• facebook
  • whatsapp
  • telegram

కుంభకోణాల ఊబిలో బ్యాంకులు

గట్టెక్కించడంలో వ్యవస్థల వైఫల్యం

 

 

గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌ సంస్థ 2012-2017 మధ్య కాలంలో బ్యాంకులకు దాదాపు రూ.23 వేల కోట్ల రూపాయల మేరకు ఎగనామం పెట్టినట్లు ఇటీవల వెల్లడైంది. ఏబీజీ చేతిలో మోసపోయినవి ఒకటో రెండో బ్యాంకులు కావు. ఏకంగా 28 బ్యాంకుల కన్సార్షియానికి ఆ కంపెనీ కుచ్చుటోపీ పెట్టింది. ఆ కన్సార్షియంలో ఎస్‌బీఐ, ఐడీబీఐ, ఐసీఐసీఐ వంటి హేమాహేమీ బ్యాంకులు ఉన్నాయి. భారతదేశంలో అతి పెద్ద బ్యాంకు మోసంగా వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. ఏబీజీ మోసం ఏదో ఆకస్మికంగా సంభవించినది కాదు. కొన్ని ఏళ్ల నుంచి జరుగుతూ వస్తోంది. బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న డబ్బును 38 విదేశీ కంపెనీలతో సహా మొత్తం 98 సంస్థలకు మళ్ళించారు. అంత జరిగినా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంలో ఎందుకు ఆలస్యమైంది? ఆ బాగోతాన్ని బ్యాంకులు, చట్ట సంస్థలు పసిగట్టలేకపోవడానికి కారణం కేవలం నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వకమా? ఏబీజీ భారీ లూటీ వెనక రాజకీయ హస్తం ఏదైనా ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

ఎన్‌పీఏల విజృంభణ

గుజరాత్‌లోని దహేజ్‌, సూరత్‌లలో నౌకా నిర్మాణం, మరమ్మతు కేంద్రాలను నిర్వహిస్తున్న ఏబీజీ గ్రూపు 1985 నుంచి వ్యాపారం ప్రారంభించింది. పదహారేళ్లలో మొత్తం 165 పెద్ద బోట్లు, నౌకలను నిర్మించింది. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి ఆ సంస్థ తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. 2014లో కార్పొరేట్‌ రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని ఏబీజీ రుణాలకు వర్తింపజేయాలని ఎస్‌బీఐ ప్రయత్నించినా, ఉపయోగం లేకపోయింది. ఆ సంస్థ సకాలంలో రుణ కిస్తీలను, వడ్డీని చెల్లించలేకపోవడమే దానికి కారణం. దాని ఖాతాను నిరర్థక ఆస్తి(ఎన్‌పీఏ)గా 2013 నవంబరులోనే గుర్తించినా 2016 జులైలో కానీ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఏబీజీ భారీ మోసానికి పాల్పడిందని ఎస్‌బీఐ తీరుబడిగా గుర్తించేసరికి 2019 జనవరి వచ్చేసింది. 2012 ఏప్రిల్‌-2017 జులై మధ్యే మోసం జరిగిందని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ నిర్ధారించింది. దాని మీద ఫిర్యాదు చేయడానికి ఎస్‌బీఐకి పదకొండు నెలలు పట్టింది. సమగ్ర ఫిర్యాదు దాఖలయ్యేసరికి మరో పది నెలల కాలం కరిగిపోయింది. అప్పటికి 2020 ఆగస్టు వచ్చేసింది. ఆ పైన 18 నెలలకు కానీ సీబీఐ కేసు నమోదు చేయలేదు. ఏబీజీ వ్యవహారాన్ని ఇన్నేళ్లపాటు నానబెట్టడానికి కారణాలేమిటో అంతుబట్టడం లేదు. కన్సార్షియంలోని సీనియర్‌ అధికారులకు తెలియకుండా ఆ సంస్థ సుదీర్ఘ కాలం పాటు అంతటి భారీ మోసానికి పాల్పడటం సాధ్యమేనా?

 

భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాములో దాదాపు అదే స్థాయిలో బ్యాంకు మోసాలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్షాలు వ్యంగ్యంగా విమర్శిస్తున్నాయి. ఆ మోసాల దెబ్బకు ప్రభుత్వ రంగ బ్యాంకుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. 2008-14 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) ఎన్‌పీఏలు అయిదు లక్షల కోట్ల రూపాయలు; 2014-20 మధ్య అవి రూ.18.28 లక్షల కోట్లకు ఎగబాకాయి. అంటే, ఏడేళ్లలోనే అవి మూడున్నర రెట్లు పెరిగాయన్న మాట! ఇటీవలి కాలంలో పీఎస్‌బీలు పెద్దఎత్తున పారుబాకీలను రద్దు చేయడమూ తీవ్ర ఆందోళనకరం. 2008-14 మధ్య రూ.32 వేల కోట్ల మొండిబాకీలను రద్దు చేశారు. 2014-20 మధ్య ఏకంగా రూ.6.83 లక్షల కోట్ల పారుబాకీలను చెల్లుకొట్టేశారు. పోనీ, ఆ తరవాత నుంచి అవి తగ్గాయా అంటే అదీ లేదు. 2014-15లో కొత్త మొండి బాకీలు రూ.1.77 లక్షల కోట్లు; 2017-18లో అవి రూ.4.88 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఎన్‌పీఏల దెబ్బకు బ్యాంకులు కూలిపోకుండా చూడటానికి ప్రభుత్వం అపార ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. బ్యాంకులకు తిరిగి మూలధనం సమకూర్చడానికి కేంద్రం రెండున్నర లక్షల కోట్ల రూపాయలను ధారపోసింది. ఎంత చేసినా బ్యాంకులు దుర్బలంగానే ఉంటున్నాయి. మరోవైపు, ఎన్‌డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల పారుబాకీలను భారీగా రద్దు చేయడంతో రైతు రుణ బకాయిలకూ అలాగే చెల్లుకొట్టాలని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ డిమాండ్‌ చేశారు. రుణాలు తీసుకుని ఎగనామం పెట్టే ధనికులకు మళ్ళీ మళ్ళీ రుణాలిచ్చే బ్యాంకులు సన్న, చిన్నకారు రైతులకు ఎప్పుడూ మొండిచెయ్యే చూపిస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి కూడా అంతే. ఏబీజీకి మాత్రం అన్ని నిబంధనలనూ అతిక్రమించి మరీ బ్యాంకులు రుణాలు అందించాయి. 

 

సమూల సంస్కరణే శరణ్యం

బ్యాంకు మోసాలు జరిగి చాలా కాలమయ్యాక కానీ వాటి గురించి ఆరా తీయడం లేదు. రిజర్వు బ్యాంకుకు సకాలంలో సమాచారం అందడం లేదు. అక్రమాల గురించి రిజర్వ్‌ బ్యాంకు పత్రికల్లో వార్తల ద్వారా తెలుసుకున్న సందర్భాలు అనేకం. బ్యాంకు మోసాలను ఆర్‌బీఐ తీవ్రంగా పరిగణించకపోవడం పెద్ద లోపమని దాని మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ వ్యాఖ్యానించారు. ఎగవేతదారులని తెలిసినా రాజకీయ ప్రాపకం కలిగినవారికి బ్యాంకులు రుణాలిస్తూనే ఉన్నాయి. అలాంటి ఘరానా వ్యక్తులకు బ్యాంకులు వెంటపడి మరీ అప్పులిస్తాయని రాజన్‌ వ్యాఖ్యానించారు. మోసాలను బయటపెడితే తమను వేధిస్తారని బ్యాంకు అధికారులు, సిబ్బంది భయపడతారనీ ఆయన పేర్కొన్నారు. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందువల్ల బ్యాంకు మోసాలను మొగ్గలోనే తుంచడం సాధ్యమే. ఆ వెసులుబాటును బ్యాంకులు సద్వినియోగం చేసుకోవాలి. కుంభకోణాలను అరికట్టడానికి బ్యాంకుల నిర్వహణను సమూలంగా సంస్కరించాలని పలు నిపుణ సంఘాలు సిపార్సు చేశాయి. ఆ మేరకు పటిష్ఠ చర్యలకు కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపక్రమించాలి.

 

ఇంటిదొంగల దన్నుతోనే...

2019-20లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.1.48 లక్షల కోట్ల మేరకు 4,413 బ్యాంకు మోసాలు జరిగాయి. ప్రైవేటు బ్యాంకుల్లో రూ.34 వేల కోట్ల మేరకు 3,066 మోసాలు చోటుచేసుకున్నాయని రిజర్వు బ్యాంకు వార్షిక నివేదిక స్పష్టంచేసింది. బ్యాంకు మోసం సగటున 24 నెలల తరవాతే బయటపడుతోంది. వంద కోట్ల రూపాయలు, అంతకు మించిన మోసాలు అయిదేళ్లకు కానీ వెలుగులోకి రావడం లేదు. ఈలోపు మోసగాళ్లు లూటీ సొమ్మును పదిలపరచుకొంటున్నారు. దాన్ని సరిహద్దులు దాటించి పన్ను స్వర్గాలైన విదేశాల్లో దాచుకోవడంతోపాటు తమ కేసులను బలహీనపరచడానికీ వెచ్చిస్తున్నారు. ఇదంతా వ్యవస్థాపరమైన లొసుగుల వల్లే జరుగుతుందనుకోవడం పొరపాటు. సీనియర్‌ బ్యాంకు అధికారులు, బడా పెట్టుబడిదారులకు మధ్య అపవిత్ర బంధమూ దానికి కారణమే.

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 03-03-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం