• facebook
  • whatsapp
  • telegram

Abroad Education: విదేశీ విద్యతో మెరుగైన అవకాశాలు

ప్రమాణాలకు దూరంగా దేశీయ కోర్సులు
ఆధునిక ప్రపంచంలో విద్యార్జనకు ఎల్లలు చెరిగిపోతున్నాయి. తమకు అవసరమైన చదువు సొంత గడ్డపై అందుబాటులో లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళడం ప్రాచీన కాలం నుంచీ ఉన్నదే. క్రీస్తు పూర్వమే వేల మంది విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించినట్లు చరిత్ర చెబుతోంది. ఆధునిక యుగంలో శతాబ్దాల తరబడి ఇంగ్లాండ్‌ విద్యాలయాలు మన యువతను ఆకర్షించాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా అధికశాతం విద్యార్థులు అమెరికా వైపు చూస్తున్నారు. అగ్రరాజ్యంతోపాటు ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, కెనడాలలోని విద్యాలయాలకు గతేడాది చదువుకోసం వెళ్ళిన భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు అయిదు లక్షలు. విద్యార్జనకు పెద్దసంఖ్యలో విదేశాల బాటపట్టే విద్యార్థుల పరంగా చైనా తరవాతి స్థానం ఇండియాదే. అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల సంస్థ (యూఎస్‌సీఐఎన్‌) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం నిరుడు అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య 12శాతం పెరిగింది.
ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం, బ్యాంకుల రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహం వంటివి- భారతీయ విద్యార్థులను విదేశీ చదువుకు ప్రోత్సహిస్తున్నాయి. చదువే పెట్టుబడి అని ఆలోచించే తల్లిదండ్రుల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. అందువల్ల ఒకప్పుడు పిల్లల పెళ్ళిళ్ల కోసం పొదుపు చేసేవారు ఇప్పుడు చదువు కోసం పొదుపు గురించి ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ధనవంతులు, ఉన్నత వర్గాలవారికి అందుబాటులో ఉన్న విదేశీ విద్య నేడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. చదువుకోసం వెళ్ళిన చాలామందికి విదేశాల్లోనే కొలువులు దక్కుతుండటం విదేశీ విద్యపట్ల ఆసక్తిని పెంచుతోంది. సమాచార సాంకేతికత సృష్టించిన ఉద్యోగావకాశాలను అందుకోవడానికి భారతీయ విద్యార్థులు ఇంజినీరింగ్‌, సైన్స్‌ సబ్జెక్టులపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.
‣ ప్రస్తుతం ప్రపంచ ఉన్నత విద్యాకేంద్రంగా అమెరికా విరాజిల్లుతోంది. అగ్రరాజ్యంలో ఎనిమిది వేలకు పైగా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు విదేశీ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. నిరుడు 3.48 లక్షల మంది చైనా విద్యార్థులు అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో చేరారు. ఇండియా నుంచి 2.32 లక్షల మంది విద్యార్థులు అమెరికా గడ్డపై కాలుమోపారు. 2020తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 25 వేలు అధికం. అమెరికా తరవాత ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, కెనడాలు భారతీయ విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వైద్యవిద్య చదవడానికి భారతీయ విద్యార్థులు అధికంగా చైనా, రష్యా, ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్తున్నారు. భారత్‌లో ఏటా 15లక్షల మంది నీట్‌ పరీక్ష రాస్తే, కేవలం 84,375 మందికే వైద్య విద్యలో ప్రవేశానికి అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారతీయ వైద్యులు ఒక్క అమెరికాలోనే 50 వేల మందికి పైగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ప్రతి అయిదుగురిలో ఒకరు, కెనడాలో ప్రతి పదిమందిలో ఒకరు, ఇంగ్లాండ్‌లో నమోదైన వారిలో 40వేల దాకా భారతీయ వైద్యులే.
‣ రష్యా, చైనా, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌, కజికిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌లలో వైద్యవిద్య పూర్తి చేసుకున్న భారతీయులు మన దేశంలో నేరుగా ప్రాక్టీస్‌ చేయాలంటే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అలా పాస్‌ అవుతున్నవారు 12శాతం కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో ఇటీవల భారత ప్రభుత్వం నీట్‌ పరీక్షలో కనీసం 119 మార్కులు వస్తేనే విదేశాల్లో వైద్య విద్య చదడానికి అర్హులన్న నిబంధన తెచ్చింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు తెలుగు రాష్ట్రాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. వారిలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం దక్కుతోంది. విద్యారుణం పేరిట బ్యాంకులు 7.5 లక్షల నుంచి 1.6 కోట్ల దాకా అప్పు ఇస్తున్నాయి. మహిళా విద్యార్థులకు 0.5శాతం అదనంగా వడ్డీ రాయితీ కల్పిస్తున్నారు. ఇండియాలో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, వైద్య విద్యలో సీట్లు పరిమితంగా ఉండటం విద్యార్థులు విదేశీ విద్యవైపు మొగ్గు చూపడానికి ఒక కారణం. ప్రపంచంలో మేటి 100 విశ్వవిద్యాలయాల జాబితాలో ఇండియా నుంచి ఒక్కటీ కనిపించకపోవడమూ ఒక లోటే. వర్సిటీలకు అరకొర నిధులు, అధ్యాపక నియామకాలు చేపట్టకపోవడం మన విద్యావ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. చదువుకోసం మన విద్యార్థులు విదేశాలను ఆశ్రయించక తప్పని పరిస్థితులను నివారించాలంటే- నాణ్యమైన, ఉపాధితో కూడిన విద్యను అందించడంలో భారత్‌ అగ్రరాజ్యాలతో పోటీ పడాల్సిందే!

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి (అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)

Posted Date : 23-06-2022


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం