• facebook
  • whatsapp
  • telegram

సంస్కరణలే కీలకం

బడ్జెట్‌ రూపకల్పనలో భారీ సవాళ్లు

రెండేళ్ల క్రితం భారత్‌లోకి చొరబడిన మహమ్మారి మూలంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దానికి కాయకల్ప చికిత్స చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సరికొత్త కార్యాచరణతో బడ్జెట్‌ను రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గత రెండేళ్లలో వృద్ధిరేటు నిరాశాజనకంగా ఉంది. ఏ బడ్జెట్‌ అయినా దీర్ఘకాలిక వృద్ధిరేటు పెంపుదలపై దృష్టి పెట్టి స్థూల దేశీయోత్పత్తిని పెంచడానికే అధిక ప్రాధాన్యమిస్తుంది. దేశ అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనపై పెట్టుబడులూ ఎంతో అవసరం. ఏటా బడ్జెట్‌ అనగానే పలు వర్గాలు కొత్త ఆశలు పెట్టుకుంటాయి. కొత్త డిమాండ్లు ముందుకు తెస్తాయి. వాటన్నింటినీ నెరవేర్చడం ఏ ప్రభుత్వానికైనా కష్టమే. ఈ కసరత్తు అంత తేలికేమీ కాదు. ఇలాంటి ఎన్నో వర్గాలు, రంగాల ఆశల మధ్య విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో తాజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

సమస్యలపై దృష్టి

అధిక ఉత్పత్తి కోసం పరిశ్రమలకు కల్పించిన ప్రోత్సాహకాల మూలంగా పరోక్ష పన్నుల ఆదాయం తగ్గబోతోంది. ఈ నేపథ్యంలో 2022-23 బడ్జెట్‌ రూపకల్పన ఆర్థిక మంత్రికి సవాలుగా పరిణమించనుంది. అదేవిధంగా కొవిడ్‌ మూడో దశ పంజా విసిరితే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదమూ ఉంది. అదే జరిగితే ఉపాధిహామీ పథకం కింద అదనపు ఉపాధి కల్పన కోసం రూ.30 వేల కోట్లు, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద నిరుపేదలకు ఆరునెలలదాకా ఉచిత ఆహార పదార్థాల పంపిణీ కోసం రూ.90 వేల కోట్లు అదనంగా చెల్లించవలసిన పరిస్థితులు ఏర్పడతాయని ‘భారత పెట్టుబడుల సమాచారం, పరపతి రేటింగ్‌ సంస్థ- ఐసీఆర్‌ఏ’ పేర్కొంది. 2022-23లో ఇతరత్రా ఎలాంటి వైరస్‌ రకం ముంచుకురాకపోతే ప్రభుత్వ సెక్యూరిటీల జారీ మూలంగా రూ.9.1 లక్షల కోట్లు వస్తే, ద్రవ్యలోటును జీడీపీలో 5.8 శాతానికి కట్టడి చేయవచ్చని, ఒకవేళ మళ్లీ కరోనా విజృంభిస్తే, ఇది 6.9 శాతానికి చేరుకుంటుందని ఐసీఆర్‌ఏ స్పష్టం చేసింది. దేశంలో నిరుద్యోగం పెరిగింది. డిగ్రీ పట్టాదారుల్లో నిరుద్యోగిత తీవ్రంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌, పప్పు దినుసులు, నూనెలు వంటి నిత్యావసరాల పెరుగుదల వల్ల సామాన్యుల బతుకులు దుర్బలమవుతున్నాయి. భారత్‌ అత్యధికంగా దిగుమతి చేసుకొంటున్న ముడిచమురు, బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. 2022లో అమెరికా తన వడ్డీరేట్లను మూడుసార్లు పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ మూలంగా మన రూపాయి బలహీన పడుతుంది. భారత్‌ విద్యపై పెట్టిన పెట్టుబడి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. అంతర్జాతీయంగా పాఠశాల, ఉన్నత విద్యల్లో భారత్‌ చివరి స్థానాల్లోనే ఉంటోంది. నూతన జాతీయ విద్యావిధానం దీన్ని ఏ మేర సరిచేస్తుందో వేచిచూడాలి. మనదేశంలో చాలా గ్రామాల్లో ఇప్పటికీ వైద్యపరంగా మౌలిక సదుపాయాలు అంతంతే. 2024 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, దేశ ఆర్థిక వ్యవస్థను అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, పెరుగుతున్న ఎరువుల ధరలు కర్షకులకు భారంగా మారుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే రాబోయే మూడేళ్లు వరసగా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వార్షిక వృద్ధి సాధించాలి. కొవిడ్‌తో చాలామంది పేదలు నిరుపేదలుగా, దిగువ మధ్య తరగతి ప్రజలు పేదలుగా మారారు. ఫలితంగా దేశంలో పేదల సంఖ్య పెరిగింది. పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్నులో మినహాయిపులను ఆశిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో ఇలాంటి సమస్యలపై మరింతగా దృష్టి సారించాల్సి ఉంటుంది.

పెట్టుబడులే ఇంధనం

ఆత్మనిర్భర్‌ భారత్‌, వ్యవసాయం ఆధునికీకరణ, ఎగుమతులను ప్రోత్సహించే పారిశ్రామికీకరణ, అధిక నాణ్యతతో కూడిన సామాజిక, ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శకత నిండిన పాలన వంటివి ఆర్థిక వృద్ధిని పరుగులెత్తిస్తాయి. భారత్‌ విదేశీ మార్కెట్లను చేజిక్కించుకోవాలంటే- తన సాంకేతికతను ఎప్పటికప్పుడు ఆధునికీకరించడం, డిజిటలైజేషన్‌, పర్యావరణహిత పద్ధతులను పాటించడం, వ్యాపార, పన్నుల విధానాన్ని సంస్కరించడం వంటివి చాలా ముఖ్యం. ప్రైవేటు వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ పెట్టుబడులు, నికర ఎగుమతులు వంటివి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించే నాలుగు ఇంజిన్లు. ఇవి సమర్థంగా, పటిష్ఠంగా పని చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు పెట్టుబడులు బలహీనపడుతున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించగల ఏకైక చోదకశక్తి ప్రభుత్వ పెట్టుబడులు, దాని వ్యయాలే. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు, గ్రామీణ పట్టణ మౌలిక వసతుల కల్పనతోపాటు పరిశోధనల వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు మదుపరులు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రభుత్వమే ముందడుగు వేయాలి. కొన్నాళ్లుగా భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు, ఎగుమతుల్లో పెరుగుదల, భారీగా పోగవుతున్న విదేశ మారక ద్రవ్య నిల్వలు, తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి టీకాలు వంటివి 2022-23 ఏడాదికి సానుకూల పరిణామాలుగా చెప్పవచ్చు. మరోవైపు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, అవినీతి, పెరుగుతున్న చమురు, బంగారం దిగుమతులు, రక్షణ వ్యయం వంటి అంశాలు దేశ ఆర్థిక రథాన్ని వెనక్కిలాగే ప్రమాదముంది. 2022-23లో ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి రావడమనేది- కొవిడ్‌ మూడో దశ సృష్టించబోయే ప్రతికూల పరిస్థితులను, ప్రభావాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఏదిఏమైనా- కొవిడ్‌ మూలంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి, పరుగులు తీయించేందుకు విప్లవాత్మక సంస్కరణలతో ముందడుగు వేయక తప్పని తరుణమిది.

తగ్గిన వినియోగ వ్యయం

ఆర్థిక వ్యవస్థకు 2022-23లో పలు సమస్యలు, సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అందులో ప్రధానమైనది కరోనా. ఇప్పటికే ఒమిక్రాన్‌ భారత్‌ సహా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దీని తరవాత ఇలాంటివే మరికొన్ని చుట్టుముడితే ప్రభుత్వాలు ప్రజావైద్యంపై భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరోవైపు, పలు రంగాల పనితీరు, వాస్తవ పన్నుల ఆదాయం, వ్యయాలు, ఆహార భద్రత కింద 2022 మార్చి వరకు అందించనున్న ఉచిత ఆహార ధాన్యాలు వంటి వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని వృద్ధిరేటు రికార్డు స్థాయిలో 9.2 శాతంగా కేంద్ర గణాంక కార్యాలయం ముందస్తు అంచనాలను విడుదల చేసింది. ఆర్‌బీఐ దీన్ని 9.5 శాతంగా అంచనా వేసింది. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ పూర్వస్థితికి వచ్చి అభివృద్ధి దిశగా పయనిస్తుందని కేంద్రం చెబుతున్నా గృహ వినియోగ వస్తువుల గిరాకీని తెలియజేసే ప్రైవేటు వినియోగ వ్యయం కొవిడ్‌ పూర్వస్థితి కన్నా తక్కువగా ఉంది. నిరుద్యోగం, సన్నగిల్లుతున్న వాస్తవాదాయం, తగ్గుతున్న వినియోగ వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటివి సర్కారు ముందున్న మరికొన్ని ముఖ్య సవాళ్లు.

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 27-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం