• facebook
  • whatsapp
  • telegram

ఈ పొర‌పాట్లు చేయ‌క‌పోతే మెరుగైన స్కోరు ఖాయం!

ప్రీ రిక్విజిట్‌ ప‌రీక్ష‌ల స‌న్న‌ద్ధత‌కు మెల‌కువ‌లు

విదేశీ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రీ రిక్విజిట్‌ టెస్ట్‌లను రాయాల్సి ఉంటుంది. నిజానికి ఇవి పూర్తయితేనే అసలు ప్రక్రియ మొదలవుతుంది. అందుకే విదేశీ విద్యలో దీన్ని తొలి అడుగుగా పరిగణిస్తుంటారు. అందుకే విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యం వీటికి ఇస్తుంటారు. ఈ పరీక్షల్లో ఒక్కోసారి మంచి స్కోరు రాక విద్యార్థులు నిరాశ పడుతుంటారు. ఇలా కాకుండా మంచి స్కోరు తెచ్చుకోవాలంటే... తగిన కృషితోపాటు తప్పులు జరిగే అవకాశాలనూ తెలుసుకోవాలి. సవరించుకోవాలి! 

అంతర్జాతీయ విద్యపై మన విద్యార్థులకు ఆకర్షణ ఎక్కువే. మన విద్యార్థులు  ఎంఎస్, మేనేజ్‌మెంట్‌ మొదలైన కోర్సులపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు. సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలను కల్పించడానికి విశ్వవిద్యాలయాలు కొన్ని ప్రీరిక్విజిట్/ స్టాండర్డైజ్‌డ్‌ టెస్ట్‌ల స్కోర్లను కోరతాయి. ఇందులో భాగంగా ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించే పరీక్షలు ఐఈఎల్‌టీఎస్, టోఫెల్‌తోపాటు ఎంచుకున్న కోర్సును బట్టి జీఆర్‌ఈ, జీమ్యాట్‌ టెస్ట్‌లనూ రాయాల్సి ఉంటుంది.

వీటిల్లోనూ జీఆర్‌ఈ, జీమ్యాట్‌లను కోరుకున్న కళాశాల/ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించే గేట్‌వేగా చెబుతుంటారు. అందుకే వీటిల్లో మంచి స్కోరు సాధించడం తప్పనిసరి. ఇందులో భాగంగా వివిధ అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. మొత్తంగా అభ్యర్థిలోని వెర్బల్, అనలిటికల్, క్రిటికల్, లాజికల్‌ థింకింగ్‌ నైపుణ్యాలను పరిశీలించడం వీటి ఉద్దేశం. అందుకే ప్రశ్నలూ కాస్త ట్రికీగా ఉంటాయి. సాధారణమైనవిగా పరిగణించి అడుగువేస్తే బోల్తాపడే అవకాశముంది. కాబట్టి, ఏం సన్నద్ధమవ్వాలో తెలుసుకోవడంతోపాటు ఎక్కడ పొరబాటు పడే అవకాశముందో కూడా గ్రహించాలి. సన్నద్ధతను మొదలుపెట్టేవారు, పరీక్షను రాయబోయేవారు ఇద్దరూ వీటిని గమనించుకోవాలి.

ఎంత సమయం?

విదేశీ విద్య విషయంలో జీఆర్‌ఈ/జీమ్యాట్‌ల ప్రాముఖ్యం అందరికీ తెలిసిందే. కానీ.. అకడమిక్‌ వాటితో పోలిస్తే వీటి సన్నద్ధతకు చాలామంది ఎక్కువ సమయం కేటాయించరన్నది నిపుణుల మాట. సాధారణంగా వారాంతాలనో, పరీక్షకు ముందు రెండు-నాలుగు వారాల సమయాన్నో దీనికి కేటాయించేవారే అధికం. ఇంత సులభమయ్యేదైతే దాదాపుగా అందరూ దీన్ని తేలికగానే పూర్తిచేసేవారు కదా! అలా సాధ్యం కావట్లేదంటే ఎంతో కొంత కష్టం దాగున్నట్లే కదా! ఈ విషయాన్ని గమనించాలి. 

వీటికి ప్రత్యేకంగా ఇంతే సమయం కేటాయించాలన్న నియమం ఏమీ లేదు. అది అభ్యర్థి నేర్చుకునే సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా ప్రణాళిక వేసుకోవాలి.

ఒక మాదిరి పరీక్షను రాసి దాని స్కోరు ఆధారంగానూ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ రోజూ కనీసం కొంత సమయమైనా కేటాయించేలా చూసుకోవడం మాత్రం తప్పనిసరి.

ప్రణాళిక సొంతమేనా?

సన్నద్ధత విషయానికొచ్చేసరికి ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. పక్కన వారితో పోల్చుకుంటూనో, వారిని అనుసరిస్తూనో ప్రణాళిక వేసుకోవద్దు. అలాగే సన్నద్ధతను హడావుడిగా ముగించేయడం, వాయిదా వేయడం వంటివీ చేయొద్దు. వేసుకున్న ప్రణాళికను పక్కాగా అమలు పరచుకునేలా చూసుకోవాలి. అలాగే అన్ని విభాగాలకూ సమప్రాధాన్యం ఇవ్వాలి.

అందుబాటులో ఉన్న పుస్తకాలను చదివేయాలి, రోజు మొత్తంలో మూడొంతుల సమయం సన్నద్ధతకే కేటాయించాలన్న ధోరణి వద్దు. ఈ రకమైన తీరు అకడమిక్‌ పరంగా సాయపడొచ్చు. కానీ ఈ పరీక్షల విషయంలో కాదు. ఇక్కడ స్మార్ట్‌ సన్నద్ధతకు ప్రాధాన్యమివ్వాలి. ప్రశ్నను సాధించడానికీ, విశ్లేషించడానికీ ఇక్కడ ప్రాధాన్యముంటుంది.

సమయపాలన

సాధారణంగా పోటీ పరీక్షల్లో విద్యార్థి సమయంతోపాటుగా పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అసలుకే మోసం వస్తుంది. సన్నద్ధత సమయంలో సమస్యను ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించడం కనిపిస్తుంది. పైగా ఇక్కడ సమస్యలు చేసే సమయంలో ఎలాంటి ఒత్తిడీ ఉండదు. కానీ పరీక్షహాలులో పరిస్థితి అలా ఉండదు. ఆ సమయంలోనూ అదే పద్ధతిని కొనసాగిస్తే సమయం మించి పోతుంది. తీరా సమయం మించిపోతున్నపుడు కంగారు మొదలై వచ్చిన ప్రశ్నలనూ తప్పుగా గుర్తించడమో, వదిలేయడమో చేయాల్సి వస్తుంది. కాబట్టి, సన్నద్ధత సమయంలోనే దీనిపై దృష్టిపెట్టాలి. వీలైతే దగ్గరి దారులను వెతుక్కోవాలి. ఒక్కో ప్రశ్నకు వెచ్చించే సమయంపై స్పష్టమైన అవగాహనతో ఉండాలి.

మాదిరి పరీక్షలు

చాలామంది విద్యార్థులు దీన్ని సమయ వృథాగా పరిగణిస్తారు. దీనిబదులు ఈ సమయాన్ని సన్నద్ధతకు వినియోగిస్తే ఎక్కువ ప్రయోజనమని భావిస్తుంటారు. నిజానికి మాక్‌ పరీక్షలూ ఒకరకమైన సాధన కిందకే వస్తాయి. ఒక ప్రశ్నను మామూలు సమయంలో చేయడానికీ నిర్ణీత సమయంలో పరిష్కరించడానికీ తేడా ఉంటుంది. అది మాక్‌ పరీక్షల సమయంలోనే అర్థమవుతుంది. కాబట్టి, వాటిని వీలైనన్ని ఎక్కువ రాసేలా చూసుకోవాలి. అలాగే మామూలు పరీక్ష సమయంలోనే రాసేలా చూసుకోవాలి. అప్పుడే మీ వేగం, కచ్చితత్వంపై ఒక అంచనా ఏర్పడుతుంది.

ఇంకొందరు విద్యార్థులు మాక్‌ పరీక్షలను స్కోర్‌ అంచనా వేయడానికి మాత్రమే రాస్తుంటారు. అదీ సరైన పద్ధతి కాదు. మార్కులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. నిజమే కానీ.. ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోవడంతోపాటు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడమూ ప్రధానమే. పరీక్ష రాశాక ఒప్పుగా చేసినవాటిని ఒకసారి చూసుకున్నాక తప్పు చేసినవాటిలో ఎక్కడ పొరబాటు జరిగిందో విశ్లేషించుకోవాలి. ఆపై రాసే పరీక్షలకూ ఇదో సన్నద్ధత మార్గమవుతుంది. మళ్లీ పరీక్షల్లో వాటిని తిరిగి చేయకుండానూ ఉంటారు.

చాలావరకూ తప్పుగా గుర్తించిన సమాధానాలనే గమనించడం చూస్తుంటాం. కానీ ప్రశ్నపత్రంలో ప్రతి ప్రశ్ననూ సమీక్షించుకోవాలి. ఒక్కోసారి అనుకోకుండా సమాధానాన్ని ఒప్పుగా గుర్తించేస్తుంటాం. ఈ లక్‌ పరీక్షలోనూ కొనసాగుతుందన్న హామీ ఉండదు కదా! కాబట్టి, ప్రతి ప్రశ్ననూ సమీక్షించుకోవాలి. అవసరమైతే షార్ట్‌ నోట్స్‌ రాసుకోవాలి.

ప్రీరిక్విజిట్‌ టెస్ట్‌ల సన్నద్ధతలో కిటుకులు

అన్ని పరీక్షల్లానేనా!

పరీక్ష అనగానే చాలామంది కష్టపడి చదివేయాలి అనుకుంటుంటారు. జ్ఞానాన్ని పరీక్షించేవాటిగా పరిగణిస్తారు. కానీ జీఆర్‌ఈ, జీమ్యాట్‌ వంటి పరీక్షల విషయంలో ఇది ఏమాత్రం సరైన పద్ధతికాదు. దీనిలో ప్రశ్నలన్నీ అభ్యర్థి ఆలోచనా తీరు, విశ్లేషించగల నైపుణ్యాలను పరీక్షించేలా ఉంటాయి. కాబట్టి, చదవడానికి పరిమితం కాకుండా సాధనపై దృష్టిపెట్టాలి. ఒక ప్రశ్నను ఒకే విధానంలో కాకుండా వివిధ పద్ధతుల్లో ఎలా పరిష్కరించగలరో చూడగలగాలి. ఈ విధానం అలవరచుకున్నపుడే విజయం సులభమవుతుంది.

సరైనదేనా?

ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక ఆన్‌లైన్‌లో అన్ని విషయాలూ అందుబాటులోకి వచ్చేశాయి. స్టడీ మెటీరియళ్లూ అందుకు మినహాయింపు కాదు. ఉచితంగా దొరికాయనో, ఎక్కువమంది ఎంచుకుంటున్నారనో దొరికినదాన్నలా చదువుకుంటూ పోతే చివరికి దెబ్బతినాల్సి వస్తుంది. ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం మంచిదే కానీ ప్రామాణికమైన దాన్ని ఎంచుకోవడం ప్రధానం.అధికారిక వెబ్‌సైట్లు సన్నద్ధతపరంగా ఎంతో సాయమందిస్తున్నాయి. వాటిని ఉపయోగించుకోవడం శ్రేయస్కరం. అదనపు సన్నద్ధత కావాలనుకున్నపుడు పుస్తకాలు/ వెబ్‌సైట్ల ప్రామాణికతను అంచనా వేసుకున్నాకే ముందడుగు వేయాలి.

గెస్‌ చేయొచ్చు

చాలావరకూ చూడండి.. సరైన సమాధానం వస్తేనో లేదా వచ్చిన సమాధానం ఆప్షన్లలో ఉంటేనేనో గుర్తిస్తుంటాం. కానీ జీఆర్‌ఈ, జీమ్యాట్‌ల్లో ఒక్కోసారి ఇది కష్టమైన ప్రక్రియే. కాబట్టి, అంచనా వేసి సమాధానాన్ని గుర్తించడాన్నీ అలవాటు చేసుకోవాలి. అన్ని ప్రశ్నల విషయంలో ఇదే ధోరణి అవలంబించాలని కాదు. కానీ, సులువుగా, బాగా పట్టున్న వాటిల్లో ఈవిధంగా ప్రయత్నించొచ్చు. ఇదీ సాధన ద్వారానే సాధ్యమవుతుంది. సగం ప్రశ్నను చదవడానే పరిష్కరించాలన్న తొందర వద్దు. ఒక్కోసారి పరీక్షనిర్దేశకులు ఇలా కూడా విద్యార్థులను పరీక్షిస్తుంటారు. ఎంత ప్రశ్న తెలిసినట్టుగా అనిపించినా ప్రశ్న మొత్తాన్నీ సావధానంగా చదివాకే పరిష్కరించడానికి సన్నద్ధమవ్వాలి. ఒక్కోసారి చివర్లో మెలిక పెట్టే అవకాశముంది.

ఒకటికి రెండుసార్లు

సాధారణంగా ఇలాంటి పరీక్షల్లో సమయంతో పోటీ మామూలే. కానీ.. తెలియక వదిలేస్తేనో, పూర్తిగా తప్పుగా అనుకుని తప్పుగా గుర్తిస్తోనో విషయం వేరు. ఒక్కోసారి కంగారులోనో, ఏమరుపాటుగానో చేసే తప్పు బాధిస్తుంది. కాబట్టి, వచ్చిన సమాధానం ఆప్షన్లలో కనిపించగానే ఠక్కున గుర్తించేయొద్దు. కొన్ని ప్రశ్నలు అభ్యర్థుల ఏకాగ్రతను పరీక్షించేలా ఉంటాయి. కాబట్టి ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్నాకే గుర్తించాలి.

Posted Date : 17-02-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం