• facebook
  • whatsapp
  • telegram

US: వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు రద్దు!

హెచ్‌1బీ, హెచ్‌3...తదితరులకు వర్తింపు

2022 ఏడాదికి వర్తించేలా అమెరికా నిర్ణయం

వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వీసా దరఖాస్తుదారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలసేతర హెచ్‌1బి, హెచ్‌3, ఎల్‌, ఓ, పీ, క్యూ తదితర కేటగిరీల్లో వీసాలు పొందాలనుకునే వారికి తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూల నుంచి మినహాయింపునివ్వనుంది. 2022 ఏడాది మొత్తానికి ఈ నిర్ణయం వర్తించనుంది. భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లే వృత్తినిపుణులు, విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, వీసా దరఖాస్తుదారుల్లో ఎవరిని ఇంటర్వ్యూకు పిలవాలో వద్దో నిర్ణయించే తుది అధికారాన్ని తాత్కాలికంగా కాన్సులర్‌ అధికారులకు ఇస్తున్నట్లు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ  డిసెంబ‌రు 24న‌ వెల్లడించింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా కొన్ని కేసుల్లో వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించాలని రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ అధికారులు నిర్ణయించే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది. అందువల్ల అదనపు, తాజా వివరాల కోసం దరఖాస్తుదారులు సంబంధిత రాయబార, కాన్సులేట్‌ వెబ్‌సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించింది. అమెరికాలో ఏ వీసా జారీకైనా వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరి. అందులో ఎంపికైతేనే వీసా మంజూరవుతుంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 2022లో ఇంటర్వ్యూ విధానాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ముఖాముఖిలు అవసరంలేని వీసా కేటగిరీలు..

ప్రత్యేక వృత్తినిపుణులు(హెచ్‌-1బి)

శిక్షణ, ప్రత్యేక విద్య సందర్శకులు(హెచ్‌3)

 ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ అయ్యేవారు(ఎల్‌)

 విశేష ప్రతిభావంతులు (ఓ)

 క్రీడాకారులు, కళాకారులు, వినోదరంగం వారు(పి)

అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు(క్యు)

 ఇప్పటికే ఒకసారి వీసా పొంది దాని కాలపరిమితి ముగిసే 48 నెలల్లోగా పునరుద్ధరించుకోవాలని భావించే వారూ వ్యక్తిగత ఇంటర్వ్యూల హాజరీ నుంచి మినహాయింపునకు అర్హులుగా అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

వీసా మినహాయింపు ప్రోగ్రామ్‌లోని సభ్య దేశాల పౌరులు ఇప్పుడు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ రద్దు చేసే విచక్షణాధికారం కాన్సులేట్‌ అధికారులకు ఉంటుంది.

Posted Date : 25-12-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం