• facebook
  • whatsapp
  • telegram

దేశార్థికానికి యుద్ధంపోటు

రష్యా-ఉక్రెయిన్‌ పోరుతో అనర్థాలు

ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఇతర దేశాలపై ఏదో రకమైన ప్రభావం పడటం సాధారణమే. భారత్‌ ఇందుకు మినహాయింపేమీ కాదు. యుద్ధ పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించడం వల్ల ప్రతికూల ప్రభావం తప్పదు. ఫలితంగా దేశార్థికం దెబ్బతింటుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పరిణామాలు కూడా ఇలాంటి పరిస్థితులకే దారితీస్తున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధం ప్రపంచ దేశాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందోనని ఆయా దేశాలు అంచనా వేస్తున్నాయి. భారత్‌ కూడా ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కార్యదళాన్ని నియమించింది. యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది అంతుచిక్కడం లేదు. ఆ రెండు దేశాలకే కాకుండా, ఇతర దేశాలపైనా పెనుభారం పడే ప్రమాదం ఉందన్న ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా చమురు, వంటనూనెలు, బంగారం ధరలు మరింత పెచ్చరిల్లుతాయని నిపుణుల అంచనా. యుద్ధం మొదలైనప్పట్నుంచి భారత స్టాక్‌మార్కెట్‌ ఎత్తుపల్లాలు చూస్తోంది.

చిరకాల భాగస్వామ్యం

రష్యా భారత్‌కు చిరకాల మిత్రదేశం. వాణిజ్యంలోనూ ముఖ్యమైన భాగస్వామి. రష్యాకు మనదేశం నుంచి మందులు, రసాయనాలు, విద్యుత్‌ పరికరాలు, తేయాకు, దుస్తులు, కొన్ని పెట్రో ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. రష్యా నుంచి భారత్‌కు ఆయుధాలు, బొగ్గు, ముడిచమురు, లోహాలు, బంగారం, ఎరువులు దిగుమతి అవుతున్నాయి.  ఇప్పటికే భారత్‌లోని ఎగుమతిదారులకు రష్యా నుంచి రావాల్సిన డబ్బులు ఆంక్షల మూలంగా స్తంభించిపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ చెల్లింపులకు ఆటంకం కలగకుండా ఉండటానికి భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను వెదుకుతోంది. ఇక- ఉక్రెయిన్‌ నుంచి మనదేశానికి లోహాలు, ప్లాస్టిక్స్‌, పాలిమర్స్‌, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి జరుగుతోంది. భారత్‌ నుంచి ఆ దేశానికి మందులు, యంత్ర సామగ్రి, రసాయనాలు, ఆహార పదార్థాలు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గోధుమ, మొక్కజొన్నల మొత్తం ఎగుమతుల్లో ఈ రెండు దేశాల నుంచి జరిగే గోధుమ ఎగుమతులు మూడింట ఒకవంతు ఉంటాయి. ఈ క్రమంలో యుద్ధం మూలంగా ప్రపంచ దేశాలకు స్తంభించిన గోధుమ ఎగుమతుల అవకాశాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. భారత్‌ తన పొద్దుతిరుగుడు నూనె అవసరాల్లో సింహభాగం రష్యా, ఉక్రెయిన్‌ల నుంచే దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం నేపథ్యంలో మనదేశం ఇప్పుడు ప్రత్యామ్నాయాలను వెదుక్కోవలసి వస్తోంది. భారత్‌ నుంచి ఈ దేశాలకు మందులు ఎగుమతి చేస్తున్న సంస్థల్లో సైతం ఆందోళన నెలకొంది. ఇరు దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్న మన సంస్థలు కూడా తమ వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన ముడి సరకులు అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నాయి. దేశీయ అవసరాల కోసం రష్యా నుంచి భారత్‌కొచ్చే చమురు వాటా తక్కువే. ఒకవేళ రష్యా నుంచి ముడిచమురు సరఫరా నిలిచిపోతే, ఇతర దేశాల నుంచి భర్తీ చేసుకొనే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

దీర్ఘకాలం సాగితే నష్టమే...

ఇరు దేశాల మధ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే విదేశీ వ్యాపారాలకు అంతరాయం కలిగి, నష్టం అపారంగా ఉంటుంది. సరకుల దిగుమతి నిలిచిపోతే, దేశీయంగా ఆహార వస్తువుల కొరత పెరుగుతుంది. ధరలకు రెక్కలొస్తాయి. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత వాతావరణం, గిరాకీ క్షీణత, పెట్టుబడుల స్తంభన, ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు వంటి ప్రతికూలతలు ఎదురవుతాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చాలా ఓడరేవుల్లో అనిశ్చితి మూలంగా కంటైనర్లు నిలిచిపోయాయి. కొవిడ్‌ తదితర కారణాలతో దిగజారిన వృద్ధిరేటును పెంచేందుకు, పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తీవ్ర కసరత్తు సాగుతున్న వేళ వచ్చిపడిన  యుద్ధం మరింత భారం మోపనుంది. యుద్ధ ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక లభ్యతలపైనా పడుతుంది. రష్యా నుంచి భారత్‌కు ఆయుధ సరఫరాలో ఆటంకాలు నెలకొంటే- పొరుగున పొంచి ఉన్న శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధాన్ని ఎదుర్కొనే సన్నద్ధత శక్తి సన్నగిల్లుతుంది. ఈ రెండు దేశాలు దీన్ని సావకాశంగా తీసుకొనే ప్రమాదం లేకపోలేదు. యుద్ధం కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏ దేశంలోనైనా ఇబ్బంది పడేది సామాన్యులే. ఒకవేళ సత్వరమే యుద్ధం సమసిపోయినా, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చాలా రోజులు పట్టవచ్చు. భారత్‌కు సంబంధించి వ్యూహాత్మక, ఆర్థిక, రాజకీయ, సైనిక అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడంలో భారత్‌కు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

భారత్‌కు పెరిగే సెగ

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఆగకపోతే- భారత్‌కు మరింత సెగ పెరిగేలా ఉంది. దేశీయంగా పొద్దుతిరుగుడు నూనె, గోధుమలు, సెల్‌ఫోన్ల ధరలు జోరందుకునే ప్రమాదం ఉంది. 2020-21లో భారత్‌ దిగుమతి చేసుకున్న నూనెలో రష్యా వాటా 20 శాతం, ఉక్రెయిన్‌ వాటా 70 శాతంగా ఉంది. ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటికే సరఫరా ఆగిపోయిన ఫలితంగా ధరలకు రెక్కలు మొలుస్తున్నాయి. సెల్‌ఫోన్‌ తయారీలో వినియోగించే ‘పలేడియం’ లోహాన్ని రష్యా భారీ స్థాయిలో ఎగుమతి చేస్తోంది. ఈ లోహం సరఫరా తగ్గితే సెల్‌ఫోన్‌ ధరలు ఊపందుకొనే అవకాశం ఉంది. రష్యా పలు దేశాలకు భారీగా ముడిచమురును ఎగుమతి చేస్తోంది. యుద్ధం మూలంగా అంతర్జాతీయంగా దీని ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనివల్ల భారత్‌ కూడా పలు విధాలుగా నష్టపోయే ముప్పుంది. భారత తేయాకుకు రష్యా చిరకాలంగా సుస్థిరంగా కొనసాగుతున్న విపణి. ఆంక్షలవల్ల చెల్లింపుల సమస్య తలెత్తవచ్చని తేయాకు ఎగుమతిదారుల్లో కలవరం మొదలైంది. బార్లీ ఎగుమతుల్లో ఉక్రెయిన్‌ వాటా 18 శాతం. భారత్‌లోని బీరు ఉత్పతిదారులు ముడిసరకైన బార్లీని ఎక్కువగా స్థానికంగానే పొందుతున్నా, యుద్ధం వల్ల స్థానికంగానూ బార్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ఉత్పత్తి వ్యయంపై ప్రభావం చూపి, ధరల పెరుగుదలకు దారితీస్తుంది. సెమీకండక్టర్ల తయారీకి ఉపయోగించే పలేడియం, నియాన్‌ గ్యాస్‌లను ఈ ఇరుదేశాలు అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి. ఆటొమొబైల్‌ తదితర పరిశ్రమలకు సెమీకండక్టర్ల అవసరం అధికం. వీటి సరఫరాకు మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పారిశ్రామీకరణ కుంటువడే ప్రమాదం ఉంది.

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం