• facebook
  • whatsapp
  • telegram

విదేశీ విద్యకు... అంతా అనుకూలం!

‣ స్వాగతం పలుకుతున్న యూనివర్సిటీలు

కరోనా ప్రభావంతో గత ఏడాదంతా ఊహించని పరిణామాలను ఎదుర్కొన్నాం. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చేస్తున్నాయి. విదేశీ విద్య కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టొచ్చు. విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు నిబంధనలు సడలిస్తూ.. అన్నిరకాల ఏర్పాట్లూ చేస్తూ విద్యార్థులను స్వాగతిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ అభ్యాసానికే పరిమితం కాకుండా క్యాంపసుల్లోకి అడుగుపెట్టి తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు వినే అవకాశం ఏర్పడుతోంది! 

ఏటా లక్షలాది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం యూఎస్‌ఏ, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళుతుంటారు. వీరంతా ట్యూషన్‌ ఫీజు, వసతి, ఇతర సదుపాయాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూనే ఉంటారు. కరోనా పరిస్థితుల  ప్రభావంతో ఈ ఆదాయాన్ని విదేశీ యూనివర్సిటీలు కోల్పోయాయి. అందుకే ఈ విద్యా సంస్థలన్నీ అవసరమైన సదుపాయాలను వెంటనే కల్పించి విద్యార్థులను ఆహ్వానించే పనిలో పడ్డాయి. 

యునైటెడ్‌ స్టేట్స్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇప్పటివరకూ అమలు చేస్తూ వచ్చిన ప్రయాణ నిబంధనలను సడలిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు తమ దేశాలకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాయి.

రాయితీలను అందిస్తున్నాయి...

విద్యార్థులు తాము ఎంచుకున్న దేశం చేరేందుకు కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ ఉంటే... తాము ప్రయాణించే ఏర్‌లైన్స్‌ లేదా ఆగిన దేశంలో కొవిడ్‌-19 నిబంధనలకు తగిన ఏర్పాట్లు ఉండేలా చూసుకోవటం తప్పనిసరి. 

విదేశీ విశ్వవిద్యాలయాలు ట్యూషన్‌ ఫీజు మాఫీ, స్కాలర్‌షిప్‌ల ఏర్పాటు, శాట్‌టెస్ట్‌ స్కోరు మినహాయింపు... లాంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు తమ కోర్సులను పూర్తిచేయడానికి మరో విద్యా సంవత్సరం వరకూ ఎదురుచూడనవసరం లేదు.  

ఈ కారణం వల్లనే విదేశాలకు వెళ్లే విద్యార్థులు త్వరగా వ్యాక్సినేషన్‌ వేయించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. https://health.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడం ద్వారా విద్యార్థులు జూన్, జులై, ఆగస్టులో వ్యాక్సినేషన్‌ వేయించుకోవచ్చు. ఆగస్టు, సెప్టెంబరుల్లో విదేశాలకు వెళ్లే సమయానికి వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసుకోవచ్చు. 

కొవిడ్‌ పరిణామాలతో చాలా సంస్థలు ఉద్యోగాలను తగ్గించాయి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. నియామకాలు చేపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు నియంత్రణలోకి రావడంతో.. వివిధ దేశాలు వ్యాక్సినేషన్‌ వేయించుకున్న పర్యటకులను తమ దేశాల్లోకి అనుమతిస్తున్నాయి. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడే ప్రణాళికలను అమలు చేయటానికి ఇదే సమయం!

విదేశీ విశ్వవిద్యాలయాలు ట్యూషన్‌ ఫీజు మాఫీ, స్కాలర్‌షిప్‌ల ఏర్పాటు, శాట్‌టెస్ట్‌ స్కోరు మినహాయింపు... లాంటివెన్నో కల్పిస్తున్నాయి. విద్యార్థులు మరో విద్యా సంవత్సరం వరకూ ఎదురుచూడనవసరం లేదు.

యూఎస్‌ఏ 

విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు కొవిడ్‌ నిబంధనల నుంచి కొన్ని మినహాయింపులను యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా అమెరికా వెళ్లే విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

తమ ఎకడమిక్‌ ప్రోగ్రామ్‌ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌తో పాటు) ను ఆగస్టు 1, 2021న గానీ, ఆ తర్వాత గానీ ప్రారంభించే విద్యార్థులు ఎన్‌ఐఈ (నేషనల్‌ ఇంటరెస్ట్‌ ఎక్సెప్షన్‌)కు అర్హులవుతారు. ఆగస్టు 1న గానీ, ఆ తర్వాత గానీ కోర్సును ఆరంభించటానికీ గానీ, కొనసాగించటానికి గానీ ప్రణాళిక వేసుకునే విద్యార్థులు ప్రయాణానికి ఎన్‌ఐఈ కోసం ఎంబసీ/ కాన్సులేట్‌ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. 

ఆగస్టు 1, 2021కి ముందు కోర్సులో చేరే విద్యార్థులు అందుబాటులో ఉండే ఆప్షన్ల కోసం సంబంధిత విద్యా సంస్థలను సంప్రదించాలి. 

యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు 3-5 రోజుల లోపల వైరల్‌ పరీక్ష చేయించుకోవాలి. వారంపాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. 
వాక్సినేషన్‌ వేయించుకున్నట్టుగా రుజువు చూపించమని యూఎస్‌ ప్రభుత్వం కోరడం లేదు. కానీ అమెరికాలోని కొన్ని కళాశాలలు విదేశీ విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అంటున్నాయి. దీనికి తగినట్టుగానే భారత ప్రభుత్వం కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ముందుగా వాక్సిన్‌ వేయడానికి ప్రాధాన్యమిస్తోంది. 

కెనడా

తమ దేశంలోకి వచ్చే విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు కింది నిబంధనలను పాటించాలంటోంది కెనడా.

ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్‌-19 టెస్ట్‌ చేయించుకోవాలి. వచ్చిన నెగెటివ్‌ రిపోర్ట్‌ను చూపించాలి. 

చదవడానికి అనుమతిని ఇచ్చినట్టుగా చూపే స్టడీ పర్మిట్‌ లేదా లెటర్‌ ఆఫ్‌ ఇంట్రడక్షన్‌ను సమర్పించాలి. 

విద్యార్థులు డిజిగ్నేటెడ్‌ లర్నింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌(డీఎల్‌ఐ)కు ప్రభుత్వం గుర్తించిన కొవిడ్‌-19 ప్లాన్‌తో హాజరుకావాలి. 

కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినప్పటికీ.. విదేశీ విద్యార్థులు తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలి. 

కెనడా లోకి అడుగుపెట్టిన వెంటనే కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. 14 రోజుల క్వారంటైన్‌లో కనీసం మొదటి మూడు రోజులూ ప్రభుత్వం అనుమతించిన హోటల్‌లో ఉండాలి. పరీక్షలో నెగెటివ్‌ వస్తే డీఎల్‌ఐ నిర్వహించే వసతిలో మిగతా క్వారంటైన్‌ కాలాన్ని పూర్తిచేయాలి. 

ఆస్ట్రేలియా 

కెనడా, యూఎస్‌ఏ, యూకే లాంటి దేశాల మాదిరిగానే ఆస్ట్రేలియా (న్యూసౌత్‌ వేల్స్‌) కూడా అంతర్జాతీయ విద్యార్థులను తిరిగి స్వాగతిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేసే లక్ష్యంతో అక్కడ ఆరోగ్య, పోలీసు శాఖల మద్దతుతో పైలట్‌ ప్లాన్‌ను అమలుచేస్తోంది. దీని ప్రకారం- 15 రోజులకు 250 మంది అంతర్జాతీయ విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వసతి గృహాల్లో క్వారంటైన్‌ చేస్తారు. ఈ సంవత్సరం చివరి నాటికి 15 రోజులకు 500 అంతర్జాతీయ విద్యార్థులను క్వారంటైన్‌ చేసి, విద్యాసంస్థల్లోకి అనుమతించాలని నిర్ణయించారు. కొవిడ్‌కు ముందు న్యూసౌత్‌ వేల్స్‌లో ఏటా 2,50,000 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థుల్లో 95 వేలమంది రిటెయిల్, హాస్పిటాలిటీ మొదలైన రంగాల్లో స్థానిక ఉద్యోగాల్లో పనిచేస్తుండేవారు. ఈ పరిశ్రమలు కోలుకోవటం కోసం విద్యార్థుల సేవలు అవసరమని భావించి, తిరిగి వారిని ఆహ్వానిస్తున్నారు. అందుకే విద్యార్థుల ప్రయాణ ఖర్చులు, వసతి, భద్రత సహా క్వారంటైన్‌ ప్రక్రియకు విశ్వవిద్యాలయ రంగమే నిధులు సమకూరుస్తోంది. 

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 

యూకే చేరుకున్న వెంటనే కొవిడ్‌-19 నెగెటివ్‌ రిపోర్ట్‌ను చూపించాలి. ప్రయాణానికి 3 రోజుల ముందు ఈ పరీక్ష చేయించుకోవాలి. వ్యాక్సిన్‌ వేయించుకున్నా, వేయించుకోకున్నా ఈ పరీక్ష తప్పనిసరి.

10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలి. నెగెటివ్‌ రిజల్ట్‌ వచ్చినా ఇది తప్పనిసరి. హోటల్‌లోగానీ లేదా అక్కడికి వెళ్లిన వెంటనే సూచించిన ప్రదేశంలోగానీ ఈ సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉండాల్సివస్తుంది. 

క్వారంటైన్‌లో ఉండగానే రెండో రోజునా, ఎనిమిదో రోజునా కరోనా వైరస్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. అప్పుడు పాజిటివ్‌ వస్తే మరో 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలి. 

టైర్‌-4 వీసా, బయోమెట్రిక్‌ వీసా లేదా ప్రీసెటిల్డ్‌/ సెటిల్డ్‌ స్టేటస్‌ ఉన్న విదేశీ విద్యార్థులకు ప్రయాణ నిషేధంలో మినహాయింపు ఉంటుంది. వీరికి సమాన నివాస హక్కులుంటాయి. 

పది రోజుల హోటల్‌ క్వారంటైన్, టెస్టింగ్‌ బిల్లు కోసం సుమారు 1,750 పౌండ్లను భారతీయ విద్యార్థులకు తిరిగి చెల్లిస్తామని చాలా యూనివర్సిటీలు ప్రకటించాయి. అంతేకాకుండా విదేశీ విద్యార్థులకు దేశంలో ఎక్కడైనా వ్యాక్సిన్‌ వేయించుకునే అవకాశం కల్పిస్తున్నారు. 

Posted Date : 21-06-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం