• facebook
  • whatsapp
  • telegram

పీటీఈ... ప్రత్యేకతలేమిటి?

విదేశీ విద్యాభ్యాసానికి పనికొచ్చే పరీక్ష 

కొవిడ్‌ సంక్షోభ ప్రభావం పలచబడుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విదేశీ విద్యపై దృష్టిసారిస్తున్నవారికిది శుభ పరిణామమే. వారు తమ సన్నద్ధ ప్రయత్నాల జోరు పెంచేయవచ్చు. ప్రీ రిక్విజిట్‌ టెస్టులది అందులో ప్రధాన పాత్ర. ఇంగ్లిష్‌కు సంబంధించి ఆంగ్లభాషేతర దేశాల విద్యార్థులు ఐఈఎల్‌టీఎస్‌ లేదా టోఫెల్‌ల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటుంటారు. వీటితోపాటు ఎన్నో దేశాలు, ప్రముఖ యూనివర్సిటీలు ఆదరిస్తున్న ఇంకో పరీక్ష.. పీటీఈ!  ఫలితాలను వేగవంతంగా వెలువరించటం దీని ప్రత్యేకత!  

పియర్సన్‌ టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ అకడమిక్‌ (పీటీఈ అకడమిక్‌) ఆంగ్ల భాషేతర దేశాల విద్యార్థులకు నిర్వహించే పరీక్ష. దీనిని బ్రిటిష్‌ మల్టీనేషనల్‌ పబ్లిషింగ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ .. పియర్సన్‌ పీఎల్‌సీ నిర్వహిస్తోంది. ఇది విదేశీ విశ్వవిద్యాలయాల స్థితిగతులను అర్థం చేసుకోవడానికీ, దానికి అనుగుణంగా కొనసాగడంలో సాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు ఈ స్కోరును అంగీకరిస్తున్నాయి. లండన్‌ బిజినెస్‌ స్కూల్, స్టాన్‌ఫర్డ్‌ గ్రాడ్యుయేట్‌ బిజినెస్‌ స్కూల్, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్, ఐఎన్‌ఎస్‌ఈఏడీ, యేల్‌ యూనివర్సిటీ వంటివీ ఈ స్కోరు ద్వారా ప్రవేశాలను కల్పిస్తున్నవాటిలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో అకడమిక్‌తోపాటు ఇమిగ్రేషన్‌ ప్రక్రియకూ ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నారు. పీటీఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. కాలవ్యవధి మూడు గంటలు. దీనిలో నాలుగు మాడ్యూళ్లు- రీడింగ్, రైటింగ్, లిసనింగ్, స్పీకింగ్‌లను పరీక్షిస్తారు. ఇవి మూడు ప్రధాన విభాగాలుగా ఉంటాయి. స్పీకింగ్, రైటింగ్‌లను కలిపి ఒకసారి, లిసనింగ్, రీడింగ్‌లను విడివిడిగా పరీక్షిస్తారు. నిజజీవిత, అకడమిక్‌ పరమైన అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. పరీక్షలో భాగంగా ఎన్నో రకాల సబ్జెక్టులను ఉపయోగించినా, అభ్యర్థి ఆంగ్ల పరిజ్ఞానాన్నే పరీక్షిస్తారు. 

అర్హత: పరీక్ష రాసే సమయానికి 16 సంవత్సరాలు నిండినవారు ఎవరైనా దీనిని రాయొచ్చు. 18 ఏళ్లలోపువారు ఈ పరీక్షను రాయాలంటే తల్లిదండ్రుల నుంచి పేరెంçల్‌ కన్‌సెంట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. గరిష్ఠ వయః పరిమితి ఏమీ లేదు.

నమోదు ఇలా!

ఏడాది పొడవునా నమోదు చేసుకునే వీలుంది. ప్రపంచవ్యాప్తంగా టెస్ట్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థి తనకు వీలైనదాన్ని ఎంచుకోవచ్చు. పరీక్షను ముందుగా పీటీఈ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 24 గంటల ముందైనా నమోదు చేసుకునే వీలుంది.
పరీక్షకు నమోదు చేసుకోవాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్‌ https://pearsonpte.com/ లో అకౌంట్‌ను తగిన వివరాలతో రూపొందించుకోవాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియను ధ్రువీకరిస్తూ ఈమెయిల్‌ వస్తుంది. ఇది వెంటనే అయినా 24 గంటల్లోపైనా పొందే అవకాశముంటుంది. ఒకసారి అకౌంట్‌ రిజిస్టర్‌ అయ్యాక దానిలో లాగిన్‌ అయ్యి ఫీజు చెల్లించడం ద్వారా పరీక్షను షెడ్యూల్‌ చేసుకోవచ్చు. అవసరమైతే ప్రొఫైల్‌లో, పరీక్ష తేదీలోనూ మార్పులు చేసుకునే వీలూ ఉంటుంది. 

ఫీజు: దేశాన్నిబట్టి ఫీజులో మార్పులున్నాయి. మనదేశ విద్యార్థులు రూ.13,300 (జీఎస్‌టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. లేట్‌ బుకింగ్‌ ఫీజు రూ. 13,965 (+ జీఎస్‌టీ). క్రెడిట్, డెబిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ విధానాల్లో దేని ద్వారా అయినా ఫీజు చెల్లించొచ్చు.

టెస్ట్‌ సెంటర్లు: దాదాపుగా ప్రతి సిటీల్లోనూ పీటీఈ అకడమిక్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అకడమిక్‌ టెస్ట్‌ తేదీకంటే ముందుగా సెంటర్‌ను నమోదు చేసుకోవాలి. విద్యార్థి దేశం, సిటీ వివరాలను నమోదు చేయగానే అందుబాటులో ఉన్న సెంటర్ల వివరాలు కనపడతాయి. వాటిలో సెంటర్‌ను నిర్ణయించుకున్నాక కోరుకున్న తేదీలో పరీక్ష రాసే అవకాశం ఉందో లేదో చూడాల్సి ఉంటుంది. మనదేశంలో. హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు, దిల్లీ, నోయిడా, జలంధర్, లూథియానా, వడోదర, కోల్‌కతా, ముంబయి, నాగ్‌పుర్, పాటియాలా, పుణె, రాజ్‌కోట్‌ల్లో ఉన్నాయి.

స్కోరు- ఫలితాలు

పరీక్ష రాసిన రోజు నుంచి 48 గంటల్లో ఫలితాలు వెలువడుతాయి. అయితే విద్యార్థి తను దరఖాస్తు చేసుకుంటున్న విశ్వవిద్యాలయం పీటీఈ స్కోరును అనుమతిస్తుందో లేదో చూసుకోవడం ప్రధానం. సాధారణంగా 10-90 స్కేలు ఆధారంగా మార్కులను ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక పాయింటు ఇస్తారు. పాక్షికంగా సరైనవాటికీ పాక్షికంగా మార్కులుంటాయి.  పీటీఈ అకడమిక్‌ స్కోరు రెండేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉంచుతారు. దీనికి సంబంధించి అభ్యర్థికి మెయిల్‌ వస్తుంది. దాని ఆధారంగా వెబ్‌సైట్‌లో యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవడం ద్వారా స్కోరును తెలుసుకోవచ్చు. ఒకసారి ఫలితాలు వెల్లడి అయ్యాక స్కోరు రిపోర్ట్‌ను పియర్సన్‌ వీయూఈ అకౌంట్‌ ద్వారా సంస్థలకు పంపుకోవచ్చు. అభ్యర్థి తన స్కోరును వీలైనన్ని విద్యాసంస్థలకు పంపుకునే వీలుంటుంది. వచ్చిన స్కోరు పట్ల అసంతృప్తి ఉంటే, రీస్కోరింగ్‌ అవకాశమూ ఉంటుంది. ఫలితాలు వెలువడిన 14 రోజుల్లోగా దరఖాస్తు చేసుకుంటేనే రీస్కోరింగ్‌ అవకాశం ఉంటుంది.

ప్రత్యేకతలివీ!

ఆర్టిఫిషియల్‌  ఇంటలిజెన్స్‌

దీనిలో ఆటోమేటెడ్‌ స్కోరింగ్‌ టెక్నాలజీ ఉంటుంది. హ్యూమన్‌ రేటెడ్‌ శాంపిళ్ల ద్వారా శిక్షణనిచ్చిన కాంప్లెక్స్‌ అల్గారిథమ్స్‌ను ఇందులో ఉపయోగించారు. ఇందుకుగానూ 120కిపైగా వివిధ భాషల వర్గాలకు చెందిన 10,000 మంది అభ్యర్థుల సమాధానాలను అంచనా వేశారు.

నిష్పాక్షిక స్కోరింగ్‌

అభ్యర్థి సమాధానాన్ని ఏఐ అంతకు ముందు సమాధానాల ఆధారంగా అంచనావేసి మార్కులను ఇస్తుంది. దీనిలో అభ్యర్థి ఉచ్చారణకు కాకుండా చెప్పిన సమాధానం ఆధారంగానే స్కోరు ఉంటుంది.

త్వరిత ఫలితాలు

గ్లోబల్‌ టెస్టింగ్‌ను 70కుపైగా దేశాల్లోని 350 టెస్ట్‌ సెంటర్లలో అందుబాటులో ఉంచింది. ఫలితాలు 48 గంటల్లోగా వెలువరుస్తుంది.

ఎన్నిసార్లైనా..: టెస్ట్‌ స్కోరును వీలైనన్ని సంస్థలకు పంపుకునే వీలును పీటీఈ అకడమిక్‌ కల్పిస్తోంది. ఇందుకుగానూ అదనపు ఫీజు ఏమీ చెల్లించాల్సిన అవసరమూ లేదు.

విద్య, మైగ్రేషన్‌

ప్రపంచవ్యాప్తంగా వేల అకడమిక్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశానికి ఈ స్కోరును సంస్థలు అంగీకరిస్తున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల స్టూడెంట్‌ వీసా, మైగ్రేషన్‌ దరఖాస్తులకూ ఈ స్కోరు ఉపయోగపడుతుంది.

ఏమేం పరీక్షిస్తారు?

స్పీకింగ్‌ అండ్‌ రైటింగ్‌: కాలవ్యవధి 77-93 నిమిషాల వరకూ ఉంటుంది. దీనిలో వ్యక్తిగత పరిచయం, పెద్దగా చదవడం, వాక్యాలను తిరిగి చెప్పమనడం, ఇచ్చిన పేరాగ్రాఫ్‌ల ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, దానిని సూక్ష్మీకరించడం, ఫొటోను ఇచ్చి దానిని వర్ణించమనడం, లెక్చర్‌ను మళ్లీ చెప్పడం, చిన్న ప్రశ్నలకు సమాధానాలు, సమాచారాన్ని సమ్మరైజ్‌ చేయడం, ఎస్సే రాయడం వంటివి ఉంటాయి. స్పీకింగ్‌లో భాగంగా 30 సెకన్లలో అభ్యర్థి తన వ్యక్తిగత పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మార్కులుండవు కానీ తనను తాను సంస్థకు పరిచయం చేసుకునే అవకాశం ఉంటుంది. 

రీడింగ్‌: కాలవ్యవధి 32-41 నిమిషాలు. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు.. ఒకే సమాధానాన్ని, ఒకటికి మించి సమాధానాలను గుర్తించడం, ఖాళీలను పూరించడం, పేరాలను సరైన క్రమంలో పెట్టడం వంటివి ఉంటాయి.

లిసనింగ్‌: 45-57 నిమిషాల వరకూ సాగుతుంది. ఆడియో, వీడియో క్లిప్‌లను విని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఆడియో అయినా, వీడియో అయినా ఒక్కసారి మాత్రమే వినే/ చూసే అవకాశం ఉంటుంది. దీనిలోనూ విన్నదాన్ని సూక్ష్మీకరించడం, మల్టిపుల్‌ చాయిస్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, మిస్సింగ్‌ పదాలను గుర్తించడం, తప్పు పదాలను గుర్తించడం, డిక్టేషన్‌ వంటివి ఉంటాయి.

వెబ్‌సైట్‌లోనే సన్నద్ధమయ్యే అవకాశమూ ఉంది. సన్నద్ధతను పరీక్షించుకోవాలనుకునేవారికి ప్రాక్టీస్‌ టెస్టులు అందుబాటులో ఉన్నాయి.

తేడాలేంటి?

అంశం ఐఈఎల్‌టీఎస్‌ టోఫెల్‌ టీఈ అకడమిక్‌
వ్యవధి 2.45 గం. 3 గం. 3 గం.
స్కోరు రేంజ్‌ 0-9 0-120 10-90
చెల్లుబాటు రెండేళ్లు రెండేళ్లు రెండేళ్లు
ఫలితాలు 13 రోజులు 6-10 రోజులు 48 గంటల్లోపు


    

Posted Date : 28-01-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం