుంటాయి. నేను కోసాను ఎంచుకున్నా. ప్రభుత్వాన్నీ, సంఘాన్నీ సంధానపరుస్తూ క్రియాశీలకంగా సంఘసేవ చేయటం దీనిలో ఉంటుంది. కోసా విద్యార్థిగా నా చదువు ఆసక్తికరంగా మాత్రమే కాదు; తెలివితేటలకూ, నైపుణ్యాలకూ పదును పెట్టేదిగానూ ఉంటోంది. మాస్టర్స్‌ విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఏదైనా సేవాసంస్థలో పనిచేయాల్సి వుంటుంది. వారంలో రెండు రోజులు ఫీల్డులో గడుపుతాం. రెండో సంవత్సరానికొచ్చేసరికి వారానికి మూడు రోజులు ఫీల్డులో, మిగిలిన రెండు రోజులు తరగతిలోఉంటాం. తరగతి పాఠాలు, ఇంటర్న్‌షిప్‌ కాకుండా విద్యార్థులు నేర్చుకోవటానికీ, పనిచేయటానికీ ఎన్నో కమిటీలుంటాయి. వివిధ సమస్యల విషయమై ఈ కమిటీలు సాంఘిక న్యాయం కోసం పోరాడుతూవుంటాయి. స్టూడెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్లో నన్ను అంతర్జాతీయ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఈ కౌన్సిల్లో పనిచేయటం వల్ల నాయకత్వ లక్షణాలు, పరస్పర సహకారం, సంయమనం అలవాటవుతాయి. ఈ కౌన్సిల్‌ నేరుగా డీన్‌ పర్యవేక్షణలో, ప్రొఫెసర్ల మార్గదర్శనంలో పనిచేస్తుంది. నాకు సంబంధించిన ఓ విశేషం- చేరిన ఆరు నెలలకు ‘ఐరిస్‌ మేరియాన్‌ యంగ్‌’ అనే అంతర్జాతీయ సమస్యల అధ్యయనకర్త పేర నెలకొల్పిన ఉత్తమ పురస్కారం నాకు దక్కటం. బాలల హక్కుల సంస్థలో విద్యాబోధనకు నేను ప్రవేశపెట్టిన సృజనాత్మక బోధనా పరికరాలకూ, నేతృత్వ స్ఫూర్తికీ ఈ గౌరవం లభించింది. మా విద్యాసంస్థలో ప్రత్యేకంగా లెక్చర్లు అంటూ జరగటం తక్కువ. వర్తమాన అంశాల గురించి తరగతిలో విద్యార్థులకూ, ప్రొఫెసర్లకూ మధ్య చర్చలే ఎక్కువ సాగుతాయి. ఫీల్డులో పనికొచ్చే కౌశలాలను పాఠాల ద్వారా నేర్పుతారు. పరీక్షల కోసం మాత్రమే చదవటం అనేది దాదాపు ఉండదు.

ఆహ్లాదకరంగా క్యాంపస్‌
ఈ యూనివర్సిటీ నగరంలో ఒక భాగం. దగ్గర్లో చాలా వరకూ పాతకాలం ఇళ్లు ఉంటాయి. కొందరు విద్యార్థులు కలిసి అద్దెకు తీసుకునివుంటారు. మాస్టర్స్‌ విద్యార్థులంతా క్యాంపస్‌ బయటే ఉంటారు. అమెరికాలోని ఇతర నగరాలకంటే పిట్స్‌బర్గ్‌లో విద్యార్థులకు రోజువారీ జీవితం ఖర్చు చవక అని చెప్పవచ్చు. విద్యార్థులకు బస్సు వసతి ఉచితం. మ్యూజియాలను ఉచితంగా చూడొచ్చు. లైబ్రరీ, ఫిట్‌నెస్‌ సెంటర్‌, వినోదం కోసం ప్రత్యేక ప్రదేశాలు, విద్యార్థి బృందాలు ఏర్పాటు చేసే కార్యక్రమాలతో క్యాంపస్‌ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మాస్టర్స్‌ కోర్సులో నేనొక్కదాన్నే భారతీయురాలిని. ప్రతి సబ్జెక్టులో పాతిక మంది కంటే ఎక్కువమందికి ప్రవేశం ఉండదు. దీనివల్ల ప్రొఫెసర్లు అందరిపట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించేందుకు వీలుంటుంది. భారతీయ విద్యార్థుల సంఘాలు యూనివర్సిటీలో ఉన్నాయి. కొత్తగా వచ్చిన భారతీయ విద్యార్థులకు సాయపడతారు. యూనివర్సిటీలో ఎంఎస్‌ సోషల్‌వర్క్‌ కోర్సు వివరాలు, ఇతర సమాచారం ఇంకా తెలుసుకోవాలంటే నన్ను సంప్రదించవచ్చు.
యూ-పిట్‌ వెబ్‌సైట్‌: https://www.socialwork.pitt.edu/
నా మెయిల్‌ ఐడీ: kmedha26@gmail.com

మీరూ రాయవచ్చు
సుప్రసిద్ధ విద్యాసంస్థల్లో మీరు చదువుతున్నారా? అయితే మీరూ ఈ శీర్షికకు రాయొచ్చు. మీ కళాశాల ప్రత్యేకతలనూ, కోర్సు, బోధన పద్ధతుల్లోని విశిష్టతలనూ అందరితో పంచుకోవచ్చు.
మా మెయిల్‌ ఐడీ: edc@eenadu.in

ఈ యూనివర్సిటీలో చేరాలంటే?
యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌


ప్రపంచ ర్యాంకింగులు, రివ్యూలు అద్భుతంగా ఉన్న యూనివర్సిటీ ఇది. పైగా పిట్స్‌బర్గ్‌లో నేరాల శాతం బాగా తక్కువ. దీనిలో చేరాలంటే... అన్ని మాస్టర్స్‌ కోర్సులకు ఉన్నట్లే టోఫెల్‌ స్కోరు, చదివిన కోర్సులో మంచి మార్కులు, ప్రొఫెసర్ల దగ్గర్నుంచి చక్కటి సిఫార్సులు తప్పకవుండాలి. ముఖ్యంగా స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ)తో యూనివర్సిటీ డిపార్ట్‌మెంటును ఒప్పించగలగాలి. జీఆర్‌ఈ స్కోరు అవసరం లేదు.

Posted Date : 21-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం