• facebook
  • whatsapp
  • telegram

ఏం చూడాలి? ఎలా ఎంచుకోవాలి?  

విదేశీ విద్యకు మార్గదర్శకాలు

 

అత్యుత్తమ కెరియర్, ఉన్నత అవకాశాలు.. దాదాపుగా ఇవే లక్ష్యాలతో విద్యార్థులు విదేశీ విద్యపై మొగ్గు చూపుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఎంతో సమయాన్నీ, డబ్బునూ ఖర్చు పెడుతుంటారు. కానీ అనుకున్న ఫలితం  దక్కాలంటే  మంచి కళాశాల/ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాలి. మరి దానికి ఏం చేయాలి? 

 

ఈ ఏడాది ఫాల్‌ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఎన్నో విద్యాసంస్థలు ఎన్నో రకాల కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో తగినదాన్ని ఎంచుకోవడం కొంత కష్టతరమే. ఇంకా.. కళాశాల ప్రవేశం పొందడం అంటే.. ఎంచుకున్న సంస్థ, కోర్సును బట్టి ఏడాది నుంచి నాలుగేళ్ల సమయానికి నిర్ణయం తీసేసుకోవడంతో సమానం. పైగా విదేశీ విద్య అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి సమయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడిని కోల్పోయినట్లే అవుతుంది. అందుకే.. కొంత సమయం ప్రత్యేకంగా కేటాయించి, అన్ని అంశాలూ పరిశీలించుకున్నాకే నిర్ణయం తీసుకోవడం మేలు.

 

వీటిని గమనించాలి

ప్రోగ్రామ్‌ 

ఆర్ట్స్, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌.. ఇలా చాలా కోర్సులు ప్రతి విద్యాసంస్థలోనూ ఉంటాయి. కానీ స్పెషలైజ్‌డ్‌ ప్రోగ్రామ్‌లు కొన్నింటిలో మాత్రమే ఉంటాయి. కొన్నిసార్లు ఇవి కోరుకున్న విద్యాసంస్థలో ఉండకపోవచ్చు. కాబట్టి, దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న విద్యాసంస్థలను జాబితాగా రాసుకునేముందు ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవాలి. అలాగే కోర్సు మాత్రమే ఉంటే సరిపోదు. దానిపరంగా సంస్థకు మంచి పేరుండాలి. అందుబాటులో ఉన్న సీట్లు.. ఏటా ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్యనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఇంకా.. ఒక్కోసారి కోర్సు పేరు దగ్గరగా ఉండి, తీరా చేరాక అనుకున్నవి కాకుండా వేరే అంశాలు ఉండొచ్చు. కాబట్టి, పేరును బట్టి కాకుండా కోర్సులో భాగంగా బోధించే పాఠ్యాంశాలనూ పరిశీలించుకోవాలి. కళాశాలను విద్యార్థులు ఎంచుకుంటున్న నిష్పత్తి తీరునూ గమనించుకోవాలి.

 

అర్హులేనా? 

ఎంచుకున్న కళాశాల కోరుతున్న అర్హతలన్నీ మీలో ఉన్నాయో లేదో ముందుగానే పరిశీలించుకోవాలి. తీరా దరఖాస్తు చేసుకున్నాక ఏ ఒక్క అర్హత లేకపోయినా దరఖాస్తు రద్దయ్యే అవకాశముంది. ఉదాహరణకు- ప్రీరిక్విజిట్‌ స్కోరు కటాఫ్‌ కంటే తక్కువగా ఉన్నా దరఖాస్తు చేసుకుంటే ప్రవేశాన్ని తిరస్కరిస్తారు. డాక్యుమెంట్లను కోరిన భాషలోకి తర్జుమా చేయడం.. ఇలాంటివన్నీ సరిచూసుకోవాలి.

 

 

ఫ్యాకల్టీ 

ఉపాధ్యాయుల నేపథ్యం, అనుభవం వంటి అంశాలనూ చూసుకోవాలి. వారి గురించిన సమాచారాన్ని లోతుగా పరిశీలించుకోవాలి. అలాగే రిసెర్చ్‌ ప్రాజెక్టులకు అవకాశముందో చూసుకోవాలి. పరిశోధన విషయంలో సరైన మెంటర్‌/ ప్రాజెక్టును ఎంచుకోవడం ప్రధానం. ఇలాంటప్పుడు ఫ్యాకల్టీతో ముందుగా మాట్లాడి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. కళాశాల ల్యాబ్‌ సౌకర్యాలు, బృందంతో పనిచేసే వాతావరణం, వచ్చిన పబ్లికేషన్లు మొదలైనవాటిని చూసుకోవాలి.

 

ప్రదేశం

దేశం పేరు ఇంటర్నెట్‌లో కొట్టగానే.. దానికి సంబంధించి అందమైన, ప్రముఖ ప్రదేశాల ఫొటోలన్నీ వచ్చేస్తాయి. వాటికి ఆకర్షితమై ఎంచుకునేవారూ ఎక్కువే. కానీ ఆ దేశంలో అవొక భాగం మాత్రమే అని గమనించాలి. మీరు వెళ్లే ప్రదేశం అందుకు భిన్నంగా ఉండొచ్చు. కాబట్టి ముందుగానే చూసుకోవాలి. క్యాంపస్‌ ఉన్న ప్రదేశం, చుట్టుపక్కల నేపథ్యం, సంస్కృతి, వాతావరణ పరిస్థితులు, భద్రత, నివాసయోగ్యమేనా? అనేది చూసుకోవాలి. దగ్గర్లో సంస్థలేమైనా ఉన్నాయేమో కూడా పరిశీలించుకోవాలి. లేదంటే ఇంటర్న్‌షిప్, తాత్కాలిక ఉద్యోగాల కోసం చూసేటపుడు ఇబ్బంది అవుతుంది. 

 

ప్లేస్‌మెంట్స్‌ 

సరిహద్దులు దాటి మరీ వెళ్లేది మంచి కెరియర్‌ కోసమే. అందుకే చాలావరకూ విద్యార్థులు చదువుతున్నపుడే కొలువు కొట్టాలని చూస్తుంటారు. కాబట్టి, ఎంచుకున్న కళాశాలలో అదెంతవరకూ సాధ్యమో చూసుకోవాలి. కేవలం ఉద్యోగమనే కాదు.. ఇది కళాశాల ప్రతిష్ఠతో పాటు పొందగల భవిష్యత్తునూ తెలియజేస్తుంది. అందించగల విజ్ఞానంతోపాటు అందుకోగల అవకాశాలనూ తెలుసుకునే వీలు ఇది.

 

ఆర్థికం

ఎంచుకున్న కళాశాలలో కోరుకున్న కోర్సుకు ఫీజు ఎంత చెల్లించాలో ముందుగానే తెలుసుకోవాలి. కోర్సును బట్టీ ఫీజుల్లో మార్పు ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఏడాదికి చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి విద్యాసంస్థలు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతాయి. కళాశాలను ఎంచుకునే ముందే అది తమ బడ్జెట్‌ పరిధిలోకి వస్తుందో లేదో పరిశీలించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు కళాశాల ఫీజు తక్కువగా ఉన్నప్పటికీ అది ఉన్న ప్రదేశంలో నివసించడానికి అయ్యే ఖర్చు లేదా కళాశాలలో వసతికి తీసుకునే మొత్తం ఎక్కువగా ఉండొచ్చు. ఇక్కడ కేవలం ఫీజునే పరిగణనలోకి తీసుకుంటే ఆర్థిక ప్రణాళిక దెబ్బతినే అవకాశముంది. ఆహారం, వసతి, రవాణా.. ఇలా ప్రతి ఒక్కదాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే చాలావరకూ విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తాయి. కొన్ని దేశాల్లోని విద్యాసంస్థలు రుణ సౌకర్యాన్నీ కల్పిస్తున్నాయి.

 

సౌకర్యాలు  

చదువుతోపాటు అందించే ఇతర అదనపు అంశాలనూ చూసుకోవాలి. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ఆక్టివిటీస్‌.. విద్యార్థిలో వివిధ నైపుణ్యాలను పెంపొందించడంలో సాయపడతాయి. వాటిని కళాశాల/ విశ్వవిద్యాలయం ఏమేరకు అందిస్తోందో చూసుకోవాలి. ఆటలు, డిబేట్‌లు, సామాజిక సేవ, స్టూడెంట్‌ కౌన్సిల్, మ్యూజిక్‌.. ఇలా వేటిని అందిస్తోందో చూసుకోవాలి. ఇవి విద్యార్థి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడంతోపాటు మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలకూ తోడ్పడతాయి.

 

స్పందన?

ప్రపంచవ్యాప్తంగా చాలా విశ్వవిద్యాలయాలు కొవిడ్‌ పరిస్థితికి తగ్గట్టుగా మార్పులు తీసుకొచ్చాయి. దేశం, విశ్వవిద్యాలయం బట్టి వాటిల్లో మార్పులున్నాయి. చాలావరకూ విశ్వవిద్యాలయాలు ఫీజులను తగ్గించాయి. విద్యార్థుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, స్పందించిన తీరు.. వంటి అంశాలు చూసుకోవాలి. ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో విద్యార్థిపరంగా ఎలా ఆలోచిస్తారనే అంశానికీ ప్రాధాన్యమివ్వాలి.

 

ఒకటికి మించి

బాగా నచ్చిన ఒకటో, రెండో కళాశాలలకు పరిమితమవడం చాలామంది విద్యార్థులు అనుసరించే పద్ధతి. కానీ ఇది మంచిది కాదు. తీరా దేనిలోనూ ఎంపిక కాకపోతే తిరిగి వచ్చే ఏడాది వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి. కాబట్టి, ముందుగా నచ్చిన, మీ అర్హతలకు తగిన విద్యాసంస్థలన్నింటినీ జాబితాగా రాసుకోవాలి. ఒక్కోదానికి అవసరమైన ధ్రువపత్రాలు, వివరాలన్నింటినీ సమకూర్చుకుని, ఆ పరంగా దరఖాస్తు చేసుకోవాలి. తీరా ఒకటికి మించి ప్రవేశ అవకాశం వచ్చినా వాటిలోనూ అన్నింటినీ బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఒకటి/ రెండింటికి మాత్రమే దరఖాస్తు చేసుకుంటే ఆ అవకాశమూ ఉండదు.

 

కళాశాలా? విశ్వవిద్యాలయమా?

విద్యార్థి ఒక కోర్సును ఎంచుకున్నాడనుకుందాం. అది తాను దరఖాస్తు చేసుకుందామనుకుంటున్న కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ ఉంటే దేనికి ప్రాధాన్యమివ్వాలి? ఇది చాలా చిన్నగా అనిపించినా.. చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యగా నిపుణులు చెబుతున్నారు. విశ్వవిద్యాలయాలతో పోలిస్తే కళాశాలలు పరిధిపరంగా చిన్నవి. దీంతో పరిశోధన అవకాశాలు పరిమితంగా ఉంటాయి. విశ్వవిద్యాలయాల్లో ఎన్నో కళాశాలలు ఆన్‌/ ఆఫ్‌ క్యాంపస్‌ల్లో పనిచేస్తుంటాయి. వీటిల్లో అసోసియేట్‌ డిగ్రీ అవకాశాలూ ఉంటాయి. 

 

ర్యాంకింగ్‌ తప్పనిసరా!

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు విద్యాసంస్థల ర్యాంకింగ్‌లను ఏటా ప్రకటిస్తుంటాయి. కొన్ని దేశం పరిధిలోనే ప్రకటిస్తే మరికొన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తుంటాయి. ఒక్కో సంస్థ పరిశీలించే అంశాలు ఒక్కోలా ఉంటాయి. ర్యాంకులను పరిశీలించుకోవడం మంచి నిర్ణయమే. కానీ వాటిలో విద్యార్థికి సరిపోయేలా అంశాలు ఎంతవరకూ ఉన్నాయో పరిశీలించుకుని ఆ పరంగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఎంచుకున్న కోర్సు, బోధన, ఆక్సెప్టెన్సీ రేటు, విద్యార్థుల ప్రదర్శన, పరిశోధన అవకాశం.. ఇలాంటి అంశాల ఆధారంగా ఉన్నవాటికి ప్రాధాన్యం ఇస్తే మేలు.

Posted Date : 04-03-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం