• facebook
  • whatsapp
  • telegram

ఎలా వీలు?  ఎప్పుడు మేలు?

విదేశీ విద్య ప్రవేశాల తీరూ తెన్నూ

ప్రపంచమంతా కొవిడ్‌ పరిస్థితి నుంచి  కోలుకుంటోంది. టీకా కూడా అందుబాటులోకి వచ్చేసింది. విదేశీ విద్యాలయాలు ఫాల్‌ ప్రవేశాలను ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలు దరఖాస్తు ప్రక్రియనూ  ప్రారంభించాయి. ఇప్పటికే విదేశీవిద్యపై స్పష్టమైన ఆలోచన ఉన్నవారు కొందరైతే ఈ ఏడాదా? మరుసటి ఏడాదా అని మీమాంసలో  ఉన్నవారు మరికొందరు. అసలు వాస్తవ పరిస్థితేంటి? వెళ్లాలనుకునేవారు  ఏమేం గమనించుకోవాలి?

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థుల విదేశీ కలలకు కొవిడ్‌ బ్రేక్‌ వేసింది. లాక్‌డౌన్లు, సరిహద్దు నిబంధనలు, విశ్వవిద్యాలయాల మూసివేత.. వెరసి ఈ ఏడాది విదేశీ విద్యకు ఆశావహులు దూరమయ్యారు. కొంతమంది విద్యార్థులు మళ్లీ విదేశీ విద్య వైపు మొగ్గు చూపాలా లేదా అన్న మీమాంసలో పడ్డారు. కానీ చాలామంది విద్యార్థులు వెళ్లడం వైపే ఆసక్తి చూపారు. దాదాపుగా 91% మంది మన విద్యార్థులు పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందా అని ఆసక్తిగా ఎదురు చూశారంటూ ప్రముఖ సంస్థ క్యూఎస్‌ సహా ఎన్నో సంస్థల అధ్యయన నివేదికలు తెలిపాయి. గత ఏడాది తరగతులన్నీ ఆన్‌లైన్‌ బాట పట్టడం, ఉద్యోగావకాశాలు తగ్గడం, క్యాంపస్‌ నియామకాలు లేకపోవడం.. ఇవన్నీ ఇంకా విద్యార్థులను ఆలోచింపజేసిన అంశాలు. కానీ టీకా అందుబాటులోకి రావడం లాంటి తాజా పరిణామాల దృష్ట్యా  ఫాల్‌ ప్రవేశాలు సజావుగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితిని అంచనా వేసుకుని ప్రక్రియను వేగవంతం చేస్తున్నవారు కొందరైతే.. ఇంకాస్త సమయం వేచి చూద్దామనుకుంటున్నవారు కొందరు. ఆలోచన ఏదైనా పరిస్థితిని ఓసారి అంచనా వేసుకుంటే నిర్ణయం తీసుకోవడం సులువన్నది నిపుణుల మాట.

ఎలా స్పందించాయి?

ప్రపంచవ్యాప్తంగా చాలా విశ్వవిద్యాలయాలు కొవిడ్‌ పరిస్థితికి తగ్గట్టుగా మార్పులు తీసుకొచ్చాయి. దేశం, విశ్వవిద్యాలయం బట్టి వాటిల్లో మార్పులున్నాయి. చాలావరకూ విశ్వవిద్యాలయాలు ఫీజును తగ్గించాయి. విద్యార్థుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, స్పందించిన తీరు.. వంటి అంశాలకూ ప్రాధాన్యమిచ్చి ఎంచుకోవాలి. ఈ అనుకోని పరిస్థితిలో విద్యార్థిపరంగా ఎలా ఆలోచిస్తారనే అంశం ముఖ్యం. 

టెస్ట్‌ స్కోర్లు

ప్రతి అంతర్జాతీయ కోర్సులో ప్రవేశానికి కొన్ని ప్రీ-రిక్విజిట్‌ పరీక్షలను రాయాల్సి ఉంటుంది. శాట్, ఆక్ట్, జీమ్యాట్, జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్‌ మొదలైనవి. కోర్సు, దేశాన్ని బట్టి ఏవి రాయాలో చూసుకోవాలి. దరఖాస్తు సమయంలో స్కోరు సంబంధిత పత్రాలనూ జోడించాల్సి ఉంటుంది. ప్రతి విశ్వవిద్యాలయం వీటికి సంబంధించి కటాఫ్‌లను కూడా సూచిస్తుంది. వాటి ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, నచ్చిన విద్యాసంస్థల కటాఫ్‌లను ముందుగానే పరిశీలించుకుని, వాటికి అనుగుణంగా స్కోరు సాధించేలా చూసుకోవాలి.

ఏ ఇన్‌టేక్‌?

సాధారణంగా ఫాల్, స్ప్రింగ్, సమ్మర్‌ అనే మూడు రకాల ఇన్‌టేక్‌లు ఉంటాయి. 

ఫాల్‌ ఇన్‌టేక్‌ సెప్టెంబర్‌లో మొదలై డిసెంబర్‌లో ముగుస్తుంది. 

స్ప్రింగ్‌.. జనవరిలో ప్రారంభమై మేలో ముగుస్తుంది. 

సమ్మర్‌ ఇన్‌టేక్‌ మేలో ప్రారంభమై ఆగస్టుతో ముగుస్తుంది. 

ఎక్కువ దేశాలు ఫాల్, స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌లకు ప్రాముఖ్యమిస్తున్నాయి. వీటిలోనూ ఎక్కువమంది విద్యార్థులను ఫాల్‌ ఇన్‌టేక్‌లో తీసుకుంటారు. చాలా కొద్ది విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సమ్మర్‌ ఇన్‌టేక్‌ ద్వారా విద్యార్థులను తీసుకుంటున్నాయి. ఎంచుకునే ప్రోగ్రామ్, సంస్థను బట్టి కూడా వీటిలో మార్పులుంటాయి.ఇక తాజా పరిస్థితి దృష్ట్యా పోటీ ఎక్కువగా ఉంటుందనేది నిపుణులు ముందునుంచీ చెబుతున్న మాట. ప్రస్తుత పోటీలో నిలవగలను అనుకునేవారు ఫాల్‌కు ప్రయత్నించవచ్చు. కొద్దిగా పరిస్థితిని అంచనా వేసుకునేవారు, నెమ్మదిగా వెళదామనుకునేవారు మరుసటి ఏడాది స్ప్రింగ్‌/ ఫాల్‌కు ప్రయత్నించవచ్చు. ఈ ఏడాదే వెళ్లాలనుకునేవారికి ఫాల్‌ ఒక్కటే మార్గం. సమయం తక్కువగా ఉంది. ఈ వ్యవధిలో ప్రయత్నించగలరా అన్నదీ చూసుకోవాలి. ఏదో ఒక విద్యాసంస్థ.. విదేశాల్లో చదవడమే ప్రాధాన్యమన్న ధోరణీ మంచిది కాదు. ఈ విషయాన్నీ గమనించుకోవాలి.

ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?

2021 ఫాల్‌ (సెప్టెంబరు) ప్రవేశాలకు సంబంధించి చాలావరకూ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి. దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టినా కొవిడ్‌ నిబంధనల కారణంగా ఆన్‌లైన్‌ తరగతులనే నిర్వహించే అవకాశముందని చాలామంది భావించారు. అయితే వ్యాక్సిన్‌ ప్రజలందరికీ దాదాపుగా అందుబాటులోకి వచ్చినట్లే. కాబట్టి, క్యాంపస్‌ తరగతులనే నిర్వహించే అవకాశముంది.

మారుతున్న ప్రాధాన్యాలు

సాధారణంగా మన విద్యార్థులు ఎక్కువగా యూఎస్, యూకే, కెనడా ఆస్ట్రేలియాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. యునెస్కో నివేదిక ప్రకారం ఇతర దేశాలు ముఖ్యంగా న్యూజీలాండ్, జర్మనీ, సింగపూర్, ఐర్లాండ్‌ లాంటి దేశాలకూ ప్రాధాన్యముందని అంచనా. నిజానికి సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, జర్మనీ దేశాల వైపు దృష్టిసారించడం గతంలోనే మొదలైంది. ఈసారి వీటికీ దాదాపుగా సమాన ప్రాధాన్యం లభించే వీలుంది. కొవిడ్‌ విషయంలో ఈ దేశాలు మెరుగైన పనితీరును చూపడం విద్యార్థులను ఎక్కువ ఆకర్షిస్తోంది.

ప్రీ-రిక్విజిట్‌ టెస్ట్‌లు

యూఎస్‌ సహా అన్ని దేశాల విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్‌ పొందడానికి టోఫెల్, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ వంటి ప్రీ-రిక్విజిట్‌ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా వీటికి దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. వ్యాక్సిన్‌ విషయంలో స్పష్టమైన సమాచారం లేనపుడే వీటికి దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య లక్షల్లో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశముందనేది వారి భావన.

పెరగనున్న పోటీ

అంతర్జాతీయ విద్య నిపుణుల ప్రకారం ఈ ఏడాది పోటీ ఎక్కువ ఉండొచ్చు. దరఖాస్తులు భారీగా పెరిగే వీలుంది. కొత్తవారితోపాటు 2020లో దరఖాస్తు చేసుకున్నవారూ ఈసారి ప్రయత్నించే వీలుంది. మునుపటితో పోలిస్తే దరఖాస్తు చేసే విశ్వవిద్యాలయాల సంఖ్యా పెరగడంతోపాటు స్టేట్‌ యూనివర్సిటీలు, కాలేజీలపైనా విద్యార్థులు దృష్టిపెడుతుండటం విశేషం.

ఏయే డాక్యుమెంట్లు?

వీసా దరఖాస్తుకు ముందు కోర్సును బట్టి గత తరగతుల ధ్రువపత్రాలు- పది, ఇంటర్, డిగ్రీలకు సంబంధించినవి సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మార్కుల షీట్లు ఇంగ్లిష్‌ కాకుండా ఏ ఇతర భాషలో ఉన్నా తర్జుమా చేయించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తిచేయడానికీ, దేశంలో నివాస ఖర్చులను భరించగలరని తెలిపేలా ఫైనాన్షియల్‌ ప్రూఫ్స్‌ (గ్యారెంటీడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్టిఫికెట్, ఎస్‌డీఎస్‌ వంటివి) సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఐడెంటిటీ డాక్యుమెంట్లు మొదలైనవాటినీ ముందస్తుగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తు చేసుకున్న సంస్థ విద్యార్థి గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అందులో భాగంగా మీ గురించి రాయమంటుంది. సాధారణంగా ఈ రెండింట్లో ఏదో ఒకదాన్ని కోరతాయి. రాసేటపుడు ఫలానా కోర్సును, విద్యాసంస్థను ఎంచుకోవడానికి కారణాలు, భవిష్యత్‌ లక్ష్యాలు, మీరు ఆ విద్యాసంస్థకు ఎంతవరకూ సరైన ఎంపిక వంటి వాటికీ సమాధానాలుండేలా చూసుకోవాలి.

ప్రొఫెసర్లు/ రిపోర్టింగ్‌ మేనేజర్ల నుంచి రెకమెండేషన్‌ లెటర్లను కోరొచ్చు. మీతో కలిసి పనిచేసిన అనుభవం, మీతో కలిసి సాధించిన లక్ష్యాలు, విజయాలను అందులో సూచించాలి.

మొత్తంగా తమ దరఖాస్తులో ఎలాంటి అవాస్తవాÄలు/ మోసపూరితమైన అంశాలు లేకుండా చూసుకోవాలి. లేదంటే జీవితాంతం ఆ దేశంలో అడుగుపెట్టే అవకాశాన్నే కోల్పోయే ప్రమాదముంది!
 

Posted Date : 21-01-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం