• facebook
  • whatsapp
  • telegram

ఎగిరే ముందు ...

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుబాటులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందస్తు ప్రణాళిక లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఏ దేశానికి వెళ్లాలి, ఏయే యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రామాణిక పరీక్షలేవి, వాటికి ఎప్పటి నుంచి సిద్ధం కావాలి, ఎంత ఖర్చవుతుంది..? ఇలాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. వచ్చే ఏడాది విదేశాల్లో డిగ్రీ లేదా పీజీ చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. అందుకే ఏయే అంశాలపై దృష్టిపెట్టాలో ఇప్పటి నుంచే తెలుసుకోవాలి.
నాణ్యమైన విద్యతోపాటు భవిష్యత్తు ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకునే ఉద్దేశంతో ఎక్కువమంది విదేశీ విద్యపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో విభిన్న సంస్కృతులు, అంతర్జాతీయ ఆలోచన విధానాలపై అవగాహన ఏర్పడుతోంది. ఏ దేశంలో చదవాలి అన్నది విద్యార్థి ఆసక్తి, స్థోమత, కెరియర్‌ అవకాశాల ఆధారంగా నిర్ణయించడం మంచిది.
మనదేశ విద్యార్థులకు ఫారిన్‌ ఎడ్యుకేషన్‌ అనగానే సాధారణంగా పీజీ గుర్తొస్తుంది. కొన్నేళ్లుగా కొందరు గ్రాడ్యుయేషన్‌పైనా దృష్టిపెడుతున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్నవారు విదేశాల్లో చదవాలని అనుకుంటే.. అందుకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు, వాటి దరఖాస్తు విధానం వంటి అంశాలపై ఇప్పటి నుంచే అవగాహన ఏర్పరచుకోవడం అవసరం. అబ్రాడ్‌ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎంతో సమాచారం ఇప్పుడు అంతర్జాలంలో అందుబాటులో ఉంది. కానీ తగిన వాటిని నిర్ణయించుకోడానికి కొన్ని అంశాలను పరిశీలించుకోవాలి.

ఏ కోర్సు చేయాలో తేల్చుకోలేని అభ్యర్థులకు మరో చక్కటి అవకాశం ఉంది. అదే ‘అన్‌డిసైడెడ్‌ స్టూడెంట్‌’. దీని ప్రకారం విద్యార్థి తన మొదటి సంవత్సరంలో వివిధ సబ్జెక్టులపై అవగాహన ఏర్పరచుకొని, దాని ఆధారంగా మేజర్‌ను ఎంచుకునే వీలుంటుంది.

ఏ యూనివర్సిటీ ?
ఎక్కడుంది?: విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతం మనకు తగ్గట్టుగా, నివాసయోగ్యంగా ఉండాలనుకుంటే, ఇంకొందరు నగరాలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. ప్రశాంతంగా ఉంటే చాలనుకునేవాళ్లూ ఉన్నారు. తెలిసినవారు, బంధువులు దగ్గరగా ఉండే ప్రదేశాల్లో ఉండాలనుకోవడమూ మంచిదే. మన వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా వీటిలో వీలైనన్ని కుదిరే విధంగా చూసుకోవాలి. అన్నీ ఉండాల్సిందే అని పట్టుబట్టి అవకాశాలను జారవిడుచుకోకూడదు.
ఎలా ఉంది?: అందరికీ ఒకేరకమైన బోధనా వాతావరణం ఉంటుందని చెప్పలేం. కొందరు తరగతి ఎంత పెద్దదైనా, ఎంతమంది ఉన్నా ఆసక్తిగానే ఉంటారు. ఇంకొందరైతే తక్కువమంది విద్యార్థులున్నప్పుడే సందేహాలు నివృత్తి చేసుకోవచ్చనుకుంటారు. ఇలాంటివీ పరిగణనలోకి తీసుకోవాలి. రిసెర్చ్‌ సెంటర్లు, స్పోర్ట్స్‌, క్లబ్‌లు, క్యాంపస్‌ లోపల, వెలుపల దగ్గర్లో హాస్టల్‌ సౌకర్యాల గురించీ విచారించుకోవాలి.
ఏ కోర్సు: నాణ్యమైన విద్యకు పేరు పొందిన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవాలి. పరిశోధన అవకాశాలు, ప్ల్లేస్‌మెంట్స్‌ సంగతి చూసుకోవాలి.యూకే, కెనడాలకు చెందిన కొన్ని విశ్వవిద్యాలయాలు ప్లేస్‌మెంట్‌ ఇయర్‌ను అందిస్తాయి. అంటే చదువులో భాగంగా ఏడాదిపాటు వేతనంతో కూడిన ప్లేస్‌మెంట్‌ అవకాశాన్ని కల్పించడం. దీని వల్ల అంతర్జాతీయంగా పని అనుభవంతోపాటు నెట్‌వర్క్‌ను పెంచుకోవచ్చు.
ఏ కోర్సు చేయాలో తేల్చుకోలేని అభ్యర్థులకు యూఎస్‌, కెనడాలాంటి చోట్ల ‘అన్‌డిసైడెడ్‌ స్టూడెంట్‌’ అవకాశముంది. దీని ప్రకారం విద్యార్థి తన మొదటి సంవత్సరంలో వివిధ సబ్జెక్టులపై అవగాహన ఏర్పరచుకొని, దాని ఆధారంగా మేజర్‌ను ఎంచుకోవచ్చు.
ఎంత వ్యవధి: కోర్సు కాలవ్యవధి ఎంచుకున్న దేశం, విశ్వవిద్యాలయాన్ని బట్టి మారుతుంటుంది. యూకేలో గ్రాడ్యుయేషన్‌ కాలవ్యవధి మూడేళ్లు. యూఎస్‌, కెనడా, ఇంకా కొన్ని దేశాల్లో నాలుగేళ్లు. విద్యార్థి తన స్థోమత ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
స్కాలర్‌షిప్‌, పని అవకాశాలు: గడువులను గమనించి వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకుంటే అడ్మిషన్‌ అవకాశాలు మెరుగుపడి, ఉపకార వేతనాలూ సాధించవచ్చు. మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌ అవకాశాలున్నాయో లేదో చూసుకోవాలి. చాలావరకూ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు వారాంతాల్లో, సెలవుల్లో పనిచేసుకునే వీలును కల్పిస్తుంటాయి. సాధారణంగా ఇది వారానికి 20 గంటలు, సెలవుల్లో వారానికి 40 గంటలు ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని తమ నివాస, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.

దేశాల పరంగా...
వీసా నిబంధనలు: ఎంచుకున్న దేశం ఎలాంటి నిబంధనలతో వీసా ఇస్తోందో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఇమిగ్రేషన్‌ ఆలోచన ఉంటే, దానికి సంబంధించిన వివరాలనూ చూసుకోవాలి.
భాష: విద్యార్థి చదువులో భాగంగా తోటి విద్యార్థులతో మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల స్థానిక భాషపై అవగాహన ఉండటం అవసరం. ఎక్కువ దేశాల్లో ఇంగ్లిష్‌ స్థానికభాషగా ఉంది. కానీ జర్మనీ లాంటి దేశాన్ని ఎంచుకున్నప్పుడు అక్కడి భాష తెలిసుండటం తప్పనిసరి అవుతోంది.
ఖర్చు: విదేశీ విద్య అంటే ఖర్చుతో కూడుకున్నదే. అనవసరమైన ఇబ్బందులను నివారించాలంటే దీనిపై ముందస్తు అవగాహన ఏర్పరచుకోవాలి. విమాన టికెట్ల నుంచి, ట్యూషన్‌, హాస్టల్‌ వసతి, ఆహారం, వీసా, పాస్‌పోర్ట్‌, ఉండే ప్రదేశంలో అయ్యే ఖర్చు పరిగణనలోకి తీసుకుని ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి.
వాతావరణం: ఎంచుకున్న దేశంలో వాతావరణ పరిస్థితులు చెక్‌ చేసుకోవాలి. మన వాతావరణానికి దగ్గరగా ఉండేలా చూసుకోవడం మంచిదే. వ్యక్తిగతంగా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులున్నవారు ఏడాది మొత్తం స్థానిక వాతావరణ వివరాలను పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలి.

ఏ పరీక్షలు రాయాలి?
ఎస్‌ఏటీ: గ్రాడ్యుయేషన్‌ చేయాలనుకునేవారు ముందుగా (ముఖ్యంగా యూఎస్‌, కెనడాల్లో) స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రాయాలి. దీనిలో మూడు విభాగాలు ఉంటాయి. అవి- ఎవిడెన్స్‌ బేస్డ్‌ రీడింగ్‌ అండ్‌ రైటింగ్‌, మేథమేటిక్స్‌, ఎస్సే.
ఎంక్యాట్‌, ఎల్‌శాట్‌, యూకేక్యాట్‌: మెడిసిన్‌కు ఎంక్యాట్‌, లా కోర్సుల్లో ప్రవేశాలకు ఎల్‌శాట్‌ రాయాలి. యూకేలో ఎంబీబీఎస్‌ చదవాలనుకునేవారు యూకేక్యాట్‌లో అర్హత పొందాలి.
జీమ్యాట్‌: మేనేజ్‌మెంట్‌ ఆధారిత కోర్సులను చేయాలనుకునేవారు జీమ్యాట్‌ రాయాలి. జీమ్యాట్‌లో అనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌, వెర్బల్‌ అంశాలను పరీక్షిస్తారు.
జీఆర్‌ఈ: ఇంజినీరింగ్‌ తదితర కోర్సులకు జీఆర్‌ఈ రాయాలి. ఇందులో అనలిటికల్‌ రైటింగ్‌, వెర్బల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లను పరీక్షిస్తారు.
ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌, పీటీఈ: కోర్సు ఏదైనప్పటికీ ఇంగ్లిష్‌ సంబంధిత పరీక్షలను తప్పక రాయాలి. ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌, పీటీఈ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒకదానిలో తప్పక అర్హత సాధించి ఉండాలి.
ఈ టెస్టుల స్కోర్లను ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు అంగీకరిస్తున్నాయి. అయితే ఎంచుకున్న విశ్వవిద్యాలయం ఏ స్కోరును ఆధారం చేసుకుంటోందో చూసుకోవాలి.

ఏ పరీక్షలో ఎంత స్కోరు రావాలి?


 

దరఖాస్తుకు సిద్ధం చేసుకోవాల్సినవి!
* అండర్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులైతే హైస్కూలు ధ్రువపత్రాలు, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోసం వాటితోపాటు బ్యాచిలర్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్లూ సిద్ధం చేసుకోవాలి.
* చెల్లుబాటు అయ్యే వీసా
* రెజ్యూమె
* స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ). దీనిలో విద్యార్థి తన కెరియర్‌ లక్ష్యాలు, ఆసక్తులు, బలాలు, ఫలానా కోర్సు, విశ్వవిద్యాలయం ఎంచుకోవడానికి గల కారణాలు స్పష్టంగా ఉండాలి.
* సబ్జెక్టు టీచర్ల నుంచి రెండు నుంచి మూడు రెకమెండేషన్‌ లెటర్లు.
* ప్రవేశానికి అవసరమైన ప్రీ రిక్విజిట్‌ టెస్టుల స్కోర్లు (శాట్, జీమ్యాట్, జీఆర్‌ఈ మొదలైనవి).
* ఆర్ట్, ఫ్యాషన్, ఫిలిం మేకింగ్‌ వంటి కోర్సులకు దరఖాస్తు చేస్తున్నవారు తమ ఉత్తమ 10 అంశాల పోర్ట్‌ఫోలియోను అందించాల్సి ఉంటుంది.

Posted Date : 21-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం