• facebook
  • whatsapp
  • telegram

అమెరికాలో ఉన్నత విద్యకు అయిదు సూత్రాలు!

వెళ్లాలనుకుంటే వెంటనే పరిశీలించాల్సిన అంశాలు

దరఖాస్తులో తప్పులుంటే తిరస్కరణ తప్పదు

విదేశాల్లో ఉన్నత విద్య అంటే గుర్తొచ్చే దేశం అమెరికా. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ ఈ దేశంలోనే ఉంటాయంటే ఎంత నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందుతాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడాలని ఎంతో మంది భారతీయులు కోరుకుంటారు. అక్కడి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం ఏటా లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. మరి వాళ్లందరికీ ప్రవేశాలు లభిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. అందుకు భిన్న కారణాలున్నా.. ముఖ్యమైనది దరఖాస్తులో దొర్లే తప్పులు. ఏటా ఎన్నో దరఖాస్తులను అక్కడి విద్యాసంస్థలు తిరస్కరిస్తున్నాయి. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? అమెరికాలోని ఏ విద్యాసంస్థల్లో చేరాలి? ఎలాంటి జాగ్రత్తల వల్ల దరఖాస్తు తిరస్కరణ కాకుండా చూసుకోవచ్చనే అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

1) అక్రెడిటేషన్ ఉందా?

అమెరికాలో ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకునే ముందు చేరాలనుకుంటున్న విశ్వవిద్యాలయానికి అక్రెడిటేషన్ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవాలి. అక్రెడిటేషన్ అనేది విద్యాసంస్థలో నాణ్యమైన విద్య, పేరు ప్రఖ్యాతలు, ఇతర సదుపాయాలకు గుర్తింపు.  ఆయా విశ్వవిద్యాలయాల గుర్తింపును విద్యార్థులు ‘డీఏపీఐపీ’, ‘స్టడీ ఇన్ ది స్టేట్స్’ వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. అమెరికాలో 4,500 పైచిలుకు విశ్వవిద్యాలయాలకు అక్రెడిటేషన్ ఉండగా.. ఏటా లక్షల మంది భారతీయ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అక్రెడిటేషన్ లేని సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుంటే విలువైన సమయంతోపాటు డబ్బు కూడా వృథా అవుతుంది. 

2) జాబితా సిద్ధం చేసుకోవాలి

అమెరికాలో ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయాల ఎంపిక ఎప్పుడూ అత్యుత్తమంగానే ఉంటుంది. విద్యార్థుల అకడమిక్ సామర్థ్యంతోపాటు ఇతర అర్హత పరీక్షల్లో సాధించిన స్కోర్లు, ర్యాంకులను గమనిస్తాయి. అందరిలా కాకుండా అదనపు స్కిల్స్ ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఇస్తాయి. విద్యార్థులు వీటిపై దృష్టి సారించాలి. మరోవైపు తాము చేరడానికి ఆసక్తి చూపుతున్న విశ్వవిద్యాలయాల జాబితాను విద్యార్థులు తయారు చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఆయా సంస్థల్లో చదివిన విద్యార్థుల విజయాలు, ప్లేస్‌మెంట్లు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 

3)  ఆర్థిక ప్రణాళిక

విదేశాల్లో చదువుకోవాలంటే ఆర్థిక ప్రణాళికకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు ఆర్థిక సహాయం కోరుకునే విద్యార్థులు ముఖ్యంగా వర్సిటీల వెబ్సైట్లలో ఆయా వివరాలను పరిశీలించాలి. విదేశీ విద్యార్థులు-అర్హత విభాగంలో ఇవి అందుబాటులో ఉంటాయి. వాటిని తెలుసుకోకుండా ముందుకు సాగితే విద్యార్థులు విశ్వవిద్యాలయం మధ్య సమతౌల్యత దెబ్బతింటుంది. 

4) సందేహాల నివృత్తి 

చేరాలనుకునే సంస్థ వెబ్సైట్లోని వివరాలను చూసే విద్యార్థులు నిర్ధారణకు రావడం సరికాదు. ఎలాంటి సందేహాలున్నా తీర్చుకోవాలి. ముఖ్యంగా అమెరికా విద్యాలయాలు విద్యార్థులు అడిగే ప్రశ్నలకు వేగంగా స్పందిస్తాయి. ఈ-మెయిల్, ఫోన్, వాట్సప్, జూమ్ కాల్స్ ద్వారా తమను సంప్రదించే అవకాశం కల్పిస్తున్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి.

5) దరఖాస్తు తిరస్కరణకు కొన్ని కారణాలు

విద్యార్థులు తుది గుడువు లోపు తమ దరఖాస్తును పంపించాలి. రుసుము చెల్లించకుంటే దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరు. అలాగే ఆయా విశ్వవిద్యాలయాలు అడిగే ఎస్సే, ఎల్ఓఆర్, ట్రాన్స్క్రిప్ట్ తదితర డాక్యుమెంట్లను తప్పనిసరిగా జత చేయాలి. ఇందులో ఏ ఒక్కటి సమర్పించక పోయినా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. అత్యధిక దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నందున రిజెక్ట్ అవుతున్నాయి. రెండు,మూడు సార్లు చూసుకొని పంపడం మేలు. కొన్నిసార్లు విద్యార్థులు ఎస్సేకు సంబంధించి సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతోపాటు వారికి వచ్చిన దరఖాస్తులు, ఇతరులతో పోలిస్తే అభ్యర్థి బలహీనంగా కనిపిస్తే తిరస్కరణకు అవకాశం ఉంది.

Posted Date : 18-03-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం