• facebook
  • whatsapp
  • telegram

Education Loan: విదేశీ విద్యకు రుణం

విద్యార్థే హామీగా రూ.1.50 కోట్లు వరకు పొందే అవకాశం

ఉన్నత చ‌దువుల కోసం విదేశాలకు వెళ్లి విద్య‌ను అభ్య‌సించ‌డం.. దానిక‌య్యే అధిక ఖ‌ర్చుల‌ను త‌ట్టుకోవ‌డానికి విద్యా రుణాలు తీసుకోవ‌డం.. ఇప్పుడు చాలా కుటుంబాల్లో సాధారణం అయిపోయింది. చాలా భార‌తీయ బ్యాంకులు ఈ తరహా రుణాలందిస్తున్నాయి. పేరున్న విద్యాల‌యాల్లో సీటు ఖ‌రార‌యితే గ్యారెంటీ లేకుండానే విద్యార్థినే హామీగా తీసుకుని రుణాలిచ్చే బ్యాంకులు ఉన్నాయి. దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా విదేశీ విశ్వ‌విద్యాల‌యాల్లో కోర్సుల కోసం జాయిన్ అయ్యే విద్యార్థులకు రూ. 1.50 కోట్ల వ‌ర‌కు విద్యా రుణాన్ని ఇవ్వ‌డానికి సిద్ధపడుతోంది. ఈ ప‌థ‌కం కింద క‌వ‌రయ్యే దేశాల జాబితాలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెన‌డా, యూర‌ప్‌, జ‌పాన్‌, సింగ‌పూర్‌, హాంకాంగ్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. విదేశీ క‌ళాశాల‌లు, విశ్వ‌విద్యాల‌యాల్లో పూర్తి స‌మ‌యం రెగ్యుల‌ర్ కోర్సుల‌ను అభ్య‌సించాల‌నుకునే విద్యార్థుల కోసం ప్ర‌త్యేకంగా ఈ విదేశీ విద్యా రుణాన్ని ప్ర‌క‌టించింది. ఎస్‌బీఐ ‘గ్లోబ‌ల్ ఎడ్‌-వాంటేజ్’ పేరుతో త‌మ కెరీర్ ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి విదేశాల్లో కోర్సులు అభ్య‌సించాల‌నుకునే విద్యార్థులకు సాయం చేయడానికి రుణాల‌ను అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలిపింది.

విద్యార్థులు రూ.7.50 ల‌క్ష‌ల నుంచి రూ. 1.50 కోట్ల వ‌ర‌కు రుణం పొందొచ్చు. విద్యార్థినులకు 0.50% రాయితీతో రుణంపై 8.65% వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. రెగ్యుల‌ర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, డిప్లొమా స‌ర్టిఫికేట్‌, డాక్ట‌రేట్ కోర్సుల‌ను ఎంచుకునే విద్యార్థులు ఈ విద్యా రుణానికి అర్హులు. రుణాలు తీసుకున్న‌వారు కోర్సు పూర్త‌యిన 6 నెల‌ల త‌ర్వాత నుంచి రుణ చెల్లింపులు చేయొచ్చు. తిరిగి చెల్లించే కాలం గ‌రిష్ఠంగా 15 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంది. ప్ర‌యాణ ఖ‌ర్చులు, లైబ్ర‌రీ, ల్యాబ్ ఫీజులు, పుస్త‌కాలు, కోర్సుకు చెందిన ప‌రిక‌రాలు, యూనిఫాం, కంప్యూట‌ర్ ఫీజులు, ప్రాజెక్ట్ వ‌ర్క్‌, స్ట‌డీ టూర్‌ల వంటి అద‌న‌పు అవ‌స‌రాల‌ మొత్తం ట్యూష‌న్ ఫీజులో 20% మించ‌కుండా ఉండాలి. డిపాజిట్‌, బిల్డింగ్ ఫండ్‌, రీఫండ్ చేయ‌ద‌గిన డిపాజిట్ వంటి ఇత‌ర ఖ‌ర్చులు.. ట్యూష‌న్ ఫీజులో 10% మించ‌కుండా ఉంటే విద్యారుణం కింద అవీ కూడా క‌వ‌ర్ అవుతాయి. విద్యార్థుల ఐ-20/వీసా కంటే ముందు అత‌డికి రుణం మంజూరు అవుతుంది. సెక్ష‌న్ 80 (ఈ) కింద ప‌న్ను మిన‌హాయింపునకు అర్హులు.

దర‌ఖాస్తు ప్ర‌క్రియ‌కు అవ‌స‌ర‌మ‌య్యే ప‌త్రాలు:  10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి మార్క్ షీట్‌, గ్రాడ్యుయేష‌న్ పూర్త‌యితే దానికి సంబంధించిన స‌ర్టిఫికెట్‌, ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితం, అడ్మిష‌న్ లెట‌ర్‌/ ఆఫ‌ర్ లెట‌ర్‌, యూనివ‌ర్సిటీ నుంచి అడ్మిష‌న్ రుజువుగా కోర్సు కోసం ఖ‌ర్చుల షెడ్యూల్‌, స్కాల‌ర్‌షిప్‌, ఫ్రీ-షిప్ మొద‌లైన‌వి అందించే లెట‌ర్ కాపీలు ఇవ్వాలి. దరఖాస్తుదారుడు గ‌త 6 నెల‌ల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, స్థిరాస్తికి సంబంధించి సేల్ డీడ్‌, విద్యార్థి/ త‌ల్లిదండ్రులు/ స‌హ‌-రుణ‌గ్ర‌హీత‌/ హామీదారుల శాశ్వ‌త ఖాతా (పాన్‌), ఆధార్ కాపీలు ఇవ్వాలి. గుర్తింపు చిరునామా కింద పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్ /ఓట‌రు గుర్తింపు కార్డు వంటి అధికారికంగా చెల్లుబాటు అయ్యే ప‌త్రాలు అందించాల్సి ఉంది.

Posted Date : 03-09-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం