• facebook
  • whatsapp
  • telegram

ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలంటే?

అత్యవసరమైన అయిదు సూచనలు

విదేశాల్లో చదువు ఇప్పుడు సాధారణం అయిపోయింది. ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉంటే వెళ్లిపోవచ్చు. ఉన్నత విద్య కలలు సాకారం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు సహా పలు ఆర్థిక సంస్థలూ సాయం అందిస్తున్నాయి. వనరులు అందుబాటులో ఉన్నా.. కొన్ని ముఖ్యమైన విషయాలను అభ్యర్థులు విస్మరిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే విద్య కోసం ఇతర దేశాలకు విజయవంతంగా వెళ్లాలనుకునే వాళ్లు కొన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. తగిన అవగాహన పెంపొందించుకోవాలి. అందులో ప్రధానంగా అయిదు అంశాలపై దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు.

1. ముందస్తు పరిశీలన

విదేశాల్లో ఎక్క‌డ చ‌దువుకోవాలి? ఏ యూనివ‌ర్సిటీ మంచిది? మంచి సౌక‌ర్యాలు, నాణ్య‌మైన బోధ‌న ఎక్క‌డ ల‌భిస్తుంది? అనే అంశాలను క్షుణ్ణంగా ప‌రిశీలించాలి. ఆయా యూనివ‌ర్సిటీలు ఎలా ఎంపిక చేస్తున్నాయి? అనే విష‌యాల‌ను గ‌మ‌నించాలి. కొన్ని విశ్వ‌విద్యాల‌యాలు శాట్‌, జీఆర్ఈ, జీమ్యాట్ ఆధారంగా, మ‌రికొన్ని ఐఈఎల్‌టీఎస్‌/టీంఈఎఫ్ఎల్ స్కోర్‌ల‌తో అడ్మిషన్లు ఇస్తాయి. ఆ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అవసరమైన స్కోర్లు లేదా మార్కులు సంపాదించుకోవడంతోపాటు ఆయా యూనివర్సిటీలు ఎలాంటి అర్హతలు ఉన్న విద్యార్థులను చేర్చుకుంటున్నాయో తెలుసుకోవాలి. దీని కోసం నిపుణులను ముందుగా సంప్రదించాలి. తద్వారా తగిన అర్హతలను సమకూర్చుకోవచ్చు. తేలిగ్గా అడ్మిషన్ పొందవచ్చు.

2. సరైన కౌన్సెలర్ల సాయం

ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లాలంటే చాలా అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా కౌన్సెలర్ల సాయం తీసుకోవాలి. కోరుకున్న కోర్సు అడ్మిషన్ ఎలా, ఏ మార్గాల్లో పొందవచ్చో వాళ్లు సూచిస్తారు. అయితే వీరి ఎంపికలో జాగ్రత్త వహించాలి. తమ స్వప్రయోజనాల కోసం కొందరు కౌన్సెలర్లు తమకు అనుకూలమైన సలహాలు, గైడెన్స్ ఇస్తున్నారు. అంతగా ప్రాచుర్యం లేని కాలేజీలు, యూనివర్సిటీలకు విద్యార్థులను పంపుతున్నారు. పారదర్శకంగా ఉండటం లేదు. అందుకే సరైన కౌన్సెలర్ ను ఎంచుకోవాలి. అందుకు సీనియర్ల సాయం తీసుకోవాలి. వారి వారి అనుభవాల వివరాలు తెలుసుకుంటే కొంత వరకు ఒక అంచనాకు రావచ్చు. కేవలం అకడమిక్ ఫలితాలను బట్టి మాత్రమే విశ్వవిద్యాలయాలు విద్యార్థులను ఎంపిక చేయవు. వాటితోపాటు అభ్యర్థులు పంపే  లెట‌ర్ ఆఫ్ రిక‌‌మెండేష‌న్ (ఎల్ఓఆర్‌), స్టేట్‌మెంట్ ప‌ర్ప‌స్ (ఎస్ఓపీ), విద్యార్థుల ప్రొఫైల్‌, అద‌న‌పు క‌రిక్యుల్ యాక్టివిటీస్ ను పరిశీలిస్తాయి. పరిగణనలోకి తీసుకుంటాయి. వాటికి సంబంధించి కౌన్సెలర్లు తగిన గైడెన్స్ గతంలో ఇచ్చారో లేదో తెలుసుకోవాలి.

3. అదనపు నైపుణ్యాలు, ప్రావీణ్యాలు

విదేశీ విద్యా సంస్థలు అడ్మిషన్ ఇవ్వడానికి కేవలం అకడమిక్ అంశాలే కాకుండా ఇతర విషయాలను పరిశీలిస్తాయని అభ్యర్థులు గుర్తించాలి. వక్తృత్వం, స్పోర్ట్స్ తదితర విభాగాల్లో ఏదైనా ప్రతిభను ప్రదర్శించి సర్టిఫికెట్లు, మెడల్స్ పొంది ఉంటే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే అలాంటి అదనపు అర్హతలను పొందడానికి ముందు నుంచే ప్రయత్నించాలి. అందుకే అలాంటి వాటిలో రాణించడంపై, సర్టిఫికెట్లు సాధించడంపై దృష్టి పెట్టాలి.

4. ప్ర‌చారాల‌ పట్ల అప్రమత్తత

విద్యార్థులు కొన్ని సంద‌ర్భాల్లో విశ్వ‌విద్యాల‌యాల ప్ర‌చార ఆర్భాటాలను చూసి మోస‌పోతుంటారు. నేరుగా తెలుసుకోకుండా వాటిని నమ్మకూడదు. విద్యాసంస్థ‌ల గురించి తెలుసుకోవాలంటే అక్క‌డి పూర్వ విద్యార్థుల‌తో మాట్లాడాలి. సామాజిక మాధ్య‌మాల ద్వారా వారితో సంభాషించడం సాధ్యమవుతుంది. సందేహాలను నివృత్తి చేసుకోవాలి. వారిచ్చే సూచ‌న‌ల‌తో కాలేజీల ప్లేస్‌మెంట్ల రికార్డులు, ఫ్యాక‌ల్టీకి సంబంధించిన స‌మాచారాన్ని సేకరించాలి. తెలిసిన వారు ఎవ‌రైనా ఆ కాలేజీలో చ‌దివారా అని ఆరా తీయాలి. అలాంటి వారు ఉంటే ఎంపిక సులు‌వవుతుంది.

5. ప‌క్కా ప్ర‌ణాళిక‌

ఏ దేశంలోనైనా విదేశీ విద్యార్థుల కోసం సీట్లు త‌క్కువ సంఖ్య‌లోనే ఉంటాయి. కాబ‌ట్టి సీటు సంపాదించ‌డం కొంత కష్టమే.  పోటీలో నిలబడి సీటు సాధించుకోవాలంటే పక్కా ప్రణాళిక అవసరం. ఏం కావాలి? ఎక్కడ చేరాలి? పరిస్థితులేంటి? వసతి, వ్యయాలు, వాతావరణం, బోధన తదితర ఎన్నో రకాల అంశాల గురించి తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు మొదలు, కాలేజీలో ప్రవేశించే వరకు ప్రణాళిక ప్రకారం జరిగే విధంగా చూసుకోవాలి. వివిధ దశల్లో అవసరమయ్యే వాటిని ముందుగా సిద్ధం చేసుకోవాలి. సరైన ప్లాన్ లేకపోతే అనవసరమైన గందరగోళానికి గురై తప్పులు చేసే ప్రమాదం ఉంది. అందువల్ల కోరుకున్న సీటును కోల్పోయే అవకాశమూ ఉంది. అందుకే నిపుణులు, సీనియర్ల సాయంతో పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి.

Posted Date : 10-03-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం